
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్‌కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment