మట్టి పరీక్షలు.. నవశకానికి నాంది
గజ్వేల్: ‘వ్యవసాయరంగం కష్టాల్లో ఉంది.. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే పరిజ్ఞానం అందుబాటులోలేక రైతులు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారు.. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే తొలిసారిగా చేపట్టబోతున్న పూర్తిస్థాయి మట్టి పరీక్షలు రైతన్నల ఆత్మహత్యల నివారణకు పునాది వేయాలి, నవ శకానికి నాంది పలకాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.
కొత్త రకం మట్టి పరీక్షలకు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గజ్వేల్‌లో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌ఎల్‌యూపీ(నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ యూటీలైజ్ ప్లానింగ్) సంస్థ అధ్వర్యంలో చేపట్టనున్న పూర్తిస్థాయి భూసార పరీక్షల కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
నేల స్వభావం తెలియక రైతులు తమకు తోచిన పంటలు వేసుకోవడం, మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోందన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకే ప్రభుత్వం పూర్తిస్థాయి మట్టి పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామాల్లో 1,778 మట్టి నమునాలను సేకరించి వాటి పరీక్షల ఫలితాలతో రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డ్’ అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్డులో రైతులు వచ్చే 50 ఏళ్లు పాటు తమ భూముల్లో ఏయే పంటలు వేయాలి? భూముల్లో ఎలాంటి పోషకాలు లోపించాయి? వాటిని భర్తీ చేసుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ప్రణాళిక అందివ్వడం జరుగుతుందన్నారు. దీంతో రైతులకు పంటల సాగులో అవగాహన ఏర్పడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించే అవకాశం కలుగుతుందన్నారు.
ఈ పరీక్షల నిర్వహణకు ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం గజ్వేల్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలాల్లో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో రాష్ట్రంలోని 46 లక్షల హెక్టార్లలో చేపడతామన్నారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. బిందు, తుంపర సేద్యానికి ఈ ఏడాది రూ.430 కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
గత పదేళ్ల సమైక్య పాలనలో 129 హెక్టార్లలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు కేవలం రూ.24 కోట్లు కేటాయిస్తే....ప్రస్తుతం సీఎం కేసీఆర్ తొలి బడ్జెట్‌లోనే వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు రూ.250 కోట్లు కేటాయించారని తెలిపారు. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాలు సాగుచేస్తున్న రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
భూసార పరీక్షలతో రైతుకు లాభం
వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, ఆహార భద్రతను సాధించాలంటే ముందుగా నేల భద్రంగా ఉండాలన్నారు. ఈ విషయం తెలియాలంటే భూసార పరీక్షలతోనే సాధ్యమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఎల్‌యూపీకు చెందిన గొప్ప శాస్త్రవేత్త ఎస్‌కే.సింగ్ నేతృత్వంలో చేపట్టబోతున్న ఈ పూర్తిస్థాయి మట్టి పరీక్షలు వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న పూనం మాలకొండయ్య తెలంగాణలోనే సేవలందించాలని కోరారు. సభలో వ్యవసాయశాఖ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఫ్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రత్యేకాధికారి ప్రవీన్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి పరీక్షలు, పరిజ్ఞానం, పంటలు,
Soil tests, knowledge, crops