uranium
-
పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత
సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
యురేనియంపై ‘పచ్చ’ విషం
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు... భ్రమింపజేయడం పచ్చపత్రికల లక్ష్యం. ప్రతి అంశాన్నీ సర్కారుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పెట్టించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా జగన్ సర్కారును అప్రదిష్టపాలు చేయాలన్నది వారి సంకల్పం. కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల విజ్ఞత ముందు వారికుట్రలు ఎన్నైనా కొట్టుకుపోవడం ఖాయం. పులివెందుల ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ప్రాజెక్టుపై వండివార్చిన అడ్డగోలు కథనాన్ని అందరూ ఛీదరించుకుంటున్నారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిసిన జనాలు ఆ అబద్ధాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. సాక్షి రాయచోటి/వేముల: పులివెందుల ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రాజెక్టుపై ఇప్పుడు పచ్చ పత్రికలు విషం చిమ్ముతున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సంకల్పించారు. అంతేగాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తేనే మరోపక్క తాగు, సాగునీటికోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని పైపులైన్ల ద్వారా తుంగభద్ర, కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించి...నిర్మాణ పనులు చరుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే సగానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్తయినా మార్చి వచ్చినా ఏమార్చారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. శర వేగంగా రిజర్వాయర్ పనులు వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలైన కేకే కొట్టాల, కణంపల్లె, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజల శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణమే ప్రధానమని భావించిన ప్రభుత్వం వేగంగా పనులు జరిగేలా చూస్తోంది. వైద్య శిబిరాలు, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూములు కోల్పొయిన రైతుల కుటంబాల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రిజర్వాయర్, భూ సేకరణ, చిత్రావతి నుంచి రూ. 1113 కోట్లు అంచనా వ్యయంతో రిజర్వాయర్ రూపొందించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేశారు. యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు 6 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 53శాతం పూర్తయ్యాయి. అలాగే కాలువల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. లింగాల మండలం పార్నపల్లె వద్దనున్న చిత్రావతి ప్రాజెక్టు నుంచి పైపులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. బాబుకు మేలు చేకూర్చేందుకు రామోజీ తాపత్రయం ప్రతి అంశాన్నీ బాబుకు మేలు చేసే విధంగా కట్టుకథలతో తప్పుదారి పట్టించేందుకు రామోజీ తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో శంకుస్థాపన చేసి 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేయగా 32 నెలల కిందటే పనులు ప్రారంభించినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు అల్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ. 650 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతలతోపాటు పైపులైన్ల పనులకు సుమారు రూ. 135 కోట్లు ఖర్చు చేశారు. కాలువ పనులకు సంబంధించి దాదాపు 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. మరో 13 కిలోమీటర్ల వరకు పైపులను కూడా అమర్చారు. కొన్నిచోట్ల అటవీ శాఖ భూముల పరిధిలో పైపులైన్ పనులు చేయాల్సి ఉన్నందున అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. దానినీ రాజకీయం చేయాలని ఈనాడు చూస్తోంది. త్వరలోనే సమస్యల పరిష్కారం ♦ యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కూడా యూసీఐఎల్ చర్యలు చేపట్టింది. తుమ్మలపల్లె సమీపంలో 2007 నవంబర్‌లో యురేనియం తవ్వకా లు చేపట్టేందుకు రూ.1106కోట్లతో కర్మాగారాన్ని నిరి్మంచింది. ♦ 2013లో యూసీఐఎల్ యురేనియం ఉత్పత్తి ప్రారంభించింది. ముడిపదార్థాన్ని శుద్ధి చేయగా వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ♦ 2016లో భారీ వర్షాలతో వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలుషితమయ్యాయని, బోర్లలో కలుషిత నీరు వస్తోందని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో రైతులు ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినా ష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, యూసీఐఎల్ సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతూ వస్తున్నారు. ♦ సంస్థ టెయిలింగ్ పాండ్‌లో 1.5 మీటర్ల మట్టి వేసి దానిపై 1.5 ఎం.ఎం హెచ్‌డీపీ షీట్ వేసి యురేనియం వ్యర్థాలను నింపుతోంది. ఇందుకోసం యూసీఐఎల్ రూ.39కోట్లు ఖర్చు చేసింది. ♦ యురేనియం పరిసర గ్రామాల్లో యూసీఐఎల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో రూ.60లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను యూసీఐఎల్ నిర్మించింది. సాగునీటికి ప్రత్యేక చర్యలు యురేనియం బాధిత గ్రామాల్లో తోటల్లోని బోరు బావుల్లో నీరు సైతం కలుషితం అవుతుందన్న శాస్త్రవేత్తల నివేదికల మేరకు ఆయా గ్రామాల పొలాలకు కూడా సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించాలని సంకల్పించారు. పైపులైన్లతోపాటు తోటలకు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యంతోపాటు ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద సాగునీటిని అందించనున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో యురేనియం కలకలం
లండన్: లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్ బ్రిటన్‌కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్ ఒకదానిని ఎయిర్పోర్ట్ కార్గో సిబ్బంది స్కానింగ్ తనిఖీల సమయంలో గుర్తించారు. ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు అక్కడి నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ద్వారా లండన్‌కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్‌కు తరలించారని బ్రిటిష్ మీడియాలో వార్తలొచ్చాయి. పాక్, ఒమన్లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్‌కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్ బ్రెటన్ గార్డన్ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పార్సిల్‌తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
భూమికి మంచు యుగాన్ని ఇచ్చింది మనమే!
భారతదేశం ఆసియా ఖండంలో భాగమేనా? ఇప్పుడెందుకీ డౌట్.. నిజమేగా అంటారా.. ఇది ఇప్పుడు నిజం.. ఇంతకు ముందు అబద్ధం. మళ్లీ ఇదేం కొర్రీ అని సందేహాం వస్తోందా? నిజమే.. ఇండియా వేరే ఖండం నుంచి వచ్చి ఆసియాకు కలిసింది. ఇదేకాదు ఇంకా ఎన్నోవిశేషాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా? అంతా టెక్టానిక్ ప్లేట్ల మహిమ! భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుంది. భూమి మధ్యలో ఉన్నది కోర్, దానిపై మాంటిల్, ఆపై క్రస్ట్ పొరలు ఉంటాయి. కోర్ అంతా దాదాపు ఇనుము, ఇతర లోహాల ముద్ద అయితే.. మధ్యలోని మాంటిల్ చాలా రకాల మూలకాలతో కూడిన లావా. అన్నింటికన్నా పైన ఉన్న క్రస్ట్ గట్టిగా మట్టి, రాళ్లతో ఉంటుంది. అయితే ఈ క్రస్ట్ ఏకమొత్తంగా పొరలా ఉండకుండా.. పెద్ద ముక్కలు (ప్లేట్లు)గా ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటాం. వీటితోనే వివిధ ఖండాలు (కాంటినెంట్స్) ఏర్పడుతాయి. మాంటిల్‌పై తేలుతున్నట్టుగా ఉండే ఈ టెక్టానిక్ ప్లేట్లు.. భూభ్రమణం, పరిభ్రమణం, ఇతర అంశాల కారణంగా కదులుతూ ఉంటాయి. గోండ్వానా ఖండం ముక్కలై.. మొదట్లో భూమిపై ఖండాలన్నీ వేరుగా ఉండేవి. యూరప్, ఆసియా కలిసి యూరేíÙయన్ ఖండంగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియాతోపాటు భారత ఉప ఖండం (ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు) మొత్తం కలిపి గోండ్వానా ల్యాండ్ అనే మరో పెద్ద ఖండంగా ఉండేవి. సుమారు 18 కోట్ల ఏళ్ల కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికలతో.. గోండ్వానా ముక్కలైంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియా దూరంగా కదిలిపోయాయి. భారత ఉప ఖండం యూరేనియన్ టెక్టానిక్ ప్లేట్ వైపు వచి్చంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అంటే మనం ఏమాత్రం గుర్తు పట్టలేనంత మెల్లగా జరుగుతాయి. అంటే సంవత్సరానికి పది, పదిహేను సెంటీమీటర్ల దూరం కదులుతాయి. హిమాలయాలను పుట్టించి.. యూరేనియన్ ప్లేట్ వైపు ఇండియన్ ప్లేట్ జరగడంతో.. ఆ ఒత్తిడికి భారీ స్థాయిలో భూభాగం పైకి లేచి, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలైన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండి గంగ, సింధు, బ్రహ్మపుత్ర ఇలా ఎన్నో నదులకు జన్మనిచ్చాయి. ఇలాంటి నదుల నుంచి కొట్టుకువచి్చన మట్టితో ఏకంగా బెంగాల్ డెల్టా ఏర్పడింది. మంచు యుగాన్ని తెచ్చి.. యూరేనియన్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టడానికి ముందు భూమి చాలా వేడిగా ఉండేది. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో మంచు ఉండేది కాదు. మొత్తంగా నీళ్లు, నీటి ఆవిరే ఉండేది. ఈ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టాక పైకి లేచిన భూభాగంలోని సిలికేట్లు భూవాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను వేగంగా పీల్చుకున్నాయి. ఇది ‘గ్లోబల్ కూలింగ్ (సూర్య కిరణాలు భూమి నుంచి ఎక్కువగా పరావర్తనం చెంది చల్లబడటం)’కు దారి తీసింది. అది భూమిపై మంచు యుగానికి దారితీసింది. అదే సమయంలో హిమాలయాలు, ధ్రువాలు, ఇతర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. అప్పటి జీవులనూ మోసుకొచ్చి.. అప్పటి ఖండాల్లో జీవజాలం వేర్వేరుగా ఉండే ది. గోండ్వానా ల్యాండ్ నుంచి విడిపోయి వచి్చ న ఇండియా.. ఆ జీవులనూ మోసుకొచ్చి ఆసియా, యూరప్ ఖండాలకు అందించింది. లక్షల ఏళ్లనాటి శిలాజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఆఫ్రికా, ఇండియా, దక్షిణ అమెరికా ఖండాల్లో జీవులన్నీ ఒకటేనని నిర్ధారించారు. జింక లాంటి జీవి నుంచి తిమింగలాలు గోండ్వానా నుంచి విడిపోయిన ఇండియా ప్రాంతం ఎన్నో జీవ సంబంధ మార్పులకు దారితీసింది. కొత్త జీవులు అభివృద్ధి చెందడానికి కారణమైంది. అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే.. భారత ఉప ఖండంలో ఒకప్పుడు నివసించిన జింక తరహా ‘ఇండోహ్యూస్’ అనే జీవులు మార్పు చెంది ప్రస్తుతమున్న తిమింగలాలుగా పరిణామం చెందినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండియా ఇంకా కదులుతూనే ఉంది భారత ఉప ఖండం ప్రాంతం ఇప్పటికీ యూరేíÙయన్ ప్లేట్ వైపు కదులుతూనే ఉంది. దీని కారణంగానే రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడి ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భారీ భూకంపం అందులో భాగమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: ‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు 500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం -
గర్వంగా ఉంది: ఇరాన్ కీలక ప్రకటన
దుబాయ్: యురేనియం ముడిపదార్థం నుంచి 60 శాతం స్వచ్ఛమైన యురేనియాన్ని వేరు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలిబాఫ్ ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘మా యువ శాస్త్రవేత్తలు యురేనియం ముడి పదార్థం నుంచి 60 శాతం స్వచ్ఛమైన యురేనియాన్ని వేరు చేశారు. ఈ ప్రకటన చేయడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఇస్లామిక్ ఇరాన్‌కు నా అభినందనలు. . ఇరాన్‌కున్న పట్టుదల అద్భుతమైనది, కుట్రలను నాశనం చేయగలది’ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన యురేనియాన్ని అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవల ఇరాన్‌లోని నటాన్జ్ న్యూక్లియర్ స్థలంపై దాడి జరగడంతో, దానికి ప్రతిగా ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్ నుంచి బలగాలు వెనక్కి -
యురేనియం అన్వేషణకు నో..
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. అమ్రాబాద్ అటవీ ప్రాంతం లోని 83 చదరపు కి.మీ.ల పరిధిలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వ విభాగం ‘అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీఈఆర్) చేసిన ప్రతిపాదనలను సిఫారసు చేయడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీ శాఖ ముఖ్య సంరక్షకులు (పీసీసీఎఫ్) ఆర్.శోభ గత మే 14న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్)కు లేఖ రాశారు. నాగార్జునసాగర్ వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ డివిజినల్ అధికారి, అమ్రాబాద్ పులుల అభయారణ్యం ‘ప్రాజెక్టు టైగర్’ఫీల్డ్ డైరెక్టర్, అటవీ ముఖ్య సంరక్షణ అధికారి, నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి వేర్వేరుగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి యురేనియం నిక్షేపాల అన్వేషణను వ్యతిరేకిస్తూ సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తిరస్కరించడం లాంఛనమేనని రాష్ట్ర అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యమాలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నాగార్జున సాగర్ అభయారణ్యం పరిధిలోని నిడ్గూల్ రిజర్వు ఫారెస్టు పరిధిలో 7 చ.కి.మీ.లు, అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 76 చ.కి. మీ.లు కలిపి మొత్తం 83 చ.కి.మీ.ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతి కోరుతూ 2015 జనవరి 1న అటమిక్ మినరల్ డైరెక్టరేట్ ప్రతిపాదనలు చేసింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న ఈ ప్రాంతం పరిధిలో ఐదేళ్ల పాటు యురేనియం అన్వేషణ చేసుకునేందుకు అనుమతి కోరింది. ఈ ప్రతిపాదనలకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్ర అటవీ శాఖకు సిఫారసు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు లేవని, పూర్తి సమాచారాన్ని సమర్పించాలని కేంద్ర అటవీ శాఖ కోరటంతో మళ్లీ అటమిక్ మినరల్ డైరెక్టరేట్ సవరించిన ప్రతిపాదనలను పంపించింది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యురేనియం అన్వేషణకు వ్యతిరేకంగా గతేడాది శాసనసభలో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. పెను ప్రమాదం.. సిఫారసు చేయలేం.. అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ సమర్పించిన సవరించిన ప్రతిపాదనలపై రాష్ట్ర అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించి నివేదికలు తెప్పించుకుంది. ప్రతిపాదిత ప్రాంతం పరిధిలోని అమ్రాబాద్ రేంజ్లో 16.38 లక్షల చెట్లు, మద్దిమాడుగు రేంజ్లో 19.30 లక్షల చెట్లు, నాగార్జున సాగర్ అభయారణ్యం పరిధిలో 489 చెట్లున్నాయని, యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపితే వీటి మనుగడ ప్రమాదంలో పడనుందని క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన అధికారులు నివేదించారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అటవీ కుక్కలు, నీల్గాయ్, చార్ సింగ, జింకలు, నక్కలు తదితర ఎన్నో అరుదైన జంతుజాతులు, వృక్ష జాతులున్నాయని, తవ్వకాలతో వీటి ఆవాసాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. ప్రతిపాదిత ప్రాంతం టైగర్ రిజర్వు ఏరియా పరిధిలోకి వస్తుందని, అక్కడ ఖనిజాన్వేషణకు అనుమతి గుర్తు చేశారు. యురేనియం అన్వేషణ లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 3,000 బోరు బావులు వేసేందుకు అనుమతి కోరారని, దీని కోసం భారీ యంత్రాలు, సామగ్రి, సిబ్బం ది, వాహనాలను అడవిలోకి తీసుకురావాల్సి ఉంటుందని, అటవీ ప్రాంతం లోపల కొత్త రహదారులు ఏర్పాటవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అటవీకి నష్టం జరగడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రతిపాదిత ప్రాంతం, కుందు నదులకు పరీవాహక ప్రాంతంగా ఉందని, యురేనియం తవ్వకాలు జరిపితే తాగు, సాగునీరు, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా నది గుంటూరు, విజయవాడల మీదుగా బంగాళాఖాతంలో కలవనుందని, ఈ ప్రాంతం పరిధి వరకు ఈ నీటిని వినియోగించే ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యవసాయం దెబ్బతింటుందని నివేదికల్లో పేర్కొన్నారు. అమ్రాబాద్ పరిధిలోని ఉడిమిల్ల, ఇప్పాలపల్లి, వెంకేశ్వరం, పెట్రాల్చెను, చిట్లంకుంట, కుమ్మరోనిపల్లి, పదరా, రాయలగండి, మాచారం గ్రామాలతో పాటు ఇక్కడ నివాసముండే 1000 కుటుంబాలు యురేనియం అణుధార్మికతకు లోనై అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే సిఫారసు చేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధికారులందరూ తమ నివేదికల్లో తేల్చి చెప్పారు. -
యురేనియం గరళం!
‘అణు ఇంధన శాఖ పరిధిలోని ఏఎండీ (ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) లంబాపూర్–పెద్దగట్టు ప్రాంతంలోని 25 బోరుబావులు, చేతిపంపుల నుంచి సేకరించిన నీటిలో యురేనియం ఉన్నట్లు గుర్తించింది. ఏఈఆర్బీ (ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు) విధించిన పరిమితి 60 పీపీబీ (పార్ట్ పర్ బిలియన్)కి లోబడి కొన్ని నమూనాల్లో, పరిమితికి మించి ఎంతో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది. సేకరించిన నీటి నమూనాల్లో 1పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు తేలింది...’ – లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్ లాల్ కటారియా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా భూగర్భంలో ఫ్లోరైడే కాదు.. ఇప్పుడు మరో కొత్త గరళం యురేనియం కూడా ఉందని తేలింది. యురేనియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించిన దేవరకొండ నియోజవకర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) పరిధిలోని పెద్దగట్టు–లంబాపూర్ ప్రాంతంలోని నీటిలో యురేనియం ఆనవాళ్లు ప్రమాదరకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా దశాబ్దన్నరం కిందట ప్రజాందోళనలతో వెనక్కి వెళ్లిపోయిన పెద్దగట్టు యురేని యం ప్రాజెక్టుకు తిరిగి ఊపిరి పోయాలని జరిగిన ప్రయత్నాలనూ గతేడాది ఈ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు. అయితే ఇక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.. ప్రాజెక్టును (మైనింగ్) ఏర్పాటు చేయకున్నా ఈ ప్రాంతం నుంచి నిత్యం నీటి నమూనాలు సేకరించి పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తవ్ ుకుమార్‌రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్‌లాల్ కటారియా వారం కిందట బదులిచ్చారు. ఆయన సమాధానంతో యురేనియం నిక్షేపాలు ఉన్న లంబాపూర్, పెద్దగట్టు ప్రాంతంలోని తాగు, సాగు నీటిలో యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ.. కథ!: దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో 11.02 మిలియన్ టన్నుల యురేనియం నిక్షేపాలు 1,326 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఏ) రూపొందించారు. ఈ గనులకు అనుబంధంగా మల్లాపూర్‌లో ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. అయితే అన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. వాస్తవానికి ఈ గనులకు 1,301.35 ఎకరాలు అవసరమని గుర్తించగా ఇందులో 1,104.64 ఎకరాలు రిజర్వు అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరమయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. మైనింగ్ మొదలుపెట్టే ముందు కేంద్ర అణు ఇంధన శాఖ ఆ ప్రాంతంలోని నీటి నమూనాలు సేకరించి విశ్లేషించడం పరిపాటి. దీనిలో భాగంగానే 2010–2011 మధ్య 468 నీటి శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. 2018 నవంబర్–2019 జూలై మధ్య ఎంపిక చేసిన 25 బోరు బావులు, చేతి పంపుల నుంచి నమూనాలు సేకరించి నీటిలో యురేనియం ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో యురేనియం ఆనవాళ్లు తాజా పరిశోధనల ప్రకారం లంబాపూర్–పెద్దగట్టు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలోనే ఎంపిక చేసిన 21 బోరు బావులు, 4 చేతి పంపుల నుంచి నీటి నమూనాలు సేక రించారు. ఇందులో 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఆన వాళ్లను కనుగొన్నా రు. 13 చోట్ల 60 పీపీబీకి తక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని, మిగిలిన 12 చోట్ల 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ అంటే.. అత్యధిక స్థాయిలో ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. తాగే నీటిలో 60 పీపీబీ వరకు యురేనియం ఉండొచ్చని ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) రక్షిత పరిమితులు విధించిందని చెబుతున్నారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) మాత్రం నీటిలో 30 పీపీబీ వరకు యురేనియం ఉంటేనే ఆ నీరు తాగడానికి రక్షితమ ని నిర్దేశించినట్లు చెబుతున్నారు. నమూనాలు సేకరించిన 4 చేతి పంపుల నీటిలో 1 పీపీబీ నుంచి 48 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు పరిశోధన అధ్యయనాలు తేల్చాయి కాబట్టి, ఆ చేతి పంపుల నీరు తాగడానికి పనికిరాదంటున్నారు. ఈ లెక్కన సేకరించిన 25 చోట్ల నీటి నమూనాల్లో యురేనియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లేనని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల మంది వరకు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. -
యురేనియం గ్రామాలకు మహర్దశ
సాక్షి, వేముల: యురేనియం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇక్కడ సూక్ష్మ సేద్యం అమలు చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. దీంతో జైన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం యురేనియం గ్రామాలలో పర్యటించారు.కాగా మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధిచేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. టైలింగ్ పాండ్ నిర్మాణంలో యూసీఐఎల్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని బాధితుల ఆరోపణ.. టైలింగ్‌పాండ్ వ్యర్థాలతో యురేనియం కాలుష్యం వెలువడుతోంది. వ్యవసాయ బోర్లలోని నీరు కలుషితం అవుతున్నాయి. దీంతో సాగులో ఉన్న అరటి, వేరుశనగ పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అంతేకాక చర్మ వ్యాధులు సోకుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాధిత రైతులు యూసీఐఎల్ తీరుకు నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. గ్రామాల్లో పర్యటించిన జైన్ కంపెనీ బృందం : మండలంలోని తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కె.కె.కొట్టాల, వేల్పుల గ్రామాల్లో జైన్ కంపెనీ బృందం పర్యటించింది. జైన్ ప్రాజెక్టు ఇంజినీర్లు సుదన్షు, కృష్ణ, నీటిపారుదల శాఖ జేఈలు వాసుదేవారెడ్డి, ప్రదీప్‌రెడ్డి సూక్ష్మ సేద్యం అమలుపై పరిశీలించారు. ఈ గ్రామాలలో సుమారు 10వేల ఎకరాలకుపైనే సూక్ష్మ సేద్యం అమలు చేయనున్నారు. ఇందుకోసం రోజుకు ఎంత నీరు అవసరమవుతుంది.. 200ఎకరాలకు ఒక సంప్ నిర్మించాలా, 500ఎకరాలకు,.. 2వేల ఎకరాలకు ఒక్కో సంప్ నిర్మించాలా అనే దానిపై సర్వే చేసినట్లు జేఈ వాసుదేవారెడ్డి తెలిపారు. మబ్బుచింతలపల్లెలో భూములను పరిశీలిస్తున్న జైన్ కంపెనీ బృందం, నీటిపారుదల శాఖ అధికారులు సూక్ష్మ సేద్యం అమలుకు చర్యలు.. : యురేనియం గ్రామాల్లో సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ బోర్లతో నిమిత్తం లేకుండా సంప్ల ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక టీఎంసీ సామర్థ్యంతో గిడ్డంగివారిపల్లె సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. టైలింగ్ పాండ్ వ్యర్థ జలాలు కలుషితం కావడంతో వ్యవసాయం దెబ్బతింది. దీంతో సీఎం వైఎస్ జగన్ యురేనియం గ్రామాలకు పార్నపల్లె నీటిని పైపులైన్ ద్వారా తీసుకొచ్చి రిజర్వాయర్‌కు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలతో అధికారుల సర్వే చేస్తున్నారు. -
కాటేస్తున్న యురేనియం కాలుష్యం
వేముల/పులివెందుల : యురేనియం కాలుష్యం కాటేస్తోంది. ఇక్కడ బతకలేకున్నాం.టైలింగ్ పాండ్ వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి వ్యవసాయ బోర్లు కలుషితం కావడంతో పంటలు సాగుచేయడం లేదు.రేడియేషన్ ప్రభావంతో వ్యాధులు ప్రబలుతున్నాయని టైలింగ్‌పాండ్ పరిధిలోని గ్రామాల బాదిత రైతులు అఖిలపక్షం ఎదుట వాపోయారు. ఆదివారం మం డలంలోని కె.కొట్టాల గ్రామంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, శాసన మండలి మాజీ వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డిలతోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుల కొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు తమ సమస్యలను, ఇబ్బందులను వారికి వివరించారు. కలషితనీటిని తాగడంతో శరీరంపై బొబ్బలు, దద్దులు వస్తున్నాయని..నవ్వలు, కడుపునొప్పి, చిన్నపిల్లల్లో కడుపునొప్పి ఎక్కువగా ఉంటుందని వాపోయారు. యూసీఐఎల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలతో ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. వైద్యులు పేరు తెలుసుకొని మందులు ఇస్తున్నారని..అన్ని రకాల వ్యాధులకు ఒకే రకాల మందులు ఇవ్వడం వలన వ్యాధులు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమై పంటలు సాగుచేయలేక పొలాలను బీళ్లుగా ఉంచామని వివరించారు. గతంలో 200–300 అడుగుల లోతులో నీరు ఉండేదని..యురేనియం తవ్వకాలతో 1000–1500 అడుగుల వరకు బోర్లు వేయాల్సి వస్తుందని విన్న వించారు. అరటి సాగుచేస్తే కలుషిత నీటిని ఇవ్వడంవల్ల పంట దెబ్బతిని సాగులో పెట్టుబడులు కూడా రావడంలేదని..సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్నామన్నారు. సమస్యలను పట్టించుకోని యూసీఐఎల్ ఏడాదిన్నరగా సమస్య ఉన్నా యూసీఐఎల్ పట్టించుకోవడంలేదన్నారు. టైలింగ్ ఫాండ్ వ్యర్థ జలాలతో సాగునీరు కలుషితమై జీవనాదారమైన వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గాలి, నీరు, భూమి కలుషితమై ఇక్కడ జీవనం సాగించలేక గ్రామాలను వదలి వెల్లాలని నిర్ణయించుకున్నామని బాధిత గ్రామస్తులు అఖిల పక్షం ఎదుట వాపోయారు. అక్కడ నుండి అఖిల పక్షం సభ్యులు సమీపంలోని రామ్మోహన్ అనే రైతుకు చెందిన చామంతి తోటను పరిశీలించారు. అలాగే టైలింగ్‌ఫాండ్ సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమం యురేనియం తవ్వకాలను నిలిపి వేయాలని జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని కె.కొట్టాల గ్రామంలో బాధిత రైతులతో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. టైలింగ్‌ఫాండ్ సం దర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టైలింగ్‌ఫాండ్ వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితం కావడంతో పంటలు సాగుచేసుకొనే పరిస్థితులు లేవన్నారు. కలుషిత నీటితో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యూసీఐఎల్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాలుష్యంతో వ్యా« దులు ప్రభలుతున్నాయని..యురేనియం తవ్వకాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని జాతీయస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. కలుషిత నీటితో జీవనాధారం కోల్పోతున్న బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ రాయలసీమ కన్వీనర్ సాహీద్‌హుసేన్, ఆపార్టీ పరిశీలకురాలు సుధ, కన్వీనర్ వరప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు. -
‘యురేనియం’ పాయింట్లను మీరే చూపండి
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి తదుపరి చర్యల విషయంలో సందిగ్ధం నెలకొంది. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా అమ్రాబాద్, ఉడుమిల్ల, నారాయణపూర్‌ల్లోని 4 బ్లాక్‌లలో 83 చ.కి.మీ. పరిధిలో 4 వేల బోర్లు వేసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర అటవీశాఖకు నెలరోజుల క్రితం అటామిక్ మినరల్ డైరెక్టరేట్(ఏఎండీ) ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదికలు పంపించాలని అచ్చంపేట, దేవరకొండ డివిజన్ల అధికారులకు ఈ ప్రతిపాదనలను మూడువారాల క్రితం అటవీశాఖ పంపింది. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అటవీప్రాంతంలో ఎక్కడెక్కడ యురేనియం నిల్వల వెలికితీతకుగాను 4 వేల బోర్లు వేసి పరీక్షలు జరుతారో యూజర్ ఏజెన్సీ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి చూపాలని ఏఎండీకి అటవీశాఖ ఇటీవల లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ బోర్లు వేస్తారన్న దానికి సంబంధించిన మార్కింగ్‌లను చూపిస్తే తమవైపు నుంచి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఏఎండీకి ఈ ప్రాంతాల ఫీల్డ్ డైరెక్టర్ లేఖ ద్వారా తెలియజేశారు. -
కాలుష్యాన్ని నివారించండి
వేముల: తుమ్మలపల్లె యురేనియం ప్లాంట్ కాలుష్యానికి తక్షణ పరిష్కారం చూపాలని, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నిపుణుల అధ్యయన కమిటీ నివేదిక రాగానే సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలతో కలిసి యురేనియం ప్లాంట్ కాలుష్యంపై సమీక్ష నిర్వహించారు. ‘టైలింగ్ పాండ్ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఆ నీటి వల్ల అరటి, వేరుశనగ, మిరప పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. టైలింగ్ పాండ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించనందునే పలు గ్రామాలపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. యురేనియం దేశానికి ఉపయోగపడేది కావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు సహకరించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలకు సమస్యగా మారితే, పర్యావరణానికి హాని జరిగితే సహించేదిలేదని స్పష్టీకరించారు. ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబానికి 40 ఏళ్లుగా అండదండగా ఉన్నారని, ప్రాజెక్టు వల్ల వారికి హాని జరిగితే ఉపేక్షించం అని చెప్పారు. యూసీఐఎల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, భవిష్యత్‌లో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటితో దెబ్బతిన్న పంటలకు పరిహారం, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలని యూసీఐఎల్ సీఎండీ హస్నాని, ఏఎండీ రీజినల్ డైరెక్టర్ శరవణన్, జీఎం ప్రాణేష్‌లకు సూచించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు యురేనియం ప్లాంట్ పరిసర గ్రామాల్లో వ్యవసాయ బోర్ల నుంచి కలుషిత నీరు వస్తుండటంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంటే అందుకు ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్రావతి ప్రాజెక్టు నుంచి లింగాల కుడి కాలువ ద్వారా నీటిని తీసుకొచ్చి రిజర్వాయర్‌లో నింపేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కేకే కొటాల, కనంపల్లె గ్రామాలకు సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. వ్యవసాయ బోర్లతో నిమిత్తం లేకుండా నేరుగా రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యురేనియం ప్లాంట్ కాలుష్యంపై వచ్చే నెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలతో సమన్వయం చేసుకుని సమావేశంలో చర్చించాలన్నారు. కాలుష్యంపై అధ్యయనానికి నియమించిన కమిటీ 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఈ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, కలెక్టర్ హరికిరణ్ పాల్గొన్నారు. -
చక్కెర్లు కొట్టిన ‘యురేనియం అలజడి’
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (నల్గొండ) : యురేనియం అలజడితో మండలంలోని పెద్దగట్టు, నంబాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యురేనియం తవ్వకాలు జరుగుతాయా.. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా అని ఇంతకాలం అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయా గ్రామాల ప్రజలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడంలేదు. తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం 11గంటల సమయంలో హెలికాప్టర్ విహరించడంతో యురేనియం కోసమే ఆకాశమార్గాన సర్వే నిర్వహించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని, యురేనియం కోసం అన్వేషించే ప్రయత్నాలు చేయడం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యురేనియం ప్లాంట్ ఏర్పాటు వల్ల జరిగే అనార్థాలతో ప్రజలు యురేనియం అంటేనే మండిపడుతున్నారు. వీరికి ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలుపుతుండడంతో ప్రజలు యురేనియం ప్లాంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే కోసం వచ్చినట్లు భావించి యురేనియం ప్లాంట్‌ను, యురేనియం కోసం అన్వేషించడం, ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దగట్టు, నంబాపురం గ్రామాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమద్‌కు వినతిపత్రం అందించారు. హెలికాప్టర్ యురేనియం సర్వేకు వచ్చిందా లేదా అని చెప్పాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో పెద్దగట్టు సర్పంచ్ నరేందర్‌నాయక్, గ్రామస్తులు నాగయ్య, దూద్య తదితరులున్నారు. -
యురేనియంపై యుద్ధం రగులుకుంది..!
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి(నల్గొండ) : పీఏపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు ఉంటాయా.. ఉండవా.. ఇన్నాళ్లు దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నా తాజా ఘటనతో పటాపంచలయ్యాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రతినిధులు మంగళవారం నీటి నమూనాల కోసం రావడంతో గ్రామస్తులు వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయని, తాము పోరుబాట పట్టక తప్పదన్న నిర్ణయానికి ఇక్కడి గిరిజనులు వచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీప్రాంతంలోనే యురేనియం తవ్వకాలు ఉంటాయని ఇప్పటివరకు అనుకున్నారు. అక్కడ ‘సేవ్ నల్లమల’ అంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. కానీ పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు, లంబాపూర్ తదితర గ్రామాల అటవీప్రాంతంలోనూ తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న విషయం బట్టబయలైంది. ఈ ప్రాంత ప్రజల్లో యురేనియం భయం వెంటాడుతుందన్న సమాచారం మేరకు ‘సాక్షి’ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుని వరుస కథనాలను ప్రచురించింది. కథనాలను చదివిన ఈ ప్రాంతవాసులు యురేనియంపై పోరుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పెద్దగట్టు గ్రామస్తులతో ప్రజా సంఘాల సమావేశం యురేనియంపై ప్రజలు చైతన్యవంతులను చేసేందుకు ప్రజా సంఘాలైన తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా సైన్స్ వేదిక, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక, తెలంగాణ గిరిజన సంఘాల ప్రతినిధులు మండలంలోని పెద్దగట్టు గ్రామస్తులతో మంగళవారం సమావేశం అయ్యారు. యురేనియంపై పోరుకు తాము అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పలు ప్రజా సంఘాల సభ్యులు యురేనియం వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు మిడియం బాబురావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, ధర్మానాయక్, తెలంగాణ ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు మువ్వ రామారావు, విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాపానాయక్, శంకర్‌నాయక్, రైతు సంఘం నాయకులు కంబాలపల్లి ఆనంద్, పెరికె విజయ్‌కుమార్, విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, డేగ వి.టి., నామ శ్రీనివాస్, హరికృష్ణ, రమేశ్, సుదర్శన్, కొండల్‌రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోబ్యాక్ యూసీఐ... యురేనియంపై ప్రజలను జాగృతం చేసేందుకు ప్రజా సంఘాలు ప్రజలతో సమావేశం ముగించుకొని వెళ్తున్న క్రమంలో పెద్దగట్టు గ్రామానికి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రతినిధులు వస్తుండడాన్ని గమనించిన ప్రజా సంఘాలు, ప్రజలు వారి జీపును అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ యూసీఐ అంటూ నినాదాలు చేశారు. చాలాసేపు వరకు ఆందోళన చేపట్టడంతో అధికారులు చేసేదిలేక వెనుదిరిగారు. యూసీఐఎల్ ప్రతినిధుల వాహనంలో అప్పటికే వేరే గ్రామాల్లో సేకరించిన నీటి నమూనాలతో పాటు ఖాళీ క్యాన్లు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే యూసీఐఎల్ ప్రతినిధులు ప్రజా సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా గ్రామస్తులు, ప్రజా సంఘాలు వారిని నిలువరించి జీపును వెనుకకు తోశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. యురేనియం వెలికితీయడం ప్రజలకు మరణశాసనం యురేనియం వెలికి తీయడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని, తాగునీరు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలపై పెను ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కడపలోని తుమ్మలపల్లి, జార్ఖండ్‌లోని తొలుగల్ ప్రాంతాల్లో యురేనియం ప్లాంట్లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉన్న యురేనియం ప్లాంట్‌ను జనవావాసాలకు మధ్య, కృష్ణా తీరంలో ఏర్పాటు చేయడం సమంజసం కాదు. యురేనియం వెలికితీయడం వల్ల జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. ఒక విధంగా ప్రజలకు మరణశాసనం. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్‌తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో యురేనియం వెలికితీయడం ఎంతవరకు సమంజసం. – మిడియం బాబురావు, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అభివృద్ధి పేరుతో ఆధిపత్యమా? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులుగా బతుకీడుస్తున్న పెద్దగట్టు ప్రాంత ప్రజలను మరోసారి యురేనియం పేరుతో బయటికి గెంటివేయొద్దు. అభివృద్ధి పేరుతో గ్రామాలపై ఆధిపత్యం చెలాయించడం అన్యాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంరించుకోవాలి. ఖనిజాల పేరుతో ఆదివాసులను ఆగంచేసే నిర్ణయాలు మంచివి కావు. – అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యురేనియం వెలికితీతను నిలిపివేయాలి మానవ మనుగడతో పాటు జీవజాలానికి హానికరమైన యురేనియం వెలికితీతను ప్రభుత్వాలు విరమించుకోవాలి. యురేనియం వెలికితీతతో ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రజల జీవితాలపై పెనుప్రభావం చూపే యురేనియం వెలికితీయడాన్ని ఆపివేయాలి. – రామారావు, ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు యురేనియం వెలికి తీసే చర్యలతో గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు. యురేనియం వెలికి తీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. కృష్ణా తీరం పరిసర ప్రాంతాల్లో యురేనియం వెలికి తీయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్ట్‌ను పచ్చటి పంట పొలాల నడుమ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదు. – రవినాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
యురేనియం అన్వేషణపై పునరాలోచన?
సాక్షి, హైదరాబాద్: యురేనియం నిల్వల అన్వేషణపై అటవీశాఖ పునరాలోచనలో పడిందా? ఈ ప్రశ్నలకు అధికారికవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అమ్రబాద్ అడవుల్లో నిక్షేపాల సర్వేపై మళ్లీ తాజా ప్రతిపాదనలు సమర్పిం చాలని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ)కు కేంద్ర అటవీ సలహా మండలి, రాష్ట్రం కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది నిలిచిపోయినట్టేనని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2016లో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నం గా కొత్త మార్గాల్లో డ్రిల్లింగ్ చేపట్టడం, సర్వే పరిధి కూడా ఎక్కువగా విస్తరించడం వల్ల ఏఎండీ కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభించడం, వాటి ప్రకారం సర్వేలు మొదలుపెట్టడం అసాధ్య మని ఉన్నతస్థాయి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. యురేనియం అన్వేషణకు గత మే నెలలో ఏఎండీకి కేంద్ర అటవీ సలహా మండలి అంగీకారం తెలిపిన నేపథ్యంలో సర్వే కోసం అడవి డ్రిల్లింగ్ మొదలుపెడితే పులుల అభయారణ్యంపై తీవ్ర ప్రభావంతోపాటు జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆదివాసీలు, స్వచ్ఛందసంస్థలు, పర్యావరణ ప్రేమికులు ఆందో ళన వ్యక్తం చేశారు. దీంతో ఈ సర్వే ఏవిధంగా నిర్వహిస్తారు, ఎంపిక చేసిన ప్రదేశాల్లోకి డ్రిల్లింగ్ యంత్రాలను ఎలా తీసుకెళతారు, అక్కడి అడవికి, జీవరాశులకు ఏమేరకు నష్టం జరుగుతుంది తదితర అంశాలపై ఫారమ్–సీలోని నమూనాకు అనుగుణంగా తాజాగా ప్రతిపాదనలు పంపించాలని ఏఎండీని కేంద్ర అటవీ సలహా మండలి, రాష్ట్ర అటవీశాఖ కోరాయి. ఏఎండీ నుంచి ఆమ్రాబాద్ డీఎఫ్‌వోకు తాజా ప్రతిపాదనలు అందాక, వాటిని ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం డీఎఫ్‌వో ఇచ్చే నివేదికను బట్టి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఏఎండీ ప్రతిపాదనలు, డీఎఫ్‌వో నివేదికను రాష్ట్ర అటవీశాఖ పరిశీలించి, వాటిని కేంద్ర అటవీశాఖకు, కేంద్ర అటవీ సలహామండలికి పంపనుంది. దీనిపై కేంద్రస్థాయిలో తుదినిర్ణయం తీసుకుంటే యురేనియం అన్వేషణకు క్లియరెన్స్ లభించినట్టుగా భావించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొదట్లో ఏరియల్ సర్వే ఆలోచన... యురేనియం నిక్షేపాల అన్వేషణకు ఏరియల్ సర్వే చేపట్టడంతోపాటు డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఇతరత్రా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామనేవిధంగా ఏఎండీ తొలుత సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2016లో రాష్ట్ర అటవీ సలహామండలికి ప్రతిపాదనలు సమర్పించినప్పుడు కూడా యురేనియం నిల్వల అన్వేషణ కోసం నిర్వహించే సర్వేలో ఎలాంటి డ్రిల్లింగ్ నిర్వహించబోమని, అటవీ విధ్వంసం వంటిది జరగదని ఏఎండీ స్పష్టం చేసింది. గతంలో డ్రిల్లింగ్ ఉండదన్న హామీకి భిన్నంగా ఇప్పుడు ఈ సర్వేల్లో 250 అడుగులు అంతకంటే ఎక్కువ లోతుల్లోకి 4 వేల వరకు బోర్లు వేస్తారనే తాజా ప్రతిపాదనలు రావడంపట్ల ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఆలోచనలు మారిపోయిన కారణంగా స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలనే డిమాండ్ పెరుగుతోంది. -
ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది: ట్రంప్
వాషింగ్టన్: 2015 నాటి అణు ఒప్పందం లోని నిబంధనలను ఉల్లంఘించి యురేనియం నిల్వలను అనుమతించిన స్థాయికి మించి పెంచి ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. యురేనియం నిల్వలను పెంచుకోవడాన్ని ఆపాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ తొలిసారిగా గత సోమవారం ఉల్లంఘించింది. ‘ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది. నేను కొత్తగా ఇరాన్‌కు చెప్పదలచుకున్నది ఏదీ లేదు. అయితే తాము నిప్పుతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని ఇరాన్ గుర్తెరగాలి’ అని ట్రంప్ శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. అనంతరం శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘యూరేనియంను చిన్న మొత్తంలో నిల్వ చేసుకునేలా అణు ఒప్పందంలో ఇరాన్‌కు అవకాశం కల్పించడమే తప్పు. అసలు ఏ స్థాయిలోనూ యురేనియం నిల్వలను కలిగి ఉండేందుకు ఇరాన్‌ను అనుమతించి ఉండాల్సింది కాదు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అమెరికాతోపాటు మా మిత్రదేశాలు కూడా ఎప్పటికీ అనుమతించవు’ అని అన్నారు. అణు ఒప్పందం ప్రకారం 300 కేజీల వరకు యురేనియంను నిల్వచేయొచ్చు. -
10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం
టెహ్రాన్: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండీ తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. -
యురేనియం ఉత్పత్తి నాలుగు రెట్లు పెంపు..!
సాక్షి, హైదరాబాద్ : పెరుగుతున్న అణు ఇంధన అవసరాలను తీర్చేందుకు యురేనియం ఉత్పత్తిని నాలుగురెట్లు ఎక్కువ చేయనున్నట్లు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.కె.అస్నానీ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 13 కొత్త గనులను ప్రారంభిస్తామని.. ఇప్పటికే అందుబాటులో ఉన్న గనులను మరింత విస్తరిస్తామని ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అణు ఇంధన సముదాయం 49వ వ్యవస్థాపక దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త గనుల వివరాలను వెల్లడించారు. నాగార్జున సాగర్ సమీపంలో ఇప్పటికే గుర్తించిన యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకుగాను చిట్రియాల్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన గనికి చెందిన డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్న తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతోపాటు రాజస్తాన్‌లోని రోహిల్, కర్ణాటకలోని గోగి, ఛత్తీస్‌గఢ్‌లోని జజ్జన్‌పూర్‌లలో కొత్త యురేనియం గనులు ఏర్పాటవుతాయని అన్నారు. కొత్తగా చేపట్టనున్న 13 యూరేనియం ప్రాజెక్టుల ద్వారా రానున్న ఏడు – ఎనిమిదేళ్లలో దేశ యురేనియం ఉత్పత్తి ఇప్పుడున్నదానికి నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని వివరించారు. కర్ణాటకలోని గోగి కేంద్రంలో లభించే ముడిఖనిజం మిగిలిన వాటికంటే ఎంతో నాణ్యమైందని.. అక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ యురేనియం రాబట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం గనిలో వెలికితీతకు చెందిన సమస్యలన్నింటినీ అధిగమించామని, ప్రస్తుతం అక్కడి నుంచి ఉత్పత్తి సాఫీగా జరుగుతోందని తెలిపారు. ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం... దేశ అణు ఇంధన అవసరాలను తీర్చడంలో అణు ఇంధన సముదాయం అనేక సవాళ్లను అధిగమించి.. అత్యున్నత స్థాయిలో పనిచేస్తోందని సంస్థ సీఎండీ డాక్టర్ దినేశ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశ అంతరిక్ష, వ్యూహాత్మక అవసరాలకు కూడా తగు విధంగా ఉపకరిస్తున్నట్లు శనివారం జరిగిన 49వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన చెప్పారు. కేవలం యురేనియం ఇంధన బండిళ్లను తయారు చేయడమే కాకుండా.. అందుకు అవసరమైన అన్ని విడిభాగాలను కూడా పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న సంస్థ ఈ దేశంలో ఎన్ఎఫ్సీ ఒక్కటేనని అన్నారు. కార్యక్రమంలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ బాధురి, ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.ఫణిబాబు, భారత అణుశక్తి సంస్థ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మెర్విన్ అలెగ్జాండర్ పాల్గొన్నారు. -
యురేనియం గ్రామాలకు కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాక
సాక్షి ప్రతినిధి కడప: యురేనియం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో కార్పొరేట్ సోషియల్ రెస్పాన్షబులిటీ (సీఎస్ఆర్) ఫండ్ వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ రానున్నారు. ఈనెల 17, 18న ఆమె యురేనియం పరిశ్రమ పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో యురేనియం తవ్వకాలతోపాటు శుద్ధి చేసే కర్మాగారాన్ని నిర్మించింది. తవ్వకాలు ప్రారంభమై దాదాపు పదేళ్లు కావస్తుండగా, శుద్ధి చేసే కర్మాగారం పనులు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయ్యింది. ఈనేపథ్యంలో ఆయా గ్రామాల్లో యూసీ ఐఎల్ చేపట్టిన అభివృద్ధి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా ప్రజల ద్వారా తెలుసుకునేందుకు డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ యురేనియం గ్రామాల్లో పర్యటించనున్నారు. అమెరికాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ తరఫున రీసెర్చిలో భాగంగా ఆమె భారత ప్రభుత్వం నేతృత్వంలో కొనుసాగుతున్న యూసీఐఎల్ గ్రామాల స్థితిగతులపై ఆరా తీయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి. కాగా ఆయా గ్రామాల్లో ఏ మేరకు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేశారు. గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయనే దానిపై ఆమె ఆరా తీయనున్నారు. అంతేకాక ప్రాజెక్టు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, జరుగుతున్న నష్టాలను, వారి ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలను గ్రామస్తులతో మాట్లాడి స్వయంగా తెలుసుకోనున్నారు. యురేనియం ప్రాజెక్టు పరిధిలోని ఈ గ్రామాల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఏయే పనులు చేశారు, వాటి వల్ల ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలు స్తోంది. ఆయా గ్రామాల్లో ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా డాక్టర్ లెవెలన్ మిచ్చిగాన్ యూనివర్సిటీ నుంచి 2006లో పీహెచ్డీ పొందింది. 2008 నుంచి పదేళ్లుగా యూసీఎస్బీలో టీచింగ్ చేస్తోంది. గురువారం సాయంత్రానికి ప్రొద్దుటూరులో మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ఇంటికి చేరుకోనున్నారు. ఆమేరకు 17, 18వ తేదీల్లో యురేనియం గ్రామాల్లో డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ పర్యటించనున్నట్లు జయశ్రీ సాక్షికి ధ్రువీకరించారు. -
యురేనియం మోసాలమయం..
సాక్షి, హైదరాబాద్: చిట్టీలు వేసి మోసం చేసిన వాళ్లను చూశాం. ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలను చూశాం. చివరకు కరక్కాయల పేరుతో లక్షలు దండుకున్న గ్యాంగునూ చూశాం. కానీ మెరుపులు, ఉరుములు పడితే యురేనియం, ఇరీడియం తీసిస్తామన్న నయా గ్యాంగ్‌ను చూశారా? అవును రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉరుములు, మెరుపులు పడినా ఆ ప్రాంతం నుంచి విలువైన యురేనియం, ఇరీడియం ఖనిజాలను తీసిస్తామంటూ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. వీరి మాటలు నమ్మి అమాయకులు రూ. కోట్లల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో మూడు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు, పరీక్షలంటూ.. బెంగుళూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన కోహ్లీ బాబా ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక, ఆం«ధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాలోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులను టార్గెట్ చేసి ఇరీడియం, యురేనియం పేరుతో బురిడీ కొట్టించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ అధికారి ఇద్దరూ ఈ ముఠాను నమ్మి రూ. 4.5 కోట్లు పోగొట్టుకున్నారు. గంగాధర్‌రెడ్డి వీరితో పరిచయం పెంచుకొని బెంగుళూరు విమానాశ్రయ పరిధిలోని రసాయన కంపెనీలో యురేనియం నిలువ ఉందని, దాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ రక్షణ శాఖలో పని చేసే శాస్త్రవేత్త కోహ్లీ వస్తున్నాడని చెప్పి తీసుకెళ్లాడు. రూ. 4.5 కోట్లు టోకారా ఓ గదిలోని రసాయన పదార్థాన్ని పరిశీలించేందుకు గాను ఆ బిల్డరు, రిటైర్డ్ ఉద్యోగికి ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్ పెట్టి లోపలికి పంపాడు. ఆ రసాయనాన్ని పరీక్షిస్తున్నట్లు కోహ్లీ నటించడం, వెంటనే అందులో నుంచి పొగలు రావడం చూపించి ఇది నిజమైన ఇరీడియమని, దీన్ని జర్మన్‌లోని ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపాల్సి ఉంటుందన్నాడు. దీన్ని నమ్మిన బిల్డర్, రిటైర్డ్ ఉద్యోగి చెరో రూ. 2 కోట్లు గంగాధర్‌కు ఇచ్చారు. వీరికి మధ్యవర్తిగా ఉంటూ హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ ఉద్యోగిగా చెప్పుకుంటున్న మొయిన్ అనే వ్యక్తి రూ. 50 లక్షలు తీసుకొని మొహం చాటేశాడు. తీరా ఇదంతా ఫేక్ అని, అలాంటి ఖనిజాలు దేశంలో అరుదుగా ఉంటాయని.. దీనికి ప్రభుత్వాల అనుమతి తదితర వ్యవహారా లుంటాయని తెలుసుకొని వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీఐడీ గంగాధర్‌రెడ్డితో పాటు కోహ్లీని అరెస్టు చేసింది. విదేశాల్లో భారీ డిమాండ్ అంటూ.. 10 కిలోల యురేనియం, ఇరీడియం విదేశీ మార్కెట్లో రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతుందని బాధితులను ఈ గ్యాంగ్ నమ్మించింది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపించినట్లు తెలిసింది. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోని ప్రముఖ హీరోలు, రాజకీయ నేతలు తమ ద్వారానే రూ. వందల కోట్లు దక్కించుకున్నారని నమ్మబలికింది. ఇందుకు పలువురు శాండిల్‌వుడ్ హీరోలతో దిగిన ఫోటోలను ఆధారాలుగా చూపించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాల్లో పిడుగు పడినపుడు తమ శాస్త్రవేత్తలు యురేనియాన్ని గుర్తించి ప్రముఖులకు సొమ్ము చేశారని చెప్పడంతో బాధితులు నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్నారు. ఒక్కరి నుంచే రూ.10 కోట్లు.. కొద్ది రోజుల క్రితమే విజయవాడకు చెందిన కొందరు.. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండే రిటైర్డ్ ఉద్యోగి రామారావు (పేరు మార్చాము)ను ఇదేవిధంగా మోసం చేశారు. రెండున్నరేళ్లుగా రామారావును నమ్మించి ఆయన ఆస్తులన్నీ అమ్మిస్తూ ఖనిజ నిక్షే పాల పేరిట దండుకున్నట్టు రామారావు కుమారుడు నగర సీసీఎస్‌లో ఫిరా>్యదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఇరీడియం, యురేనియం దొరుకుతుందని, పలానా చోట దొరికిందని, దాన్ని పరీక్షించేందుకు జర్మన్ శాస్త్రవేత్తలు వస్తున్నారని చెప్పి రూ. కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. రామారావు కేసులో విజయవాడకు చెందిన వ్యక్తిని, హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వీరి వెనుకున్న గ్యాంగ్ ఏంటి? రెండు రాష్ట్రాల్లో ఎంత మందిని ఇలా మోసగించారో ఆరా తీస్తున్నారు. ఒక్క రామారావే రూ.10 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించారు. నమ్మొద్దు: సీఐడీ ఇరీడియం, యురేనియం, ఇతర ఖనిజాల వల్ల రూ. కోట్ల కొద్దీ డబ్బొస్తుందని నమ్మొద్దని, ఇలాంటి ముఠాలకు చెందిన సభ్యుల సమాచారం ఉంటే సీఐడీకి తెలపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పిడుగు పడినట్లు అలాంటి ఖనిజాలేవి పడవని, అత్యాశకు పోయి ఆస్తులను పోగొట్టుకోవద్దని సూచించారు. -
భూగర్భ జలాల్లో భారీగా యురేనియం!
వాషింగ్టన్: భారత్‌లోని 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు యురేనియంతో భారీగా కాలుష్యమయమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ప్రమాణాల కన్నా ఎక్కువగా యురేనియం కాలుష్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాగునీరు, సాగు నీటిలోనూ యురేనియం కాలుష్యం ఎక్కువగా ఉందని అమెరికాలోని డ్యూక్ యూనిర్సిటీ పరిశోధకులు చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా.. రాజస్తాన్, గుజరాత్ వ్యాప్తంగా ఉన్న 324 బావుల్లోని నీటిలో భారీ స్థాయిలో యురేనియం ఉన్నట్లు తేలింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం దేశంలో లీటరుకు 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం ఉండవచ్చు. -
తుమ్మలపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, తుమ్మలపల్లి : దేశంలోనే అత్యధిక యురేనియం నిల్వలు కలిగిన తుమ్మలపల్లి యురేనియం ప్లాంటు వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, గ్రామాల ప్రజలు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ముందు శనివారం ధర్నాకు దిగారు. ఫిబ్రవరిలో స్థానిక సమస్యలను ప్రజలు వైఎస్సార్ సీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు అవినాష్ చెప్పారు. ‘యూసీఐఎల్‌లో ఉన్న టెయిల్ పాండ్‌లోని నీరు భూమిలోకి ఇంకి చుట్టుపక్కల పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. బోర్ల నుంచి వచ్చే నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గాలి, నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. ఫిబ్రవరి 21న యూసీఐఎల్ సీఎండీ బాధిత గ్రామాల్లో పర్యటించారు. సీఎండీకి ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించమని కోరారు. గ్రామాల్లో తాగునీరుకు పైప్‌లైన్ వేయించమని అడిగారు. నీరు ఇంకకుండా టెయిల్ పాండ్‌ను పునఃనిర్మించాలని కోరారు. గ్రామాల ప్రజల సమ్మతితో ఇళ్లు, పొలాలను యూసీఐఎల్ సేకరించాలని అడిగారు. ఈ మేరకు డిమాండ్లతో సీఎండీకి వినతి పత్రం సమర్పించాం. ప్రజల డిమాండ్లపై రెండు వారాల్లోగా స్పందిస్తానన్న సీఎండీ ఇప్పటివరకూ స్పందించలేదని చెప్పారు. ఆయన సమాధానం కోసమే ధర్నా చేస్తున్నాం’ అని అవినాష్ వెల్లడించారు. -
రైతుల ధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతు
-
ప్రధానికి వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ
సాక్షి, కడప : యూరేనియం టైల్‌పాండ్ వ్యర్థాల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. టైల్ పాండ్ వ్యర్థాల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే పంటలు, పశు సంపద సైతం దెబ్బతింటోందని, ఈ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ప్రధాన మంత్రికి వైఎస్ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందించాలని కోరారు. యూసీఐఎల్ సీఎండీ త్వరగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.