కౌంటింగ్కు వీలుకాకుంటే రీ పోలింగ్
హైదరాబాద్ : అకాల వర్షాలకు తడిచిన, చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో మూడుచోట్ల బ్యాలెట్ పేపర్లు తడిచాయని, అలాగే నెల్లూరు జిల్లాలో ఓ చోటు బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయన్నారు. ఒకవేళ లెక్కింపుకు వీలు కాకుంటే రీ పోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి తెలిపారు.
అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఈవీఎంలు తెరుచుకోలేదని వాటిని ఈసీఐఎల్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు. అవి ఓపెన్ కాకుంటే మళ్లీ రీపోలింగ్ జరుపుతామన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ-2, ఎంపీటీసీ-15 స్థానాల ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిని ఎప్పుడు నిర్వహించమంటే అప్పుడు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం లేదా రాత్రి వరకూ కొనసాగవచ్చునని ఆయన తెలిపారు.