కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్‌లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది.
అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది.
రేడియో కాలర్స్ ఎలా కబళించాయి?
► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్‌ఫెక్షన్‌గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది.
► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్‌లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్‌తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు.
► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి.
అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం
దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.
నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8
దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12
మార్చిలో పుట్టిన చీతాలు : 4
మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8
మిగిలిన చీతాలు :16
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment