అంతర పంటలు.. నిరంతర లాభాలు
* ఏటికేడు పెరుగుతున్న పండ్ల తోటల సాగు విస్తీర్ణం
* అంతర పంటలతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతులు
* ప్రభుత్వం నుంచి ప్రత్యేక రుణాలు ఇవ్వాలని అభ్యర్థన
మన్ను.. మిన్నునే నమ్ముకున్న అన్నదాతలకు అతివృష్టి, అనావృష్టి వల్ల వరుస నష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలైన మండల పరిధిలోని పలువురు రైతులు ‘ప్రత్యామ్నాయ’ మార్గాలపై దృష్టిపెట్టారు. కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు ‘సాగు’తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల పెంపకం చేపట్టారు. వీటిలో అంతర పంటలు సాగు చేస్తూ.. నిరంతర లాభాలు గడిస్తున్నారు.
- చిన్నకోడూరు
కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల సరైన సమయంలో వర్షాలు లేక.. అవసరం లేనప్పుడు కురుస్తున్న కుండపోత వానల వల్ల కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణాల వల్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. మండల పరిధిలోని మేడిపల్లి, మాచాపూర్, రామునిపట్ల, మైలారం, మెట్‌పల్లి, అల్లీపూర్, చెల్కలపల్లి తదితర గ్రామాల్లో మామిడి, ఉసిరి, బత్తాయి తదితర తోటలను విరివిగా సాగు చేస్తున్నారు. డ్రిప్ పద్ధతిలో చెట్లకు నీటి సరఫరా చేస్తున్నారు.
ఈ తోటల్లోనే టమాట, బెండ, వంకాయ, మిరప తదితర కూరగాయ పంటలు వేస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. తోటల్లో ఏర్పాటు చేసిన బిందు సేద్యం విధానం వీటికి కూడా బాగా ఉపయోగపడుతోందని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తున్నందున ఈ తోటల విస్తీర్ణం బాగా పెరిగింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండటంతో ఏటా మామిడి సాగు పెరుగుతూ వస్తోంది. మండల పరిధిలో గతంలో వెయ్యి ఎకరాల లోపు పండ్ల తోటలు ఉండగా ప్రస్తుతం వీటి సాగు రెండు వేల ఎకరాలకు దాటింది. సంప్రదాయ పంటలతో పాటు కొంత విస్తీర్ణంలో పండ్ల తోటలు పెంచుతున్నారు.
ప్రతిరోజూ ఆదాయం...
పండ్ల తోటలైన మామిడి, బత్తాయి, దానిమ్మ, నిమ్మ తదితర తోటల్లో అంతర పంటలుగా కంది, టమాట, పెసర, మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. వీటివల్ల తమకు నిత్యం పని ఉండటంతో పాటు ప్రతిరోజూ ఆదాయం సమకూరుతోందని చెబుతున్నారు. సీజన్‌కు అనుకూలంగా.. కొంచం తెలివిగా ఆలోచించి పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక రుణాలు అందజేసి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.