
సాక్షి, తాడేపల్లి: ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే, మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఒకే టర్మ్‌లో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. పద్నాలుగేన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు.
వైఎస్ జగన్ తీసుకువచ్చిన విధానాలను చూసి కేంద్రం, ఇతర రాష్ట్రాలు ముందుకెళ్లాయి. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే. 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment