Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది! | Cultivation Of Orrange Garden With Natural Methods And Farmer Potturu Devendra Success Story | Sakshi
Sakshi News home page

Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!

Published Tue, Sep 10 2024 9:09 AM | Last Updated on Tue, Sep 10 2024 12:26 PM

Cultivation Of Orrange Garden With Natural Methods And Farmer Potturu Devendra Success Story

ప్రకృతి సేద్య పద్ధతులతో బత్తాయి తోటకు పునరుజ్జీవం

ఎకరం చీనీ తోట + అంతర పంటల వార్షిక ఆదాయం రూ. నాలుగు లక్షల పైనే!

అనంతపురం యువ రైతు దేవేంద్ర ప్రకృతి సేద్య అనుభవాలు.. ఆయన మాటల్లోనే..

దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.

‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.

నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్‌) పద్ధతిలో విత్తాను.

ప్రూనింగ్‌ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతు

అప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది.  గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.

నాలుగేళ్లలో ఎంతో మార్పు..
ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.

ఎపిసిఎన్‌ఎఫ్‌ చీఫ్‌ టెక్నాలజీ– ఇన్నోవేషన్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ్రపాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మా నాయక్‌ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.

కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లు

ఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది.  ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్‌ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.

ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..
ఎనీ టైమ్‌ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్‌ మోడల్‌లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్‌ నేపియర్‌ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్‌: 79976 44711

గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా  మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..

కారణాలు..
వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.
జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.
΄ోషకాహార లోపం: విటమిన్‌ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.
అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.
గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.
– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.
హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.
యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.

– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement