
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా వై.కోట సమీపంలోని గుండాల కోనకు దర్శనానికి బయలుదేరిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో..
మరో ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి మిల్లులోనికి చొరబడ్డాయి. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను నాశనం చేశాయి. నెల రోజుల్లో రెండు సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా ఏనుగుల సమస్య..
కాగా, చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.

కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment