‘స్థానిక’ కౌంటింగ్‌కు పకడ్బందీ చర్యలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ :జిల్లాలో స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపుపై పర్యవేక్షక అధికారులు, రిటర్నింగ్ అధికారులతో శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఇచ్ఛాపురంలో, పలాస పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు పలాసలో జరుగుతుందని చెప్పా రు. ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఎస్‌ఎంపురంలోని 21వ శతాబ్ది గురుకుల భవనంలో జరుగుతుందన్నారు. ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూని యర్ కళాశాలలోనూ, శ్రీకాకుళం నియోజకవర్గ మండలాల లెక్కింపు 21వ శతాబ్ది గురుకులం, ఇచ్ఛాపురం నియోజకవర్గ మండలాల ఓట్ల లెక్కింపు కంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలోను,
మిగిలిన మండలాల లెక్కింపు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోను జరుగుతుందని వివరించారు. లెక్కింపు కేంద్రంలో సెగ్మెంట్ కు ఒకటి చొప్పున టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక పర్యవేక్షణ అధికారి, ఒకరు లేదా ఇద్దరు సహాయకులు, ఒక ఆఫీసు సబార్డినేట్‌ను నియమించాలని చెప్పారు. బ్యాలెట్‌లను విడదీసి తొలుత ఎంపీటీసీ ఓట్లను తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించాలన్నారు. బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు ఆదివారం తరలిం చాలన్నారు. ఇందుకు గట్టి బందోబస్తు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కిం పుపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలన్నారు. లెక్కింపు పూర్తయ్యేవరకు ఏజెంట్లు బయటకు రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, మోసాలకు పాల్పడిన వ్యక్తులు ఏజెంట్లుగాా ఉండడానికి అవకాశం లేదన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించవచ్చని చెప్పారు.
సెల్‌ఫోన్లు అనుమతించం..
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లు అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకులకు మాత్రమే సెల్‌ఫోన్ అనుమతిస్తామన్నారు. లెక్కింపు కేంద్రంలో పాటించాల్సిన నియమావళి ఫ్లెక్సీని కేంద్రం బయట ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా ప్రతినిధులను లెక్కింపు గదికి దగ్గరలో ఇతరులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన గదివరకు అనుమతించి వివరాలు అందజేయాలన్నారు. లెక్కింపు ప్రారంభంలో ఫోటోలు, వీడియో తీయడానికి ఒకరిద్దరిని అనుమతించవచ్చన్నారు. జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ మాట్లాడుతూ ఏజెంట్ల నియామకపత్రంపై ఫోటో తప్పనిసరిగా ఉండాలన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని తెలిపారు. సమావేశంలో జేసీ జి.వీరపాండ్యన్, ఏజేసీ ఎండీ హషీం షరీఫ్, ఐటీడీఏ పీవో ఎన్.సత్యనారాయణ, డీపీవో టి.వెంకటేశ్వరరావు, నియోజకవర్గాల పర్యవేక్షక అధికారులు జి.గణేష్‌కుమార్, జె.సీతారామారావు, మనోరమ, టి.సునీతారాణి, కె. సాల్మన్‌రాజు, ఎస్.తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.