గ్రామగ్రామాన ‘పెట్టుబడి’ దందా! | Some officials who are taking money from farmers | Sakshi
Sakshi News home page

గ్రామగ్రామాన ‘పెట్టుబడి’ దందా!

Published Tue, Mar 27 2018 2:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Some officials who are taking money from farmers - Sakshi

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం సమీప గ్రామంలో పదెకరాల భూమి ఉన్న రైతు కృష్ణమోహన్‌. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున వస్తుందని ఆశపడుతున్నాడు. ఇటీవల ఓ రోజు ఆ గ్రామ కార్యదర్శి ఫోన్‌ చేసి ఎకరానికి రూ.400 చొప్పున రూ.4 వేలు ఇస్తేనే పెట్టుబడి సొమ్ము వస్తుందని, లేకుంటే తామేమీ చేయలేమని బెదిరించాడు. రూ.4 వేలు కోసం రూ.40 వేల పెట్టుబడిని పోగొట్టుకోలేక ఆ రైతు గ్రామ కార్యదర్శికి అడిగినంత ముట్టజెప్పుకున్నాడు. 

మరో రైతు రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈయన గ్రామం. ఇప్పటివరకు భూములకు పట్టాలివ్వలేదు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకం రావాలన్నా, పెట్టుబడి సొమ్ము అందాలన్నా ఎకరానికి రూ.500 ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన చెబుతున్నాడు. దీంతో గత్యంతరం లేక లంచం ముట్టజెప్పుకునేందుకు రంగారెడ్డి సిద్ధమయ్యాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడి దందా సాగుతోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 1.62 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సొమ్ము అందజేయనున్నారు. సమయం సమీపిస్తుండటంతో అనేకచోట్ల అధికారులు దందాలు మొదలుపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు కొందరు లంచాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇవ్వకుంటే అడ్డుపుల్ల వేస్తారన్న భయంతో రైతులు గత్యంతరం లేక అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చాపకింద నీరులా జరుగుతోంది. ఇలా అధికారులు లంచం తీసుకున్నారని తమ పేరు, గ్రామం వెల్లడిస్తే పెట్టుబడి సొమ్ము రాదని రైతులు వేడుకుంటున్నారు. లంచం ఇచ్చినా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు.

లంచం ఇస్తే.. మేనేజ్‌ చేస్తాం.. 
రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా వ్యవసాయ సంబంధిత ఖర్చుల కోసం.. ఖరీ ఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పు న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తే రైతులకు అందుతా యో లేదోనని భావించిన సర్కారు.. చివరకు చెక్కులు ఇవ్వాలని, అవి కూడా గ్రామ సభ లో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెక్కులు పంపిణీ కావడానికే ముందే రైతుల నుంచి లంచాలు వసూలు చేయాలని కొన్ని చోట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు పన్నాగాలు చేస్తున్నారు. ‘నీ భూమి సాగుకు యోగ్యంగా లేదు. అలా అని రికార్డుల్లో రాసేస్తే నీకు పెట్టుబడి సాయం రాదు. లంచమిస్తే మేనేజ్‌ చేస్తాం’అంటూ రైతులను బెదిరిస్తున్నారు. ఇప్పటికీ ప్రభు త్వం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతుల్లో ఆందోళన నెలకొంది. దీన్నే అవకాశంగా తీసుకొని రెవెన్యూ అధికారులు పలుచోట్ల ‘నీకు పట్టాదారు పాసుపుస్తకం, పెట్టుబడి సొమ్ము రావాలంటే ముట్టజెప్పుకోవాల్సిందే’ అంటూ హెచ్చరిస్తున్నారు. భయ పెడుతూ వసూళ్లు సాగిస్తున్నారు.

చూసీచూడనట్లుగా రైతు సమితులు 
పెట్టుబడి సొమ్ము రైతులకు సక్రమంగా పంపిణీ చేయడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక్కో గ్రామంలో 15 మందితో రైతు సమితులను ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులున్నారు. అయితే గ్రామాల్లో పెట్టుబడి దందా యథేచ్ఛగా మొదలైనా రైతు సమితి సభ్యులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతు సమితి సభ్యులను కూడా మచ్చిక చేసుకొని దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement