ఆళ్లగడ్డ: నల్లమల అడవుల్లో వన్యమృగ వేటగాళ్ల ముఠా పంజా విసురుతోంది. చాకచక్యంగా పెద్ద పులులను హతమారుస్తోంది. అటవీ శాఖ యంత్రాంగం మాత్రం తనకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తోంది. ఛత్తీస్‌గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వారు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిరివెళ్ల మండలం మహదేవపురం నుంచి వైఎస్సార్ జిల్లా సరిహద్దు చాగలమర్రి వరకు నల్లమల అడవులు ఉన్నాయి. చిరుతలు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కొండ మేకలతో పాటు నెమళ్లు, కొండకోళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి.
అభయారణ్యంలో పులుల వృద్ధి పెరిగి, ఈ ప్రాంతంలో వీటి సంచారం మొదలైంది. వీటిపై వేటగాళ్ల కన్ను పడింది. రెండేళ్లలో నాలుగు పులులు మృతి చెందగా.. ఇంకా వెలుగులోకి రానికి కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు పెద్ద పులిని ఉచ్చులో బిగించి చంపేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వేటగాళ్లు నేరం నుంచి తప్పించుకునేందుకు పెద్దపులి కళేబరాన్ని తెలుగుగంగ కాల్వలో పడేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 15 మంది అనుమానితులను శిరివెళ్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగానే బుధవారం గండ్లేరు రిజర్వాయర్‌లో పెద్దపులి కళేబరం లభ్యమైంది.
కొనసాగుతున్న వేట
రుద్రవరం, చలిమ అటవీ రేంజ్‌ల పరిధిలో వన్యప్రాణుల వేట ఆగడంలేదు. నిత్యం ఏదో ఒకచోట వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. హద్దులు నిర్ణయించుకుని వేట సాగిస్తున్నట్లు సమాచారం. తెలుగుగంగ కాల్వ వెంట ఉన్న అడవిలో వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను బట్టి కిలో మీటర ఒక హద్దుగా వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వారి హద్దులో ఇంకొక వేటగాడు ఉచ్చులు వేయడం గాని, ఎరలు పెట్టడం గాని చేయకూడదనే నిబంధన సైతం విధించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా ఉండడంతో ఫలితం లేకుండా పోతోంది.
స్మగ్లర్లతో ఒప్పందాలు
వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు అడవిలో సన్నని ఇనుప బైండింగ్ వైర్లను అమర్చి, హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అనుసంధానం చేస్తారు. అలాగే క్లచ్ వైర్లతో ఉచ్చులు కూడా వేస్తారు. ఉచ్చులో చిక్కుకున్న జంతువును మారణాయుధాలతో హతమారుస్తారు. మరి కొందరు విషపు, మత్తు గుళికలు ఆహారంలో కలిపి ఎరగా వేస్తున్నారు. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వేటగాళ్లు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరు గన్‌తో గురి చూసి విషపు ఇంజక్షన్లు వన్యప్రాణులకు ఎక్కించి, చంపడంలో నేర్పరులని సమాచారం.
కొరవడిన నిఘా
వన్యప్రాణుల వేటను అటవీశాఖ అధికారులు అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతులు పంట పొలాల రక్షణ కోసం అమర్చే విద్యుత్ తీగలకు తగిలి వన్యప్రాణులు బలవుతున్నాయని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆత్మకూరు అటవీ సమీపంలో ఓ పులి అనుమానాస్పదంగా మృతి చెందింది. తాజాగా రుద్రవరం మండలం గుండ్లేరు రిజర్వాయర్‌లో మరొక పులి కళేబరం లభ్యమైంది. ఇవే కాదు అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, తోడేళ్లు పదుల సంఖ్యలో అనుమానాస్పదంగా మృత్యువాత పడుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించిన ఘటనలు స్వల్పంగా ఉన్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం, పది రోజులు హంగామా చేయడం, తదనంతరం దానిని పట్టించుకోక పోవడం పరిపాటిగా మారింది.
ఇవీ ఘటనలు
► 2019 బాచేపల్లె తండా సమీపంలో తిప్పపై పెద్దపులి మృతి చెందింది.
► అదే సంవత్సరం మరో నెలలో ఎర్రచెరువులో పెద్దపులి మృత్యువాత పడింది.
► రెండు సంవత్సరాల క్రితం గండ్లేరు రిజర్వాయర్‌లో చిరుత కళేబరం కనిపించింది.
► నెల క్రితం ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా కళాశాల సమీపంలో వేటకు జింక బలైంది.
► పక్షం క్రితం రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు మృతి చెందాయి.
► తాజాగా బుధవారం గండ్లేరు రిజర్వాయరులో పెద్దపులి కళేబరం లభ్యమైంది.
వన్య ప్రాణుల వేట చట్ట విరుద్ధం
పులి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టం. పోస్టుమార్టం ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేట చట్ట విరుద్ధం. ఎవరైనా అటవీ సిబ్బంది ఇందుకు సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై వేటు వేస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం.
– వినీత్‌కుమార్, డీఎఫ్‌ఓ
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ వన్యప్రాణులను ప్రేమించాలి. వాటిని సంరక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలి. వన్యప్రాణులు నశిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించి పోయే ప్రమాదం ఉంది.
– డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్
కఠినంగా శిక్షించాలి
అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్ని రకాల వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణ పరిరక్షణ పూర్తిగా దెబ్బతింటుంది. వన్యప్రాణులను వధించే వారిని కఠినంగా శిక్షించాలి.
– నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment