దర్శి: భూమిలో పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం స్థాయి ఎంత వరకు అవసరమో తెలుసుకోవాలని కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీఎం ప్రసాద్‌రావు పేర్కొన్నారు. భూమి, నీటి పరీక్షల గురించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అధిక మోతాదుల్లో ఎరువులు వేయడం వల్ల భూమిసారం తగ్గడమే కాకుండా పంటకు హాని కలుగుతుంది. అందువలన రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. మట్టినమూనాలు తీయడానికి వేసవికాలం సరైన సమయం. రైతులు మట్టి నమూనాలను సేకరించి దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గల భూసార పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువస్తే నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు ఇస్తారు. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులు ఏ మోతాదులో వేసుకోవాలి, నేలకు ఏ పైరు అనుకూలం అనే విషయాలు తెలుస్తాయి. వాటిని సంబంధించిన సలహాలు, సూచనలను కూడా కేవీకే శాస్త్రవేత్తలు ఇస్తారు. పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించడం అనేది ముఖ్య విషయం. సేకరణ సరిగ్గా లేకపోతే మట్టి పరీక్ష చేసి కూడా వృథా అవుతుంది. దీనివలన సిఫార్స్ చేసిన ఎరువుల మోతాదులూ తేడాలు వస్తాయి.
మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
పొలమంతా ఒకే విధంగా ఉంటే రెండుమూడు ఎకరాల్లో 8 నుంచి 10 చోట్ల ‘ఠి’ ఆకారంలో 6 నుంచి 7 అంగులాల గుంత తీసి పైనుంచి కిందకు, అంచుల నుంచి మట్టి సేకరించాలి. మట్టిలో పంట వేర్లు, ఆకులు లేకుండా చూసుకోవాలి. పండ్ల తోటలకైతే 3 నుంచి 4 అడుగుల వరకు గుంత తీసి అచ్చుల నుంచి ప్రతి అడుగు వేరువేరుగా మట్టి సేకరించాలి. ఇలా సేకరించిన మట్టి మొత్తాన్ని ఒక గుడ్డపై పోసి నాలుగు సమభాగాలుగా చేయాలి. ఆ తర్వాత రెండు ఎదురెదురు భాగాలు తీసివేయాలి. ఇలా అరకిలో మట్టి వచ్చే వరకు చేసి ఒక ప్లాస్టిక్ కవర్‌లో లేదా గుడ్డ సంచిలో వేసి రైతు పేరు, చిరునామా, ఫోన్ నంబరు, పంట వివరాలు రాసి మట్టి నమూనా మరియు ఇతర వివరాలతో కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొస్తే పరీక్ష చేసి ఫలితాలు ఇస్తారు. మట్టినమూనాలు సేకరించేటప్పుడు పేడకుప్పల దగ్గర, గట్ల దగ్గర, నీరు నిల్వ ఉన్న చోట రసాయనిక ఎరువులు వేసి ఉంటే 50 నుంచి 60 రోజుల వరకు మట్టి నమూనాలు తీయరాదు.
అలాగే నీటి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. సాగుకు ఉపయోగించే నీరు సరైంది కాకుంటే భూసారం తగ్గి పంట తగ్గిబడి తగ్గుతుంది. నీటి పరీక్ష చేయించుకుని ఏ పైరుకు ఆ నీరు అనుకూలమో ఆ పైరు వేసుకోవాలి. నీటిని సేకరించేటప్పుడు నీరు బోరు నీరైతే 5 నిముషాల తర్వాత వదిలిన నీటిని ప్లాస్టిక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి అరలీటరు నీటిని పట్టాలి. అదే బావి నీరైతే బావి మధ్యలో కొంత లోతులోకి వెళ్లి బాటిల్ ముంచి పట్టాలి. కాలువలో అయితే కాలువ మధ్యలో నీటిని సేకరించాలి. నీటిని సేకరించిన 12 గంటల్లో పరీక్ష కేంద్రానికి అందించాలి. మట్టి, నీటి పరీక్షలపై అధిక వివరాలు తెలుసుకోదలచిన వారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించాలి. ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే 72072 63357 నంబరును సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment