విజువల్‌ వండర్‌.. సిటీలో వర్చువల్‌ పార్క్‌ల క్రేజ్‌ | Virtual Wildlife Safari Park in Hyderabad | Sakshi
Sakshi News home page

విజువల్‌ వండర్‌.. సిటీలో వర్చువల్‌ పార్క్‌ల క్రేజ్‌

Published Sat, Jan 4 2025 7:40 AM | Last Updated on Sat, Jan 4 2025 7:40 AM

Virtual Wildlife Safari Park in Hyderabad

విజువల్‌గా ఊహాజనిత  ప్రపంచంలోకి 

కొన్ని గంటల పాటు   లీనమయ్యేలా 

డైనోసార్ల నుంచి  ఏలియన్స్‌ వరకూ  

ప్రత్యక్ష వీక్షణతోపాటు,  పోరాడిన అనుభూతి 

అద్భుతమైన 3డీ, 4డీ,  వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ 

ఫ్లోర్‌ సైజు నుంచి వందల ఎకరాలకు విస్తరిస్తూ 

కృత్రిమ మేధకు ఆహ్వానం పలికిన ప్రస్తుత అధునాతన యుగంలో సాధ్యంకానిదంటూ ఏదీ లేదనేంతలా మారిపోయింది. ముఖ్యంగా ఈ అధునాతన జీవనశైలిలో వృత్తి వ్యాపారాలతో పాటుగా వినోదాత్మక కేంద్రాలు, ఊహాజనిత ప్రాంతాలన్నీ కళ్లముందుకొచ్చేశాయి. వర్చువల్‌ రియాలిటీ వేదికలుగా పిలుచుకునే ఈ విజువల్‌ వండర్లకు ఈ మధ్య ఆసక్తి, ఆదరణ విపరీతంగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం విదేశాలకే పరిమితమైన ఈ వర్చువల్‌ వేదికలు ప్రస్తుతం నగరంలో సందడి చేస్తున్నాయి. ఈ ఊహాజనిత వర్చువల్‌ ప్రపంచంలో ప్రేక్షకులు డైనోసార్‌ పార్క్‌లోకి ప్రవేశించి ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చు.. నగరంలో వరుసగా వర్చువల్‌ పార్కులు ఏర్పాటవుతున్న తరుణంలో ఆ విశేషాలు కొన్ని.. 

వర్చువల్‌ రియాలిటీ ద్వారా వజువల్‌గా ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా ఎవరెస్టు అధిరోహించవచ్చు, వినీల ఆకాశంలో, అంతరిక్షంలో సంచరించవచ్చు. ఆ ప్రయాణమంతా మన కళ్ల ముందు నిజంగానే జరుగుతుందనే అద్భుత అనుభూతిని, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి ఈ వేదికలు. ఐతే గతంలో 1, 2 ఉన్నటువంటి ఈ వర్చువల్‌ రియాలిటీ వేదికలు క్రమంగా వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఒక పెద్ద మాల్‌లోనో, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఒక భాగంగానో ఉన్న ఈ ఆశ్చర్యభరిత వేదికలు ప్రస్తుతం నగరంలో పదుల సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. గదిలో ఓ ప్రదేశం నుంచి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం విశేషం.  

వర్చువల్‌ రియాలిటీ అంటే..? 
ఇదొక మాయా ప్రపంచం.. సామాన్య మానవునికి సాధ్యం కాని సాహసాలను నిజం చేశామనే అనుభూతిని కల్పిస్తాయి. స్వయంగా దట్టమైన అడవిలోకి వెళ్లి డైనోసార్లతో ఫైటింగ్‌ చేయొచ్చు. అనకొండలతో ఆడుకోవచ్చు. మహాసముద్రాల అడుగున అద్భుత జీవజాతులను విక్షించే ఫీలింగ్‌ను పొందవచ్చు.. అంతేకాదు.. మనమే ఒక భీకర యుద్ధంలో పాల్గొంటే ఎలా ఉంటుందో మన కళ్లకు గంతలు కట్టినట్టుగా ఉండే వర్చువల్‌ హెడ్‌సెట్‌తో చూపిస్తుంది. అలా కాకుండా వర్చువల్‌ సాంకేతికతతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థియేటర్‌ వంటి ఒక 3డీ గదిలో అంతరిక్షాన్ని, ఏలియన్‌ ప్రపంచాన్ని నిజజీవితంలానే భ్రమింపజేస్తుంది. ఇప్పటి వరకూ మనిషి చూడని జల కన్యలు, గ్రహాంతర వాసులతో కలిసి మలన్ని నడిపిస్తుంది. ఇదంతా వాస్తవంగా జరుగుతుందనేలా మనకు అనిపించడమే ఈ వర్చువల్‌ రియాలిటీ ప్రత్యేకత. ఈ అనుభూతి కలి్పంచడంలో 3డీ, 4డీ, వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి అధునాతన సాంకేతికతలు కీలకంగా పనిచేస్తున్నాయి. 

మనిషి చూడని ప్రపంచంలోకి.. 
నగరం వేదికగా ఈ వర్చువల్‌ విజువల్‌ వండర్‌ను అందిస్తున్న వేదికల్లో వండర్లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ ఒకటి. ఇందులో గతంలో ప్రారంభించిన ఇంటర్‌స్టెల్లార్‌ వర్చువల్‌ షో.. ప్రేక్షకులను అంతరిక్షంలోకి, ఇక్కడి గ్రహాల పైకీ తీసుకెళుతుంది. మనమే ఒక వ్యోమగామిగా ఆ అందాలను, అద్భుతాలను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతినిస్తుంది. శాటిలైట్‌ వ్యూతో పాటు జలాంతర్గాములు, అగ్ని పర్వతాలు, మంచుకొండలను చేధించుకుంటూ వెళ్లే ఈ వర్చువల్‌ ప్రయాణం మరో లోకంలోకి తీసుకెళుతుంది.  

లేజర్‌ గన్‌లతో వర్చువల్‌ గేమ్స్‌.. 
నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీ థీమ్‌ పార్క్‌లో కూడా వర్చువల్‌ విజువల్‌ వండర్లను ప్రదర్శించే ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠను, సాహస కృత్యాలతో భయభ్రాంతులకు గురిచేసే ఈ వర్చువల్‌ ప్రదర్శన మరచిపోని అనుభూతిని అందిస్తుంది. దీంతో పాటు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వేదికగా వర్చువల్‌ గేమింగ్‌ అందుబాటులో ఉంది. ఇందులో లేజర్‌ గన్‌లతో పబ్‌జీ, బీజీఎమ్‌ ఐ, ఫ్రీ ఫైర్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ పోలిన వర్చువల్‌ రియాలిటీ గేమ్స్‌ ఎవరైనా ఆడవచ్చు. ఇవేకాకుండా ఇనార్బిట్‌ మాల్‌తో పాటు గచి్చ»ౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ మాల్స్‌లో థ్రిల్‌ కలిగించే వర్చువల్‌ వేదికలు నగరవాసులను అలరిస్తున్నాయి. వీఆర్‌ కార్‌ రేసింగ్, షూటింగ్, ఎస్కేప్‌ రూమ్, కిడ్స్‌ జోన్‌ వంటివి వీక్షకులను అలరిస్తున్నాయి.  

అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌.. 
కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ వేదికగా ఏకంగా 107 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వర్చువల్‌ వైల్డ్‌ లైఫ్‌ సఫారీ పార్క్‌ ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద వర్చువల్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌గా అవతరించింది. ఇందులో ఎత్తయిన జలపాతాలు, దట్టమైన అడవులు, గిరిజన జాతి తెగల జీవితాలు, వన్యప్రాణులు, క్రూరమృగాలను దగ్గరగా చూపించే వర్చువల్‌ బస్‌ రైడ్‌ వంటి ఆశ్చర్యపరిచే వింతలు చూపిస్తున్నారు. ఇందుకోసం వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు, 3డీ సాంకేతికత, 360 ఇండోర్‌ థియేటర్, వర్చువల్‌ హెడ్‌సెట్‌ బస్‌ ప్రయాణాలను అందుబాటులో ఉంచారు. వైల్డ్‌ సఫారీ ఎలా ఉంటుందో వర్చువల్‌ వేదికగా కళ్ల ముందే చూపిస్తుండటం విశేషం.

దశాబ్ద కాలం క్రితమే.. 
దశాబ్ద కాలం క్రితమే ట్యాంక్‌ బండ్‌ వేదికగా ఉన్న ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌లో 3డీ షో థియేటర్‌ ఉండేది. అప్పట్లో ఇలాంటి వేదికలు ఒకటీ, రెండు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం మరింత అధునాతన సాంకేతికతతో 3డీ నుంచి రూపాంతరం చెందిన వర్చువల్‌ అద్భుతాలు నగరం నలుమూలలా ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో పాటు ఈ వేదికలో మరో వర్చువల్‌ 3డీ గది.. ప్రేక్షకులను ఊహాజనిత డైనోసార్‌ యుగంలోకి తీసుకెళుతుంది. ఇందులో విభిన్న రకాల రాక్షస బల్లులతో పాటు విభిన్న రకాల జంతువులను దగ్గరగా చూడవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement