- రైతులకు అందని సలహాలు, సూచనలు
- సిబ్బంది, అధికారుల కొరత
- ఖాళీ పోస్టుల భర్తీలో సర్కార్ ఉదాసీనత
సేద్య రంగం పురోగతి సాధిస్తే..దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యవసాయశాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఉన్న అరకొర సిబ్బందికి దిశానిర్దేశం చేసే అధికారులూ లేరు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. పోస్టుల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో రైతన్నకు సలహాలు, సూచనలు అందడం లేదు. ఫలితంగా తనకున్న అనుభవంతోనే పంటల సాగుకు సమాయత్తమవుతున్నాడు.
కోలారు, న్యూస్‌లైన్ : ముంగారు ప్రారంభమవుతోందంటే వ్యవసాయ శాఖకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, లఘు పోషకాంశాలు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సౌలభ్యాలు అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది. జిల్లాలో 2.9 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉండగా దాదాపు 1.54 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడ్డారు.
ఫిర్కా కేంద్రాలలో ఉన్న రైతు సంపర్క కేంద్రాలు రైతులకు, వ్యవసాయ శాఖకు మధ్య వారధిగా పనిచేస్తాయి. అయితే జిల్లాలోని ఐదు తాలూకాల్లో అధికారులు, సిబ్బంది కలిపి 202 మంది ఉండాల్సి ఉండగా 87 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల పోస్టులు 44 ఉండగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ అధికారులు ముగ్గురు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సహాయక వ్యవసాయ అధికారుల పోస్టులు 17 ఉండగా 9 ఖాళీగా ఉన్నాయి. ఎస్‌డీసీ పోస్టులు 12కుగాను 6 ఖాళీగా ఉన్నాయి. 8 టైపిస్టులకుగాను మూడు ఖాళీగా ఉన్నాయి. డీ గ్రూప్ ఉద్యోగులు 22 పైకి 6 ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు మంజూరైన 58 సహాయక వ్యవసాయ అధికారులు ఆరుగురు మాత్రమే ఉన్నారు. 52 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవసరమైన సిబ్బంది లేక ప్రభుత్వ సౌలభ్యాలు రైతులకు సకాలంలో అందడం లేదు.
సహాయక వ్యవసాయ అధికారులు లేక రైతు సంపర్క కేంద్రాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పట్టు పరిశ్రమ శాఖను వ్యవసాయ శాఖలో విలీన ం చేయాలనే ప్రస్తావన ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉంది. ఇదే జరిగితే సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న వ్యవ సాయ శాఖకు కొంతవరకు ఉపశమనం కలుగవచ్చు. అయితే పట్టు పరిశ్రమ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయడానికి పట్టు ఉత్పత్తి దారులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
కోలారు జిల్లాలోని తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు
తాలూకా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు
మాలూరు - 14
బంగారుపేట - 22
ముళబాగిలు - 24
శ్రీనివాసపుర - 17
కోలారు - 33
భవనహళ్లి వ్యవసాయ క్షేత్రం - 05
సిబ్బంది కొరత వాస్తవమే
‘వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత ఉంది. దీంతో రైతు సంపర్క కేంద్రాలు సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నాయి. సిబ్బంది కొరతను తీర్చడానికి ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పట్టు పరిశ్రమ శాఖలోని అదనపు సిబ్బందిని గత సంవత్సరం వ్యవసాయశాఖ ఉ పయోగించుకుంది.’
- చిక్కణ్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి