
ప్రతి ఒక్కరూ ‘ఐరన్‌మ్యాన్’ అయిపోయినట్టే!
కడుపు నిండా భోజనం చేస్తే.. ఓ పూట పనికి సరిపడా శక్తి వచ్చేస్తుంది. మహా అయితే మరికొన్ని గంటలు గడిపేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒకటి తినాల్సిందే. శక్తిని సమకూర్చుకోవాల్సిందే. అరటి పండు తింటే ఇంత, అన్నం తింటే ఇంత అంటూ మన శరీరానికి అందే కేలరీల శక్తిని గురించి లెక్కలేసుకుంటూ ఉంటాం కూడా. కానీ కేవలం ఒక్క గ్రాము.. అంటే అరచేతిలో పట్టేంత పదార్థంతో.. 27 ఏళ్లు బతికేసేంత శక్తి వస్తే!? భలే చిత్రమైన అంశం కదా.. ఇది జస్ట్ కేవలం థియరీ మాత్రమే, నిజంగా చేయగలిగితే మనుషులమంతా ‘ఐరన్ మ్యాన్’ అయిపోవచ్చన్న మాటే!
ఏం చేసినా, చేయకున్నా శక్తి ఖర్చు..
మనం ఏ పనిచేసినా, ఏమీ చేయకుండా నిద్రపోయినా కూడా మన శరీరంలో శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం, రక్త సరఫరా, శ్వాస తీసుకోవడం, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా దాదాపు అన్ని అవయవాలు దాదాపుగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇందుకోసం శక్తి ఖర్చవుతూనే ఉంటుంది.
ఇక మనం ఏ పనిచేసినా కండరాల్లో శక్తి వినియోగం అవుతుంది. మనం తినే ఆహారం నుంచే ఈ శక్తి శరీరానికి సమకూరుతూ ఉంటుంది.ఉదాహరణకు ఒక అరటి పండు నుంచి 90 కేలరీల శక్తి వస్తుంది. గుడ్డు నుంచి 155 కేలరీలు, వంద గ్రాముల అన్నం నుంచి 130 కేలరీలు, 100 గ్రాముల చికెన్ నుంచి 239 కేలరీల శక్తి అందుతుంది.
ఆ ఒక్క గ్రాము.. ఆహారం కాదు!
ఒక్క గ్రాముతో 27 ఏళ్లు బతికేయొచ్చని చెప్పినది ఆహారం గురించి కాదు.. అంత శక్తిని ఉత్పత్తి చేయగల యురేనియం నుంచి! అణువిద్యుత్ ఉత్పత్తి, అణ్వాయుధాల తయారీ కోసం యురేని యం వాడటం తెలిసిందే. శాస్త్రవేత్తలు తేల్చిన లెక్కల ప్రకారం... ఒక్క గ్రాము యురేనియం నుంచి సుమారు 1,96,05,985 కేలరీలు.. ఈజీగా చెప్పాలంటే సుమారు 2 కోట్ల కేలరీల శక్తి వస్తుంది. అంటే.. ఏకంగా 27 ఏళ్లపాటు శరీరానికి అవసరమైన శక్తి అంతా అందుతుందన్న మాట.
ఐరన్ మ్యాన్ ‘ఆర్క్ రియాక్టర్’ తరహాలో..
అయితే యురేనియం నుంచి శక్తి వస్తుందికదా అని నేరుగా తినేయడం అస్సలు సాధ్యం కాదు. అత్యంత ప్రమాదం కూడా. కేవలం 50 మిల్లీగ్రాముల యురేనియం శరీరంలోకి వెళ్లినా... ప్రాణాలు పోయినట్టే. మరి శరీరానికి శక్తి ఎలా? దీనిపైనే శాస్త్రవేత్తలు భిన్నమైన ప్రతిపాదన చేస్తు న్నారు.
చిన్న పరిమాణంలో ఉండే అణు రియాక్టర్‌ను రూపొందించి, శరీరంలో అమర్చడం ద్వారా శక్తి పొందవచ్చట. ఉదాహరణకు.. ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో హీరో క్యారెక్టర్. తన గుండె ఉండే భాగంలో చిన్న పాటి ‘ఆర్క్ రియాక్టర్’ను అమర్చుకుంటాడు. దాని నుంచి వచ్చే శక్తితోనే ఐరన్‌మ్యాన్ పోరాటాలు, విన్యాసాలు చేస్తుంటాడు.
అయినా.. ‘ఆహారం’ తప్పనిసరిగా తినాల్సిందే!
ఒకవేళ నిజంగానే ‘ఆర్క్ రియాక్టర్’ వంటిది వచ్చినా.. మనం ఆహారం తీసుకోవడం మాత్రం తప్పదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. మన శరీరం కేవలం కేల రీల శక్తితో మాత్రమే పనిచేయదు. ప్రతి అవయ వం పనితీరుకు, ప్రతి జీవక్రియకు కొన్ని ప్రత్యేక మైన రసాయన సమ్మేళనాలు.. విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి అవసరం. వాటికోసమైనా మనం సమతుల పోషకాహారం తీసుకోక తప్పదు మరి.
ఇక మిగిలింది.. యురేనియంతో ‘ఐరన్‌మ్యాన్’ ఎప్పుడు అవుదామా అని ఎదురుచూడటమే!
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment