దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన వన్యప్రాణుల్ని మళ్ళీ పెంచిపోషించే ప్రయత్నం. పదినెలల క్రితం ఆర్భాటంగా మొదలైన ప్రాజెక్ట్. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ‘ప్రాజెక్ట్ చీతా’కు జరిగినంత హంగామా అంతా ఇంతా కాదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలో విడిచి పెట్టాక 4 నెలల్లో 8 చీతాలు మరణించడం ఈ యత్నంలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ మాత్రం ప్రకృతి సహజ కారణాలతోనే ఈ చీతాలన్నీ చనిపోయాయంటోంది. ఆ మాట శాస్త్రీయంగా లేదు. నిపుణులు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు సాక్ష్యం. చీతాల కదలికలు తెలుసుకొనేందుకు మెడకు బిగించిన రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ల వల్ల వాటికి గాయమై, అక్కడ క్రిములు చేరాయనీ, అదే తాజా మరణానికి దారి తీసిందన్న మాటలు ఆందోళన రేపుతున్నాయి. ప్రాజెక్ట్ చీతా భవితవ్యం, శాస్త్రీయత సందేహాస్పదమవుతున్నాయి.
నిజానికి 2009లో జైరామ్ రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ చీతాల పునరావాస ఆలోచన జరిగింది. గత ఏడాది అది ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌తో ప్రాజెక్ట్ చీతాకు ఏడాది పూర్తి కానుంది. నిరుడు సరిగ్గా ఆ సమయంలోనే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరాయి. ఆ పైన ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ప్రభుత్వం రప్పించింది. దాదాపు 35 చీతాలతో అవి స్వయం సమృద్ధమయ్యే దాకా రానున్న దశాబ్దకాలంలో ఏటా 5 నుంచి 10 చీతాల్ని తేవాలన్నది యోచన.
తొలి ఏళ్ళలో ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించకపోవచ్చని ఆది నుంచీ అనుకుంటున్నదే. అది కాక అసలీ ప్రాజెక్ట్ ఏర్పాటులోనే ప్రాథమిక లోపాలున్నాయని విమర్శకుల వాదన. వేగంగా పరుగులు తీసే చీతాలకు కూనో ప్రాంతం సరిపోదన్నది ఒకటైతే, వాటిని దీర్ఘకాలం క్వారంటైన్‌లో ఉంచడం వల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధపడే సామర్థ్యం దెబ్బతింది. మానసికంగా సర్దుకుపోవడమూ సమస్య అయింది. అలా అవి సులభంగా బలి అవుతున్నాయి. తెచ్చిన చీతాలకు తోడు కొత్తగా ఇక్కడ పుట్టిన నాలుగింటిలో 3 కూనలు చనిపోయాయి.
గాయం కథలో శాస్త్రీయత లేదని ప్రభుత్వం అంటున్నా, ఈ అంశాలపై విచారించి, మిగిలిన చీతాలన్నిటికీ పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేయాలని నిపుణుల సంఘం సిఫార్సు చేయడం గమ నార్హం. స్వేచ్ఛగా తిరిగేవాటిని పట్టి, కాలర్లు తీసేసి, ఈ పరీక్షలు చేయడం శ్రమతో కూడిన పని. సమ యమూ చాలానే పడుతుంది. అప్పుడు కానీ, ప్రాజెక్ట్ చీతా భవితవ్యం తేలదు. చీతాల కోసం అసలు మనం ఎంచుకున్న కూనో ఉద్యానమే చిన్నదని నమీబియా నిపుణులు కుండబద్దలు కొట్టారు.
ఆఫ్రికా లాంటి దేశాల్లో ఒక్కొక్క చీతా వేటాడి తినడానికీ, తిరగడానికీ సగటున 100 చదరపు కి.మీ.ల విశాల ప్రాంతం ఉంటుంది. కానీ, మన ‘కూనో జాతీయోద్యానం’లో సగటున మూడు చీతాలకు కలిపి 100 చదరపు కి.మీ.ల జాగాయే ఉంది. అలాగే, చీతా స్వేచ్ఛగా సంచరించడానికీ, ఆహార సేకరణ, పునరుత్పత్తికీ నిర్నిరోధమైన 1600 చదరపు కి.మీ.ల పైగా విస్తీర్ణం కావాలి. కూనో జాతీయోద్యానం మొత్తం వైశాల్యం చూసినా 750 చదరపు కి.మీ.లే! ఎలా చూసినా దేశంలో చీతాల పునఃప్రవేశానికి విస్తీర్ణం సరిపోని ఈ ఉద్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది బేతాళ ప్రశ్న.
నమీబియా, దక్షిణాఫ్రికాల్లో చీతాలు చుట్టూ కంచె ఉన్న రిజర్వుల్లో ఉంటే, మన దగ్గర వాటిని కంచెలేని సహజమైన, అరణ్య వాతావరణంలో పెరగనివ్వాలని యోచన. కూనో జాతీయోద్యానంలోకి వదిలిన చిరుతలు కొన్ని ఆ పరిధిని దాటి, జనావాసాల్లోకి జొరబడిన వార్తలొచ్చాయి. ఇది పోనుపోనూ మనిషికీ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు. ప్రాజెక్ట్ చీతాకు రూపకల్పన చేస్తున్నప్పుడు ఈ సంగతులేవీ లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే! అధికారులు మాత్రం కూనో రిజర్వ్‌లో కావాల్సినంత స్థలం, చీతాలకు తగినంత ఆహారం ఉన్నాయంటున్నారు.
మధ్యప్రదేశ్‌లోనే గాంధీసాగర్‌లో రెండో రిజర్వ్‌ను అభివృద్ధి చేసి, చీతా పునరావాస కేంద్రం స్థాపిస్థామని చెబుతున్నారు. అవన్నీ నిజమైతే మంచిదే. కానీ, పెద్ద పులులు, చిరుతలతో పోలిస్తే చీతాలు మహా సున్నితం. అడవిలో అవి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి మన దగ్గర వీటికి సింహాలు, చిరుత పులుల నుంచి పోటీ లేదు గనక కొంత నయం. కాలగతిలో ఇవి మన పరిస్థితులకు అలవాటు పడి భారత్‌ను తమ కొత్త ఆవాసంగా మారుస్తాయేమో చూడాలి.
అరణ్యాల్లో చీతా కూనలు బతికేరేటు 10 శాతమేనట! అంతే శాతం పెరిగిపెద్దవుతాయి. కాబట్టి మరణాలు సహజమేనని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పటిదాకా కూనోలో చనిపోయిన చీతాల్లో ఒక్కటి మినహా అన్నీ పూర్తి అరణ్యంలో కాక ఒక చ.కి.మీ. విస్తీర్ణంలో పెట్టిన ‘బోమస్’ అనే ప్రత్యేక ఎన్‌క్లో జర్లలో ఉన్నవే. కాబట్టి, లోతుగా పరిశీలన చేయాలి. తక్షణమే ప్రాజెక్ట్ చీతా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పంచుకోవడం మరీ అవసరం. తద్వారా సంబంధిత నిపుణులతో పరిష్కారాలు కనుగొనవచ్చు.
చీతాల నిర్వహణలో స్థానిక నైపుణ్యం లేదు గనక నిర్ణీత నిపుణుల అనుభవాన్ని ఆసరా చేసుకోవాలి. అలా కాక రోగాన్ని దాచిపెట్టి, వైద్యం చేస్తే ఫలితం లేకపోగా, వికటించే ప్రమాదం ఉంది. చీతాల పునరావాసం, పునరు త్పత్తి సవ్యంగా సాగాలంటే అధికారులు భేషజాలు వదలాలి. లేదంటే, మొదటికే మోసం వస్తుంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తొలి ఖండాంతర చీతా పునరావాస ప్రాజెక్ట్ అర్ధంతరంగా అంతిమ అధ్యాయానికి చేరుకుంటుంది. అలా జరగరాదంటే చిరుత ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు కావాలి!
జవాబివ్వాల్సిన చిరుత ప్రశ్నలు!
Published Thu, Jul 20 2023 12:19 AM | Last Updated on Fri, Jul 21 2023 6:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment