రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయాధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు వాడాలి.
భాస్వరం మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీనిని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండకపోగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది.
పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. చీడపీడలు ఎక్కువగా ఆశించడం వల్ల సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తోంది. తద్వారా ఖర్చు పెరుగుతుంది. వేప పిండి, యూరియా కలిపి వాడితే నత్రజని వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందించే వీలుంటుంది.
నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది.
జిల్లాలోని వ్యవసాయ భూముల్లో భాస్వరం శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫాస్పేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టిరీయా(పీఎస్‌బీ)ను వాడితే భూమిలో నిక్షేపంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి పంటకు అందించవచ్చు.
సూక్ష్మపోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను వ్యవసాయాధికారుల సూచనలు పాటించి సవరించాలి.
పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిఫార్సు చేసిన మందును.. సిఫార్సు చేసిన మోతాదులో.. సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి.
పంటలపై చీడపీడలు ఆశించినంతనే నివారణ చర్యలు చేపట్టనవసరం లేదు. ఎందుకంటే ప్రతి పురుగుకు, తెగులుకు ప్రతి పంటపై సహన పరిమితి ఉంటుంది. ఆ స్థాయి దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సస్య రక్షణపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు.
యూరియాను సిఫార్సు చేసిన మోతాదు కంటే అధికంగా వాడితే పంటలకు చీడపీడలు ఆశిస్తాయి. దాని కోసం మళ్లీ సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా సాగు ఖర్చు పెరుగుతుంది. ఇలా జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
విత్తనశుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.
ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా కూడా సస్యరక్షణ మందులపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు.. పత్తి పంటలో రసం పీల్చే పురుగులను నివారించడానికి బ్రష్ ఈజీ పరికరం బాగా ఉపయోగపడుతుంది. మోనోక్రోటోఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ మందును బ్రష్ ఈజీ పరికరంతో కాండానికి రాసిన ట్లయితే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
కొందరు రైతులు విత్తనాలు ఎక్కువగా చల్లి దిగుబడి రాలేదని బాధపడుతుంటారు. అలా కాకుండా విత్తనాలను సిఫార్సు చేసిన మోతాదులో వాడితే ఖర్చు తగ్గుతుంది, ఆశించిన దిగుబడి దక్కుతుంది.
సాగు ఖర్చు తగ్గించుకుంటే ఆదాయం
Published Thu, Sep 18 2014 3:02 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement