న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ,
అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్‌ఫెక్షన్‌లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
సౌతాఫ్రికా ఫారెస్ట్, ఫిషరీస్, ఎన్విరాన్‌మెంట్ విభాగం(DFFE).. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు.
► ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, సౌతాఫ్రికా నుంచి భారత్ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్‌ఫెక్షన్‌లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది.
► భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్ ఫేజ్‌కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
► సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు.
► వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు.
► అయితే ఈ ప్రకటనపై కునో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
► ప్రాజెక్ట్ చీతా చేపట్టిన టైంలోనే.. కునో పార్క్ చీతాల సంచారం, వేటకు సరిపోదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను.. కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు సూచించారు కూడా.
ఇదీ చదవండి: భారత్ శాంతి మంత్ర
Comments
Please login to add a commentAdd a comment