కోమట్లగూడెం అటవీ ప్రాంతంలో ఉచ్చులో పడి మృతిచెందిన దుక్కిటెద్దు (ఫైల్)
వేసవి కాలం వచ్చిందంటే వన్యప్రాణులకు దినదిన గండమే. అడవిలో ఆకురాలడంతో వాటికి ఆహారం దొరకదు. గుంతల్లో నీరు ఎండిపోతుంది. తాగేందుకు నీరు లభ్యం కాదు. అడవి కార్చిచ్చు ఓవైపు వెంట పడుతుంటే, తప్పించుకుని వచ్చే క్రమంలో వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో జిల్లాలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
కొత్తగూడ(ములుగు): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లోనే వన్యప్రాణుల ఆనవాళ్లు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ నుంచే వర్షాలు ముఖం చాటేయడంతో అటవీ ప్రాంతంలో జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడో ఓ చోట నీళ్లున్న దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్లి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మార్గ మధ్యలో ఎక్కడ ఉచ్చులు, ఎక్కడ విద్యుత్ తీగలు, ఎక్కడ వేటగాళ్లు మాటు వేసి ఉంటారో తెలియక దినదిన గండంగా కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. గూడూరు, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని భీమునిపాదం గుట్టలు, గంగారం, తాడ్వా యి, గంగారం, బయ్యారం మండలాల సరి హద్దు అటవీప్రాంతంలోని పాండవుల గుట్ట లు, కొత్తగూడ, తాడ్వాయి మండలాల సరి హద్దు అటవీ ప్రాంతాలు వేటగాళ్లకు అడ్డాగా మారాయి. వేట మాంసానికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి వేటాడుతున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్‌ను వాహకంగా వేటగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. వన్యప్రాణులు వెళ్లే దారులను గుర్తించి, వాటికి కాళ్లకు తగిలే విధంగా చెట్లకు బైండింగ్ వైర్ చుట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వేసిన రోజు జంతువులు పడకపోతే కనీసం విద్యుత్ సరఫరాను కూడా తొలగించడం లేదు. ఉచ్చులను కూడా అలాగే వదిలేస్తున్నారు. దీంతో అడవులకు వెళ్లే సాదు జంతువులు, మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల గంగారం మండలంలోని కోమట్లగూడెం అటవీ ప్రాంతంలో రెండు దుక్కిటెద్దులు ఉచ్చులకు బలైన విషయం తెలిసిందే. గత ఏడాది ఓటాయి అటవీ ప్రాంతంలో వేసిన ఉచ్చుల్లో పడి మృతిచెందిన కణుజును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటాయి గ్రామంలో కణుజు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చినా ఫారెస్ట్ అధికారులు దాడి చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచ్చులు వేస్తున్న వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం.
నీళ్లకు వచ్చే దారే వేటకు మార్గం
వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తోంది. అందుకోసం అడవిలో బోర్లు వేసి సోలార్ పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటి వద్ద సీసీ కెమెరాలు బిగించారు. కానీ, అవే వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది. జింకలు, అడవి పందులు, దుప్పిలు, కణుజులు, కొండగొర్రెల తదితర వన్యప్రాణులు నీటికోసం అడవిలో ఒకే మార్గం గుండా వచ్చి వెళ్తుండడాన్ని గమనించిన వేటగాళ్లు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా కొంత దూరంలో ఉచ్చులు వేస్తున్నట్లు సమాచారం.
స్థానికంగా నివాసం ఉండని అధికారులు
మహబూబాబాద్‌లో గంగారం, కొత్తగూడ రేంజ్‌లు విభజించి చిన్న చిన్న బీట్లు చేశారు. అయినా వన్యప్రాణుల సంరక్షణ మాత్రం సాధ్యం కావడం లేదు. గంగారం, కొత్తగూడ రేంజ్‌కు ఎఫ్‌ఆర్వోలు లేక ఇన్‌చార్జిలతో నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అటవీశాఖ అధికారులకు విలాసవంతమైన క్వార్టర్లు నిర్మించినా ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి సాధారణ ఉద్యోగుల్లా వచ్చి వెళ్తున్నారు. దీంతో పోడు జరిగినా, వేట జరిగినా, స్మగ్లింగ్ జరిగినా సిబ్బంది వచ్చే సరికే జరగాల్సింది జరిగిపోతోంది. ఎప్పుడైనా ఉన్నతాధికారులు వస్తున్నారనో, లేక సమాచారం ఉన్నతాధికారులకు తెలిస్తేనో హడావుడి చేసి అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు, వివిధ కార్యకలాపాలను బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ ద్వారా అధికా రులు ఫోన్లలో గుట్టుగా నడుపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా యూనియన్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా వన్యపారణులను కాపాడాల్సిన అవసరం ఉంది.
నిఘా పెంచుతాం..
వన్యప్రాణులను సంరక్షించడానికి అటవీ ప్రాంతంలో నిఘా పెంచుతాం. ఎక్కడ దొరికినా వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. క్వార్టర్లు కేటాయించిన ఉద్యోగులు స్థానికంగా ఉండేలా చూస్తాం. లేదంటే చర్యలు తప్పవు.
– కిష్టాగౌడ్, డీఎఫ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment