Soil tests
-
శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక ఏది?
గత ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలను తయారు చేయకుండా రైతుల ఇష్టా నిష్టాలపై వ్యవసాయ ఉత్ప త్తులను సాగించింది. అంత కుముందు ఉన్న వ్యవసాయ ప్రణాళికలను 2021 –22 నుండి పూర్తిగా ఎత్తి వేసింది. మార్కెట్ ధరలను బట్టి రైతులు పంటలు పండించడమే తప్ప ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ ఉత్పత్తి జరగలేదు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు చేయాలని జరిపిన ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వరి, పత్తి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతర పంటలకు ఇవ్వలేదు. రాష్ట్రంలో సాగుభూమి 163 లక్షల ఎకరాలు కాగా, వాస్తవంగా సాగుచేసింది 123 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో యాసంగి 70 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. అనగా వానాకాలం, యాసంగి కలిసి 200 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. చాలామంది రైతులు చవిటి భూములలో కూడా పత్తి లాంటి పంటలు వేసి నష్టపోతున్నారు. ఏ భూమిలో ఏ పంటలు వేయాలన్నది భూసార పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. భూసార పరీక్షలు జరిపి రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డు’ ఇవ్వాలి. భూసార పరీక్షలు జరపడం గత పదేళ్లుగా అమలు చేయనందున రైతులు తమకు తోచిన పంటలు పండిస్తున్నారు. పప్పులు, నూనెలు, ముతకధాన్యాల ఉత్పత్తులు హెచ్చుతగ్గులకు గురవు తున్నాయి. ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు (రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు) దిగుమతులు చేసుకుంటున్నాము. ఒకవైపున జనాభా 1.9 శాతం పెరుగుతుండగా వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతున్నది. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు నిరంతరం పెరగాలి. ఇందుకుపంటల పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2014 తర్వాత నుంచి వ్యవసాయ పరిశోధనా ఫలితాలను కూడా దిగుమతి చేసు కున్నాము. మోన్శాంటో, డ్యూపాంట్, కార్గిల్, సింజెంటా, బేయర్ లాంటి సంస్థలు వ్యవసాయ పరిశోధనలు చేసి లాభాలు సంపాదిస్తున్నాయి. రాష్ట్ర వాతావారణానికి అనుకూలంగా ప్రాంతీయంగా వ్యవసాయ పరిశోధనలు జరగాలి. ఇతర దేశాలలోని పరిశోధనా ఫలితాలను వినియోగించడం ద్వారాపంటల ఉత్పత్తులు దెబ్బతిని రైతులు నష్ట పోతు న్నారు. ప్రతి మూడువేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ విస్తరణాధికారి) నియమించాలని రైతులు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ నేటికీ తగినంతమంది వ్యవసాయ అధికారులను గత ప్రభుత్వం నియమించలేదు. హార్టికల్చర్ శాఖలో 2179 పోస్టులకు గాను 901 ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 2,800 పోస్టులు ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 1,167 గోదాముల ద్వారా 24.74 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2014 వరకు 710 గోదాములలో 7.39 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రకటించిన 457 గోదాముల నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి బాక్సులు లేదా సంచులలో నింపి గోదాములలో నిల్వ చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ప్రణాళికలో పంట రుణాలుఅత్యంత కీలకమైనవి. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకుల వాణిజ్య వ్యాపారంలో 40 శాతం వ్యవసాయ రంగానికి రుణాలివ్వాలి. అందులో 18 శాతం పంటరుణాలు ఇవ్వాలి. అందుకు తగినవిధంగా ప్రతి ఏటా మే నెలలో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయాలి. కానీ వ్యవసాయ శాఖ ఆగస్టులో రుణప్రణాళికను విడుదల చేస్తున్నది. వ్యవసాయ బడ్జెట్ తగినంత కేటాయించకపోవడం వల్ల వ్యవసాయా భివృద్ధికి, నూతన టెక్నాలజీని వినియోగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2023–24లో రూ. 18,370 కోట్లు కేటాయింపులు చూపారు. కానీఇందులో రైతుబంధు రూ. 11,704 కోట్లు, రైతు బీమా రూ. 1,167 కోట్లు, వ్యవసాయ రుణమాఫీ రూ. 4,692 కోట్లు, మ్తొతం రూ. 17,565 కోట్లు కేటాయించారు. ఈ పథకా లను మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయించింది రూ. 807 కోట్లు మాత్రమే. వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం వలన వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి రాష్ట్రంలో వాతావరణ అనుకూలత ఉంది. సమ శీతోష్ణ వాతావరణం వలన రాష్ట్రంలో విత్తనోత్పత్తితో పాటు వాణిజ్య పంటలకు, హార్టికల్చర్ పంటలకు అవకాశాలున్నాయి. వాతావరణాన్ని బట్టిపంటలు పండించేందుకు తగిన శిక్షణనివ్వాలి. ప్రభుత్వ రంగంలోని పరిశోధనా కేంద్రాలకు శాస్త్ర వేత్తలను, నిధులను కేటాయించి అధికోత్పత్తికి దోహదం చేయాలి. - వ్యాసకర్త రైతుసంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు - సారంపల్లి మల్లారెడ్డి -
మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు!
సాక్షి, అమరావతి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు.. వీరు ఏటా భూసార పరీక్షలు చేయడమే కాదు.. భూసారాన్ని కాపాడేందుకు సిఫార్సు మేరకు తగిన సూక్ష్మపోషకాలందిస్తారు. విత్తు నుంచి కోత వరకు పంటలకు సోకే తెగుళ్లను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎంత మోతాదులో మందులు వాడాలో చెబుతారు. దగ్గరుండి మొక్కలకు అందేలా చూస్తారు. నాణ్యమైన పంట దిగుబడులు సాధించడమే లక్ష్యంగా..దేశంలోనే తొలిసారిగా ఏపీలోని ఆర్బీకేల్లో ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి తొలుత మండలానికి ఓ ఆర్బీకేలో వీటి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో 670 ఆర్బీకేల పరిధిలో అమలు.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్లాంట్ హెల్త్ డయాగ్నస్టిక్ సెంటర్లు (పీహెచ్‌డీసీ)గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేశారు. భూసారం, నీటి, సూక్ష్మ పోషక లోపాలను గుర్తించేందుకు రైతు క్షేత్రం నుంచి నమూనాలు సేకరించి నిర్దేశిత గడువు లోగా ఫలితాలు అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించాలన్న లక్ష్యంతోనే ప్లాంట్ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తొలుత మండలానికి ఓ ఆర్బీకే పరిధిలో పీహెచ్‌డీసీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 670 ఆర్బీకేల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఆర్బీకేలలోనూ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్లాంట్ డాక్టర్స్‌గా శిక్షణ పీహెచ్‌డీసీ ఏర్పాటుకు అనువైన భవనం, సౌకర్యాలున్న ఆర్బీకేలను ఎంపిక చేస్తారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తయిన ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల (వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్‌ఎ)ను ఎంపిక చేస్తారు. వీరికి జిల్లా స్థాయిలోని కేవీకే, ఏఆర్ఎస్, డాట్ సెంటర్లలో ఏప్రిల్–మే నెలల్లో కనీసం మూడు వారాల పాటు విడతల వారీగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఆర్బీకేల్లో అవసరమైన మినీ కిట్స్‌తో పాటు పంటల ఆధారిత లీఫ్ కలర్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషక లోపాల చార్ట్‌లను అందిస్తారు. ప్రత్యేకంగా. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. అగ్రి ల్యాబ్స్‌లో ఉచితంగా పరీక్షలు స్థానికంగా పరీక్షించ తగ్గ వాటిని ఆర్బీకే స్థాయిలో పరీక్షిస్తారు. భూసారంతో పాటు సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను నిర్ధారించేందుకు వాటి శాంపిల్స్‌ను సమీప వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా ఉచితంగా పరీక్షించి వాటి ఫలితాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా రైతులకు పంపిస్తారు. అవే ఫలితాలను సంబంధిత శాస్త్రవేత్తలకు పంపిస్తారు. ఫలితాల ఆధారంగా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాత పూర్వకంగా రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో చెబుతారు. సామూహికంగా, వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులపై పీహెచ్‌డీసీల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారు. సిఫార్సు మేరకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, మందులు తగిన మోతాదులో అందేలా చూస్తారు. 2023–24లో కనీసం 5 లక్షల భూసార పరీక్షలు నిర్వహించి ప్రతీ రైతుకు ఈ పీహెచ్‌డీసీల ద్వారా సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
సాయిల్ టె(బె)స్ట్
సాక్షి, వరంగల్ రూరల్ : నేలతల్లి ఆరోగ్యంగా ఉంటేనే బంగారు పంటలు పండుతాయి. నేటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి రసాయనిక ఎరువుల వాడకం పెరగడంతో భూసారం దెబ్బతిని ఆశించిన దిగుబడులు రావడం లేదు. ఈ నేపథ్యంలో నేల సారాన్ని బట్టి ఎరువులు వాడాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఇందుకోసం ప్రతి రైతు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలుపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సార పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే అధిక దిగుబడులు వస్తాయని ఆయా తెగులు రాకుండా ఉంటాయని వ్యవసాయ అధికారులు రైతులకు ఎంతగా చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. తమకు తోచిన విధంగా విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించి అధిక మోతాదులో పంటలకు ఎరువులను వాడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత గురించి రైతులకు వివరించి వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించే విధంగా చైతన్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాంతాల వారీగా క్రాఫ్ కాలనీలను ఏర్పాటు చేయించి అక్కడ పండించే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో ప్రయోగాత్మకంగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉండే రైతులందరి పంట పొలాల్లో మట్టి నమునాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాల ఆధారంగా సలహాలు జిల్లాలో గత వారం రోజులుగా వ్యవసాయ శాఖ అధికారలు రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి మట్టి నమునాలను సేకరిస్తున్నారు. మట్టి నమునాల సేకరణ పూర్తి చేసి ఈ నెలాఖరులోగా వాటి ఫలితాలను కార్డుల రూపంలో అందించనున్నారు. భూసార పరీక్షల్లో వచ్చే ఫలితాల మేరకు రైతులు పండించే పంటలకు ఎంత మోతాదులో ఏ ఎరువులు వాడాలో వ్యవసాయ అధికారులు రైతులకు సూచించనున్నారు. అంతేగాకుండా వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇక నుంచి ఫర్టిలైజర్ షాపులకు రైతులు నేరుగా వచ్చి ఎరువులు కొనుగోలు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. అధికారుల ప్రిస్కిప్షన్ ద్వారానే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి వసతి గల భూములు 3707.75 హెక్టార్లు, వర్షాధారంగా సాగయ్యే భూములు 1896.24 హెక్టార్లు, మొత్తం 5603.99 హెక్టార్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను 5496 మంది రైతులు కలిగి ఉన్నారు. ఈ నెల 27 వరకు పూర్తి ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా ఆ భూమిలో మట్టి నమునాలు సేకరించనున్నారు. సేకరించిన మట్టి నమునాలను వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం గల ల్యాబ్‌కు పంపనున్నారు. కొన్నింటిని మినీ వ్యవసాయ కిట్ల ద్వారా పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 27 వరకు పరీక్షలు పూర్తి చేసి ఆ మరుసటి రోజు నుంచి భూసార పరీక్షల ఫలితాల కార్డులను రైతులకు అందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లోని రైతుల పంట పొలాల మట్టి నమునాలను సేకరించనున్నారు. -
ముంగిట్లోనే ‘మట్టి పరీక్ష’
నేలకొండపల్లి: ఏటా మట్టి నమూనా పరీక్షలు చేయించుకోకపోవడం.. భూసారం తగ్గిపోవడం.. దిగుబడులపై ప్రభావం చూపడం.. పురుగు మందులు ఇష్టానుసారంగా వాడడం.. ఇలా వ్యవసాయ భూముల్లో పంటలు వేసిన రైతులు ఆశించిన దిగుబడి రాక నష్టాల పాలయ్యేవారు. పరీక్షల కోసం మట్టిని జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌లకు పంపించాల్సి రావడంతో రైతులు వెనుకాడేవారు. వారి ఇబ్బందులను తీర్చేందుకు.. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకునేలా ప్రో త్సహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వ్యవసాయాధికారుల బృందంతో భూసార పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించడం.. పరీక్ష ల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించడం వంటి చర్యలు చేపట్టింది. మట్టి పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 92 మినీ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో భూసార పరీక్షలు గ్రామానికి ఒకరిద్దరు రైతులు మాత్రమే చేయించుకునే వారు. వ్యవసాయంపై ఆసక్తి ఉండి.. కొద్దోగొప్పో అవగాహన ఉండి.. చదువుకున్న రైతులు మాత్రమే దీనికి మొగ్గు చూపేవారు. అయితే చేలల్లో మట్టి నమూనాలు సేకరించడంపై అవగాహన లేకపోవడం.. పరీక్షల వల్ల కలిగే లాభాల గురించి పూర్తిగా తెలియకపోవడం.. మట్టి నమూనాలను పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి రావడం వంటి కారణాలతో పరీక్షలపై ఆసక్తి ఉన్న కొద్దిమంది రైతులు కూడా ఇదంతా ఎందుకులే అని వెనుకాడేవారు. అక్కడక్కడ రైతులు ఎవరైనా తమ చేలల్లోని మట్టి నమూనాలకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపించినా.. ఫలితాల కోసం నెలలతరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో భూసార పరీక్షల ఫలితాలు రైతులకు సకాలంలో అందకపోగా.. రైతులు కూడా తమ పక్క రైతులు వాడే ఎరువులనే ఇష్టారీతిగా పంటలపై వాడేవారు. దీనివల్ల దిగుబడి పెరగడం మాట అటుంచితే.. పెట్టుబడులు తడిసి మోపెడయ్యేవి. దీర్ఘకాలంగా ఒకే రకమైన రసాయన ఎరువులు వాడడంతో భూసారం తగ్గడంతోపాటు నేలలు నిర్జీవంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడేవి. ఈ క్రమంలో సాగులో నిమగ్నమైన రైతులు ఏళ్లుగా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చేది. పంటపై పెట్టిన పెట్టుబడులు పూడకపోగా.. అప్పుల పాలైన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మారిన పరిస్థితుల నేపథ్యంలో రైతుల్లో మట్టి పరీక్షలపై అవగాహన పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు మండలస్థాయిలో మట్టి పరీక్షల కోసం మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో భూసార పరీక్షలు చేయించుకునేందుకు రైతులు ముందుకొస్తున్నారు 92 మినీ ల్యాబ్‌లు గతంలో మట్టి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే రైతులకు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం, దూర ప్రయాణం చేయాల్సి రావడం, ఫలితాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడంతో రైతులు మట్టి పరీక్షలపై అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. ప్రస్తుతం మండల కేంద్రాల్లో, క్లస్టర్లవారీగా 92 మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం, సత్తుపల్లిలో ప్రధాన ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏఈఓల ఆధ్వర్యంలో.. క్లస్టర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. ఇందుకోసం ఏఈఓలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. రైతులు తమ పంట భూముల నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పరీక్షించి.. ఒక్క రోజులోనే ఫలితం చెప్పే విధంగా వెసులుబాటు కల్పించారు. ల్యాబ్‌లో మట్టిలోని గాఢత, లవణీయత, సేంద్రియ, కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియంతోపాటు నేలలో ఉన్న సూక్ష్మపోషకాల శాతాన్ని అధికారులు లెక్కిస్తారు. అనంతరం రైతులకు నివేదికలు అందిస్తారు. దీని ఆధారంగా రైతులు వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. ఎప్పుడెప్పుడు వేయాలి.. ఎలాంటి పంటలు వేయాలనే వివరాలను రైతులకు సూచిస్తారు. దీంతో పంటలపై తగిన మోతాదులో ఎరువులు వాడి ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా రైతులు లాభాలు సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. గ్రామాల్లో రైతులకు మట్టి పరీక్షల సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో క్లస్టర్ పరిధిలో మినీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. మట్టి పరీక్షలు చేసి.. రైతులకు నివేదికలు అందిస్తారు. శిక్షణ పొందిన ఏఈఓలు ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పోషకాల శాతం ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే బయటి ఎరువులు వేసుకోవాలి. దీని ద్వారా పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. – ఎస్వీకే.నారాయణరావు, వ్యవసాయాధికారి, నేలకొండపల్లి రైతులకు వరం లాంటిది.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో మట్టి పరీక్ష ల్యాబ్‌లను రైతుల చెంతకు తెచ్చింది. మినీ ల్యాబ్‌ల ఏర్పాటు రైతులకు వరం లాంటిది. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని.. అధికారులు చెప్పిన నివేదిక ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలి. ఎరువులు వాడాలి. తెలంగాణ రైతాంగం ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – మేకల వెంకటేశ్వర్లు, రైతు సమితి కన్వీనర్, కోనాయిగూడెం -
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్‌పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్‌ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
మట్టి, నీటి పరీక్షలు తప్పనిసరి
దర్శి: భూమిలో పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం స్థాయి ఎంత వరకు అవసరమో తెలుసుకోవాలని కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీఎం ప్రసాద్‌రావు పేర్కొన్నారు. భూమి, నీటి పరీక్షల గురించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అధిక మోతాదుల్లో ఎరువులు వేయడం వల్ల భూమిసారం తగ్గడమే కాకుండా పంటకు హాని కలుగుతుంది. అందువలన రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. మట్టినమూనాలు తీయడానికి వేసవికాలం సరైన సమయం. రైతులు మట్టి నమూనాలను సేకరించి దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గల భూసార పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువస్తే నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు ఇస్తారు. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులు ఏ మోతాదులో వేసుకోవాలి, నేలకు ఏ పైరు అనుకూలం అనే విషయాలు తెలుస్తాయి. వాటిని సంబంధించిన సలహాలు, సూచనలను కూడా కేవీకే శాస్త్రవేత్తలు ఇస్తారు. పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించడం అనేది ముఖ్య విషయం. సేకరణ సరిగ్గా లేకపోతే మట్టి పరీక్ష చేసి కూడా వృథా అవుతుంది. దీనివలన సిఫార్స్ చేసిన ఎరువుల మోతాదులూ తేడాలు వస్తాయి. మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... పొలమంతా ఒకే విధంగా ఉంటే రెండుమూడు ఎకరాల్లో 8 నుంచి 10 చోట్ల ‘ఠి’ ఆకారంలో 6 నుంచి 7 అంగులాల గుంత తీసి పైనుంచి కిందకు, అంచుల నుంచి మట్టి సేకరించాలి. మట్టిలో పంట వేర్లు, ఆకులు లేకుండా చూసుకోవాలి. పండ్ల తోటలకైతే 3 నుంచి 4 అడుగుల వరకు గుంత తీసి అచ్చుల నుంచి ప్రతి అడుగు వేరువేరుగా మట్టి సేకరించాలి. ఇలా సేకరించిన మట్టి మొత్తాన్ని ఒక గుడ్డపై పోసి నాలుగు సమభాగాలుగా చేయాలి. ఆ తర్వాత రెండు ఎదురెదురు భాగాలు తీసివేయాలి. ఇలా అరకిలో మట్టి వచ్చే వరకు చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో లేదా గుడ్డ సంచిలో వేసి రైతు పేరు, చిరునామా, ఫోన్ నంబరు, పంట వివరాలు రాసి మట్టి నమూనా మరియు ఇతర వివరాలతో కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొస్తే పరీక్ష చేసి ఫలితాలు ఇస్తారు. మట్టినమూనాలు సేకరించేటప్పుడు పేడకుప్పల దగ్గర, గట్ల దగ్గర, నీరు నిల్వ ఉన్న చోట రసాయనిక ఎరువులు వేసి ఉంటే 50 నుంచి 60 రోజుల వరకు మట్టి నమూనాలు తీయరాదు. అలాగే నీటి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. సాగుకు ఉపయోగించే నీరు సరైంది కాకుంటే భూసారం తగ్గి పంట తగ్గిబడి తగ్గుతుంది. నీటి పరీక్ష చేయించుకుని ఏ పైరుకు ఆ నీరు అనుకూలమో ఆ పైరు వేసుకోవాలి. నీటిని సేకరించేటప్పుడు నీరు బోరు నీరైతే 5 నిముషాల తర్వాత వదిలిన నీటిని ప్లాస్టిక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి అరలీటరు నీటిని పట్టాలి. అదే బావి నీరైతే బావి మధ్యలో కొంత లోతులోకి వెళ్లి బాటిల్ ముంచి పట్టాలి. కాలువలో అయితే కాలువ మధ్యలో నీటిని సేకరించాలి. నీటిని సేకరించిన 12 గంటల్లో పరీక్ష కేంద్రానికి అందించాలి. మట్టి, నీటి పరీక్షలపై అధిక వివరాలు తెలుసుకోదలచిన వారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించాలి. ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే 72072 63357 నంబరును సంప్రదించాలి. -
ప్రతి రైతుకూ భూసార పత్రం
అనంతపురం అగ్రికల్చర్: ప్రతి రైతుకూ భూసార పత్రం అందజేయాలనే ఉద్దేశంతో ఈ ఏడాది 52,044 మట్టి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని భూసార పరీక్షా కేంద్రం (సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ–ఎస్టీఎల్) సహాయ సంచాలకులు జి.విజయశేఖర్ తెలిపారు. పంటల సాగు, దిగుబడులు, ప్రజారోగ్యం, పర్యావరణ కాలుష్య పరంగా మట్టి పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. అందువల్ల రైతులందరూ తమ పొలాల్లో మట్టి నమూనాలు తీయించి వాటి ఫలితాలకు సంబంధించిన సాయిల్హెల్త్కార్డు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 52,044 పరీక్షలు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద గత నవంబర్ నుంచి ఈ ఏప్రిల్ వరకు 52,044 మట్టి నమూనాలు తీసి వాటిని పరీక్షించాం. ఇపుడు రెండో విడతగా మే నుంచి వచ్చే మార్చి లోపు జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లోని మట్టిని సేకరించి పరీక్షలు పూర్తిచేసి భూసార పత్రాలు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో మొదటి విడత భూసార పత్రాలు (సాయిల్హెల్త్కార్డులు) పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటూనే, రెండో విడత కింద మట్టి నమూనాల సేకరణ ప్రారంభించాం. రెండో విడత కింద ఇప్పటికే 2 వేల నమూనాలు ప్రయోగశాలకు చేరాయి. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలతో పాటు సంచార వాహనం ద్వారా పరీక్షలు నిర్వహిస్తాం. 25 ఎకరాలను ఒక గ్రిడ్‌గా విభజించి మొదటి విడత మాదిరిగానే రెండో విడతలో కూడా 3.62 లక్షల మంది రైతులకు భూసార పత్రాలు అందజేయాలని ప్రణాళిక రూపొందించాం. సిఫారసుల ఆధారంగాపోషక యాజమాన్యం పరీక్షల తర్వాత భూమిలో పోషకాలు ఏ మేరకు ఉన్నాయి..? ఇంకా ఎలాంటి పోషకాలు పొలంలో వేయాలనే అంశాల నివేదికను భూసార పత్రాల్లో నమోదు చేసి రైతులకు ఇస్తాం. వాటి ఆధారంగా రైతులు ఎరువుల యాజమాన్యం పాటిస్తే పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. మట్టి నమూనాలు ఇక్కడకు రాగానే వాటిని మరోసారి పరిశీలించి కావల్సినంత పరిమాణంలో వేరు చేస్తాం. తర్వాత పీహెచ్ (భూమి స్థితి) శాతం ఎలెక్ట్రికల్ కండక్టర్ (ఈసీ), ఆర్గానిక్ కర్బన్ (ఓసీ), నైట్రోజన్ (ఎన్), ఫాస్పరస్ (పి), పొటాష్ (కె), సల్ఫర్, బోరాన్ పోషకాల శాతం పరీక్షలు నిర్వహిస్తాం. వీటితో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శాతం తెలుసుకునే పరీక్షలు చేస్తాం. అన్నింటినీ క్రోడీకరించి ఉన్న పోషకాల శాతం, లేనివి ఏంటి, ఏ పంటలకు ఎలాంటి పోషకాలు ఎంత శాతం వాడాలనే వివరాలతో కూడిన పత్రాలు తయారు చేసి రైతులకు అందజేస్తాం. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో భూసార పత్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది. ప్రతి రైతుకూ భూసార పత్రం ప్రతి రైతుకూ భూసార పత్రం ఇవ్వాలనే లక్ష్యంతో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత మూడేళ్ల కాలంలో 1.63 లక్షల మట్టి పరీక్షలు నిర్వహించి 5.10 లక్షల మంది రైతులకు భూసార పరీక్ష పత్రాలు ఇచ్చాము. ఈసారి రెండు విడతలు పూర్తిచేస్తే మొత్తంగా 2.67 మట్టి పరీక్షల ద్వారా 12.34 లక్షల మంది రైతులకు ఇచ్చినట్లవుతుంది. ఇలా జిల్లాలోని ప్రతి రైతుకూ భూసార పత్రం అందేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడతలో కూడా అనంతపురం కేంద్రం ద్వారా 29,033 పరీక్షలు, ధర్మవరంలో 9,775 పరీక్షలు, పెనుకొండలో 8,750 పరీక్షలతో పాటు సంచార భూసార వాహనం ద్వారా 5,216 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం గ్రామ గ్రామానా జీపీఎస్ సాయంతో ఇప్పటికే మట్టి నమూనాలు సేకరిస్తున్నాం. ఇందుకు వ్యవసాయాధికారులు, రైతులు సహకరిస్తే సకాలంలో లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది. -
తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రవాణా, హోంశాఖ, వ్యవసాయం, పశు సంవర్ధనం, మత్స్య పరిశ్రమ, సహకార రంగాలకు చెందిన పద్దులకు ఆదివారం ఆమోదం లభించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ముఖ్యపట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసుల వారంతపు సెలవును త్వరలో అమలు చేస్తామన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక వాహనం: పోచారం భూసార పరీక్షలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే పశువైద్యం కోసం కూడా 108 తరహాలో వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
భూసార పరీక్షలపై దృష్టి పెట్టండి
- వచ్చే వారం రోజులు క్షేత్రాల్లోనే ఉండాలి - వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు సాక్షి, విశాఖపట్నం : భూసార పరీక్షలు, సూక్ష్మపోషక పదార్థాల వినియోగంపై ఆశించినస్థాయిలో రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారని రాష్ర్ట వ్యవసాయశాఖ కమిషనర్ కె.మధుసూదనరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్ సన్నద్ధతపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల జేడీలు, ఏఓలు, వ్యవసాయ విస్తరణాధికారుల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశాఖపట్నంలో భూసార పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. 2015-16లో 32,070 శాంపిల్స్ తీయాలని లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 14,009 మాత్రమే తీయగలిగారు. వాటిలో ఇప్పటి వరకు 10,335 శాంపిల్స్ మాత్రమే ల్యాబ్స్‌కు పంపగా, 4138 శాంపిల్స్ మాత్రమే పరీక్షించగలిగారన్నారు. సకాలంలో భూసార పరీక్షలు జరిపి తగిన సూచనలు ఇవ్వక పోవడం వల్ల మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తున్నారని, తద్వారా సూక్ష్మ పోషకాలు అందడం లేదన్నారు. ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులను ఆకర్షితులను చేయాలన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు విత్తన కొరత తీర్చాలన్నారు. శుక్రవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు వారం రోజుల పాటు రైతు క్షేత్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ జిల్లాలో రాజ్మా సాగును స్పెషల్ ప్రాజెక్టుగా తీసుకోవాలని, మిల్లట్స్, పాడీ, మైజా విస్తీర్ణాన్ని పెంచేలాన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేయనున్నట్టు చెప్పారు. భూసారంలో జింక్, జిప్సం, బోరాన్ వంటి ధాతువుల లోపాల నివారణ గురించి ఏడీ విజయప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జేడీలు సత్యనారాయణ, ప్రమీల, అప్పలస్వామి, ఆత్మ పీడీలు సీఎన్ శ్రీనివాసులు, శివప్రసాద్ పాణిగ్రాహి పాల్గొన్నారు. -
మట్టి పరీక్షలు.. నవశకానికి నాంది
గజ్వేల్: ‘వ్యవసాయరంగం కష్టాల్లో ఉంది.. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే పరిజ్ఞానం అందుబాటులోలేక రైతులు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారు.. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే తొలిసారిగా చేపట్టబోతున్న పూర్తిస్థాయి మట్టి పరీక్షలు రైతన్నల ఆత్మహత్యల నివారణకు పునాది వేయాలి, నవ శకానికి నాంది పలకాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కొత్త రకం మట్టి పరీక్షలకు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గజ్వేల్‌లో మంగళవారం ఎన్ఎస్ఎస్ఎల్యూపీ(నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ యూటీలైజ్ ప్లానింగ్) సంస్థ అధ్వర్యంలో చేపట్టనున్న పూర్తిస్థాయి భూసార పరీక్షల కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. నేల స్వభావం తెలియక రైతులు తమకు తోచిన పంటలు వేసుకోవడం, మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోందన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకే ప్రభుత్వం పూర్తిస్థాయి మట్టి పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామాల్లో 1,778 మట్టి నమునాలను సేకరించి వాటి పరీక్షల ఫలితాలతో రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డ్’ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్డులో రైతులు వచ్చే 50 ఏళ్లు పాటు తమ భూముల్లో ఏయే పంటలు వేయాలి? భూముల్లో ఎలాంటి పోషకాలు లోపించాయి? వాటిని భర్తీ చేసుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ప్రణాళిక అందివ్వడం జరుగుతుందన్నారు. దీంతో రైతులకు పంటల సాగులో అవగాహన ఏర్పడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం గజ్వేల్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలాల్లో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో రాష్ట్రంలోని 46 లక్షల హెక్టార్లలో చేపడతామన్నారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. బిందు, తుంపర సేద్యానికి ఈ ఏడాది రూ.430 కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత పదేళ్ల సమైక్య పాలనలో 129 హెక్టార్లలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు కేవలం రూ.24 కోట్లు కేటాయిస్తే....ప్రస్తుతం సీఎం కేసీఆర్ తొలి బడ్జెట్లోనే వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు రూ.250 కోట్లు కేటాయించారని తెలిపారు. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాలు సాగుచేస్తున్న రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూసార పరీక్షలతో రైతుకు లాభం వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, ఆహార భద్రతను సాధించాలంటే ముందుగా నేల భద్రంగా ఉండాలన్నారు. ఈ విషయం తెలియాలంటే భూసార పరీక్షలతోనే సాధ్యమన్నారు. ఎన్ఎస్ఎస్ఎల్యూపీకు చెందిన గొప్ప శాస్త్రవేత్త ఎస్కే.సింగ్ నేతృత్వంలో చేపట్టబోతున్న ఈ పూర్తిస్థాయి మట్టి పరీక్షలు వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న పూనం మాలకొండయ్య తెలంగాణలోనే సేవలందించాలని కోరారు. సభలో వ్యవసాయశాఖ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఫ్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రత్యేకాధికారి ప్రవీన్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మట్టి పరీక్షలు, పరిజ్ఞానం, పంటలు, Soil tests, knowledge, crops -
సాగు ఖర్చు తగ్గించుకుంటే ఆదాయం
రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయాధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు వాడాలి. భాస్వరం మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీనిని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండకపోగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. చీడపీడలు ఎక్కువగా ఆశించడం వల్ల సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తోంది. తద్వారా ఖర్చు పెరుగుతుంది. వేప పిండి, యూరియా కలిపి వాడితే నత్రజని వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందించే వీలుంటుంది. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో భాస్వరం శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫాస్పేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టిరీయా(పీఎస్బీ)ను వాడితే భూమిలో నిక్షేపంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి పంటకు అందించవచ్చు. సూక్ష్మపోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను వ్యవసాయాధికారుల సూచనలు పాటించి సవరించాలి. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిఫార్సు చేసిన మందును.. సిఫార్సు చేసిన మోతాదులో.. సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. పంటలపై చీడపీడలు ఆశించినంతనే నివారణ చర్యలు చేపట్టనవసరం లేదు. ఎందుకంటే ప్రతి పురుగుకు, తెగులుకు ప్రతి పంటపై సహన పరిమితి ఉంటుంది. ఆ స్థాయి దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సస్య రక్షణపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదు కంటే అధికంగా వాడితే పంటలకు చీడపీడలు ఆశిస్తాయి. దాని కోసం మళ్లీ సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా సాగు ఖర్చు పెరుగుతుంది. ఇలా జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనశుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా కూడా సస్యరక్షణ మందులపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు.. పత్తి పంటలో రసం పీల్చే పురుగులను నివారించడానికి బ్రష్ ఈజీ పరికరం బాగా ఉపయోగపడుతుంది. మోనోక్రోటోఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ మందును బ్రష్ ఈజీ పరికరంతో కాండానికి రాసిన ట్లయితే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. కొందరు రైతులు విత్తనాలు ఎక్కువగా చల్లి దిగుబడి రాలేదని బాధపడుతుంటారు. అలా కాకుండా విత్తనాలను సిఫార్సు చేసిన మోతాదులో వాడితే ఖర్చు తగ్గుతుంది, ఆశించిన దిగుబడి దక్కుతుంది. -
ఏడాదిలోగా తెలంగాణ భూసార పటం
కర్ణాటక తరహాలో రూపకల్పనకు కేసీఆర్ నిర్ణయం కోటి ఎకరాల సాగు భూముల సమగ్ర సమాచారం భారతీయ విత్తన భాండాగారంగా తెలంగాణ ఇక్రిశాట్ ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి హైదరాబాద్: ఏడాదిలోగా కోటి ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో కర్ణాటక రాష్ట్రం తరహాలో తెలంగాణ భూసార పటం(తెలంగాణ సాయిల్ ఫర్టిలిటీ అట్లాస్) రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు ఇక్రిశాట్ సహకారాన్ని తీసుకుంటామని ప్రకటించారు. ఇక్రిశాట్ ఆధ్వర్యంలోనే కర్ణాటకలో భూసార పరీక్షలు జరిగాయని.. ఈ సంస్థ అనుభవాన్ని, విజ్ఞానాన్ని తెలంగాణకు కూడా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం డి.దార్, గ్లోబల్ లీడర్ దిలీప్ కుమార్, డెరైక్టర్ సుహాస్ పి.వాణి శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణను భారతీయ విత్తన భాండాగారంగా మార్చే ఆలోచన ఉందని ఈ సందర్భంగా సీఎం వారితో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండో హరిత విప్లవానికి అడుగులు పడుతున్న తరుణంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ ప్రాంత రైతులకు ఉపయోగపడే వ్యవసాయ విధానం అవలంబించాలన్నది తన ఉద్దేశమని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించే పద్ధతులను వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించాల్సిన పద్థతులపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిపారు. భూసార పటాన్ని రూపొందించిన తర్వాత ఆ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇది రైతులకే కాకుండా ప్రభుత్వానికి, వ్యవసాయ పరిశోధకులకు, వ్యవసాయ అధికారులకు, సంప్రదాయ ఎరువుల ఉత్పత్తిదారులకు, చివరకు వ్యవసాయ విధానాన్ని ఖరారు చేసే శాసనకర్తలకు కూడా కరదీపికలాగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. -
భూసార ‘పరీక్ష’
కర్నూలు(అగ్రికల్చర్), తొలకరి పలకరిస్తోంది. ఖరీఫ్ ఆశలు రేపుతోంది. ప్రాధాన్యత కలిగిన భూసార పరీక్షలు మాత్రం రైతులను వెక్కిరిస్తున్నాయి. రైతులు గుడ్డిగా రసాయన ఎరువులు వాడుతూ నష్టపోతున్న దృష్ట్యా ఈ పరీక్ష చేయించడం ఎంతైనా అవసరం. ఈ మేరకు ప్రణాళికా బద్ధంగా మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌లలో పరీక్షించి ఫలితాలను రైతులకు తెలియజేస్తే వారికి అంతోఇంతో ఉపయోగం చేకూరుతుంది. ఇదే సమయంలో దిగుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఖరీఫ్ సాధారణ సాగు 5,85,351 హెక్టార్లు కాగా.. ఈ విడత 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగవనున్నాయి. అయితే మట్టి నమూనాల పరీక్ష మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపహాస్యమవుతోంది. వ్యవసాయ యంత్రాంగం భూసార పరీక్షలను సీరియస్‌గా తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మే నెల మొదటి వారంలో మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపినాపరీక్షకు నోచుకోకపోవడం గమనార్హం. కర్నూలు సబ్ డివిజన్ నుంచి 806, డోన్ సబ్ డివిజన్ నుంచి 606, నందికొట్కూరు సబ్ డివిజన్ నుంచి 620, ఆత్మకూరు సబ్ డివిజన్ నుంచి 390, నంద్యాల సబ్ డివిజన్ నుంచి 1150, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ నుంచి 860, కోవెలకుంట్ల సబ్ డివిజన్ నుంచి 1080, ఆదోని సబ్ డివిజన్ నుంచి 1270, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ నుంచి 750, ఆలూరు సబ్ డివిజన్ నుంచి 960, పత్తికొండ సబ్ డివిజన్ నుంచి 460 ప్రకారం మట్టి నమూనాలు సేకరించారు. జిల్లాలో ఎమ్మిగనూరు, కర్నూలు, డోన్, నంద్యాలలో భూసార పరీక్ష కేంద్రాలు ఉండగా.. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ ఆధ్వర్యంలో మిగిలినవన్నీ పని చేస్తున్నాయి. సేకరించిన మట్టి నమూనాల్లో 60 శాతం ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికే పంపారు. సాధారణంగా ఈపాటికే పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. ఎమ్మిగనూరు ఏడీఏ అలసత్వం కారణంగా మొత్తం 9,200 మట్టి నమూనాలు సేకరించగా ఇప్పటి వరకు 15 శాతం కూడా పరీక్షలకు నోచుకోని పరిస్థితి నెలకొంది. మిగిలిన వాటిని ఎప్పుడు పరీక్షిస్తారో.. ఫలితాలు రైతులకు ఎప్పటికి అందుతాయనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఏడీఏ నిర్లక్ష్యం ఫలితమే... ఎమ్మిగనూరు ఏడీఏ నిర్లక్ష్యం వల్ల ఈ సారి భూసార పరీక్షలు అస్తవ్యస్తమయ్యాయి. ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన ఈయన పనితీరు ఆది నుంచి వివాదాస్పదమే. భూసార పరీక్ష కేంద్రాలు మార్కెట్ యార్డులలో నిర్వహిస్తుండగా.. కమిటీలు ఏడాదికి రూ.25వేల బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ఈ మొత్తాన్ని వినియోగించిన తర్వాత యూసీలు ఇస్తే మళ్లీ బడ్జెట్ మంజూరవుతుంది. 2013-14 సంవత్సరానికి మార్కెట్ కమిటీలు బడ్జెట్ కేటాయించినా.. ఎమ్మిగనూరు ఏడీఏ యూసీలు ఇవ్వకపోవడంతో 2014-15 సంవత్సరానికి బడ్జెట్ మంజూరు కాని పరిస్థితి. ఫలితంగా పరీక్షల నిర్వహణకు కెమికల్ కొరత ఏర్పడింది. పరీక్ష ఫలితాల నమోదుకు రిజిస్టర్లు కూడా కరువయ్యాయి. ఆన్లైన్లో పెట్టేందుకు బడ్జెట్ కూడా లేకపోవడంతో పరీక్షలు అటకెక్కుతున్నాయి. డోన్‌లో లవణ పరిమాణం పరీక్షించే యంత్రం మొరాయించింది. దీంతో అక్కడ పరీక్షలు నిలిచిపోయాయి. కర్నూలులోని కేంద్రానికి 1800 మట్టి నమూనాలు చేరగా.. 500 మాత్రమే పరీక్షించారు. కర్నూలు మినహా ఎమ్మిగనూరు, డోన్, నంద్యాలలో నమూనాల పరీక్ష ఎక్కడికక్కడ నిలిచిపోయింది. -
భూసార పరీక్షలు వేగవంతం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో భూసార పరీక్షలను వేగవంతం చేసినట్లు భూసార పరీక్షల కేంద్రం ఏడీఏ సీహెచ్ ప్రభాకరరావు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 9,920 భూసార పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకూ 3,710 మట్టి నమూనాలను పలు మండలాల నుంచి సేకరించామన్నారు. వాటిలో 600 మట్టి నమూనాలను పరీక్షించడం పూర్తయిందన్నారు. రైతుల నుంచి మట్టి నమూనాల సేకరణలో మండల వ్యవసాయాధికారులు నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ పొలంలోని మట్టినమూనాలను నేరుగా ఒంగోలులోని భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు. భూసార పరీక్షల నిమిత్తం బాపట్లలోని సాయిల్ టెస్టింగ్ కేంద్రానికి వెయ్యి మట్టినమూనాలు పంపిస్తున్నామన్నారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లో కూడా భూసార పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయని ప్రభాకరరావు వెల్లడించారు. జిల్లాలోని 56 మండలాల నుంచి వచ్చిన మట్టి నమూనాలను ఆయా కేంద్రాలకు పంపి భూసార పరీక్షలను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. మట్టి నమూనాలను ‘వి’ ఆకారంలో సేకరించాలి... భూసార పరీక్షల వల్ల నేలసారము, నేలలోని సమస్యలు తెలుస్తాయని ప్రభాకరరావు పేర్కొన్నారు. అయితే, మట్టినమూనాలను పొలంలో ఎక్కడపడితే అక్కడ తీస్తే పరీక్షలో ఫలితాలు సరిగా రావని తెలిపారు. భూమిని, ప్రాంతాలను బట్టి పొలంలో ‘వి’ ఆకారంలో మట్టి నమూనాలు తీయాల్సి ఉందన్నారు. తేమ, చిత్తడిగా ఉండే నేలలు, పెంటకుప్పలు వేసినచోట, రోడ్లకు సమీపంలో, చెట్ల నీడన, పొలాల్లో కంచెవేసిన ప్రాంతాల్లో మట్టినమూనాలు తీయకూడదని తెలిపారు. ఎరువులు, నీరుపెట్టినచోట, వర్షం పడిన సమయంలో మట్టినమూనాలు సేకరించరాదన్నారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్న పంటలు పండించే పొలాల్లో 6 నుంచి 12 అంగుళాల లోతులో, చౌడ భూముల్లో 12 అంగుళాల లోతులో మట్టి నమూనాలు తీయాలని వివరించారు. భూసార పరీక్షల అనంతరం ఏయే పంటలకు ఆ భూమి సరిపోతుందో తెలియజేస్తూ రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమయ్యే నాటికి లక్ష్యం మేరకు భూసార పరీక్షలు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు.