ఖనిజాల కోసం అన్వేషణ.! | search for minerals | Sakshi
Sakshi News home page

ఖనిజాల కోసం అన్వేషణ.!

Published Wed, Mar 8 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

search for minerals

► నాగసానిపల్లెలో యురేనియం, అల్యూమి నియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తింపు
► 20రోజుల పాటు నాగసానిపల్లె  పరిసరాల్లో సర్వే

ఖాజీపేట : ఖాజీపేట మండలం నాగసానిపల్లె ప్రాంతంలోని కొండ భాగంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులు ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నారు.  ఈ సర్వే అంతా నాగసానిపల్లె సుగాలీతాండా ఆనుకుని ఉన్న గుట్టపైనే జరుగుతోంది.  ఫిబ్రవరి 22 నుంచి  హెలికాప్టర్‌ సహాయంతో గుట్ట పైభాగాన భూమిని పూర్తి స్థాయిలో సర్వే  చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు హెలికాప్టర్‌ సహాయంతో స్కానింగ్‌ చేశారు. ఆ తర్వాత మరికొద్ది రోజులకు అక్కడికి మరోఅధికారిక బృందం వచ్చి పలురకాల అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా సర్వే నిర్వహించారు.

వారికి కావాల్సిన మట్టి నమూనాలను తీసుకుని పోయారు. అలాగే  సర్వే నిర్వహించిన భూభాగంలో గుర్తులు ఉంచి పోయారు. ఆంజనేయ కొట్టాలు దగ్గర ఉన్న భూభాగం నుంచి నాగసానిపల్లె వరకు నీటి లభ్యత పై కూడా అధికారులు సర్వే చేపట్టారు. వీరంతా సుమారు 12 రోజుల పాటు సర్వే నిర్వహించి పూర్తి స్థాయి వివరాలు సేకరించి వెళ్లిపోయారు.

ప్రాథమిక సమాచారం పూర్తి
ఇక్కడ యురేనియంతోపాటు అల్యూమినియం నిల్వలు ఉన్నట్లు సర్వే స్కానింగ్‌లో గుర్తించారు. అందుకు సంబంధించిన  ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. సర్వే బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా  కేంద్రం మరలా సర్వే నిర్వహించే అవకాశం ఉంది. యురేనియం నిల్వలు ఎంత భూభాగంలో ఉన్నాయి. ఇక్కడి యురేనియం, అల్యూమినియం ఎంత నాణ్యత కలిగి ఉంది అనే దానిపై నివేదికలు తయారు చేస్తారు. అందుకోసం తిరిగి ఇక్కడి భూ భాగంలో లోతుగా డ్రిల్లింగ్‌ వేసి మట్టి నమూనాలను అధికారులు ల్యాబ్‌కు పంపుతారు. ల్యాబ్‌లో పరిశీలన పూర్తయిన తర్వాత వచ్చే నివేదికల అనంతరం అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
‘నాగసానిపల్లె గ్రామంలో హెలికాప్టర్‌ ద్వారా సర్వే జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఆ సర్వే ఎందుకు జరుపుతున్నారు. అనే సమాచారం మాకులేదు. దీనిపై మా ఉన్నతాధికారులు కూడా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు’ అని తహసీల్దార్‌ శివరామయ్య తెలిపారు.

యురేనియం, అల్యూమినియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తింపు?
నాగసానిపల్లె భూభాగంలో భారీగా యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు పరిశీలనకు వచ్చిన బృందం గుర్తించినట్లు సమాచారం. అందుకే అధికారులు ఇక్కడే మకాం వేసి పూర్తి అన్వేషణ చేసినట్లు తెలుస్తోంది. యురేనియం కూడా 78 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇక్కడ అల్యూమినియం నిల్వలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం వచ్చిన అధికారులు మాత్రం సమాచారం ఎక్కడా బయటకు రానివ్వడంలేదు. గ్రామస్తులు అడిగినా వారినుంచి సమాధానం లేదు. తాము సర్వే చేసిన నివేదికను కేంద్రానికి పంపుతామని మాత్రం చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement