ఎడారిలో చలికి వణుకుతున్న ఒంటెకు తలదాచుకోవడానికి అవకాశమిచ్చిన అరబ్బు చివరకు తాను నిర్వాసితుడు కావడం మనం నీతి కథల్లో చదివే ఉంటాం. అదే గతి నేడు వన్యప్రాణులకు పడుతోంది. ఒకప్పుడు భూ విస్తీర్ణంలో డెబ్బయ్ శాతంతో కళకళలాడిన అడవులు నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. మనిషి జీవన అవసరాల కోసం అడవులను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలను కాపాడుదామని పర్యావరణ ప్రేమికులు ఎంత ఆందోళన వెలిబుచ్చినా ఇది ఆగడం లేదు.
– ఆత్మకూరురూరల్
విభిన్న రకాల జీవజాతులు
కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తోపాటు రోళ్లపాడు, గుండ్లబ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజాతులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమికీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు.
వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం
శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట నల్లమల అడవిలో ఉంది. ఇక్కడ 30 వేల మంది నివాసం ఉంటున్నారు. అటవీప్రాంతం కావడంతో గ్రామంలోకి తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వస్తుంటాయి. జనవరి 11వ తేదీ రాత్రి శ్రీశైలమాత పాఠశాల, నీటిపారుదలశాఖ సెంట్రల్ వర్క్‌షాప్ సమీపంలో ఎలుగుబంట్లు సంచరించడాన్ని స్థానికులు గుర్తించి, అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాణాసంచా పేలుస్తూ, చప్పుళ్లు చేస్తూ వాటిని అడవిలోకి తరిమారు. అలాగే అహోబిలం, మహానంది, సర్వనరసింహస్వామి, రుద్రకోడు పుణ్యక్షేత్రాలు నల్లమల అడవిలో ఉన్నాయి. ఇక్కడ భక్తులకు తరచూ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. జనవరి 13వ తేదీ కోవెలకుంట్లకు చెందిన ప్రసాద్ అనే భక్తుడు ఎగువ అహోబిలం నుంచి మెట్ల మార్గంలో పావన క్షేత్రం వెళ్తుండగా పొదచాటున పెద్ద పులి కనిపించడంతో భయాందోళనతో పరుగుతీశాడు. అడవి వన్యప్రాణుల నివాస స్థలం. ఎప్పుడో కాని అవి మనుషుల కంట పడవు. తమకుతాముగా అవి మనుషులకు హాని చేయవు. ఎప్పుడో ఒకసారి కనపడితే ప్రజలు ఆందోళన చేసి, అటవీ శాఖ అధికారులుపై ఒత్తిడి పెంచుతుంటారు.
అటవీ నిబంధనలు పాటించాలి
పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడి చేయవు. అలాగే ఎలుగుబంటి కూడా. పులిని ఒకసారి మనం చూశామంటే అది వేయిసార్లు మనల్ని చూసే ఉంటుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకు పోతాయి. మనుషులపై దాడి చేయవు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుÜు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లి నపుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి.
అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయరాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినపుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్య ప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండా ఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్యప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నారు.
అడవిపై వన్యప్రాణులదే హక్కు
వన్యప్రాణుల ఆవాసాల్లోకి మనం చొరబడుతున్నాం. వన్యప్రాణులు జనవాసాల్లో తిరగడం లేదు. అడవిపై పూర్తి హక్కు వన్య ప్రాణులదే. వాటి మనుగడకు ఎవరూ అడ్డంకి కారాదు. సున్నిపెంట వంటి చోట్ల మానవ ఆవాసాల్లో వన్య ప్రాణుల సంచారం కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమీప అటవీ అధికారులకు సమాచారమివ్వాలి.
– అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌ఓ, ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment