అడవిలో స్వేచ్ఛగా జీవించలేకపోతున్న చీతాలు
చివరిదైన చిరుత ‘పవన్’ మృతి
ఎన్‌క్లోజర్లలోనే కునో జాతీయ పార్కులో 12 చిరుతలు
అడవిలోకి వదిలిన చిరుతలు వివిధ వ్యాధులతో మృత్యువాత
సరైన సంరక్షణా చర్యలు లేకపోవడమే కారణం!
భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతులను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’ (ప్రాజెక్ట్ చీతా) ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో వదిలిన చిరుతల్లో జీవించి ఉన్న ఒకే ఒక చిరుత పవన్ కొద్దినెలల క్రితం మృతి చెందడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
వన్యప్రాణి ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య 2022 సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్.
ఆఫ్రికన్ చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాలపాటు అడవిలో జీవిస్తాయి. కానీ.. పవన్ ఆరేళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది. దీంతో చీతా ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతి
సరైన సంరక్షణా చర్యలు లేవా!
పవన్ మృతి చెందిన తర్వాత మిగిలి ఉన్న చీతాలన్నింటినీ ఎన్‌క్లోజర్లు, అడవిలా తీర్చిదిద్దిన ప్రాంతాల్లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చీతా ప్రాజెక్టు అతి పెద్దది. దేశంలోని చాలా వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించి సుమారు 58 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు.
అయితే, శాస్త్రీయ అధ్యయనం, సరైన సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు విఫల దశలో ఉన్నట్టు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా చీతాలను ఆఫ్రికా నుంచి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు వన్యప్రాణుల నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలా చేసి ఉంటే..
ఆఫ్రికన్ చీతాలకు అనువుగా ఉండే అడవులను మొదట సిద్ధం చేసి ఆ తర్వాత వాటిని తీసుకురావాల్సి ఉంది. కానీ.. ముందే వాటిని తీసుకువచ్చి ఆ తర్వాత కునో జాతీయ పార్కు అందుకు అనువైనదని భావించి అందులో వదిలారు.
కానీ.. కునో పార్కు వాటికి సరైన ఆవాసం కాదని తేలింది. అందుకే చీతాలు అందులో జీవించలేకపోయాయి. దీంతో కొన్ని గడ్డి మైదానాల్లోని ఫెన్సింగ్‌లు, క్యాప్టివ్ బ్రీడింగ్‌పై ఆధారపడ్డారు. కేవలం ప్రచారం కోసం పాకులాడడం తప్ప నిబద్ధత లోపించడంతో వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది.
అత్యంత వేగం చిరుతల ప్రత్యేకత
చిరుతలు అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. మూడు సెకన్లలోనే గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. 1967 వరకూ ఇవి మన దేశంలోనూ ఉన్నాయి. వాటి ఆవాసాలు కుచించుకుపోవడం, అడవులు తగ్గిపోవడం, వేటాడటం, సింహాలు, పులులు, చిరుతలు వాటి ఆహారం కోసం పోటీ పడుతుండడంతో క్రమేపీ అవి దేశంలో అంతరించిపోయాయి.
ఇన్ఫెక్షన్లు, గాయాలతో..
దేశంలో వీటిని మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం 2021లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన అడవుల్లో చీతాల పునరుత్పత్తిని ప్రారంభించి అడవిలో వాటి జనాభాను పెంచాలని భావించింది.
అయితే.. తీసుకువచ్చిన చీతాలను అడవిలో వదిలిన తర్వాత అవి ప్రాణాంతకమైన సెప్టిసిమిమా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాయి. మరికొన్ని ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యాయి. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలోనే ఉంచి పర్యవేక్షించారు. ప్రభుత్వం చీతా ప్రాజెక్టు చేపట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ వ్యవస్థలో భాగమైన గడ్డి భూముల అడవుల్లో మనుగడ సాగిస్తేనే ఉపయోగం ఉంటుంది.
అలాంటి వాతావరణం లేకపోవడంతో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మిగిలిన ఏకైక చీతా పవన్ మృతి చెందింది. అంతకుముందు 12 చీతాలు కూడా ఇలాగే మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 12 చీతాలు, మరో 12 పిల్ల చీతాలు ఎన్‌క్లోజర్లలో ఉన్నాయి. వాటిని అడవిలోకి వదిలితే అవి బతుకుతాయో లేదోననే అనుమానాలు, భయాలతో వాటిని అక్కడే ఉంచి సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షణలో ఉన్న చీతాల వల్ల ఎటు
వంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment