ప్రాదేశిక ఉత్కంఠ | MPTC, ZPTC poll counting on May 13 | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఉత్కంఠ

Published Tue, May 13 2014 2:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ప్రాదేశిక ఉత్కంఠ - Sakshi

ప్రాదేశిక ఉత్కంఠ

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల లెక్క తేలింది. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలపై పడింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును మంగళవారం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు వారి పార్టీలు, ప్రజలు ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల ఫలితాలు అప్పుడే వెలువడాల్సి ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభా వం చూపుతాయన్న ఉద్దేశంతో సార్వత్రిక పోలింగ్ తర్వాతే కౌం టింగ్ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పోటీ చేసిన అభ్యర్థులకు నెలరోజుల నిరీక్షణ తప్పలేదు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత సోమవారం మున్సిపల్ కౌంటింగ్ పూర్తి చేసిన అధికారులు, మంగళవారం ప్రాదేశిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తొమ్మిది కేం ద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు.
 
 అభ్యర్థుల్లో ఉత్కంఠ
 జిల్లాలో 38 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా నరసన్నపేట జెడ్పీటీసీ ఏకగ్రీవం కావడంతో 37 స్ధానాలకు ఎన్నికలు జరి గాయి. వీటిలో 121 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. అలాగే 675 ఎంపీటీసీ స్ధానాలు ఉండగా 26 స్ధానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 649 స్థానాలకు 1495 మంది బరిలో ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్ధులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. సమ యం దగ్గర పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. అయితే జిల్లాలో అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని ప్రధాన పోటీదారులైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ ఫలితాల్లో రెండు పార్టీలకు చెరి సగం సీట్లు దక్క గా.. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మంచి ఆదరణ ఉందని, అందువల్ల తమకే ఆధిక్యం లభిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కాగా ఇప్పటికే మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో.. ప్రా దేశిక ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడైతే వాటిని విశ్లేషించి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వే యవచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
 
 12 గంటల తర్వాతే తొలి రౌండ్ ఫలితాలు
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈవీఎంలు కాకుం డా బ్యాలెట్లు వినియోగించినందుకు కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీనికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను వేర్వేరుగా లెక్కించాల్సి ఉన్నందున మంగళవారం రాత్రి వరకు లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. తొలి రౌండ్ ఫలితాలు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాతే వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు.   తొలుత స్ట్రాంగ్ రూముల నుంచి బ్యాలెట్ బాక్సులను బయటకు తెచ్చి ఏజెంట్ల సమక్షంలో సీళ్లు తొలగిస్తారు.
 
   బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను డ్రమ్ముల్లో వేసి కలుపుతారు.
   తర్వాత పార్టీల వారీగా బ్యాలెట్లను వేరు చేస్తారు.
   అప్పుడు 25 బ్యాలెట్లు చొప్పున కట్టలు కట్టిన అనంతరం రౌండ్ల వారీగా లెక్కిస్తారు.
   ఇదే విధానంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్లను వేర్వేరుగా లెక్కిస్తారు.


   బ్యాలెట్ బాక్సులు తెరిచి కట్టలు కట్టే వరకు సుదీర్ఘ ప్రక్రియ పూర్తి కావడానికే చాలా సమయం పడుతుంది. అందువల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి రౌండు ఫలితాలు వచ్చే అవకాశం లేదు.   ఎంపీటీసీల పరిధిలో తక్కువ ఓట్లే ఉంటాయి కనుక వాటి ఫలితాలు తొందరగానే వచ్చినా మం డలం యూనిట్‌గా ఉన్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు పట్టవచ్చు.   కౌంటింగ్ పూర్తి అయ్యి తుది ఫలితాలు వచ్చేసరికి రాత్రి ఆరు, ఏడు గంటలవుతుందని అధికారులు తెలిపారు.  వీలైనంతవరకు సాయంత్రంలోగానే ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ మేరకు అవసరమైన సిబ్బందిని నియమించినట్లు వారు చెప్పారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement