
ఖమ్మం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు కీలకపాత్ర పోషించింది. పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాయల వెంకటనారాయణ వంటి నేతలెందరో ఇక్కడే అనేక సమావేశాలు నిర్వహించి పోరాటాలకు రూపకల్పన చేశారు. దున్నే వాడిదే భూమి అనే నినాదంతో లక్షలాది ఎకరాలను పేదలకు పంచారు.
ఈ గ్రామానికి చెందిన రాయల వెంకటనారాయణ దళ కమాండర్‌గా పనిచేయగా... పులి రామయ్య, రాయల జగ్గయ్య, రాంబాయమ్మ, పద్మనాభుల పుల్లయ్య, దొడ్డా జానకిరామయ్య, దొండేటి నారయ్య, కమ్మకోమటి రంగయ్య, కమ్మకోమటి వీరయ్య, దొడ్డా సీతారాములు, పప్పుల భద్రయ్య తదితరులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులయ్యారు. అమరుల త్యాగాలకు గుర్తుగా స్థూపం నిర్మించగా, రాయల వెంకటనారాయణ, పద్మనాభుల పుల్లయ్య పేరిట స్మారక భవనాలు కూడా ఏర్పాటయ్యాయి.
ఒకే చితిపై ఏడుగురి దహనం
బోనకల్: కట్టుబానిసల్లా పని చేయించుకుని పట్టెడన్నం కూడా పెట్టని నైజాం నవా బులు, భూస్వాములను తుపాకీ పట్టి తరిమికొట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు బోనకల్ పురిటిగడ్డగా నిలుస్తుంది. బోనకల్ మండలం చిరునోములకు చెందిన రావెళ్ల జానకీరామయ్య ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆయన నాయకత్వంలో గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల, ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, సీతానగరం, రాయన్నపేటకు చెందిన పలువురు పోరాటంలో పాల్గొన్నారు. లక్ష్మీపురానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లును దళ కమాండర్‌గా, గోవిందాపురానికి చెందిన తమ్మారపు గోవింద్, చుండూరు నర్సింహారావు, జొన్నలగడ్డ రామయ్యను ప్రజానాయకులుగా నియమించుకుని యువకులకు శిక్షణ ఇస్తూ పోరాడారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అంతమొందించేందుకు నైజాం నవాబు, రజాకార్లు ఉద్యమకారులపై దాడులు చేసినా పోరాటం ఆపలేదు. దీంతో యోధుల సమాచారం చెప్పాలని ఆళ్లపాడుకు చెందిన యలమందల చంద్రయ్య, మందా అచ్చయ్య, వల్లాపురానికి చెందిన గొర్రెముచ్చుల హజరయ్య, మద్ది రాములు, మడుపల్లి వీరస్వామి, సామినేని గోపయ్య, రేపల్లెవాడకు చెందిన తమ్మినేని బుచ్చయ్యను రేపల్లెవాడ శివార్లలో కాల్చిచంపారు. ఆ తర్వాత గోవిందాపురం ఊరిబయట మంగలి గుట్టపై ఒకే చితిపై దహనం చేశారు. అయినా యోధులు పోరాడి స్వాతంత్య్రం సాధించుకోగా.. వారి త్యాగాలను స్థానికులు గుర్తుచేసుకుంటారు.

గోవిందాపురంలో ఏడుగురిని దహనం చేసిన చోట నిర్మించిన స్తూపం

పిండిప్రోలులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్మారక స్తూపం
Comments
Please login to add a commentAdd a comment