Fruits gardens
-
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్‌సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్‌లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్‌లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్‌సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్‌లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్‌పై డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్‌పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్‌ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్‌ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745) -
Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..
రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా మార్కెట్‌కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్ చేయటం వారి సక్సెస్‌కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్‌కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ల్లో డిమాండ్ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్ క్వీన్ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్ రకం, మస్క్‌మిలన్ (జ్యూస్ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్ నుంచి తెప్పించారు. ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్ మేకర్‌తో బెడ్ తయారు చేసి, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు. జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్ 3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ డిమాండ్‌ను బట్టి పంట మార్చుతాం! ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273). నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు
ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్ జామ పంట సాగు చేశాడు. మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది. మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు. ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్‌లో 800 తైవాన్ జామ మొక్కలు నాటాడు. గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది. మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. మూడో వంతు మామిడి సాగే మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. ఏటా రూ.1000 కోట్ల ఆదాయం మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
మొన్నటి వరకు కరువు ఛాయలు.. ఇప్పుడు ఉద్యాన సిరులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో పండ్ల తోటల సాగు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సాగునీటి వనరులు అందుబాటులోకి రావడంతో పండ్ల తోటల సాగు పెరిగింది. గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో 70 శాతానికి పైగా సాగు పెరగడం గమనార్హం. అరటి, మామిడితోపాటు సన్ననిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, కమల, చీనీ, దానిమ్మ తదితర పండ్ల తోటలను జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోని 36 మండలాల పరిధిలో 86,844 ఎకరాల్లో ప్రస్తుతం పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పరిధిలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం నీటితో నింపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు దాదాపుగా భూమి పైకి వచ్చాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లోనూ బోరు బావుల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా రైతులు వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. అత్యధికంగా మామిడి సాగు జిల్లాలో 36 మండలాల పరిధిలో ఒక్క లింగాల, పెద్దముడియం మండలాలు మినహా మిగిలిన 34 మండలాల్లోనూ రైతులు మామిడి సాగు చేశారు. చక్రాయపేట మండలంలో అత్యధికంగా 2825 ఎకరాల్లోనూ, ఆ తర్వాత సిద్దవటం మండలంలో 1514 ఎకరాల్లోనూ మామిడి సాగైంది. మిగిలిన మండలాల్లో 500 ఎకరాలకు తగ్గకుండా మామిడి సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 8090 ఎకరాల్లో మామిడి సాగైంది. ఇక జిల్లా వ్యాప్తంగా 51,451 ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. సింహాద్రిపురం మండలంలో అత్యధికంగా 14,461 ఎకరాల్లో సాగైంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ బత్తాయి పంట సాగులో ఉండడం గమనార్హం. దీంతోపాటు జిల్లాలో 3533 ఎకరాల్లో సన్న నిమ్మ సాగులో ఉంది. గోపవరం మండలం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ నిమ్మను రైతులు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2285 ఎకరాల్లో రైతులు దానిమ్మ పంటను సాగు చేశారు. పోరుమామిళ్ల, అట్లూరు మండలాల్లో దానిమ్మ సాగు అధికంగా ఉంది. చాపాడు, దువ్వూరు, చక్రాయపేట, చెన్నూరు మినహా మిగిలిన 32 మండలాల్లోనూ దానిమ్మ పంట సాగులో ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 17059 ఎకరాల్లో అరటి పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా లింగాల మండలంలో 6317 ఎకరాలు, పులివెందులలో 2346 ఎకరాల్లో అరటి సాగైంది. జిల్లాలోని చెన్నూరు, వల్లూరు, చక్రాయపేట, ప్రొద్దుటూరు, రాజుపాలెం, అట్లూరు మండలాల్లో మినహా మిగిలిన 30 మండలాల్లోనూ అరటి పంట సాగైంది. ఇక 1977 ఎకరాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. మైదుకూరు, దువ్వూరు, కాశినాయన, వేముల తదితర మండలాల్లో రైతులు ఈ పంటను అధికంగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. వీటితోపాటు 2849 ఎకరాల్లో అంజుర, డ్రాగన్ ఫ్రూట్స్, జామ, ద్రాక్షతోపాటు పలు రకాల పండ్ల తోటలను రైతులు సాగు చేశారు. రాజుపాలెం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ ఈ తరహా పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సింహాద్రిపురంలో 15,165 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కాగా, లింగాలలో 14,098, ముద్దనూరు 5,324, కొండాపురం 4977, వీఎన్ పల్లె 4583, వేముల 4562, చక్రాయపేట 4196 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 86,844 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కావడం విశేషం. అరటికి మంచి ధర లభిస్తోంది గడిచిన మూడేళ్లుగా అరటి పంటకు మంచి ధర లభిస్తోంది. కరోనా కష్టాల్లోనూ ప్రభుత్వం స్వయంగా అరటి కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. ఈ ప్రాంతంలో పండే అరటి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ పంట సాగుతో ఆదాయం కూడా బాగుంది. అందువల్ల అరటి సాగువైపు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. – ఎ.భాస్కర్‌రెడ్డి, రైతు, నల్లపురెడ్డిపల్లె అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతులు మా ప్రాంతంలో బేనీషా, లాల్ బహార్, అల్ఫాన్సా, నీలం తదితర మామిడి రకాలను పండిస్తున్నాము. బెంగళూరు, కేరళతోపాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి మామిడి ఎగుమతి అవుతోంది. మేము 100 ఎకరాల్లో మామిడిని సాగు చేశాము. గడిచిన మూడేళ్లలో మామిడికి మంచి ధరే లభిస్తోంది. టన్ను రూ. 50 వేలకు తగ్గకుండా అమ్ముడవుతోంది. అందువల్ల రైతులు మామిడి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. – సూర్యప్రసాద్‌రెడ్డి, రైతు, చక్రాయపేట మండలం నీటి వసతితో పండ్ల తోటల సాగు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయి. దీంతో నీటి కొరత లేకుండా పోయింది. రైతులు చీనీ పంట అధికంగా సాగు చేశారు. చీనీ కాయలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 30 వేల వరకు ధర ఉంది. – అరవిందనాథరెడ్డి, రైతు, సింహాద్రిపురం పండ్ల తోటల సాగుకు రైతుల ఆసక్తి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో డిమాండ్ మేర జిల్లా నుంచి వివిధ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. ఒకవైపు అనుకున్న మేర దిగుబడులు రావడం, మరోవైపు మార్కెట్లో ఆయా పండ్లకు ఉన్న ప్రాధాన్యతను బట్టి రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తున్నాము. – మైఖేల్ రాజీవ్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, వైఎస్సార్ జిల్లా దేశ వ్యాప్తంగా ఎగుమతులు పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న అరటి పంటను ఇక్కడి నుండి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హైదరాబాదుతోపాటు పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సంవత్సరం టన్ను అత్యధికంగా రూ. 24 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ. 13 వేల ధర ఉంది. కరోనా సమయంలో అరటి రైతులు ఇబ్బందులు పడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి చొరవతో ప్రభుత్వం టన్ను రూ. 3,500 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులను ఆదుకుంది. జిల్లాలో బేనీషా, అల్ఫోన్సా, లాల్ బహార్, బెంగుళూర, నీలం తదితర రకాల మామిడి సాగవుతోంది. ఈ పంటను బెంగుళూరు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే బేనీషా దేశ వ్యాప్తంగానే కాకుండా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. గత మూడేళ్లలో మామిడికి మంచి ధరలే ఉన్నాయి. టన్ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అమ్ముడుపోయింది. రూ. 50 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. జిల్లాలో పండుతున్న చీనీకి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ప్రాంతంలో పండే చీనీ కంటే మన జిల్లాలో పండుతున్న చీనీకి మంచి నాణ్యత కలిగినదిగా పేరుంది. ఈ రకం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. గడిచిన మూడేళ్లలో చీనీకి మంచి ధర లభించింది. అత్య«ధికంగా టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం టన్ను రూ. 30 వేలకు పైగానే ధర ఉంది. చీనీ ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. వీటితోపాటు జిల్లాలో పండుతున్న అన్నిరకాల పండ్లు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా పండ్లకు మంచి ధర వస్తోందని, గిట్టుబాటు అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. -
వయసు 9.. మొక్కలు నాటడంలో సు'ప్రసిద్ధి'
తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్‌కి ‘డయానా అవార్డ్ 2022’ దక్కింది. ఆ అమ్మాయిని అంతా ‘ఎకో వారియర్’ అంటారు. ‘క్లయిమేట్ ఛాంపియన్’ అని కూడా. ఎందుకు? మొక్కలు నాటుతుంది. చెట్లను పెంచుతుంది. అడవులను నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికి 28 పండ్లతోటలు ప్రసిద్ధి ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్నాయి. పచ్చగా లేని ప్రపంచంలో జీవించలేము అంటుంది ప్రసిద్ధి. ఈ వానాకాలంలో ప్రసిద్ధిలా ఆలోచిస్తే నాలుగు మొక్కలు కనీసం కుండీల్లో అయినా పడతాయి. మూడేళ్ల పిల్లలు మట్టితో ఆడుకుంటారు. కాని ప్రసిద్ధి సింగ్ మొక్కలతో ఆడుకుంది. వాళ్ల నాన్న ప్రవీణ్ సింగ్ ఆ పాపను మూడేళ్ల వయసు నుంచే మొక్కలతో పరిచయం చేయించాడు. పాప చేత మొదటగా పెరట్లో నాటించింది ‘మిరప గింజల’ని. అవి మొక్కలుగా ఎదగడం చూసి ఆశ్చర్యపోయింది ప్రసిద్ధి. తండ్రి, కూతురు కలిసి దక్షిణ చెన్నై శివార్లలో ఉండే ‘మహేంద్ర వరల్డ్ సిటీ’లో ఉంటారు. దానికదే ఒక ప్రపంచం. పచ్చగా ఉండేది. అయితే 2016లో అంటే ప్రసిద్ధికి మూడేళ్ల వయసులో వచ్చిన వర్ధా తుఫాను ఆ పచ్చదనాన్ని ధ్వంసం చేసింది. చిన్నారి ప్రసిద్ధి మీద ఆ విధ్వంసం ముద్ర వేసింది. ‘నువ్వు మొక్కలు పెంచాలి. చూడు ఎలా నాశనం అయ్యాయో’ అని తండ్రి చెప్పిన మాట పని చేసింది. అంత చిన్న వయసులో అందరు పిల్లలూ ఆడుకుంటుంటే తనకు చేతనైన మొక్కలు నాటడం మొదలెట్టింది ప్రసిద్ధి. అది మొదలు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రసిద్ధి ఫౌండేషన్ ‘నాకు చెట్లన్నా, తేనెటీగలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకు అని చెప్తాయి చెట్లు. నలుగురిని కలుపుకుని పని చెయ్ అంటాయి తేనెటీగలు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెబుతుంది సముద్రం. అందుకే అవి నాకు స్ఫూర్తి’ అంటుంది ప్రసిద్ధి. చెట్లమీద ప్రేమతో 6 ఏళ్ల వయసులోనే ‘ప్రసిద్ధి ఫౌండేషన్’ను స్థాపించింది. ‘నా చేతుల మీదుగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించాను’ అంటుంది ప్రసిద్ధి. ఇప్పటికి ఎన్ని నాటిందో తెలుసా? 46,000. అవును... అన్ని వేల మొక్కలు ప్రసిద్ధి పూనిక వల్లే పచ్చగా తలలు ఎత్తాయి. అందుకే అందరూ ప్రసిద్ధి క్లయిమేట్ ఛాంపియన్ అంటున్నారు. పండ్ల మొక్కలే లక్ష్యం జపాన్‌కు చెందిన ‘అకిర మియావకి’ గొప్ప పర్యావరణవేత్త. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ అడవులను తలపించే ‘మియావకి ఫారెస్ట్’ను అతడు వృద్ధి చేశాడు. అంటే ఇందులో అన్నిరకాల చెట్లు, మొక్కలు, తీగలు ఉండి దానికదే ఒక అడవిగా మారుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘ఫూట్ ఫారెస్ట్’లను చెన్నై చుట్టుపక్కల వృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అయితే తాను పెంచదలుచుకున్నవన్నీ స్థానిక (భారతీయ) పండ్ల మొక్కలే. ‘నాకు ఫ్రూట్ ఫారెస్ట్లు పెంచాలని ఎందుకు అనిపించిందంటే పండ్లు జనానికి అందుతాయి, తింటారు అని. ఇవాళ అన్ని రసాయనాల పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రసాయనాలు లేని పండ్లు అందించాలి’ అంటుంది ప్రసిద్ధి. మామిడి, జామ, సపోట, నారింజ, నిమ్మ, రేగు, తాటి, సీమచింత ఇలా దేశీయంగా ఉండే పండ్ల మొక్కలు, చెట్లను పెంచడం ప్రసిద్ధి లక్ష్యం. 28 పండ్ల తోటలు ప్రసిద్ధి పెంచుతున్న ఫ్రూట్ ఫారెస్ట్‌లను మనం పండ్ల తోటలు అనవచ్చు. ఈ తోటలు ఎలా పెంచుతుంది? ‘భాగస్వామ్యం వల్ల’ అంటుంది ప్రసిద్ధి. స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పారిశ్రామిక సంస్థలకు ఉన్న ఖాళీ స్థలాలు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలు వీటిని పండ్లతోటలకు ఇమ్మని అభ్యర్థిస్తుంది. ఫౌండేషన్‌లో స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ స్థలాలను గుర్తిస్తారు. ప్రసిద్ధి ఆ యాజమాన్యాలకు లేఖలు రాస్తుంది. ‘వారిని ఒప్పించడం కష్టమే గాని పరిస్థితి వివరిస్తే ఒప్పుకుంటారు’ అంటుంది నవ్వుతూ. అంతెందుకు? ప్రసిద్ధి తాను చదువుతున్న మహేంద్ర వరల్డ్ స్కూల్లో వంద పండ్ల మొక్కలు నాటింది. అవి ఎదుగుతున్నాయి. ఒకసారి స్థలం దొరికాక తన కార్యకర్తలు వెళ్లి ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొక్కల్ని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలోని మొక్కల్ని తీసుకెళ్లి ప్రసిద్ధి ఆధ్వర్యంలో నాటుతారు. ‘మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను’ అంటుంది ప్రసిద్ధి. ప్రసిద్ధి చేస్తున్న పనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. సహకరిస్తున్నారు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రసిద్ధి అనేక నగరాలకు తిరుగుతూ పర్యావరణ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి ప్రకృతిని ఏదో ఒక స్థాయిలో కాపాడాలని చూస్తోంది. ఇది చదివాక మన వంతు. మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను. – ప్రసిద్ధి సింగ్ -
సాగుబడి : ‘రాంభూటాన్’ పండ్లు పండిద్దామా?
మృగశిర కార్తె (జూన్ 21 వరకు), ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి) ఎర్రగా, ఒళ్లంతా రోమాలతో మన ఆకాకర కాయ మాదిరిగా కనిపించే ఈ మలేసియా పండు పేరు ‘రాంభూటాన్’. తీపిలో కొంచెం పులుపు కలగలిసిన రుచి ఉంటుంది. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్ల తోటలు శ్రీలంక, తైవాన్, మలేసియా తదితర దేశాల్లో.. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగవుతూ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఈ పండ్ల మొక్కలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివ ర్సిటీ(వెంకట్రామన్నగూడెం, ప.గో. జిల్లా) ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పెరగటం రాంభూటాన్ చెట్ల ప్రత్యేకత. నాలుగేళ్ల క్రితం కర్ణాటకలోని చిత్తలీ ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వెంకట్రామన్నగూడెంలో నాటారు. ఆ చెట్లకు సంతృప్తికరమైన పండ్ల దిగుబడి వస్తోంది. ఇక్కడి వాతావరణంలోనూ ఈ జాతి పండ్ల చెట్లు చక్కగా పెరుగుతాయని రుజువైంది. కేరళ నుంచి తెప్పించిన అంటు మొక్కలను ఇటీవలే నాటారు. అంటు మొక్కల నుంచి వచ్చే పండ్లు మరింత రుచిగా ఉంటాయని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ పండ్ల తోటల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.రాజశేఖర్(73826 33660) తెలిపారు. మొక్క నాటిన మూడో ఏడాది నుంచి కాపు మొదలవుతుంది. పండ్ల దిగుబడి మూడో ఏడాదిలో చెట్టుకు 3 - 8 కిలోలతో ప్రారంభమై.. ఆరో ఏడాదికి 50 నుంచి 80 కిలోలకు పెరుగుతుంది. కాయ బరువు 18 గ్రాములుంటుంది. లోపల గింజతో ఉన్న గుంజు బరువు 12 గ్రాములు ఉంటుంది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని కంజీరాపల్లితో పాటు, తిరువనంతపురం సమీపంలోని పాలోడ్, వితుర ప్రాంతాల్లోని రాంభూటాన్ తోటలు, నర్సరీలలో అంటు మొక్కలను విక్రయిస్తున్నారు. అక్కడ కిలో పండ్లకు రూ. 180కు పైగా ధర పలుకుతోంది. రాంభూటాన్ చెట్టు భాగాలు ఔషధాల తయారీలో, బ్లాక్ డై, సబ్బులు, కొవ్వొత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మార్కెట్ అవకాశాలుంటే విస్తృతంగా సాగు చేయదగిన కొత్తరకం పండ్ల జాతి ఇది. - యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం పర్యావరణహిత సేద్యంపై సర్టిఫికెట్ కోర్సు పర్యావరణ హితమైన సేద్య పద్ధతులు, నమూనాలపై కోల్‌కతా యూనివర్సిటీ ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారం భించనుంది. నార్వేకు చెందిన యూని వర్సిటీ ఆఫ్ లైఫ్ సెన్సైస్తో కలిసి కోల్‌కతా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ పొల్లినేషన్ స్టడీస్ ఆంగ్ల మాధ్యమంలో ఈ కోర్సును కోల్‌కతా కేంద్రంగా ఆఫర్ చేస్తోంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సికింద్రాబాద్ ఫోన్: 040 27014302) ఈ కోర్సు నిర్వహణలో తోడ్పాటు నందిస్తుంది. సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్‌లలో ఏదైనా డిగ్రీ కలిగి ఉన్న వారెవరైనా అర్హులే. జూన్ 22 నుంచి ధరఖాస్తులు పొందవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. పర్యావరణ హితమైన సేద్య నమూనాలను రూపొందించడం, విశ్లేషించడంపై శిక్షణ ఉంటుంది. వివరాలకు సంప్రదించాల్సిన మెయిల్ ఐడి: groecology.cps@gmail.com -
అంతర పంటలు.. నిరంతర లాభాలు
* ఏటికేడు పెరుగుతున్న పండ్ల తోటల సాగు విస్తీర్ణం * అంతర పంటలతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతులు * ప్రభుత్వం నుంచి ప్రత్యేక రుణాలు ఇవ్వాలని అభ్యర్థన మన్ను.. మిన్నునే నమ్ముకున్న అన్నదాతలకు అతివృష్టి, అనావృష్టి వల్ల వరుస నష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలైన మండల పరిధిలోని పలువురు రైతులు ‘ప్రత్యామ్నాయ’ మార్గాలపై దృష్టిపెట్టారు. కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు ‘సాగు’తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల పెంపకం చేపట్టారు. వీటిలో అంతర పంటలు సాగు చేస్తూ.. నిరంతర లాభాలు గడిస్తున్నారు. - చిన్నకోడూరు కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల సరైన సమయంలో వర్షాలు లేక.. అవసరం లేనప్పుడు కురుస్తున్న కుండపోత వానల వల్ల కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణాల వల్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. మండల పరిధిలోని మేడిపల్లి, మాచాపూర్, రామునిపట్ల, మైలారం, మెట్పల్లి, అల్లీపూర్, చెల్కలపల్లి తదితర గ్రామాల్లో మామిడి, ఉసిరి, బత్తాయి తదితర తోటలను విరివిగా సాగు చేస్తున్నారు. డ్రిప్ పద్ధతిలో చెట్లకు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ తోటల్లోనే టమాట, బెండ, వంకాయ, మిరప తదితర కూరగాయ పంటలు వేస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. తోటల్లో ఏర్పాటు చేసిన బిందు సేద్యం విధానం వీటికి కూడా బాగా ఉపయోగపడుతోందని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తున్నందున ఈ తోటల విస్తీర్ణం బాగా పెరిగింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండటంతో ఏటా మామిడి సాగు పెరుగుతూ వస్తోంది. మండల పరిధిలో గతంలో వెయ్యి ఎకరాల లోపు పండ్ల తోటలు ఉండగా ప్రస్తుతం వీటి సాగు రెండు వేల ఎకరాలకు దాటింది. సంప్రదాయ పంటలతో పాటు కొంత విస్తీర్ణంలో పండ్ల తోటలు పెంచుతున్నారు. ప్రతిరోజూ ఆదాయం... పండ్ల తోటలైన మామిడి, బత్తాయి, దానిమ్మ, నిమ్మ తదితర తోటల్లో అంతర పంటలుగా కంది, టమాట, పెసర, మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. వీటివల్ల తమకు నిత్యం పని ఉండటంతో పాటు ప్రతిరోజూ ఆదాయం సమకూరుతోందని చెబుతున్నారు. సీజన్‌కు అనుకూలంగా.. కొంచం తెలివిగా ఆలోచించి పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక రుణాలు అందజేసి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. -
సమగ్ర చర్యలే మందు!
పాడి-పంట: వివిధ రకాల పండ్ల తోటలపై బాక్టీరియా తెగుళ్లు దాడి చేస్తుంటాయి. వీటి కారణంగా పంటకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. రైతులు ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి పండ్ల తోటల రైతులు బాక్టీరియా తెగుళ్లపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని, వాటిని సకాలంలో గుర్తించాలి. సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నివారించాలి. అప్పుడే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం లభిస్తాయి. అరటిలో... పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలకు బాక్టీరియా దుంపకుళ్లు తెగులు ఎక్కువగా సోకుతుంది. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే తెగులు ఉధృతి అధికమవుతుంది. చిన్న మొక్కలతో పాటు పెద్ద మొక్కల్ని కూడా ఈ తెగులు నష్టపరుస్తుంది. ముందుగా కాండం మొదలులో భూమికి దగ్గరగా... అంటే కాండం, దుంప కలిసే భాగంలో... కుళ్లు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత దుంప క్రమేపీ కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలకు తెగులు సోకితే మొవ్వు ఆకు కూడా కుళ్లి, మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కల్లో కాండం మీద నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం నుంచి కుళ్లిన వాసన వస్తుంది. కింది వరుస ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. చివరికి ఆకులన్నీ ఎండిపోయి, మొక్క చనిపోతుంది. మొక్కల పిలకలకు కూడా తెగులు సోకే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు వేసవిలో తోటకు సరిపడా నీరు అందించాలి. ఆరోగ్యంగా ఉన్న తోటల నుంచి మాత్రమే పిలకల్ని సేకరించి నాటాలి. పిలకల్ని మందు ద్రావణంలో (కాపర్ ఆక్సీక్లోరైడ్+మోనోక్రొటోఫాస్) ముంచి ఆరబెట్టి, ఆ తర్వాతే నాటాలి. వరి, చెరకు వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ద్వారా తెగులును నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కల్ని దుంపలతో సహా తీసేసి, తోట బయట చిన్న చిన్న ముక్కలుగా నరికి, ఎండుగడ్డి వేసి తగలబెట్టాలి. మొక్కలు తీసేసిన చోట, ఆ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద బ్లీచింగ్ పొడి ద్రావణాన్ని (లీటరు నీటికి 25 గ్రాముల చొప్పున కలపాలి) మట్టి బాగా తడిసేలా పోయాలి. నిమ్మలో... నిమ్మ తోటల్ని బాక్టీరియా గజ్జి తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. తెగులు సోకిన తోటల్లో లేత ఆకులు, చిన్న-పెద్ద కొమ్మలు, కాయలు, కాండం మీద మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు ఎండిపోతాయి. తెగులు సోకిన చెట్ల మీద ఎండుపుల్లలు ఎక్కువగా కన్పిస్తాయి. ఈ తెగులును ‘బాలాజీ’ రకం బాగా తట్టుకుంటుంది కాబట్టి దానిని సాగు చేయడం మంచిది. తోటలో తెగులు సోకిన కొమ్మల్ని కత్తిరించాలి. ఆ తర్వాత 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి వర్షాకాలంలో 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెట్టు మొదలు పైన, పెద్ద కొమ్మల పైన తెగులు లక్షణాలు కన్పిస్తే బెరడును కత్తితో గోకి బోర్డో పేస్టు పూయాలి. దానిమ్మలో... దానిమ్మ తోటలకు సోకే తెగుళ్లలో బాక్టీరియా మచ్చ తెగులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు జూలై-అక్టోబర్ నెలల మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉన్నప్పుడు, గాలిలో తేమ 70 శాతానికి పైగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. అంతేకాదు... వేసవిలో కురిసే అకాల వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు కూడా తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. తెగులు సోకిన చెట్లకు అంటుకడితే నర్సరీ దశలోనే తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన తోటల్లో ఆకులు, కొమ్మలు, పిందెల పైన ముందుగా నీటి మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి క్రమేపీ పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీంతో ఆకులు రాలిపోతాయి. కొమ్మలు కణుపుల వద్ద విరుగుతాయి. కాయల పైన ఏర్పడిన మచ్చలు నలుపు రంగుకు మారతాయి. కాయలపై ఇంగ్లీషు ‘వై’ లేదా ‘యల్’ ఆకారంలో పగుళ్లు కన్పిస్తాయి. బాక్టీరియా మచ్చ తెగులును నివారించాలంటే ఆరోగ్యవంతమైన అంటు మొక్కలు నాటాలి. తెగులు సోకిన కొమ్మల భాగాల్ని అంగుళం కింది వరకూ కత్తిరించి, తోట బయట కాల్చేయాలి. కత్తిరింపులకు ముందు కత్తెర్లను 1% సోడియం హైఫోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. కత్తిరింపులు పూర్తయిన వెంటనే మొక్కలపై 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. రసాయన ఎరువుల్ని సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. వాటితో పాటు జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ ధాతువుల్ని కూడా అందిస్తే చెట్లకు తెగుళ్లను తట్టుకునే సామర్ధ్యం చేకూరుతుంది. తెగులు సోకిన కాయల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటికి 200 మిల్లీగ్రాముల స్ట్రెప్టోసైక్లిన్+3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. - డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి పశ్చిమ గోదావరి జిల్లా