'స్లిప్లు, నోటు తడిచాయి.. చెదలు పట్టాయి'
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల ప్రజలు తమ నిరసనను బ్యాలెట్ బాక్సుల్లో చూపారు.
* చిత్తూరు జిల్లా కలిగిరి మండలంలో ఓటర్లు గత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంచి నీళ్ళివ్వని మీకెందుకు ఓటేయాలంటూ.. స్లిప్‌లు రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కలిగిరి తాజా మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి సొంత మండలం కావడం విశేషం.
*అనంతపురం జిల్లా నల్లచెర్వు జెడ్పీటీసీ కౌంటింగ్కు టీడీపీ ఏజెంట్గా రౌడీషీటర్ నాగభూషణం నాయుడు హాజరయ్యాడు.
*అటు గుంటూరు జిల్లా కర్లపాలెంలో కూడా ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ పత్రంతో పాటు, ఓ పది రూపాయల నోటు కూడా బయట పడింది. కర్లపాలెం ఎంపిటిసిలో ఓటు వేసిన ఓ వ్యక్తి బ్యాలెట్ పత్రంతో పాటు, పది రూపాయల నోటు జత చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నోటు బయట పడింది.
*నెల్లూరు జిల్లా కావలిలో ఓ కళాశాలలో ఉంచిన కొండాపురం మండలం బ్యాలెట్ బాక్స్లకు చెదలు పట్టాయి. మంగళవారం ఓట్లు లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్లను ఏజెంట్లు బయటకు తీశారు. అందులోని బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉన్నాయి. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయి ఉండటంపై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో పాము ప్రత్యక్షం కావటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
*శ్రీకాకుళం జిల్లా పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద తేనెటీగలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్తో పాటు, 20మంది గాయపడ్డారు.
*పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెనుగొండ మండలానికి చెందిన 3 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు తడిచి ముద్దయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. దీంతో కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుందోనని అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.
*నిడదవోలు మండలంలో తాడిమళ్ల, కోరుమామిడి బ్యాలెట్ ఓట్లు తడవటంతో, లెక్కింపుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
*తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపూడి మండలంలో పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్స్ వర్షానికి తడిసిపోయింది.
*రంగారెడ్డి జిల్లా తాండూరు కౌంటింగ్ కేంద్రంలో భోజనాలు అందలేదని సిబ్బంది కౌంటింగ్ నిలిపివేశారు.
*కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద స్టాంగ్ రూమ్ తాళాన్ని సిబ్బంది పోగొట్టడంతో, అధికారులు తాళాలు పగులకొట్టి బ్యాలెట్ బాక్సులు బయటకు తీశారు.
*నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం వడ్లూరు బ్యాలెట్ బాక్స్‌లో ఓ లెటర్ ప్రత్యక్షం అయ్యింది. అభ్యర్థులు నచ్చలేదని ఓ ఓటరు ఓటు బదులు బ్యాలెట్ బాక్స్‌లో లెటర్ వేశాడు.
*ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్‌లో కాజద్‌నగర్, కౌటాలా పోలింగ్ కేంద్రంలో భోజనం సదుపాయం కల్పించలేదని సిబ్బంది విధులు బహిష్కరించారు.