పులి హత్య కేసులో కీలక పాత్ర ధారులైన టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ గ్యాంగ్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పులి హత్య కేసు మిస్టరీ వీడింది. ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలతో డొంక కదిలింది. రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. యానిమల్ ట్రాకర్స్ సహకారంతో పథకం ప్రకారమే పులిని చంపినట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను అరెస్టు చేశారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శివ్వారం అడవుల్లో విద్యుత్ తీగలకు బలైన పులి కేసు మిస్టరీ వీడింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి డిసెంబర్‌లో ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన నాలుగేళ్ల మగ పులి జనవరి 8న శివ్వారంలో విద్యుత్ తీగలకు తాకి చనిపోవడం వెనుక పెద్ద కుట్ర నడిచినట్లు తేలింది. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసే శివ్వారం ప్రాంతపు యానిమల్ ట్రాకర్స్ పులి జాడను వేటగాళ్లకు తెలియజేయగా, పథకం ప్రకారమే విద్యుత్ తీగను అమర్చి అరుదైన పెద్దపులిని హతమార్చినట్లు రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విచారణలో వెల్లడైంది. పులి చనిపోయిన తరువాత దాని చర్మాన్ని, గోళ్లను ఒలిచి, తలను గుర్తుపట్టకుండా గొడ్డళ్లతో నరికిన వేటగాళ్లు చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. పులులను అంతమొందించేలా యానిమల్ ట్రాకర్స్ ద్వారా వేటగాళ్లను ఉసిగొల్పుతూ ‘టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్’అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్ పింప్లేతో పాటు ఏడుగురి దందాను పోలీసులు ఛేదించారు. మందమర్రిలో డిసెంబర్ 24న ‘పులిచర్మం’దొరికిన వ్యవహారంతో మొదలైన ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె. ఝా కోరిక మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు.
ఈ మేరకు అటవీశాఖ సాధారణ పులిచర్మం దొరికిన కేసుగా వదిలేసిన కేసును రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అప్పగించడంతో మిస్టరీ వీడింది. రామగుండం సీసీఎస్ (అడ్మిన్) అదనపు డిప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సీఐల నేతృత్వంలో విచారణకు ఆదేశించగా, వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ సంస్థ నిర్వాహకుడు నందకిషోర్ పింప్లేతో సహా ఏడుగురు సభ్యుల చంద్రాపూర్ గ్యాంగ్‌ను, ఇద్దరు యానిమల్ ట్రాకర్స్, ముగ్గురు వేటగాళ్లు, నలుగురు బ్రోకర్స్ సహా 16 మందిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తొలినాళ్లలో మరో నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో 20 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వి.సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలను అభినందిస్తూ పత్రికలో వచ్చిన కథనాల వల్లనే కేసును అటవీశాఖ నుంచి పోలీసులకు బదిలీ చేసినట్లు చెప్పారు
వేటగాళ్లు ఉపయోగించిన మారణాయుధాలు, నగదు
పులి హత్యలను ప్రోత్సహిస్తూ..
చంద్రాపూర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నందకిషోర్ పింప్లే 2002 నుంచి 2007 వరకు చంద్రాపూర్–గడ్చిరోలి హైవేలోని వాలని గ్రామంలో దాబా నడిపేవాడు. 2008 నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసి, సరైన సంపాదన లేకపోవడంతో వన్యప్రాణి వేటగాళ్లను పట్టిస్తానని అటవీశాఖ ఇన్‌ఫార్మర్‌గా మారాడు. వేటగాళ్లు చంపిన పులి, చిరుత చర్మాలు, వాటి గోర్లు మొదలైన పక్కా సమాచారాన్ని అందించి అటవీ అధికారుల నుంచి డబ్బులు తీసుకొని నమ్మకం సంపాదించాడు. తరువాత వేటగాళ్లను ఇన్‌ఫార్మర్ పేరుతో భయపెట్టి డబ్బులు సంపాదించేవాడు. దీన్నే వ్యాపారంగా మార్చుకోవాలని భావించి 2016లో టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ప్రారంభించాడు. గుర్నేలే సురేష్, భుక్యా భీమ, పియూస్ బార్డే, అశ్విన్, రాకేష్ చక్రవర్తి, తోడాసే థామస్‌లతో కలసి సంస్థను అడ్డుపెట్టుకొని వన్యప్రాణుల వేటగాళ్లను బెదిరిస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.
వన్యప్రాణుల కన్నా పులులను చంపితే చర్మానికి రూ. 30లక్షలు వస్తాయని వేటగాళ్లకు ఆశచూపి, వారు తీసుకొచ్చిన పులి చర్మాలపైనే డబ్బులు పెట్టి పూజలు చేస్తే డబుల్ అవుతాయని మభ్యపెట్టి , చర్మాలను అటవీ అధికారులకు పట్టించే మోసానికి తెరలేపాడు. ఇలా ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60కి పైగా చర్మాలను పట్టించాడు. ఎన్‌జీవో సంస్థ కారణంగానే దేశంలో పులులు హతమైనట్లు రామగుండం కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణుల వేటగాళ్లను 100 మందిని గుర్తించినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో డీసీపీ వేణుగోపాల రావు, అడిషనల్ డీసీపీలు అశోక్‌కుమార్, రవి కుమార్, సీఐలు సాగర్, ఎడ్ల మహేశ్, శ్రీనివాస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పులుల వేట వెనుక చంద్రాపూర్ ముఠా
జనవరి 24న మందమర్రిలో పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వా«ధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను అటవీశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానం రావడంతో రాష్ట్ర స్థాయిలో అటవీశాఖ పీసీసీఎఫ్ ఝా డీజీపీ మహేందర్ రెడ్డికి, ఇంటెలిజెన్స్ సహకారాన్ని కోరారు. ఈ మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ ఆధ్వర్యంలో రెండు బృందాలు అటవీశాఖతో కలసి దర్యాప్తు ప్రారంభించాయి. పట్టుబడిన పులి చర్మం ఎక్కడిదనే కోణంలో జరిగిన దర్యాప్తులో శివ్వారంలో యానిమల్ ట్రాకర్స్ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో వన్యప్రాణుల వేటగాళ్లు పులిని విద్యుత్ తీగలతో హతమార్చినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా తీగను లాగితే డొంక కదిలినట్లు చంద్రాపూర్ గ్యాంగ్ పాత్ర వెల్లడైంది.
(పోలంపల్లి ఆంజనేయులు)
Comments
Please login to add a commentAdd a comment