ఎలుగుబంట్లు, గుర్తు తెలియని జంతువులతో బిక్కుబిక్కుమంటున్న ఉద్దానం
కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, ఎల్‌ఎన్‌పేట ఏరియాల్లో ఏనుగుల విధ్వంసం
తాజాగా జిల్లాలో పులి సంచారంతో భయాందోళన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వన్య మృగాలు వనాలు వదిలి జనాలపైకి పడుతున్నాయి. ఆవులు, మేకలను పులి
తినేసి భయపెడుతుండగా, ఏనుగులు, ఎలుగుబంట్లు ఏకంగా మనషుల్నే చంపేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, సీతంపేట, పాతపట్నం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ రకమైన ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీంతో వన్య మృగాలు సంచరిస్తున్న వార్తలు వస్తే చాలు ఈ ప్రాంతాలు వణికిపోతున్నాయి.
సరిగ్గా ఏడాది క్రితం..
శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్లు దాడులు చేస్తుండగా, కొత్తూరు, పాలకొండ, భామిని తదితర ప్రాంతాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి.
ఇవి చాలదన్నట్టు మధ్యలో పులులు కూడా సంచరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇదే రకంగా పులి సంచరించగా సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి జిల్లాలోకి ప్రవేశించింది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న ఆక్రమణల వల్లే జంతువులు ఇలా ఊళ్లమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది.
పులి సంచారమిలా..
» ఒడిశా నుంచి మందస రిజర్వు ఫారెస్టు మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీర ప్రాంతం మీదుగా సంత»ొమ్మాళి వైపునకు చేరుకుంది. ఈ మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ కేశనాయుడుపేటలో పులి తిరిగిందన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు మృతి చెందింది. పులి కారణంగా చనిపోయిందా? మరే జంతువు కారణంగా చనిపోయిందో స్పష్టత లేదు.
» కోటబోమ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. సారవకోట మండలం జమ చక్రం, సోమయ్యపేట, అన్నుపురం, వాబచుట్టు, బోరుభద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి పాతపట్నం మండలంలోకి ప్రవేశించింది. బోరుభద్ర, దాసుపురం, గురండి, తీమర, తామర, పెద్దసీదిలో సంచరించింది. తీమరలోని బెండి రామారావు మామిడితోటలో బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను చంపేసింది.
» ఇదే సమయంలో ఉద్దానంలో గుర్తు తెలియని జంతువు కూడా తిరుగుతోంది. దాని దాడి ఎక్కువగా ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లోని ఒంకులూరు, మెట్టూరు, కొండపల్లి, అనకాపల్లి, బహడపల్లి, కొండలోగాం గ్రామాల్లో ఈ జంతువు సంచరించింది. పలాస మండలంలో నీలావతిలో రెండు ఆవు దూడలను చంపేసింది.
ఇదే కారణమా..?
‘పులులు చాలా అరుదుగా అడవులను వదిల జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మగ, ఆడ పులులు జతకట్టే సమయం కావడంతో తమ జోడు కోసం అవి సాధారణం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంటపొలాలు, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో దాడులు అధికంగా జరిగే అవకాశం ఉంది.
వేసవి ఎండలతో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు కూడా అవి జనావాసాల వైపు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైతులు పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లడంతో వాటిని వేటాడేందుకు యత్నిస్తాయి. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో పశువులు, మేకలు, గొర్రెలను మందలుగా ఉంచడంతో వాటిని కూడా వేటాడే అవకాశాలు ఉంటాయి.’ అని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్త సుమా
» అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు వన్య మృగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
» సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. పులులు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే శివారు ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై శబ్దం చేస్తూ చాకచక్యంగా తిరిగి అడవిలోకి పంపించాలి.
» పులి అరుపులు, పాద ముద్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
» పంటల కాపలాకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లాలి.
» పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా ఉండాలి.
» పశువుల కాపరులు పగలంతా మేత కోసం సంచరించి రాత్రి అటవీ ప్రాంతంలో మందను ఉంచి బస చేస్తుంటారు.
» పులులు వాటిని వేటాడేందుకు వస్తుంటాయి.
» రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండటం సురక్షితం కాదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు.
ఇబ్బందికరంగానే ఉంది...
మా మండలంలో పులి తిరుగుతుందని పేపర్లు, వాట్సాప్‌లలో చూస్తుంటే భయమేస్తుంది. మేము నిత్యం కొండలు, పంట పొలాలలో మేకలు, గొర్రెలతో మందలు వేసుకుని పడుకుంటున్నాం. మా ఊరికి దగ్గర్లో ఉన్న జమచక్రం, సోమయ్యపేట గ్రామాలలో పులి అడుగులు గుర్తించడంతో ఆయా గ్రామాల నుంచి మందలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. – పల్ల ముఖలింగం, వడ్డినవలస, సారవకోట మండలం.
భయం.. భయం..
పులి మా గ్రామ పంట పొలాల్లో తిరగడంతో మాకు భయంగా ఉంది. పశువులు మేతకు తీసుకు వెళ్లడానికి, ఉదయం పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఇప్పటికే ఆవుదూడను తీనేసింది. పులి ఉందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. – మద్ది నారాయణరెడ్డి, పెద్దసీది గ్రామం,పాతపట్నం మండలం
ఆందోళనకరమే..
పులి సంచరిస్తున్న వార్తలతో ఆందోళనగా ఉంది. మా గ్రామం వైపు పులి వచ్చిందని మాకు తెలియదు, మంగళవారం ఉదయం ఆవుదూడపై దాడి చేయడంతో మాకు పులి వచ్చిందని తెలిసింది. దీంతో పంట పొలాలవైపు వెళ్లాలంటే భయంగా ఉంది. – బండి ఆనంద్,తీమర గ్రామం, పాతపట్నం మండలం
Comments
Please login to add a commentAdd a comment