వన్యప్రాణులు జాతీయ సంపద. ఇవి పెరిగితేనే మానవాళి మనుగడ సాధ్యం. అందుకే వీటిని మనం సంరక్షించుకోవాలి. అలా చేయాలంటే అటవీ సంపద పెరగాలి. సంపదను పెంచేందుకే ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి వన్యప్రాణుల గణనను నిర్వహించడం ఆనవాయితీ. 4వ జాతీయస్థాయి వన్య ప్రాణుల గణన దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టనున్నారు. వీటిలో ముఖ్యంగా పులులు, సహజాతులు, వాటి ఆహార ప్రాణులు, ఆవాస ప్రాంతాలపై పర్యవేక్షణ చేయడమే ఈ గణన ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో కూడా వన్యప్రాణుల గణన చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
వీరఘట్టం: వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియ సమయం సమీపిస్తుండడంతో అధికారులు అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం 616 చదరపు కి.మీ.ఈ అటవీ విస్తీర్ణంలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో అడవులు కేవలం 10.55 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం అటవీ సంపదను పెంచా ల్సిన అవశ్యకత చాలా ఉంది.
గణన ఇలా..
వన్యప్రాణుల గణన ఉదయం 6 గంటల నుంచి చేపడతారు. ఒక ఫారెస్ట్ బీట్‌లో నిర్దేశించిన ప్రాంతంలో 0 కి.మీ నుంచి 2 కి.మీల వరకు ఒకే మార్గం గుండా ప్రత్యేక బందం సభ్యులు పరిశీలన చేస్తారు. 2 కి.మీ వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి వస్తారు. ప్రతీ 400 మీటర్లకు ఒక పాయింట్‌ను నిర్దేశిస్తారు. మొదట 400 మీటర్ల వద్ద కుడి వైపుగా వెళ్లి పరిశీలిస్తారు. తర్వాత 800 మీటర్ల వద్ద ఎడమ వైపునకు వెళ్లి పరిశీలిస్తారు.ఇలా బయలు దేరిన స్థానం వద్దకు చేరే వరకు వెళ్లిన మార్గంలో కుడి, ఎడమల వైపు ‘యు’ ఆకారంలో ముమ్మరంగా గాలిస్తారు. ఈ పరిశీలనలో జంతువుల వెంట్రుకలు, పాదముద్రలు, పింట్రుకలు(పేడ), అచ్చులు, కొమ్ములతో గీకిన, గోళ్లతో రక్కిన ఆనవాలను గుర్తిస్తారు. ఈ ఆనవాళ్ల ద్వారా ఆ ప్రాంతంలో ఏయే జాతి జంతువులు సంచరిస్తున్నాయే గుర్తిస్తారు.
మన జిల్లాలో ఉన్న జంతువులు..
మన జిల్లాలో మాత్రం పులులు లేవని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం, టెక్కలి, కాశీబుగ్గ, పాలకొండ అటవీ రేంజ్‌లో 42 ఫారెస్ట్ బీట్‌లు ఉన్నాయి. పాతపట్నం–టెక్కలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, జింక, కొండగొర్రె, కొండ మేక ఇలా నాలుగు రకాల జింకలు ఉన్నాయి. పాతపట్నానికి సమీపంలో ఆంధ్రా–ఒరిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుమ్మలగుళ్లు, తోడేళ్ల సంచారం ఉంది. అలాగే పాతపట్నం అటవీ ప్రాంతంలో రేసుకుక్కల సంచారం కూడా ఉంది. మొళియాపుట్టి మండలం జాడుపల్లి అటవీ ప్రాంతంలో కనుజులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వీటితో పాటు 11 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఉంది. అలాగే ఇతర రేంజిల్లో ఎక్కువగా జింకలు, దుప్పులు ఉన్నట్లు 2014 వన్యప్రాణుల గణన ద్వారా గుర్తించారు. మూడేళ్ల క్రితం సారవకోట మండలం వెంకటాపురం వద్ద ఓ చిరుతను కొందరు వ్యక్తులు హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో అప్పటిలో 17 మందిపై కేసులు కూడా నమోదు చేసారు.ఆ తర్వాత చిరుతల జాడ మాత్రం మన జిల్లాలో లేదని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఒకే సారి చేపట్టనున్న గణన
వన్యప్రాణల గణన దేశవ్యాప్తంగా ఒకేసారి చేపడతారు. ఒకప్రాంతంలో సంచరించే జంతువు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. కొన్ని జంతువులు వలసలు వస్తుంటాయి. అందుచే ఈ గణన ఒకేసారి చేపడతారు.
గణన ఆధారంగానే...
వన్యప్రాణుల గణన ఆధారంగా వాటి మనగడకు కావాల్సిన పరిస్థితులను కల్పిస్తారు. వాతావరణానికి అనుగుణంగా గడ్డి, నీరు ఉండేలా అటవీ అధికారులు చర్యలు చేపడతారు. అలా చేయాలంటే అడవులను అభివృద్ధి చేయాలి. అంటే వృక్ష సంపద పెంచాలి. అయితే ప్రస్తుతం జిల్లాలో అక్రమార్కుల గొడ్డలి వేటుకు అడవులు అంతరించిపోతున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్తేనే వన్యప్రాణులను సంరక్షించుకోగలం.
అటవీ సంపదను పెంపొందించడమే లక్ష్యం
వన్యప్రాణుల గణన ద్వారా అటవీ సంపదను పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.అటవీ సంపద పెరిగితే వన్యప్రాణులు కూడా గణనీయంగా పెరుగుతాయి. వాతావరణం సమతుల్యంగా మారి కాలుష్యం తగ్గుతుంది.- జె.జగదీష్,అటవీశాఖ రేంజ్ అధికారి,పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment