
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ, తూకాల్లో రైతులను మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులతో విక్రయిస్తున్న పలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు.
ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 154 కేసులు నమోదు చేసి, రూ.2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.