
గన్నవరం రూరల్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్ 18న ఇదే గ్రామంలో తోటలో పులి ఉచ్చులో చిక్కుకుని మరణించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని చూసినట్లు ఆర్టీసీ కండక్టర్ చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కలటూరుకు చెందిన బొకినాల రవికిరణ్ గన్నవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల నిమిత్తం గన్నవరం డిపోకు తెల్లవారుజాము 3 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా సగ్గూరు–మెట్లపల్లి దారిలో పులి పిల్ల ఎదురైంది.
దానిని చూసిన రవి కిరణ్ భయాందోళనకు లోనై సమీపంలోని సగ్గూరు వెళ్లి గ్రామస్తులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్లపల్లి, వీరపనేనిగూడెం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ గార్డు కుమారి గ్రామానికి వచ్చారు. పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నించారు. జొన్న చేను వెంట పులి అడుగులు ఉన్నట్లుగా రైతులు ఆమెకు చూపించారు. ఈ అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.