
నాగావళి, వంశధార, జంఝావతి నదీతీరాల వెంబడి గజరాజుల తిష్ట
తరచూ పంటలు, ఆస్తులు, ప్రజల ప్రాణాలకు నష్టం
3,500 ఎకరాల్లో పంటలకు దినదిన గండం
రూ.కోట్లలో నష్టాలు
శాశ్వత పరిష్కారం కోరుతున్న మన్యం జిల్లా ప్రజలు
ఎన్నికల ముందు గజరాజుల తరలింపునకు వాగ్దానం చేసిన కూటమి నేతలు
పాలకొండ రూరల్/భామిని: మన్యం జిల్లాలో గజరాజుల ఘీంకారాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి సంచారంతో ప్రజలు తమ ప్రాణాలు, పంటలు, ఆస్తులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అడవుల రూపు కోల్పోతుండడంతో ఏనుగుల మనుగడ కష్టమై జనావాసాల వైపు దూసుకు వస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల వైపు వచ్చేస్తున్నాయి. దీంతో సాగు పొలాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఆస్తులు, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఎన్నికల ముందు ఏనుగుల తరలింపుపై కూటమి నేతలు స్పష్టమైన హామీలిచ్చి...నేడు వాటిని మరవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి పరీవాహక ప్రాంతాల వెంబడి గజరాజులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని కట్టడి చేసే క్రమంలో అధికారిక యత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు తమకు పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలని అటు ప్రజాప్రతినిధులను, ఇటు అధికారులను కోరుతున్నారు.
గ్రామాల్లో కునుకు కరువు
జిల్లాలో సువిశాలంగా విస్తరించి ఉన్న ఏజెన్సీ, నాగావళి, వంశధార, జంఝావతి నదీతీర పరివాహక ప్రాంతాల వెంబడి గజరాజుల గుంపులు తిష్ట వేసాయి. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయి. పార్వతీపురం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నిత్యం సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
రైతులు సేద్యం చేస్తున్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు, వరి, పామాయిల్, కర్బూజ, మామిడి, జీడి పంటలతో పాటు ఇతర ఆహార, వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో సుమారు 3,500 ఎకరాల మేర పంటలు ఏనుగుల సంచారంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రూ.కోట్లలో నష్టం సంభవిస్తున్నా... ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందించలేదు.
కుంకీ ఏనుగులు ఎక్కడ?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏనుగుల సమస్యను అధిగమించేందుకు తాము కట్టిబడి ఉన్నామని కూటమి నాయకులు బహిరంగ సభల్లో వెల్లడించారు. ప్రస్తుత డిప్యుటీ సీఎం పవన్‌కల్యాణ్ నాడు కుంకీ ఏనుగులు తీసుకువస్తామన్నారు. వాటి సహాయంతో ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపులు తరలింపునకు చర్యలు చేపడతామన్నారు.
నేటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. పార్వతీపురం మండలం డోకిశిల పంచాయతీ జంతి కొండ వద్ద ఎలిఫ్యాంట్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల హామీలపై బాధితుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరణ మృదంగం
గజరాజుల సంచారంతో గడిచిన కొద్ది సంవత్సరాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. 12 పశువులు మృతి చెందినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ బోర్లు, పంపు షెడ్లు, పరికరాలను, డ్రిప్ పైపులను నాశనం చేసాయి.
ఏనుగులు మళ్లీ వచ్చేశాయ్...
జియ్యమ్మవలస: మండలంలోని జోగిరాజుపేట, బట్లబద్ర, కన్నపుదొరవలస, వెంకటరాజపురం పరిసర ప్రాంతాలలోకి గురువారం సాయంత్రం ఏనుగులు మళ్లీ వచ్చాయి. రాత్రి పూట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచించారు. ప్రస్తుతం జోగిరాజు పేట వద్ద ఉన్నాయని, రాత్రి సమయానికి బిత్రపాడు, బాసంగి తదితర పంట పొలాలలోకి వచ్చే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి...
ఇటీవల పాలకొండ నియోజకవర్గం భామిని మండలం ఘ నసర వద్ద ఏనుగుల కారణంగా రైతులు నష్టపోయిన పంటలను అంచనా వేసేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారుల వద్ద బాధిత రైతులు తీవ్రంగా స్పందించారు. తరచూ న ష్టాల అంచనాలు నమోదు చేయడం తప్ప చేసేదీ ఏమీ లే దంటూ నినాదాలు చేసారు. తమకు పరిహారం వద్దని, శాశ్వ త పరిష్కారం చూపాలని అధికారులను, ఎమ్మెల్యే జయకృష్ణను చుట్టుముట్టారు. బైఠాయించి నిరసన తెలిపారు.
రెండెకరాల్లో జొన్న పంట నాశనం
నా సొంత భూమితో పాటు మరో ఎకరా భూమిని కౌలుకు తీసుకుని రెండెకరాల్లో మొక్కజొన్న సేద్యం చేపట్టాను. అప్పులు చేసి మదుపులు పెట్టాను. కుటుంబమంతా కష్టపడ్డాం. కీలక దశలో ఏనుగుల గుంపు దాడి చేయటంతో పూర్తిగా పంట నష్టపోయాను. నష్టపోయిన పంటను చూసేందుకు పొలంకు వెళ్లాలన్నా భయం వేస్తుంది. ఏ క్షణం ఏనుగులు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నాం. నష్ట పరిహారాలు ఎందుకు? ఈ ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే మేలు. – వలరౌతు లక్ష్మీనారాయణ, రైతు, ఘనసర, భామిని మండలం
నిరంతరం నిఘా
ఏనుగుల కదిలికలపై మా సిబ్బంది నిరంతరం దృష్టి సారిస్తున్నారు. అవి సంచరించే పరిసరాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు గుచ్చిమి వద్ద ఏర్పాట్లు చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. రూ.5 కోట్లతో సోలార్ కంచె, ట్రెంచులు, వెదురు వనాలు, నీటి సంపులు, ఇతర వసతులు ఏనుగుల కోసం సిద్ధం చేయాలని నిర్ణయించాం.
తొలి దశలో రూ.కోటి నిధులుతో పనులు చేపడతాం. పంట నష్టాలకు సంబంధించి దాదాపు మూడు వేల మంది రైతులకు రూ.45లక్షలు వరకు జమ చేశాం. రెండు మూడు రోజుల్లో సదరు రైతుల ఖాతాకు ఈ మొత్తాలు పూర్తిగా జమ కాబడతాయి. కుంకీ ఏనుగులను తీసుకువచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. – జీపీఏ ప్రసూన, అటివీ శాఖాధికారిణి
Comments
Please login to add a commentAdd a comment