Wildlife animals
-
TG: వన్యప్రాణుల దాహార్తి.. అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి,హైదరాబాద్: వేసవి మండుతోంది. మనుషులతో పాటు జంతువుల గొంతులు తడారిపోతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అడవిలో ఉండే వన్య ప్రాణులైతే తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల(సాసర్ పిట్)లో నీటిని తాగి వణ్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. Interesting camera trap pics from the forests of Telangana Thirsty Animals Find Refuge in Artificial Water Sources in Telangana. As the drought intensifies, thirsty animals are relying on artificial water sources provided by Forest officials. Despite a funding crunch, Forest… pic.twitter.com/JJCf0IK1nq — Sudhakar Udumula (@sudhakarudumula) April 2, 2024 రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్ దాకా ఉన్న అడవుల్లో పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు, పక్షులు, పాములు దాహం తీర్చుకుంటున్న పలు దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వీటిని తెలంగాణ అటవీ శాఖతో పాటు పలువురు వన్యప్రాణి ప్రేమికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ వైపు నిధుల కొరత వేధిస్తున్నా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు కొనియాడుతున్నారు. A waterhole being filled with water using solar power borewell in Birsaipet range of Utnoor #Telangana @TbiHindi @thebetterindia @IUCN @WorldBankWater @DoWRRDGR_MoJS @IUCN_Water pic.twitter.com/fHmwWxev1r — Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) March 31, 2024 -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్‌కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
వేటాడితే.. వేటు తప్పదు
పాల్వంచరూరల్: అడవులు పచ్చగా ఉంటేనే వర్షాలు కురుస్తాయి. అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయి. మరి అడవులు పెరగాలంటే వన్యప్రాణులను సంరక్షించాలి. అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులను బతుకనిద్దామని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు 1977 జనవరి 24న చట్టం రూపొందించారు. ఈనెల 8 వరకు వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం.. సమాజంలో మనుషులతో పాటు అనేక రకాల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మనుషులు తమ ఆహారం కోసం పలురకాల జీవులను వధిస్తున్నారు. ముఖ్యంగా వన్యప్రాణులను వేటాడుతున్నారు. దీన్ని నివారించేందుకు 50 ఏళ్ల క్రితం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేకించి వైల్డ్‌లైఫ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే స్మగ్లర్లు అక్రమంగా కలప తరలించేందుకు అడవులను హరిస్తున్నారు. ఇలా అడవులు అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. అడవుల్లో పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేళు, పక్షులు, మొసళ్ల వంటి ప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వైల్డ్‌లైఫ్ చట్టం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా వన్యప్రాణులను సంహరిస్తే కఠిన శిక్ష పడుతుంది. కానీ చట్టాలపై అవగాహన లేనివారు, ఉన్నా పట్టించుకోని వారు వన్యప్రాణులను యథేచ్ఛగా వధిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో వారికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. శిక్షల తీరు ఇలా.. ► అటవీ జంతువైన పులిని చంపినా, చర్మాన్ని, గోళ్లను తీసినా, బంధించినా, విష ప్రయోగం చేసినా, ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు తరలించినా 1972 వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్షకు పైగా జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష పడితే ఏడాది వరకు బెయిల్ కూడా లభించదు. ► చిరుతపులిని చంపినా, పట్టుకున్నా, మరో చోటుకు తరలించినా వన్య మృగాల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించొచ్చు. ► ఎలుగుబంటిని పట్టుకున్నా, సర్కస్‌లో ఆడించినా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే మాత్రం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ► మొసళ్లను పట్టుకున్నా, చంపినా మూడు నుంచి ఏడేళ్ల జైలు, కోతులను పట్టుకున్నా, చంపినా, ఇంట్లో పెంచుకున్నా 5 నుంచి 7 నెలల పాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే కుందేళ్లకై తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ► నెమలిని పట్టుకున్నా, వధించినా, గుడ్లను పగలగొట్టినా, హాని చేసినా వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. గతంలో ఏడుగురిపై కేసులు గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలో కొందరు దుప్పిని కుక్కలతో వేటాడి సోములగూడెం సమీప అటవీ ప్రాంతంలో వధించి మాంసం విక్రయించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేశారు. దంతలబోరు అటవీ ప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా పాల్వంచ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఇంకా ఏడూళ్లబయ్యారం, ములకలపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు అటవీ ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోగా, ఈ అన్ని ఘటనలో మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. వన్యప్రాణులను ప్రతిఒక్కరూ కాపాడాలని జాగృతం చేస్తున్నాం. ఎవరైనా వన్య ప్రాణులను సంహరించే ప్రయత్నం చేసినా, వాటికి హాని కలిగించినా కఠిన చర్యలు తప్పవు. – కట్టా దామోదర్‌రెడ్డి, ఎఫ్డీఓ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ఈనెల 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అటవీ రేంజ్‌ల పరిధిలో నిర్వహిస్తాం. ‘వనాలు పెంచండి, వన్యప్రాణులను కాపాడండి’ నినాదంతో ఏజెన్సీ పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తాం. దీంతో పాటు విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తాం. – కృష్ణగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి -
జవాబివ్వాల్సిన చిరుత ప్రశ్నలు!
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన వన్యప్రాణుల్ని మళ్ళీ పెంచిపోషించే ప్రయత్నం. పదినెలల క్రితం ఆర్భాటంగా మొదలైన ప్రాజెక్ట్. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ‘ప్రాజెక్ట్ చీతా’కు జరిగినంత హంగామా అంతా ఇంతా కాదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలో విడిచి పెట్టాక 4 నెలల్లో 8 చీతాలు మరణించడం ఈ యత్నంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ మాత్రం ప్రకృతి సహజ కారణాలతోనే ఈ చీతాలన్నీ చనిపోయాయంటోంది. ఆ మాట శాస్త్రీయంగా లేదు. నిపుణులు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు సాక్ష్యం. చీతాల కదలికలు తెలుసుకొనేందుకు మెడకు బిగించిన రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ల వల్ల వాటికి గాయమై, అక్కడ క్రిములు చేరాయనీ, అదే తాజా మరణానికి దారి తీసిందన్న మాటలు ఆందోళన రేపుతున్నాయి. ప్రాజెక్ట్ చీతా భవితవ్యం, శాస్త్రీయత సందేహాస్పదమవుతున్నాయి. నిజానికి 2009లో జైరామ్ రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ చీతాల పునరావాస ఆలోచన జరిగింది. గత ఏడాది అది ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌తో ప్రాజెక్ట్ చీతాకు ఏడాది పూర్తి కానుంది. నిరుడు సరిగ్గా ఆ సమయంలోనే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరాయి. ఆ పైన ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ప్రభుత్వం రప్పించింది. దాదాపు 35 చీతాలతో అవి స్వయం సమృద్ధమయ్యే దాకా రానున్న దశాబ్దకాలంలో ఏటా 5 నుంచి 10 చీతాల్ని తేవాలన్నది యోచన. తొలి ఏళ్ళలో ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించకపోవచ్చని ఆది నుంచీ అనుకుంటున్నదే. అది కాక అసలీ ప్రాజెక్ట్ ఏర్పాటులోనే ప్రాథమిక లోపాలున్నాయని విమర్శకుల వాదన. వేగంగా పరుగులు తీసే చీతాలకు కూనో ప్రాంతం సరిపోదన్నది ఒకటైతే, వాటిని దీర్ఘకాలం క్వారంటైన్లో ఉంచడం వల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధపడే సామర్థ్యం దెబ్బతింది. మానసికంగా సర్దుకుపోవడమూ సమస్య అయింది. అలా అవి సులభంగా బలి అవుతున్నాయి. తెచ్చిన చీతాలకు తోడు కొత్తగా ఇక్కడ పుట్టిన నాలుగింటిలో 3 కూనలు చనిపోయాయి. గాయం కథలో శాస్త్రీయత లేదని ప్రభుత్వం అంటున్నా, ఈ అంశాలపై విచారించి, మిగిలిన చీతాలన్నిటికీ పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేయాలని నిపుణుల సంఘం సిఫార్సు చేయడం గమ నార్హం. స్వేచ్ఛగా తిరిగేవాటిని పట్టి, కాలర్లు తీసేసి, ఈ పరీక్షలు చేయడం శ్రమతో కూడిన పని. సమ యమూ చాలానే పడుతుంది. అప్పుడు కానీ, ప్రాజెక్ట్ చీతా భవితవ్యం తేలదు. చీతాల కోసం అసలు మనం ఎంచుకున్న కూనో ఉద్యానమే చిన్నదని నమీబియా నిపుణులు కుండబద్దలు కొట్టారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఒక్కొక్క చీతా వేటాడి తినడానికీ, తిరగడానికీ సగటున 100 చదరపు కి.మీ.ల విశాల ప్రాంతం ఉంటుంది. కానీ, మన ‘కూనో జాతీయోద్యానం’లో సగటున మూడు చీతాలకు కలిపి 100 చదరపు కి.మీ.ల జాగాయే ఉంది. అలాగే, చీతా స్వేచ్ఛగా సంచరించడానికీ, ఆహార సేకరణ, పునరుత్పత్తికీ నిర్నిరోధమైన 1600 చదరపు కి.మీ.ల పైగా విస్తీర్ణం కావాలి. కూనో జాతీయోద్యానం మొత్తం వైశాల్యం చూసినా 750 చదరపు కి.మీ.లే! ఎలా చూసినా దేశంలో చీతాల పునఃప్రవేశానికి విస్తీర్ణం సరిపోని ఈ ఉద్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది బేతాళ ప్రశ్న. నమీబియా, దక్షిణాఫ్రికాల్లో చీతాలు చుట్టూ కంచె ఉన్న రిజర్వుల్లో ఉంటే, మన దగ్గర వాటిని కంచెలేని సహజమైన, అరణ్య వాతావరణంలో పెరగనివ్వాలని యోచన. కూనో జాతీయోద్యానంలోకి వదిలిన చిరుతలు కొన్ని ఆ పరిధిని దాటి, జనావాసాల్లోకి జొరబడిన వార్తలొచ్చాయి. ఇది పోనుపోనూ మనిషికీ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు. ప్రాజెక్ట్ చీతాకు రూపకల్పన చేస్తున్నప్పుడు ఈ సంగతులేవీ లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే! అధికారులు మాత్రం కూనో రిజర్వ్‌లో కావాల్సినంత స్థలం, చీతాలకు తగినంత ఆహారం ఉన్నాయంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే గాంధీసాగర్లో రెండో రిజర్వ్‌ను అభివృద్ధి చేసి, చీతా పునరావాస కేంద్రం స్థాపిస్థామని చెబుతున్నారు. అవన్నీ నిజమైతే మంచిదే. కానీ, పెద్ద పులులు, చిరుతలతో పోలిస్తే చీతాలు మహా సున్నితం. అడవిలో అవి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి మన దగ్గర వీటికి సింహాలు, చిరుత పులుల నుంచి పోటీ లేదు గనక కొంత నయం. కాలగతిలో ఇవి మన పరిస్థితులకు అలవాటు పడి భారత్‌ను తమ కొత్త ఆవాసంగా మారుస్తాయేమో చూడాలి. అరణ్యాల్లో చీతా కూనలు బతికేరేటు 10 శాతమేనట! అంతే శాతం పెరిగిపెద్దవుతాయి. కాబట్టి మరణాలు సహజమేనని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పటిదాకా కూనోలో చనిపోయిన చీతాల్లో ఒక్కటి మినహా అన్నీ పూర్తి అరణ్యంలో కాక ఒక చ.కి.మీ. విస్తీర్ణంలో పెట్టిన ‘బోమస్’ అనే ప్రత్యేక ఎన్క్లో జర్లలో ఉన్నవే. కాబట్టి, లోతుగా పరిశీలన చేయాలి. తక్షణమే ప్రాజెక్ట్ చీతా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పంచుకోవడం మరీ అవసరం. తద్వారా సంబంధిత నిపుణులతో పరిష్కారాలు కనుగొనవచ్చు. చీతాల నిర్వహణలో స్థానిక నైపుణ్యం లేదు గనక నిర్ణీత నిపుణుల అనుభవాన్ని ఆసరా చేసుకోవాలి. అలా కాక రోగాన్ని దాచిపెట్టి, వైద్యం చేస్తే ఫలితం లేకపోగా, వికటించే ప్రమాదం ఉంది. చీతాల పునరావాసం, పునరు త్పత్తి సవ్యంగా సాగాలంటే అధికారులు భేషజాలు వదలాలి. లేదంటే, మొదటికే మోసం వస్తుంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తొలి ఖండాంతర చీతా పునరావాస ప్రాజెక్ట్ అర్ధంతరంగా అంతిమ అధ్యాయానికి చేరుకుంటుంది. అలా జరగరాదంటే చిరుత ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు కావాలి! -
ముంగిసతో ఫోటోకి ఫోజులు.. నటిపై కేసు నమోదు
Bengali actress Srabanti Chatterjee: బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. గొలుసుతో కట్టేసి ఉన్న ముంగిసతో ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో చేయడంతో ఆమెపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు ఛటర్జీపై కేసులు నమోదు చేయబడ్డాయి. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతికి నోటీసులు పంపారు. అయితే వ్యన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి తనకు అంతగా తెలియదని ఆమె అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె అధికారుల ముందు హాజరుకాలేదు. ఈ విషయంపై స్రబంతిని మీడియా ప్రశ్నించగా..‘ఈ కేసు విచారణలో ఉది. అందుల్ల నేను ఏమి మాట్లాడలేను’అని బదులిచ్చారు. ఇక స్రబంతి ఛటర్జీ వ్యక్తిగత న్యాయవాది ఎస్కే హబీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘స్రబంతి ఇంకా అధికారులను కలవలేదు. వారిని కలిసిన తర్వాత మాత్రమే స్పష్టమైన వివరణ ఇవ్వగలం.కచ్చితమైన ఆరోపణలను తెలుసుకోవడానికి మేము త్వరలో అధికారులను కలుస్తాం’అని చెప్పారు. ఈ కేసు గురించి ఓ సీనియర్ అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను బంధించడం ఒక్కటే నేరం కాదు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే స్రబంతిపై కేసు నమోదైంది. దర్యాప్తుకు ఆమె సహకరించి, వన్యప్రాణుల సంరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్తతుగా నిలవావాలని కోరారు. -
దత్తత తీసుకుందాం రండి..!
కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. ఆరిలోవ (విశాఖ తూర్పు) ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు.. రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్ వరకు లాక్డౌన్లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. ఎంతైనా ఇవ్వవచ్చు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. జూలో 810కు పైగా వన్యప్రాణులు జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న ఐఓసీఎల్ జూలో నకుల్ అని పిలవబడే ఇండియన్ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్ నందనీ సలారియాతో ఐఓసీఎల్ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జూ క్యూరేటర్ నందనీ సలారియాకు అందజేశారు. ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం.. ► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 ► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 ► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 ► సింహానికి ఒక రోజుకు–600 ► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 ► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 ► చిరుత పులికి ఒక రోజుకు రూ400 ► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 ► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 ► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 ► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 ► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 ► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100 ► రింగ్‌టైల్డ్ లెమూర్కు ఒక రోజుకు రూ.100 ► మొసలి/ఘరియల్ రెండింటికి ఒక రోజుకు రూ.150 ► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 ► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 ► సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్‌లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్ బర్డ్స్ పదింటికి ఐదు రోజులకు రూ.100 దాతలు ముందుకు రావాలి... కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
దాక్కో పులి..లేదంటే ఉచ్చుకు బలి
ఆళ్లగడ్డ: నల్లమల అడవుల్లో వన్యమృగ వేటగాళ్ల ముఠా పంజా విసురుతోంది. చాకచక్యంగా పెద్ద పులులను హతమారుస్తోంది. అటవీ శాఖ యంత్రాంగం మాత్రం తనకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తోంది. ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వారు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిరివెళ్ల మండలం మహదేవపురం నుంచి వైఎస్సార్ జిల్లా సరిహద్దు చాగలమర్రి వరకు నల్లమల అడవులు ఉన్నాయి. చిరుతలు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కొండ మేకలతో పాటు నెమళ్లు, కొండకోళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి. అభయారణ్యంలో పులుల వృద్ధి పెరిగి, ఈ ప్రాంతంలో వీటి సంచారం మొదలైంది. వీటిపై వేటగాళ్ల కన్ను పడింది. రెండేళ్లలో నాలుగు పులులు మృతి చెందగా.. ఇంకా వెలుగులోకి రానికి కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు పెద్ద పులిని ఉచ్చులో బిగించి చంపేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వేటగాళ్లు నేరం నుంచి తప్పించుకునేందుకు పెద్దపులి కళేబరాన్ని తెలుగుగంగ కాల్వలో పడేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 15 మంది అనుమానితులను శిరివెళ్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగానే బుధవారం గండ్లేరు రిజర్వాయర్‌లో పెద్దపులి కళేబరం లభ్యమైంది. కొనసాగుతున్న వేట రుద్రవరం, చలిమ అటవీ రేంజ్‌ల పరిధిలో వన్యప్రాణుల వేట ఆగడంలేదు. నిత్యం ఏదో ఒకచోట వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. హద్దులు నిర్ణయించుకుని వేట సాగిస్తున్నట్లు సమాచారం. తెలుగుగంగ కాల్వ వెంట ఉన్న అడవిలో వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను బట్టి కిలో మీటర ఒక హద్దుగా వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వారి హద్దులో ఇంకొక వేటగాడు ఉచ్చులు వేయడం గాని, ఎరలు పెట్టడం గాని చేయకూడదనే నిబంధన సైతం విధించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా ఉండడంతో ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లర్లతో ఒప్పందాలు వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు అడవిలో సన్నని ఇనుప బైండింగ్ వైర్లను అమర్చి, హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అనుసంధానం చేస్తారు. అలాగే క్లచ్ వైర్లతో ఉచ్చులు కూడా వేస్తారు. ఉచ్చులో చిక్కుకున్న జంతువును మారణాయుధాలతో హతమారుస్తారు. మరి కొందరు విషపు, మత్తు గుళికలు ఆహారంలో కలిపి ఎరగా వేస్తున్నారు. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వేటగాళ్లు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరు గన్‌తో గురి చూసి విషపు ఇంజక్షన్లు వన్యప్రాణులకు ఎక్కించి, చంపడంలో నేర్పరులని సమాచారం. కొరవడిన నిఘా వన్యప్రాణుల వేటను అటవీశాఖ అధికారులు అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతులు పంట పొలాల రక్షణ కోసం అమర్చే విద్యుత్ తీగలకు తగిలి వన్యప్రాణులు బలవుతున్నాయని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆత్మకూరు అటవీ సమీపంలో ఓ పులి అనుమానాస్పదంగా మృతి చెందింది. తాజాగా రుద్రవరం మండలం గుండ్లేరు రిజర్వాయర్‌లో మరొక పులి కళేబరం లభ్యమైంది. ఇవే కాదు అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, తోడేళ్లు పదుల సంఖ్యలో అనుమానాస్పదంగా మృత్యువాత పడుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించిన ఘటనలు స్వల్పంగా ఉన్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం, పది రోజులు హంగామా చేయడం, తదనంతరం దానిని పట్టించుకోక పోవడం పరిపాటిగా మారింది. ఇవీ ఘటనలు ► 2019 బాచేపల్లె తండా సమీపంలో తిప్పపై పెద్దపులి మృతి చెందింది. ► అదే సంవత్సరం మరో నెలలో ఎర్రచెరువులో పెద్దపులి మృత్యువాత పడింది. ► రెండు సంవత్సరాల క్రితం గండ్లేరు రిజర్వాయర్‌లో చిరుత కళేబరం కనిపించింది. ► నెల క్రితం ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా కళాశాల సమీపంలో వేటకు జింక బలైంది. ► పక్షం క్రితం రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు మృతి చెందాయి. ► తాజాగా బుధవారం గండ్లేరు రిజర్వాయరులో పెద్దపులి కళేబరం లభ్యమైంది. వన్య ప్రాణుల వేట చట్ట విరుద్ధం పులి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టం. పోస్టుమార్టం ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేట చట్ట విరుద్ధం. ఎవరైనా అటవీ సిబ్బంది ఇందుకు సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై వేటు వేస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. – వినీత్‌కుమార్, డీఎఫ్ఓ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ వన్యప్రాణులను ప్రేమించాలి. వాటిని సంరక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలి. వన్యప్రాణులు నశిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించి పోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించాలి అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్ని రకాల వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణ పరిరక్షణ పూర్తిగా దెబ్బతింటుంది. వన్యప్రాణులను వధించే వారిని కఠినంగా శిక్షించాలి. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కావాలోయ్ కాసింత ‘వన్య’ ప్రేమ
ఎడారిలో చలికి వణుకుతున్న ఒంటెకు తలదాచుకోవడానికి అవకాశమిచ్చిన అరబ్బు చివరకు తాను నిర్వాసితుడు కావడం మనం నీతి కథల్లో చదివే ఉంటాం. అదే గతి నేడు వన్యప్రాణులకు పడుతోంది. ఒకప్పుడు భూ విస్తీర్ణంలో డెబ్బయ్ శాతంతో కళకళలాడిన అడవులు నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. మనిషి జీవన అవసరాల కోసం అడవులను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలను కాపాడుదామని పర్యావరణ ప్రేమికులు ఎంత ఆందోళన వెలిబుచ్చినా ఇది ఆగడం లేదు. – ఆత్మకూరురూరల్ విభిన్న రకాల జీవజాతులు కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తోపాటు రోళ్లపాడు, గుండ్లబ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజాతులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమికీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు. వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట నల్లమల అడవిలో ఉంది. ఇక్కడ 30 వేల మంది నివాసం ఉంటున్నారు. అటవీప్రాంతం కావడంతో గ్రామంలోకి తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వస్తుంటాయి. జనవరి 11వ తేదీ రాత్రి శ్రీశైలమాత పాఠశాల, నీటిపారుదలశాఖ సెంట్రల్ వర్క్‌షాప్ సమీపంలో ఎలుగుబంట్లు సంచరించడాన్ని స్థానికులు గుర్తించి, అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాణాసంచా పేలుస్తూ, చప్పుళ్లు చేస్తూ వాటిని అడవిలోకి తరిమారు. అలాగే అహోబిలం, మహానంది, సర్వనరసింహస్వామి, రుద్రకోడు పుణ్యక్షేత్రాలు నల్లమల అడవిలో ఉన్నాయి. ఇక్కడ భక్తులకు తరచూ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. జనవరి 13వ తేదీ కోవెలకుంట్లకు చెందిన ప్రసాద్ అనే భక్తుడు ఎగువ అహోబిలం నుంచి మెట్ల మార్గంలో పావన క్షేత్రం వెళ్తుండగా పొదచాటున పెద్ద పులి కనిపించడంతో భయాందోళనతో పరుగుతీశాడు. అడవి వన్యప్రాణుల నివాస స్థలం. ఎప్పుడో కాని అవి మనుషుల కంట పడవు. తమకుతాముగా అవి మనుషులకు హాని చేయవు. ఎప్పుడో ఒకసారి కనపడితే ప్రజలు ఆందోళన చేసి, అటవీ శాఖ అధికారులుపై ఒత్తిడి పెంచుతుంటారు. అటవీ నిబంధనలు పాటించాలి పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడి చేయవు. అలాగే ఎలుగుబంటి కూడా. పులిని ఒకసారి మనం చూశామంటే అది వేయిసార్లు మనల్ని చూసే ఉంటుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకు పోతాయి. మనుషులపై దాడి చేయవు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుÜు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లి నపుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయరాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినపుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్య ప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండా ఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్యప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నారు. అడవిపై వన్యప్రాణులదే హక్కు వన్యప్రాణుల ఆవాసాల్లోకి మనం చొరబడుతున్నాం. వన్యప్రాణులు జనవాసాల్లో తిరగడం లేదు. అడవిపై పూర్తి హక్కు వన్య ప్రాణులదే. వాటి మనుగడకు ఎవరూ అడ్డంకి కారాదు. సున్నిపెంట వంటి చోట్ల మానవ ఆవాసాల్లో వన్య ప్రాణుల సంచారం కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమీప అటవీ అధికారులకు సమాచారమివ్వాలి. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
జపాన్ నుంచి నెహ్రూ జూ పార్క్‌కు అరుదైన అతిథులు! జనవరిలోనే..
అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. రానున్న వేసవిలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. ఇక్కడి వాతావరణంలో కంగారూలు మనుగడ సాగిస్తాయా? లేదా అనే మీమాంస మధ్య జపాన్ నుంచి నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లోకి జత కంగారూలు రానున్నాయి. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వీటిని ఇక్కడికి తీసుకురానున్నారు. – సాక్షి, సిటీబ్యూరో జపాన్‌లోని యోకోహామా జంతు ప్రదర్శనశాలలోని జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన తర్వాత కంగారూల తరలింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తానికి ఎండాకాలం సెలవులు మొదలయ్యేనాటికి కంగారూలు రంగప్రవేశం చేస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ వెల్లడించారు. జపాన్‌లోని యోకోహామా జూ నుంచి కంగారూలు, మీర్‌క్యాట్ (అడవి పిల్లి)కి బదులుగా యోకోహామా జూకు ఆసియా సింహాన్ని ఇవ్వనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. గ్లాండ్ ఫార్మా ద్వారా ఎన్‌క్లోజర్ ►జూకు రానున్న కంగారూల కోసం ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులకయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్‌లోని గ్లాండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. కంగారూల ఎన్‌క్లోజర్ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్ ఫార్మా అధికారులు ఇప్పటికే జూ అధికారులకు అందజేశారు. ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ►కరోనా మహమ్మారి సీజన్లో నిధుల కొరత కారణంగా జూ అభివృద్ధికి రాజీ పడకుండా జంతువుల కందకాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, జంతువులను దత్తత తీసుకుని జూలోని వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకునేందుకు పౌరులు, కార్పొరేట్ సంస్థలు అందరూ ముందుకు రావాలని క్యూరేటర్ విజ్ఞప్తి చేశారు. 173 జాతులు.. 1,800 ప్రాణులు.. 380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్క్‌లో ప్రస్తుతానికి 173 జాతులకు చెందిన 1,800 జీవాలు ఉన్నాయి. కొత్తగా రాబోయే కంగారూలు, మీర్ క్యాట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతువుల మార్పిడిలో భాగంగా గత ఏడాది నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పొపొటమస్, సింహం లాంటి తోకలుండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చారు. జంతు మార్పిడి కింద తీసుకువచ్చినవి ఇవీ.. ►రాజ్‌కోట్ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం ఆడ బదులుగా మగ ఆసియాటిక్ సింహం ఆగస్టులో వచ్చింది. ►రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2 జతలు మంగళూర్ బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్ 3 మగ , 3 ఆడ, గ్రే పెలికాన్ 1 మగ, 1 ఆడ మంగళూర్ పిలికుల జూకు అందజేశారు. ►త్రివేండ్రం జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్ అమెరికన్ జత వచ్చే జనవరిలో జూకు వచ్చే అవకాశం ఉంది ►జపాన్‌లోని ఓకోహామా జూ నుంచి ఒక జత బూడిద రంగు కంగారూ, 1 జత మీర్ క్యాట్ జూకు రానున్నాయి. బదులుగా 1 ఆడ ఆసియా సింహాన్ని ఇస్తారు. దత్తత తీసుకోవడం హర్షణీయం జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని యోకోహామా జూపార్కు నుంచి నెహ్రూ జూపార్కుకు జత కంగారూలు రెండు నెలల్లో రానున్నాయి. కంగారులు జూకు వచ్చిన తర్వాత ఏడాది అనంతరం వాటిని దత్తత తీసుకుంటామని పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకర విషయం. రానున్న రోజుల్లో జంతు మార్పిడిలో భాగంగా దేశంలోని ఇతర జూల నుంచి కూడా జంతువులు రానున్నాయి. నగర జూ నుంచి కూడా కొన్ని వన్యప్రాణులు బదులుగా ఇస్తాం. – రాజశేఖర్, నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ చదవండి: 2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు! -
రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!!
సిడ్నీ: సింగపూర్‌లోని చాంగి ఎయిర్‌పోర్ట్‌లో రెండు సింహాలు తమ సరుకు రవాణా కంటైనర్‌లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నవారందర్నీ భయబ్రాంతులకు గురి చేశాయి. అయితే అక్కడి అధికారులు ట్రాంక్విలైజర్ గన్‌తో కాల్చి మత్తులో పడేసి ఎయిర్పోర్ట్ నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) వన్యప్రాణుల సదుపాయాన్ని నిర్వహిస్తున్న మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోంది. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) అయితే ఈ ఎయిర్ లైన్స్ పెద్ద పులుల సంరక్షణ బాధ్యతను నిమిత్తం వాటిని మండైలోని జంతు నిర్బంధ కేంద్రానికి తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు అవి ఇలా తప్పించుకోవడం మొదటిసారికాదు అని అక్కడ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ సింహాలు మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్ సంరక్షణలో మత్తు నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
జంతువులకూ కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: దేశంలో పెంపుడు జంతువులు, వన్యప్రాణులకు సైతం కరోనా వైరస్ (కోవిడ్– 19) ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల వీటికి కూడా కోవిడ్ –19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా శాంపిల్స్ పరీక్షల కోసం నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) జంతువైద్య విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జ్యోతి మిశ్రీ ఆయా సంస్థలకు, రాష్ట్రాల పశువైద్యశాఖలకు ఆదేశాలు జారీచేశారు. శాంపిల్స్ సేకరణ, పరీక్షల సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్ ) నిబంధనావళిని పక్కా గా పాటించాలని పేర్కొన్నారు. ఎంపికచేసిన సంస్థలివే.. ► నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) – భోపాల్ (మధ్య ప్రదేశ్) ► నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఎన్ఆర్సీఈ) – హిసార్ (హరియాణా) ► సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ (సీఏడీఆర్‌ఏడీ) ► ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) – ఇజాత్ నగర్, బరేలి, ఉత్తర ప్రదేశ్ -
ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు
మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూ పోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. ప్రపంచంలో జీవవైవిధ్యం సజావుగా ఉంటేనే భూమ్మీద మనుషుల మనుగడ సజావుగా ఉంటుంది. జీవవైవిధ్యాన్ని కాపాడే వన్యప్రాణులు ఒక్కొక్కటే కనుమరుగైపోతుంటే, చివరకు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మన భారతదేశంలోనూ వన్యప్రాణుల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వన్యప్రాణుల వర్తమాన పరిస్థితులపై ఒక సింహావలోకనం.... మిగిలిన ప్రపంచం సంగతలా ఉంచితే, మన భారతదేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవ వైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్ పార్కులు ఉన్నాయి. వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. స్థూలంగా చూసుకుంటే దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని– 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. మన దేశంలోని పడమటి కనుమలు, తూర్పు హిమాలయ ప్రాంతం, భారత్–బర్మా సరిహద్దు ప్రాంతాలు మూడూ ప్రపంచంలోనే గొప్ప జీవవైవిధ్యానికి ఆలవాలయంగా నిలుస్తున్న ముప్పయి నాలుగు ప్రాంతాల్లో కీలకమైనవి. ప్రపంచంలోని దాదాపు 60 శాతానికి పైగా జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తున్న పదిహేడు దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలోని స్తన్యజీవుల్లో 7.6 శాతం, ఉభయచరాల్లో 14.7 శాతం, 6 శాతం పక్షి జాతులు, 6.2 శాతం సరీసృపాలు, 6 శాతం పూలు పూసే వృక్షజాతులు భారత భూభాగంలో ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నా, ప్రపంచంలో చాలా చోట్ల మాదిరిగానే మన దేశంలోనూ వన్యప్రాణుల మనుగడకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులేమీ లేవు. మనుషులు అడవులను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం, ఎన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడటం, ఖనిజ తైల ఇంధనాలను, రసాయనిక ఎరువులు, పురుగుమందులను యథేచ్ఛగా వాడటం వంటి చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది. మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని, వీటిలో 49 వృక్షజాతులు కూడా ఉన్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్) గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పెద్దపులి మొదలుకొని పలు చిన్నా చితకా జంతువులు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మన దేశంలో దాదాపు 40 వేల పెద్దపులులు ఉండేవి. 2008 నాటికి వీటి సంఖ్య 1,411కు పడిపోయినా, నవసహస్రాబ్ది ప్రారంభంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా 2019 నాటికి 2,967కు చేరుకుంది. మన దేశంలోని మిగిలిన వన్యప్రాణులదీ దాదాపు ఇదే పరిస్థితి. ముప్పులో పదిలక్షల జీవజాతులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని గత ఏడాది మే నెలలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 లక్షల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, వీటిలో పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ‘గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్’ హెచ్చిరిస్తోంది. ప్రపంచంలోని 50 ప్రధాన దేశాల ప్రభుత్వాలు, శాస్త్ర పరిశోధన సంస్థల నుంచి సేకరించిన వివరాలతో 145 మంది శాస్త్ర నిపుణులు 1500 పేజీలతో ఈ నివేదికను రూపొందించారు. పారిస్‌లో గత ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో ఈ నివేదిక సారాంశాన్ని 40 పేజీలతో ‘సమ్మరీ ఫర్ పాలసీ మేకర్స్’ పేరిట విడుదల చేశారు. మన పర్యావరణ ఆరోగ్యం శరవేగంగా క్షీణిస్తోందనేందుకు ఈ నివేదికే నిదర్శనమని పారిస్ సదస్సులో ‘ఇంటర్‌గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయో డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ (ఐపీబీఈఎస్) అధ్యక్షుడు రాబర్ట్ వాట్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన ఆర్థిక వ్యవస్థలు, మన జీవనోపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, జీవన నాణ్యతలకు సంబంధించిన పునాదులకు మనమే హాని చేసుకుంటున్నాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మితిమీరిన చేపల వేట, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆమ్లీకరణ వంటి వాటితో చివరకు సముద్రాలను కూడా దారుణంగా నాశనం చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. నవ సహస్రాబ్దిలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని పారిస్ సదస్సులో పాల్గొన్న ‘నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ’ ఉపాధ్యక్షుడు జొనాథన్ బెయిలీ పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవులు... మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతులు మొత్తం 132 ఉన్నట్లు ఇటీవల అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలు వెల్లడించిన వాటిలో కొన్ని ప్రధానమైన జీవజాతులు కూడా ఉన్నాయి. మన జాతీయ జంతువుగా గర్వంగా చెప్పుకునే బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), గంగా నదీ డాల్ఫిన్, ‘ఘరియాల్’ జాతికి చెందిన మొసలి, కొంగ జాతికి చెందిన ‘ఇండియన్ బస్టర్డ్’, ఖడ్గమృగం, కృష్ణజింక, అడవి గాడిద, నీటి బర్రె, ఏనుగు, నీలగిరి కోతి, రేచు కుక్క, రెడ్ పాండా వంటివి కూడా ఉన్నాయి. పక్షులలో గద్దలు, రాబందులు, పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. అడవుల్లోనే కాదు, ఒకప్పుడు పట్టణాల పరిసరాల్లో కూడా కనిపించే ఈ పక్షిజాతులు బొత్తిగా అరుదుగా మారాయి. వీటితో పాటు కొంగ జాతికి చెందిన ‘వైట్ బెల్లీడ్ హెరాన్’, బాతు జాతికి చెందిన బేయర్స్ పోచార్డ్, పిచుకను పోలి ఉండే స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్, హిమాలయ క్రౌంచ పక్షి, మణిపురి క్రౌంచపక్షి, అడవి గుడ్లగూబ, నెమలి జాతికి చెందిన ‘గ్రీన్ పీఫౌల్’, నీలగిరి పక్షి, డాల్మేషియన్ కొంగ, సారస్ కొంగ వంటి పక్షిజాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. జంతుజాతుల్లో పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వాటితో పాటు హిమాలయన్ తోడేలు, చైనీస్ పంగోలిన్, కశ్మీర్ జింక, రెడ్ పాండా, కస్తూరి మృగం, అడవి దున్న, నీటి బర్రె, జడల బర్రె, నీలగిరి తహర్, వానరాల జాతికి చెందిన లయన్ టెయిల్డ్ మకాక్, జంగుపిల్లి, మంచు చిరుత, నీలగిరి మార్టెన్, ఎలుగు జాతికి చెందిన సన్ బేర్ వంటి జంతువులు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. జలచరాల్లో గంగా డాల్ఫిన్, ఘరియాల్ మొసలి వంటి వాటితో పాటు ఆలివ్ రిడ్లే తాబేలు, అస్సాం తాబేలు, కీలెడ్ బాక్స్ తాబేలుతో పాటు ఫిన్ వేల్, బ్లూ వేల్, నైఫ్ టూత్ సా ఫిష్, రెడ్‌లైన్ టార్పెడో బార్బ్, గోల్డోన్ మహాసీర్ మత్స్యజాతులు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా, గోవా తొండ, వాయనాడ్ తొండ, పడమటి కనుమల్లో కనిపించే ‘బ్రాంజ్‌బ్యాక్’ పాము, పూనా బల్లి, కొండ బల్లి, ట్రావెన్కోర్ పాము వంటి సరీసృపాలు దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించిన ప్రకారం 1750 నాటి నుంచి ఇప్పటి వరకు భారత భూభాగంపై కనిపించే వన్యప్రాణి జాతుల్లో నాలుగు, వృక్షజాతుల్లో 18 పూర్తిగా అంతరించిపోయాయి. అంతరించిపోయిన వృక్షజాతుల్లో నాలుగు జాతులు పూలు పూయని జాతులకు చెందినవైతే, 14 పూలు పూసే జాతులకు చెందినవని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) డైరెక్టర్ ఏఏ మావో ఒక నివేదికలో వెల్లడించారు. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను గత ఏడాది జూలైలో లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టింది. ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు, వేట వంటి మానవ తప్పిదాలు వంటి కారణాల వల్ల ఈ జీవజాతులు అంతరించిపోయాయని అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వన్యప్రాణులకు చేటు తెస్తున్న కారణాలు వన్యప్రాణులకు చేటు తెచ్చి పెడుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల మితిమీరి పెరుగుతున్న కాలుష్యం, దాని ఫలితంగా పెరుగుతున్న భూతాపం, యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత, విశృంఖలమైన వేట, వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల వల్ల పెరిగిన పురుగు మందులు, రసాయనిక ఎరువుల వినియోగం వంటివి వన్యప్రాణుల మనుగడకు తీవ్రస్థాయిలో ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాలు. వీటిని నియంత్రించకుంటే మన కళ్ల ముందే చాలా జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు కూడా వన్యప్రాణులు అంతరించిపోవడానికి కారణమవుతుంటాయి. గ్రహశకలాలు భూమిని తాకడం, భూకంపాలు, కార్చిచ్చులు వంటి ఉత్పాతాలు జీవరాశికి చేటు తెచ్చిపెడుతుంటాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట గ్రహశకలాలు భూమిని తాకిన ఫలితంగా అప్పటి వరకు భూమ్మీద మనుగడ సాగించిన భారీ జీవులైన డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అడవుల నరికివేత, కార్చిచ్చుల కారణంగా వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి అంతరించిపోయే పరిస్థితులకు చేరుకుంటున్నాయి. జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగా కొన్ని ప్రాణులు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటున్నాయి. ఆఫ్రికన్ చిరుతలు జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగానే త్వరగా అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరవడటం వల్ల మరికొన్ని జీవజాతులు నశిస్తున్నాయి. దోమలను ఆహారంగా తీసుకుంటూ మనుగడ సాగించే కొన్ని రకాల కప్పలు, గబ్బిలాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గముఖం పడుతోంది. ప్లాస్టిక్, ప్రమాదకరమైన రసాయనాలు సముద్రాల్లో కలుస్తుండటంతో పలు జాతులకు చెందిన సముద్రజీవులు, పగడపు దీవులు వేగంగా నశిస్తున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మన ప్రభుత్వం కూడా ఈ దిశగా పలు చర్యలు చేపడుతోంది. కేవలం శతాబ్ది వ్యవధిలోనే మన దేశంలో పులుల సంఖ్య 95 శాతానికి పైగా కనుమరుగవడంతో ప్రభుత్వం 1972లో పులులను కాపాడుకోవడానికి ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించింది. అదే ఏడాది వన్యప్రాణి పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ‘ప్రాజెక్ట్ టైగర్’ ఇప్పుడిప్పుడే కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుండటం కొంత ఆశాజనకమైన పరిణామం. దంతాల కోసం ఏనుగుల వేట విచ్చలవిడిగా సాగడంతో ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో 1992లో ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది. అదే రీతిలో మొసళ్లు, తాబేళ్ల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం రాబందుల పరిరక్షణ కోసం, ఖడ్గమృగాల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రభుత్వాలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఎన్ని కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, అమలులోకి తెచ్చినా, ఖనిజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించకుండా జీవవైవిధ్యాన్ని దీర్ఘకాలంలో కాపాడుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖనిజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, విరివిగా అడవుల పెంపకం, రసాయన వ్యర్థాలను నదులు, సముద్రాల్లో కలపకుండా జాగ్రత్త పడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను చిత్తశుద్ధితో చేపడితే తప్ప జీవజాతులను కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. -
దినదిన గండం..
వేసవి కాలం వచ్చిందంటే వన్యప్రాణులకు దినదిన గండమే. అడవిలో ఆకురాలడంతో వాటికి ఆహారం దొరకదు. గుంతల్లో నీరు ఎండిపోతుంది. తాగేందుకు నీరు లభ్యం కాదు. అడవి కార్చిచ్చు ఓవైపు వెంట పడుతుంటే, తప్పించుకుని వచ్చే క్రమంలో వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో జిల్లాలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కొత్తగూడ(ములుగు): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లోనే వన్యప్రాణుల ఆనవాళ్లు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ నుంచే వర్షాలు ముఖం చాటేయడంతో అటవీ ప్రాంతంలో జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడో ఓ చోట నీళ్లున్న దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్లి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మార్గ మధ్యలో ఎక్కడ ఉచ్చులు, ఎక్కడ విద్యుత్ తీగలు, ఎక్కడ వేటగాళ్లు మాటు వేసి ఉంటారో తెలియక దినదిన గండంగా కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. గూడూరు, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని భీమునిపాదం గుట్టలు, గంగారం, తాడ్వా యి, గంగారం, బయ్యారం మండలాల సరి హద్దు అటవీప్రాంతంలోని పాండవుల గుట్ట లు, కొత్తగూడ, తాడ్వాయి మండలాల సరి హద్దు అటవీ ప్రాంతాలు వేటగాళ్లకు అడ్డాగా మారాయి. వేట మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి వేటాడుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ను వాహకంగా వేటగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. వన్యప్రాణులు వెళ్లే దారులను గుర్తించి, వాటికి కాళ్లకు తగిలే విధంగా చెట్లకు బైండింగ్ వైర్ చుట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వేసిన రోజు జంతువులు పడకపోతే కనీసం విద్యుత్ సరఫరాను కూడా తొలగించడం లేదు. ఉచ్చులను కూడా అలాగే వదిలేస్తున్నారు. దీంతో అడవులకు వెళ్లే సాదు జంతువులు, మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల గంగారం మండలంలోని కోమట్లగూడెం అటవీ ప్రాంతంలో రెండు దుక్కిటెద్దులు ఉచ్చులకు బలైన విషయం తెలిసిందే. గత ఏడాది ఓటాయి అటవీ ప్రాంతంలో వేసిన ఉచ్చుల్లో పడి మృతిచెందిన కణుజును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటాయి గ్రామంలో కణుజు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చినా ఫారెస్ట్ అధికారులు దాడి చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచ్చులు వేస్తున్న వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. నీళ్లకు వచ్చే దారే వేటకు మార్గం వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తోంది. అందుకోసం అడవిలో బోర్లు వేసి సోలార్ పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటి వద్ద సీసీ కెమెరాలు బిగించారు. కానీ, అవే వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది. జింకలు, అడవి పందులు, దుప్పిలు, కణుజులు, కొండగొర్రెల తదితర వన్యప్రాణులు నీటికోసం అడవిలో ఒకే మార్గం గుండా వచ్చి వెళ్తుండడాన్ని గమనించిన వేటగాళ్లు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా కొంత దూరంలో ఉచ్చులు వేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నివాసం ఉండని అధికారులు మహబూబాబాద్‌లో గంగారం, కొత్తగూడ రేంజ్‌లు విభజించి చిన్న చిన్న బీట్లు చేశారు. అయినా వన్యప్రాణుల సంరక్షణ మాత్రం సాధ్యం కావడం లేదు. గంగారం, కొత్తగూడ రేంజ్‌కు ఎఫ్ఆర్వోలు లేక ఇన్చార్జిలతో నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అటవీశాఖ అధికారులకు విలాసవంతమైన క్వార్టర్లు నిర్మించినా ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి సాధారణ ఉద్యోగుల్లా వచ్చి వెళ్తున్నారు. దీంతో పోడు జరిగినా, వేట జరిగినా, స్మగ్లింగ్ జరిగినా సిబ్బంది వచ్చే సరికే జరగాల్సింది జరిగిపోతోంది. ఎప్పుడైనా ఉన్నతాధికారులు వస్తున్నారనో, లేక సమాచారం ఉన్నతాధికారులకు తెలిస్తేనో హడావుడి చేసి అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు, వివిధ కార్యకలాపాలను బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ ద్వారా అధికా రులు ఫోన్లలో గుట్టుగా నడుపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా యూనియన్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా వన్యపారణులను కాపాడాల్సిన అవసరం ఉంది. నిఘా పెంచుతాం.. వన్యప్రాణులను సంరక్షించడానికి అటవీ ప్రాంతంలో నిఘా పెంచుతాం. ఎక్కడ దొరికినా వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. క్వార్టర్లు కేటాయించిన ఉద్యోగులు స్థానికంగా ఉండేలా చూస్తాం. లేదంటే చర్యలు తప్పవు. – కిష్టాగౌడ్, డీఎఫ్ఓ -
స్వార్థం వల.. వన్యప్రాణి విలవిల
అడవి అంటే.. పచ్చని చెట్లు.. గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల సవళ్ల గుర్తుకు వస్తాయన్నది నాటి మాట. కనుమరుగైన చినుకు జాడ.. ఎండిన నీటివనరులు.. ఆగని వేట.. విద్యుదాఘాతాలు.. ప్రమాదాలతో వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. అడవి జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో జీవవైవిధ్యానికి ఎసరొస్తోంది. పలమనేరు: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. రకరకాల కారణాలతో ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియదు. అరుదైన చిరుత పులులు సైతం ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇక మృత్యువాత పడుతున్న ఏనుగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమైంది. జిల్లాలోని అడవుల్లో అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు, నాటు తుపాకులతో ఆటోమేటిక్ ఫైరింగ్, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు బలవుతూనే ఉన్నాయి. వన్య ప్రాణాలకు తప్పని ముప్పు కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోంది. కొందరు నిత్యం అడవిలో వేటే జీవనోపాధిగా మార్చుకున్నారు. దీంతో అడవుల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఉరులు, నాటు బాంబులతో సైతం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అలాగే అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగులుకుని మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య క్షీణిస్తోంది. ఐదేళ్లలో 12 ఏనుగులు, మూడు చిరుతలు మృతి 2013 నుంచి 2017వ సంవత్సరం మధ్య కాలంలో పది ఏనుగులు నీటి దొనల్లో పడి, విద్యుత్ షాక్, వ్యవసాయ బావులు మృతి చెందాయి. గతేదాడి కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు విద్యుదాఘాతానికి బలయ్యాయి. ఇటీవల ఎర్రావారిపాళెం మండలం కోటకాడిపల్లె వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. చిరుతల విషయానికొస్తే గత జనవరిలో బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. ఐరాల మండలం మల్లార్లపల్లె వద్ద ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. దీన్ని జూకి తరలించగా మృతి చెందింది. తాజాగా కుప్పం సరిహద్దులోని క్రిష్ణగిరి వద్ద ఓ చిరుతను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపేశాడు. ఇప్పటికైనా అటవీశాఖ తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. -
మేమెక్కడ మెదిలేది..?
కామారెడ్డి క్రైం: మనిషికి తన స్వార్థమే ముఖ్యమైపోయింది. ఎవరెలా పోతే తనకేంటి అనుకునేవారే నేటి కాలంలో ఎక్కువ. తోటి మనిషికి కష్టమొచ్చినా పట్టించుకోరు. అలాంటిది జంతు వు గురించి ఆలోచించేవారెవరు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా దట్టమైన అడవులకు పెట్టింది పేరు. దశాబ్దకాలంగా జిల్లాలో అడవుల విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. రోజురోజుకీ పరిస్థి తి అధ్వానంగా మారుతోంది. ఎక్కడికక్కడ అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోని సహజ సంపదను దోపిడీ చేస్తున్న దీ మనిషే. వన్యప్రాణికి అడవుల్లో ఆహారం అటుంచితే కనీసం నీళ్లు దొరకడం లేదు. అడవి లో కడుపు మాడ్చుకుంటున్న ప్రాణులు జనావాసాల్లోకి వస్తూ దాడులు, ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. అక్రమ కలప ర వాణా, అటవీ భూముల ఖబ్జా, అడవులను హరిస్తుండగా వేటగాళ్ల ఉచ్చులో పడుతూ ఎన్నో వన్యప్రాణులు మనుగడను కోల్పోతున్నాయి. అడవుల రక్షణకుగానీ, వన్యప్రాణుల సంరక్షణకు గానీ అటవీశాఖ చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యం. ఇందులో క్షేత్రస్ధాయిలోని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంతరిస్తున్న అడవులు.. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ డివిజన్ పరిధిలో 52,113 హెక్టార్లు, ఆర్మూర్ పరిధిలో 33,778 హెక్టార్లు, కామారెడ్డి, బాన్సువాడ అటవీ డివిజన్ల పరిధిలో 82,173 హెక్టార్ల అడవులు ఉన్నాయి. కామారెడ్డి డివిజన్ పరిధిలో 4 రేంజ్‌లు, బాన్సువాడ పరిధిలో 4 రేంజ్లున్నా యి. వాటి పరిధిలో 35 సెక్షన్లు, 120 బీట్లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన జంతు గణన లో ఉమ్మడి జిల్లాలో 82 చిరుతలు, 165 ఎలుగుబంట్లు, 185 జింకలు, 32 మనుబోతులలో పా టు ఇతర జంతువులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదివరకటితో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య భారీగా తగ్గింది. అడవులు అంతరిస్తుండటంతో ఉన్న కొద్దిపాటి అడవుల్లో వన్య ప్రాణుల మనుగడకు తగిన పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. దశాబ్ద కాలంగా జిల్లాలో 40 శాతం అడవులు అన్యాక్రాంతానికి గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎలుగుబంటి దాడులు.. ఏటా ఎలుగుబంటి దాడి ఘటనలు జిల్లాలోని చాలాచోట్ల జరుగుతున్నాయి. వేసవి ప్రారంభ మైందంటే అడవిలో ఏం దొరకని పరిస్ధితి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం, నీళ్లకోసం గ్రామా లు, పంటపొలాల్లోకి వస్తున్నాయి. జనం భయ బ్రాంతులకు గురి కావడమే కాకుండా జంతు వులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. మరెన్నో జంతువులు.. ఇప్పడికే కోతులు అడవులు వదిలి పట్టణాలు, గ్రామాలకు చేరుకున్నాయి. కోతుల బెడద తీ వ్రంగా ఉందని గ్రామస్తులు ఇబ్బందులకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. అడవి పందులు ఆహారం కోసం పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. నెమళ్లు అడవుల్లో నీరు, ఆహారం దొరక్క ప్రధాన రహదారుల వెంట, గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. ఇవే కాక వేటగాళ్ల ఊచ్చు లో పడి మరెన్నో అటవీ జంతువులు బలవుతు న్నాయి. ఇది వరకు అటవీ జంతువులకు వేసవిలో తాగునీటి వసతికి సాసర్ పిట్లను ఏర్పా టు చేశారు. ఒక్క కామారెడ్డి డివిజన్ పరిధిలోనే 80 సాసర్ పీట్లను నిర్మించారు. అయితే వాటి నిర్వహణపై చాలా చోట్ల నిర్లక్ష్యం జరిగింది. భవిష్యత్తులో వీటి నిర్వహణ మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. ఉన్నతాధికారులు వన్యప్రాణులకు ఆహారం, నీటి సౌకర్యాలు కల్పించే విషయంలో మరింత దృష్టి సారించాలి. లేదంటే ఎన్నో ప్రాణులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. ♦ గతేడాది మేలో కామారెడ్డి మండలం గర్గుల్లోకి చొరబడిన ఎలుగుబంటి హంగామా సృష్టించింది. అటవీశాఖ అధికారులు మూ డు గంటలపాటు శ్రమించి ఎలుగుబంటిని బోనులో బంధించారు. ♦ గత అక్టోబర్‌లో సదాశివనగర్ మండలం యాచారం, ఉత్తనూరులకు సమీపంలోని పంటపొలాల్లో ఉపాధిహామీ కూలీలు, రైతులపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు రెండు చొట్ల వెలుగు చూసాయి. ♦ ఈసారి జనవరిలో గాంధారి మండలం గుర్జాల్‌తండా సమీపంలో ఎలుగుబంటి దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ♦ ఇటీవల తాడ్వాయి మండలం కన్కల్ శివారులోని పంట పొలాల్లోకి వచ్చిన ఎలుగుబంటి నలుగురిని గాయపర్చింది. జింకలు, మనుబోతుల మృతి.. ♦ మొన్నటికి మొన్న నీళ్ల కోసం వచ్చిన మూడు మనుబోతు(నీల్గాయ్)లు నిజాంసాగర్ మండలం సింగితం రిజర్వాయర్ కాలువలో పడి బయటకు రాలేకపోయాయి. స్థానికులు, అధికారులు వాటిని బయటకు తీశారు. ఒక నీల్గాయ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి వాటిని దగ్గర్లోని అటవుల్లోకి వదిలేశారు. ♦ లింగంపేట మండలం మెంగారం శివారులో నవంబర్ 23న పం ట చేనులోకి వచ్చిన కొండగొర్రెను గ్రామస్తులు పట్టుకుని అధికారులకు సమాచారం ఇ చ్చారు. వారు సకాలం లో స్పందించక అది మృతి చెందింది. ఈ వ్యవహారంపై అప్పట్లో ఉన్నతాధికారులు విచారించారు. ♦ గతేడాది లింగంపేట మండలం శెట్పల్లి అడవుల్లో దాహార్తి తీర్చు కునేందుకు వచ్చి మనుబోతు సాసర్‌పిట్‌లో పడి మృతి చెందింది. ♦ మద్నూర్ మండలంలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సంఘటన ల్లో మూడు జింకలు రోడ్లపై వాహనాలు ఢీకొని మృతి చెందాయి. ప్రమాదాల బారిన చిరుతలు.. ♦ ఇటీవల చిరుతలు జనావాసాలపైపు రావడం పెరిగింది. రెండు నెలల వ్యవధిలో మూడు చిరుతలు మృతి చెందాయి. జిల్లాలో అడవుల వెంబడి ఉన్న చాలా గ్రామాల శివారు ప్రాంతాల్లో నిత్యం చిరుతల సంచారం ఉన్నట్లుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ♦ గత జూలైలో ఆహారం కోసం వచ్చిన ఓ చిరుత మల్లారం ప్రాంతంలోని కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్‌షాక్‌తో చనిపోయింది. ♦ నెల క్రితం సిర్నాపల్లి అటవీప్రాంతంలో గుర్తుతెలియని రైలు ఢీకొన్న ఓ చిరుతను అధికారులు వైద్యం అందించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ♦ వారం క్రితం జగ్గారావుఫారం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుత అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెల్సిందే. ♦ గతంలో గాంధారి మండలం మాతుసంగెం శివారులోని ఓ కుంట పొదల్లో దూరిన చిరుత గ్రామస్తుల దాడిలో మృతిచెందింది. -
వన్యప్రాణుల గణనకు సై!
వన్యప్రాణులు జాతీయ సంపద. ఇవి పెరిగితేనే మానవాళి మనుగడ సాధ్యం. అందుకే వీటిని మనం సంరక్షించుకోవాలి. అలా చేయాలంటే అటవీ సంపద పెరగాలి. సంపదను పెంచేందుకే ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి వన్యప్రాణుల గణనను నిర్వహించడం ఆనవాయితీ. 4వ జాతీయస్థాయి వన్య ప్రాణుల గణన దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టనున్నారు. వీటిలో ముఖ్యంగా పులులు, సహజాతులు, వాటి ఆహార ప్రాణులు, ఆవాస ప్రాంతాలపై పర్యవేక్షణ చేయడమే ఈ గణన ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో కూడా వన్యప్రాణుల గణన చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరఘట్టం: వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియ సమయం సమీపిస్తుండడంతో అధికారులు అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం 616 చదరపు కి.మీ.ఈ అటవీ విస్తీర్ణంలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో అడవులు కేవలం 10.55 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం అటవీ సంపదను పెంచా ల్సిన అవశ్యకత చాలా ఉంది. గణన ఇలా.. వన్యప్రాణుల గణన ఉదయం 6 గంటల నుంచి చేపడతారు. ఒక ఫారెస్ట్ బీట్‌లో నిర్దేశించిన ప్రాంతంలో 0 కి.మీ నుంచి 2 కి.మీల వరకు ఒకే మార్గం గుండా ప్రత్యేక బందం సభ్యులు పరిశీలన చేస్తారు. 2 కి.మీ వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి వస్తారు. ప్రతీ 400 మీటర్లకు ఒక పాయింట్‌ను నిర్దేశిస్తారు. మొదట 400 మీటర్ల వద్ద కుడి వైపుగా వెళ్లి పరిశీలిస్తారు. తర్వాత 800 మీటర్ల వద్ద ఎడమ వైపునకు వెళ్లి పరిశీలిస్తారు.ఇలా బయలు దేరిన స్థానం వద్దకు చేరే వరకు వెళ్లిన మార్గంలో కుడి, ఎడమల వైపు ‘యు’ ఆకారంలో ముమ్మరంగా గాలిస్తారు. ఈ పరిశీలనలో జంతువుల వెంట్రుకలు, పాదముద్రలు, పింట్రుకలు(పేడ), అచ్చులు, కొమ్ములతో గీకిన, గోళ్లతో రక్కిన ఆనవాలను గుర్తిస్తారు. ఈ ఆనవాళ్ల ద్వారా ఆ ప్రాంతంలో ఏయే జాతి జంతువులు సంచరిస్తున్నాయే గుర్తిస్తారు. మన జిల్లాలో ఉన్న జంతువులు.. మన జిల్లాలో మాత్రం పులులు లేవని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం, టెక్కలి, కాశీబుగ్గ, పాలకొండ అటవీ రేంజ్లో 42 ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. పాతపట్నం–టెక్కలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, జింక, కొండగొర్రె, కొండ మేక ఇలా నాలుగు రకాల జింకలు ఉన్నాయి. పాతపట్నానికి సమీపంలో ఆంధ్రా–ఒరిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుమ్మలగుళ్లు, తోడేళ్ల సంచారం ఉంది. అలాగే పాతపట్నం అటవీ ప్రాంతంలో రేసుకుక్కల సంచారం కూడా ఉంది. మొళియాపుట్టి మండలం జాడుపల్లి అటవీ ప్రాంతంలో కనుజులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వీటితో పాటు 11 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఉంది. అలాగే ఇతర రేంజిల్లో ఎక్కువగా జింకలు, దుప్పులు ఉన్నట్లు 2014 వన్యప్రాణుల గణన ద్వారా గుర్తించారు. మూడేళ్ల క్రితం సారవకోట మండలం వెంకటాపురం వద్ద ఓ చిరుతను కొందరు వ్యక్తులు హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో అప్పటిలో 17 మందిపై కేసులు కూడా నమోదు చేసారు.ఆ తర్వాత చిరుతల జాడ మాత్రం మన జిల్లాలో లేదని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి చేపట్టనున్న గణన వన్యప్రాణల గణన దేశవ్యాప్తంగా ఒకేసారి చేపడతారు. ఒకప్రాంతంలో సంచరించే జంతువు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. కొన్ని జంతువులు వలసలు వస్తుంటాయి. అందుచే ఈ గణన ఒకేసారి చేపడతారు. గణన ఆధారంగానే... వన్యప్రాణుల గణన ఆధారంగా వాటి మనగడకు కావాల్సిన పరిస్థితులను కల్పిస్తారు. వాతావరణానికి అనుగుణంగా గడ్డి, నీరు ఉండేలా అటవీ అధికారులు చర్యలు చేపడతారు. అలా చేయాలంటే అడవులను అభివృద్ధి చేయాలి. అంటే వృక్ష సంపద పెంచాలి. అయితే ప్రస్తుతం జిల్లాలో అక్రమార్కుల గొడ్డలి వేటుకు అడవులు అంతరించిపోతున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్తేనే వన్యప్రాణులను సంరక్షించుకోగలం. అటవీ సంపదను పెంపొందించడమే లక్ష్యం వన్యప్రాణుల గణన ద్వారా అటవీ సంపదను పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.అటవీ సంపద పెరిగితే వన్యప్రాణులు కూడా గణనీయంగా పెరుగుతాయి. వాతావరణం సమతుల్యంగా మారి కాలుష్యం తగ్గుతుంది.- జె.జగదీష్,అటవీశాఖ రేంజ్ అధికారి,పాలకొండ -
ఈ ఘాతుకానికి బాధ్యులెవరు?
సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఒకవైపు మాఫియా ప్రకృతి వనరులను కొల్లగొడుతుంటే, మరోవైపు వేటగాళ్లు వణ్యప్రాణును హరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయిన చిరుతపులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పీలేరు మండలం తలుపుల గ్రామపంచాయితీ పరిధిలోని సళ్లవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో మరణించిన చిరుత పులిని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఉచ్చులోపడ్డ చిరుతను చంపి, దాని కాలిగోర్లను కత్తిరించి, కళేబరాన్ని ఓ గుంతలో విసిరేసి వెళ్లారు. చనిపోయిన చిరుత వయసు సుమారు ఎనిమిదేళ్లు ఉండొచ్చని అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఖననం : గుంతలో లభించిన చిరుత కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది బయటకు తీయగా, పశువైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం చిరుతను సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేదానిపై విచారణ చేపట్టామని అధికారులు చెప్పారు. -
ఈ ఘాతుకానికి బాధ్యులెవరు?
-
వన్యప్రాణుల మరణ వేదన!
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మునుపెన్నడూ లేనంత వేగంగా అంతర్థానమవుతున్నాయి! మానవ చర్యల కారణంగా మూడింట రెండు వంతుల వన్యప్రాణులు 2020 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో దాదాపు సగం వన్యప్రాణులు అంతర్థాన దశలో ఉన్నాయని తన ద్వైవార్షిక నివేదిక ‘ది లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2016’లో తేటతెల్లం చేసింది! – సాక్షి సెంట్రల్ డెస్క్ మానవ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970–2020 మధ్య సగటున 67 శాతం తగ్గిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1970–2012 మధ్య పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, చేపలు, సరీసృపాల సంఖ్య 58 శాతం క్షీణించిందని పేర్కొంది. దీన్ని బట్టి 2020 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతులు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు పర్యావరణంపై మానవుల ప్రభావాన్ని నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ఆవాసాల విధ్వంసం, అటవీ విస్తీర్ణం తగ్గడం, వన్యప్రాణులను వధించడం కొన్ని కారణాలుగా పేర్కొంది. మన ఆహార, ఇంధన వినియోగ మార్గాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆవాసాల విధ్వంసం... ప్రపంచ మొత్తం జీవజాలంలో సగం వాటా బ్రెజిల్, చైనా, యూఎస్, రష్యా, భారత్ దేశాలదే. ‘గ్లోబల్ బయోకెపాసిటీ హబ్్స’గా ఉన్న ఈ దేశాలు ఇతర దేశాలకు వనరులను ఎగుమతి చేసే ప్రాథమిక దేశాలుగా కూడా ఉన్నాయి. ఫలితంగా ఈ దేశాల్లోని జీవ వ్యవస్థలపై అధిక భారం పడుతోంది. ఇది ఆ జీవులు ఆవాసాలు కోల్పోవడానికి కారణమవుతోందని నివేదిక వెల్లడించింది. ఆవాసాల విధ్వంసం, వన్యప్రాణుల దోపిడీకి ఆహార ఉత్పత్తే ప్రాథమిక కారణమని తెలిపింది. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రవిసింగ్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పులు ► ఏడాదికి 1.30 మి.మీ. చొప్పున పెరుగుతున్న సముద్ర మట్టంతో భారత్ ప్రపంచంలో అత్యంత విపత్కర ప్రాంతంగా నిలవనుంది. ► ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో గత 40 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ► 2100 నాటికి సముద్ర మట్టం మీటరు పెరిగితే దేశంలో 14 వేల చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ► వరదలు, కరువు, వేడిగాలులు వంటి విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 2000–15 మధ్య కాలంలో ఐదువేల మందికి పైగా మరణించారు. భూతాపం ప్రభావం కారణంగా 2080–2100 నాటికి ఆహార ఉత్పత్తి 10–40 శాతం తగ్గుతుందని అంచనా.