పాల్వంచరూరల్: అడవులు పచ్చగా ఉంటేనే వర్షాలు కురుస్తాయి. అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయి. మరి అడవులు పెరగాలంటే వన్యప్రాణులను సంరక్షించాలి. అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులను బతుకనిద్దామని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు 1977 జనవరి 24న చట్టం రూపొందించారు. ఈనెల 8 వరకు వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
సమాజంలో మనుషులతో పాటు అనేక రకాల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మనుషులు తమ ఆహారం కోసం పలురకాల జీవులను వధిస్తున్నారు. ముఖ్యంగా వన్యప్రాణులను వేటాడుతున్నారు. దీన్ని నివారించేందుకు 50 ఏళ్ల క్రితం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేకించి వైల్డ్‌లైఫ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే స్మగ్లర్లు అక్రమంగా కలప తరలించేందుకు అడవులను హరిస్తున్నారు. ఇలా అడవులు అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. అడవుల్లో పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేళు, పక్షులు, మొసళ్ల వంటి ప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వైల్డ్‌లైఫ్ చట్టం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా వన్యప్రాణులను సంహరిస్తే కఠిన శిక్ష పడుతుంది. కానీ చట్టాలపై అవగాహన లేనివారు, ఉన్నా పట్టించుకోని వారు వన్యప్రాణులను యథేచ్ఛగా వధిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో వారికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది.
శిక్షల తీరు ఇలా..
► అటవీ జంతువైన పులిని చంపినా, చర్మాన్ని, గోళ్లను తీసినా, బంధించినా, విష ప్రయోగం చేసినా, ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు తరలించినా 1972 వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్షకు పైగా జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష పడితే ఏడాది వరకు బెయిల్ కూడా లభించదు.
► చిరుతపులిని చంపినా, పట్టుకున్నా, మరో చోటుకు తరలించినా వన్య మృగాల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించొచ్చు.
► ఎలుగుబంటిని పట్టుకున్నా, సర్కస్‌లో ఆడించినా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే మాత్రం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
► మొసళ్లను పట్టుకున్నా, చంపినా మూడు నుంచి ఏడేళ్ల జైలు, కోతులను పట్టుకున్నా, చంపినా, ఇంట్లో పెంచుకున్నా 5 నుంచి 7 నెలల పాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే కుందేళ్లకై తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు.
► నెమలిని పట్టుకున్నా, వధించినా, గుడ్లను పగలగొట్టినా, హాని చేసినా వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
గతంలో ఏడుగురిపై కేసులు
గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలో కొందరు దుప్పిని కుక్కలతో వేటాడి సోములగూడెం సమీప అటవీ ప్రాంతంలో వధించి మాంసం విక్రయించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేశారు. దంతలబోరు అటవీ ప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా పాల్వంచ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఇంకా ఏడూళ్లబయ్యారం, ములకలపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు అటవీ ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోగా, ఈ అన్ని ఘటనలో మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం
వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. వన్యప్రాణులను ప్రతిఒక్కరూ కాపాడాలని జాగృతం చేస్తున్నాం. ఎవరైనా వన్య ప్రాణులను సంహరించే ప్రయత్నం చేసినా, వాటికి హాని కలిగించినా కఠిన చర్యలు తప్పవు.
– కట్టా దామోదర్‌రెడ్డి, ఎఫ్‌డీఓ
వారోత్సవాలు నిర్వహిస్తున్నాం
వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ఈనెల 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అటవీ రేంజ్‌ల పరిధిలో నిర్వహిస్తాం. ‘వనాలు పెంచండి, వన్యప్రాణులను కాపాడండి’ నినాదంతో ఏజెన్సీ పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తాం. దీంతో పాటు విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తాం.
– కృష్ణగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment