వైరస్ బారిన అడవి పందులు
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో పెద్ద సంఖ్యలో అడవి పందుల మృతి
2023 డిసెంబర్‌లో గుర్తించిన అటవీ శాఖ
వెంటనే వైరస్ వ్యాపించకుండా చర్యలు
శ్రీశైలం పరిసరాల్లోని పందుల పెంపకం కేంద్రాల మూసివేత
నల్లమల అటవీ అంతర్భాగంలో ఉన్న ప్రధాన శైవాలయ పట్టణాలైన శ్రీశైలం, మహానందిలో తరచూ చిరుత పులులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఒక అర్చకుడి ఇంట్లో రాత్రి పూట చిరుత తిరుగాడటం ఆందోళన రేకెత్తించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చిరుతలు అడవులలో అత్యంత ఇష్టపడే ఆహార జంతువు అడవి పంది, దాని పిల్లలు.
ఒక ఈతకు పదికి పైగా పిల్లలను ఈనే అడవి పందుల సంఖ్య నియంత్రణలో ఉంచడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే చిరుత ఆహారపు అలవాటు. శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో తరువాతి ఆహార ప్రాధాన్యత అయిన ఊరకుక్కల కోసం చిరుతలు శ్రీశైలం, సున్నిపెంటల వైపు రాసాగాయి.
మరోపక్క శ్రీశైలం ఆలయ పట్టణంలో కుక్కల సంఖ్య పెరగడంతో ఆలయం అధికారులు వాటిని పట్టి, దూరంగా వదలి పెట్టారు. కుక్కలూ లభించకపోవడంతో చిరుత పులులు పెంపుడు కుక్కల కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్
అడవి పందులకేమైంది?
నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో అడవి పందులు హఠాత్తుగా చనిపోవడం మొదలైంది. అడవిలో పందుల మృత కళేబరాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడంతో ఎన్‌ఎస్‌టీఆర్ వన్యప్రాణి వైద్య నిపుణులు వాటికి పోస్ట్‌మార్టం చేశారు. కొన్ని శాంపిళ్లు ల్యాబ్‌లో పరిశీలించగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ఏఎస్‌ఎఫ్‌వీ) కారణమని తేలింది.
శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలో ఉన్న పెంపుడు పందుల ఫారాల నుంచి ఈ వైరస్ అడవి పందులకు సోకినట్లు తేలింది. బెంగళూరు వంటి నగరాల నుంచి పెంపకానికి తెచి్చన సీమ పందులలో ఉన్న ఏఎస్‌ఎఫ్ వైరస్ తొలుత వారి ఫారాలు, సమీపంలో ఉన్న ఊర పందులకు సోకింది. అవి అడవిలో ఆహారానికి వెళ్లినప్పుడు అడవి పందులకు సోకినట్లు చెబుతున్నారు.
ఏమిటీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్
ఏఎఫ్‌ఎస్‌వీ అన్నది ఆస్ఫరి్వరిడే కుటుంబానికి చెందిన ఒక పెద్ద డబుల్ స్టాండర్డ్ డీఎన్‌ఏ వైరస్. ఉప సహారా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ వైరస్ పేలు, పందులు, బుష్‌పిగ్‌ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో (ఇంటర్నల్ బ్లీడింగ్) కూడిన జ్వరంతో మరణిస్తాయి. ఇది మానవులకు సోకదు.
వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట
2003 డిసెంబర్ చివర్లో ఇది బయటపడింది. వెంటనే పశు సంవర్ధకశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వం శ్రీశైలానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (యానిమల్ హజ్బెండరీ) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, చిన్నారుట్ల, నెక్కంటి, పాలుట్ల, పెచ్చెర్వు, తుమ్మలబయలు వంటి గిరిజన ప్రాంతాలను వైరస్ ఇన్‌ఫెక్టెడ్ ఏరియాగా ప్రకటించారు.
ఆ ప్రాంతాల్లో ఉన్న పందుల ఫారాలను తొలగించారు. ఊర పందులను దూరప్రాంతాలకు తరలించారు. చనిపోయిన అడవి పందుల కళేబరాలను తగలబెట్టడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేయగలిగారు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. సంవత్సర కాలంగా చిరుత పులులు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుండటంతో ఇప్పుడు ఈ వైరస్ విషయం బయటకు వచి్చంది.
ఆహారం కోసమే చిరుతలు ఊర్లోకి..
చిరుతలు అడవి పంది పిల్లలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అవి ఎక్కువగా చనిపోవడంతో రెండో ప్రాధాన్యత అయిన కుక్కల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ క్రమంలోని శ్రీశైలం, సున్నిపెంటలోకి తరచూ వస్తున్నాయి. – వి.సాయిబాబా, డిప్యూటి డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు
వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగాం
అడవి పందులు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ కారణమని ఉన్నతాధికారులతో కలిసి చేసిన పరిశోధనలలో తేలింది. జనావాసాల్లో ఉన్న పందులలో కూడా మరణాలు కనిపించడంతో ఇది పూర్తిగా వాటివల్లే విస్తరించిందని స్పష్టమైంది.
అన్నిరకాల చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలిగాం. ఈ వైరస్ గాలిలో మూడు సంవత్సరాల వరకు జీవించ గలుగుతుంది. ఆ తర్వాత వాతావరణంలో వేడికి చనిపోతుంది. – డాక్టర్ జుబేర్, వన్యప్రాణి వైద్య నిపుణులు, ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment