
శ్రీకాకుళం : రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని ఆపేసి పేదలను పీల్చి పిప్పిచేసే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత సీదిరి అప్పలరాజు విమర్శించారు. 20 ఏళ్లు వివిధ పేర్లతో నిరాటంకంగా సాగిన ఆరోగ్య శ్రీ.. చంద్రబాబు నేతృత్వంలో నేడు ఆగిపోయిందన్నారు. ఈరోజు(సోమవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీదిరి అప్పలరాజు.. ‘ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి ప్రజలకు ఇది శిక్ష. వైద్య సేవలు ఆపేస్తామని ముందు నుంచీ నెట్ వర్క్ ఆస్పత్రులు చెబుతుంటే.. చంద్రబాబుకు బాధ్యత లేదా?,
ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండి ఉంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఆయన చర్యలతో ఊహించుకోవచ్చు. పీపీపీ మోడ్ లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెడతామంటున్నారు. అప్పుడు ప్రస్తుతమున్న సీహెచ్ సీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఏం చేస్తారు.
మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా.. వీటన్నింటికీ టు లెట్ బోర్డు పెట్టేయండి. నీకు ఈ ప్రైవేటు పిచ్చి ఏంటి చంద్రబాబు?. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా?, లేక ప్రైవేటు వ్యక్తుల కోసం పని చేస్తుందా?, అని నిలదీశారు సీదిరి అప్పలరాజు.
