అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్, చిత్రంలో బుగ్గన, అవినాశ్‌రెడ్డి తదితరులు
వేముల: తుమ్మలపల్లె యురేనియం ప్లాంట్ కాలుష్యానికి తక్షణ పరిష్కారం చూపాలని, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నిపుణుల అధ్యయన కమిటీ నివేదిక రాగానే సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలతో కలిసి యురేనియం ప్లాంట్ కాలుష్యంపై సమీక్ష నిర్వహించారు. ‘టైలింగ్ పాండ్ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఆ నీటి వల్ల అరటి, వేరుశనగ, మిరప పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. టైలింగ్ పాండ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించనందునే పలు గ్రామాలపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు.
యురేనియం దేశానికి ఉపయోగపడేది కావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు సహకరించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలకు సమస్యగా మారితే, పర్యావరణానికి హాని జరిగితే సహించేదిలేదని స్పష్టీకరించారు. ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబానికి 40 ఏళ్లుగా అండదండగా ఉన్నారని, ప్రాజెక్టు వల్ల వారికి హాని జరిగితే ఉపేక్షించం అని చెప్పారు. యూసీఐఎల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, భవిష్యత్‌లో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటితో దెబ్బతిన్న పంటలకు పరిహారం, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలని యూసీఐఎల్ సీఎండీ హస్నాని, ఏఎండీ రీజినల్ డైరెక్టర్ శరవణన్, జీఎం ప్రాణేష్‌లకు సూచించారు.
రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు
యురేనియం ప్లాంట్ పరిసర గ్రామాల్లో వ్యవసాయ బోర్ల నుంచి కలుషిత నీరు వస్తుండటంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంటే అందుకు ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్రావతి ప్రాజెక్టు నుంచి లింగాల కుడి కాలువ ద్వారా నీటిని తీసుకొచ్చి రిజర్వాయర్‌లో నింపేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కేకే కొటాల, కనంపల్లె గ్రామాలకు సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. వ్యవసాయ బోర్లతో నిమిత్తం లేకుండా నేరుగా రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యురేనియం ప్లాంట్ కాలుష్యంపై వచ్చే నెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలతో సమన్వయం చేసుకుని సమావేశంలో చర్చించాలన్నారు. కాలుష్యంపై అధ్యయనానికి నియమించిన కమిటీ 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఈ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, కలెక్టర్ హరికిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment