గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విత్తనాల కోసం రాస్తారోకో చేస్తున్న రైతులు
కేసు నుంచి బయటపడటంపైనే సర్కారు దృష్టి
♦ పక్షం రోజులుగా సమయమంతా దానికే వెచ్చిస్తున్న సీఎం, మంత్రులు
♦ కేబినెట్ భేటీలు సైతం తూతూ మంత్రం
♦ రాష్ట్రంలో సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడు
♦ ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల ఆందోళన
♦ బడులు ప్రారంభమైనా అందని పాఠ్యపుస్తకాలు
♦ నిత్యావసరాల ధరలు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: వరుస విపత్తుల తర్వాత తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. రుణాలందక అష్టకష్టాలు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ పుస్తకాలు, యూనిఫామ్‌లు అందకపోవడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పూర్తికావాల్సిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. మరోవైపు కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన పాలకులు పక్షం రోజులుగా పాలనను గాలికొదిలేశారు. గత నెల 31వ తేదీన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడింది మొదలు రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్నుంచి బయటపడే మార్గాలపైనే సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చల్లో మునిగితేలుతున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై ఒకటీ అరా సమీక్షలు నిర్వహించినా తూతూమంత్రంగానే సాగుతున్నాయి. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఈ కేసుల వ్యవహారంపైనే చర్చోపచర్చలు. ఈ నెల 9 తర్వాత తాజాగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ‘ఓటుకు కోట్లు’ కేసుపైనే చర్చ తప్ప.. తక్షణం పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలపై దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాల్సిన మంత్రులంతా హైదరాబాద్‌లోనే మకాం వేసి సీఎం చుట్టూ తిరుగుతున్నారు.
రుణాల కోసం బ్యాంకుల చుట్టూ రైతులు
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. మొన్నటి వర్షాలతో దుక్కి చేసిన రైతులు వరి విత్తనాలు, ఎరువుల కోసం చాలా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాకు ఖరీఫ్‌లో 72 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా వ్యవసాయ శాఖ వద్ద కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో రూ.1,200 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.5 కోట్లు కూడా ఇవ్వలేదు.
గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని జిల్లా అధికారులు రుణ ప్రణాళిక రూపొందించినా ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పంట రుణం ఇవ్వకపోవటం గమనార్హం. సీజన్‌కు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం నిర్వహించి రుణ ప్రణాళిక నిర్ణయించి లక్ష్యం మేరకు అప్పులిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన సర్కారు అసలు సమావేశం ఎప్పుడో కూడా నిర్ణయించలేదు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ అంశాన్ని పూర్తిగా మర్చిపోయింది.
గత పక్షం రోజుల్లో అన్ని రకాల పప్పుల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలైతే ఏకంగా రెట్టింపయ్యాయి. నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. మొన్నటివరకు రూ. 95 ఉన్న కందిపప్పు రూ. 120కి పెరిగింది. పచ్చిమిర్చి కిలో రూ.60 పలుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గోదావరి పుష్కరాల సమయం దగ్గరపడుతున్నా ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన పనులు అసంపూర్తిగానే మిగిలాయి.
స్తంభించిన పోలీసింగ్..
రాష్ట్రంలో పోలీసు పాలన కూడా స్తంభించింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్ట ప్రకారం నడుచుకోవలసిన పోలీసులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సేవల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులంతా గత పక్షం రోజులుగా ఈ కేసు వ్యవహారంపైనే దృష్టి సారించారు. సమయమంతా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కౌంటర్ తయారు చేయడానికే వెచ్చించాల్సి వస్తోందని ఒకవర్గం పోలీసు ఉన్నతాధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతిభద్రతల్ని కాపాడటం, చట్టాన్ని అమలు చేయడం తమ ప్రాథమిక విధులని, తాజా పరిణామాల నేపథ్యంలో వీటికి బదులు ప్రభుత్వం కోరుతున్న ‘ఆధారాలను’ సమర్పించడానికే సమయం చాలట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన 17 రోజులుగా రాష్ట్రంలో పోలీసింగ్ దాదాపు నిలిచిపోయినట్లే భావించాల్సి వస్తోందని అంటున్నారు.
అన్నీ వదిలి పట్టిసీమకెందుకో..?
పంటల సాగుకు అత్యంత ప్రధానమైన విత్తనాలు, ఎరువుల కొరతను పరిష్కరించే మార్గం చూడకుండా, రైతులకు రుణాలపై ఆలోచన చేయకుండా గురువారం సీఎం గోదావరి జిల్లాలకు వెళ్లి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాల సమయంలో పట్టిసీమ లిఫ్ట్‌తో పనేమిటని రైతులు నిలదీస్తున్నారు. వర్షాలు రాకముందే పుష్కర పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తే ప్రయోజనం ఏముంటుందని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘పనిలోపనిగా గురువారం రాత్రి విజయవాడలో మకాం వేసి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ముఖ్యమైన నేతలు, అధికారులతో చర్చించారు..’ అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు.