Khajipeta
-
సిండి‘కేటు’కు సంకెళ్లు
బ్యాంకు రుణం తీసుకోవాలంటే సామాన్యుడికి కష్టమే. ఒకవేళ ఒప్పుకున్నా రుణం మంజూరుకు సవాలక్ష నిబంధనలతో కాలయాపన చేస్తారు. మరి బ్యాంకు మేనేజర్ స్వయంగా తలచుకుంటే .. రూల్స్ గీల్స్ ఏవీ అడ్డురావు. అనుకున్న వారికి అనుకున్నంతా ఇస్తారు. డాక్యుమెంట్లు, కీలక పత్రాలు ఎలాంటివైనా ఓకే అంటారు. ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మేనేజర్ అచ్చం అలాగే చేశారు. చేతివాటం ప్రదర్శించి రుణాలు మంజూరు చేశారు. తరువాత వచ్చిన మేనేజర్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. రెండేళ్లుగా దీనిపై సాగుతున్న విచారణ తాజాగా కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సాక్షి, ఖాజీపేట: ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో గతంలో జరిగిన రుణాల గోల్‌మాల్‌పై విచారణ కొలిక్కి వచ్చింది. ఇక్కడ మేనేజర్‌గా జయంత్ బాబు 2014 జూన్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకును దళారీలకు కేంద్రంగా మార్చారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు ఇలా ఒకటేమిటి అన్నీ దళారుల మధ్యవర్తిత్వంతోనే జరిగాయి. రుణం మంజూరుకు బేరం కుదర్చుకుని డబ్బు ముట్టిన తరువాత దళారీలు చెప్పినట్లు రుణాలు ఇచ్చేవారనే అభియోగముంది. అలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి. తరువాత అక్కడ నుంచి ఆయన బదిలీపై వెళ్లిపోయారు. సిక్ గ్రూపులకు రుణాలు చివరకు డ్వాక్రా గ్రూపు సంఘాలను బ్యాంకు మేనేజరు వదలలేదు. 7నుంచి 9సంవత్సరాలుగా సిక్ అయిన గ్రూపులపై ఆయన దృష్టి సారించారు. పూర్తి వివరాలు సంబంధిత యానిమేటర్ ద్వారా తెలుసుకున్నారు. డిఎల్, లక్ష్మిప్రసన్న, యువదర్శిని, గణేష్గ్రూపులు సిండికేట్ బ్యాంకులో ఏడేళ్లుగా రుణాలు చెల్లించక సిక్ గ్రూపులుగా ఉన్నాయి. ఈ గ్రూపుల యానిమేటర్, మేనేజర్ ఒక ఒప్పందానికి వచ్చి బకాయి రుణాన్ని చెల్లించి గ్రూపు సభ్యులకు తెలియకుండానే క్షణాల్లో వారికి రుణం మంజూరు చేశారు. మంజూరైన గ్రూపులకు పొదుపు డబ్బు లేక పోయినా కొత్తగా మంజూరు చేసిన రుణం పొదుపు గ్రూపు అకౌంట్లో ఉంచి మిగిలిన సొమ్ము డ్రా చేశారు. ఆ విధంగా నాలుగు గ్రూపులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. డీఎల్ గ్రూపులో కొందరు సభ్యులు చనిపోయారు. మిగిలిన చాలా మంది సభ్యులు స్థానికంగా లేరు. వారిపేరున బినామీలను పెట్టి ఫోర్జరీ సంతాలు చేసి తప్పుడు డ్యాక్యుమెంట్లు ఇచ్చి రుణాలు మంజూరు చేసి స్వాహా చేశారు. లక్ష్మి ప్రసన్న గ్రూపులో కూడా రూ.5 లక్షలు రుణం మంజూరు చేసి డ్రా చేశారు. అలా డ్రా చేశారని తెలియడంతో తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించారు. తనకు మట్టి అంటకూడదని గూపు సభ్యుల సహకారం తీసుకున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తానని చెప్పి కొత్తగా గ్రూపు సభ్యులు రుణం తీసుకున్నట్లు సంతకాలు చేయించి రుణాలను మంజూరు చేసినట్లు తెసింది. గణేష్ గ్రూపు సభ్యులు ఈ వ్యవహరంపై అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఫిర్యాదు డ్వాక్రా గ్రూపుల రుణాల్లో అక్రమాలు జరిగిన మాట నిజమేనని గతంలోనే వెలుగు అధికారులు గుర్తించారు. అప్పటి వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ధనుంజయ్ బ్యాంకు మేనేజర్‌పై ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో యానిమేటర్ కాంతమ్మకు సంబంధముందని తొలగించారు. తరువాత టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి ఆమెను యానిమేటర్‌గా కొనసాగించారు. డ్వాక్రా గ్రూపు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ 2017మార్చిలో సిండికేట్ బ్యాంకులో స్వాహా పర్వం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. అప్పటి లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘనాధరెడ్డి ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ఆయన గుర్తించారు. అప్పడు స్థానిక టీడీపీ నాయకుల జోక్యంతో కేసు బయటకు రాకుండా తొక్కిపట్టారు. తరువాత వచ్చిన బ్యాంకు మేనేజర్లు ఈ అక్రమాల జోలికి వెళ్లకుండా మిన్నకుండి పోయారు. దీంతో విచారణ రెండేళ్లుగా సాగుతూనే వచ్చింది. మేనేజరుపై ఫిర్యాదు మేనేజరు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికారులు కేసు నమోదుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటి బ్యాంకు మేనేజర్ లీలాప్రతాప్ పోలీసులకు ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.22 కోట్ల రుణాల మంజూరులో మేనేజరు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేశారని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు ఇచ్చారని, అధికారాలను దుర్విని యోగం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సీఐ కంబగిరి రాముడు వేగవంతం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఆయన విచారణను వేగవంతం చేశారు. వెంకటసుబ్బయ్య, కాంతమ్మ, బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్ బాబులను విచారించారు. ముగ్గురు అరెస్టు ఖాజీపేట : సిండికేట్ బ్యాంక్‌లో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ మాజీ మేనేజర్ జయంత్ బాబు శనివారం అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లయ్య అనే కీలక నిందుతుడు పరారీలో ఉన్నాడని మైదుకూరు రూరల్ సిఐ కంబగిరాముడు, ఖాజీపేట ఎస్ఐ రోషన్లు తెలిపారు. జయంత్ మేనేజర్‌గా పనిచేసిన కాలంలో దళారులను పెట్టుకుని బ్యాంకును అడ్డంగా దోచాడని తేలిందన్నారు. విచారించి ఖాజీపేట యానిమేటర్ కాంతమ్మ.. మీసాల వెంకటసుబ్బయ్యలను కూడా అరెస్టు చేశామన్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు దొంగ వెబ్‌ల్యాండ్, డాక్యుమెంట్లను సృష్టించిన ఎల్లయ్య పరారీలో ఉన్నాడు. త్వరలో పూర్తి విచారణ జరిపి రూ.2.22 కోట్లు రుణాల రికవరీ చేయాల్సి ఉందని తెల్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
కాజీపేట అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన మైనార్టీ గురుకుల విద్యాలయంలో ని బంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాజీపేట మండలం క డిపికొండలోని మైనార్టీ గురుకుల విద్యాలయం గ తేడాది అట్టహాసంగా ప్రారంభమైంది. 5,6,7 తరగతులతో ప్రారంభమై ఈ ఏడాది ఎనిమిదో తరగతిని ప్రారంభించారు. 14 మంది ఉపాధ్యాయులు, ఒక ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో సుమారు 235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సామా న్య మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలకు కార్పోరేట్‌స్థాయి విద్యతో పాటు పూర్తి సంరక్షణ లభిస్తుందనే నమ్మకంతో కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయంలో చేర్చారు. విద్యార్థులపై పట్టింపేదీ.? శుక్రవారం మైనార్టీ గురుకుల విద్యాలయంలో విద్యార్థులు స్నానమాచరించేందుకు నీరు లేని కా రణంతో ఆరుబయటకు పంపించారు. దీంతో అ భం శుభం తెలియని చిన్నారులు పాఠశాలకు ప్ర క్కనే గల పెద్ద చెరువులో కొందరు, శివాలయంలో మరికొందరు స్నానమాచరించారు. వీరిని సరైన రీతిలో తీసుకువెళ్లేందుకు ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు, వార్డెన్ ఎవరూ లేరు. విద్యార్థులు స్నానమాచరించి కడిపికొండ నుంచి ఉర్సుకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఆరులైన్ల బైపాస్ రోడు ్డపై పరుగెత్తుకుంటూ వస్తుంటే స్థానికులు భారీ వాహనాల రాకపోకల్లో విద్యార్థులకు ఏమైన జరుగుతుందోనని కంగారుపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరారు.నాకు తెలియకుండా పీఈటీ నిర్ణయం తీసుకున్నాడు విద్యార్థులను విద్యాలయం నుంచి నాకు తెలియకుండా పీఈటీ ఫిరోజ్‌ఖాన్ పంపించాడు. ఇటీవల బోర్ చెడిపోవడంతో ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నాం. కాగా, ఘటనకు బాధ్యుడైన పీఈటీని తొలగిస్తాం. – సిద్దీఖీ, ప్రిన్సిపాల్, కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయం -
సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్ అమ్రపాలి
కాటకాజీపేట అర్బన్ : ఇంటర్న్‌షిప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు అమ్రపాలి కాట తెలిపారు. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ సొసైటీలో 22 మంది ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు మే 28 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రెడ్‌క్రాస్‌లోని ధాలసెమియా సెంటర్లో 252 మంది వ్యాధిగ్రస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా విద్యార్థులు వారిపై అవగాహన పెంచుకుని తాము సైతం రక్తదానం అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అతి తక్కువ ధరలకు మందులు అందించే జనరిక్ మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ గ్రూప్, క్రాస్ మ్యాచింగ్ విధానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రెడ్ క్రాస్ చరిత్ర, బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో అందించాల్సిన సేవలు, 108, వృద్ధాశ్రమాలు, సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వలంటరీ ప్రొగ్రాంలో భాగస్వామ్యం అందిస్తూ ప్రథమ చికిత్స అందించడంపై విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో నేర్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నిట్‌లో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్‌లోని ఓ హాస్టల్లో మంగళవారం ఎంటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, సహచర విద్యార్థుల కథనం ప్రకారం.. నిట్‌లో ఎంటెక్ మొదటి సంవత్సరంలో త్రిపుల్ఈ విభాగంలోని పవర్‌సిస్టం ఇంజినీరింగ్ చదువుతున్న అమిత్‌కుమార్(31) 1.8కె అల్రామె గా హాస్టల్లోని ఎ8–27గదిలో ఉంటున్నాడు. రెండు రోజుల నుంచి తన తండ్రికి ఫోన్లో అందు బాటులోకి రాలేదు. దీంతో అమిత్‌కుమార్ పక్క గదిలో ఉంటున్న మిత్రుడు రాహుల్‌కు ఉదయం 11 గంటలకు శంకర్ ప్రసాద్ ఫోన్ చేసి అమిత్‌ను ఓసారి మాట్లాడించమని తెలిపాడు. దీంతో రాహుల్‌తో పాటు మరికొందరు విద్యార్థులు అమిత్ గది వద్దకు వెళ్లారు. తలుపు తట్టగా తలుపు లోపల గడియ పెట్టి ఉంది. దీంతో విద్యార్థులు బలవంతంగా తలుపులు తెరచి చూసే సరికి సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో అమిత్‌కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు నిట్ యాజమాన్యానికి, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అమిత్‌కుమార్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా పోలీసులు అమిత్‌కుమార్ ఆత్మహత్య విషయం తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్, లలితాదేవికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బీహార్ నుంచి వరంగల్‌కు బయలుదేరారు. మానసిక ఒత్తిడితోనేనా? అమిత్‌కుమార్ ఎంటెక్ సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. డిసెంబర్లో జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కాగా జూన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణత సాధించాడు. కాగా మొదిటి సెమిస్టర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు తాత్కాలికంగా స్టైఫండ్‌ను నిలిపివేస్తారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. -
రైల్వేకోర్టుకు హాజరైన స్పీకర్ మధుసూదనాచారి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేకోర్టుకు రైల్‌రోకో కేసులో భాగంగా మంగళవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013 సంవత్సరంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, అచ్చ విద్యాసాగర్, ఎస్.శ్రీనివాస్, డి.దయాసాగర్, ఎ.వినోద్, దిడ్డి నరేష్, వి.సత్యనారాయణ, బొల్లం సంపత్, మేకల రవి, రామగళ్ల పరమేశ్వర్ హాజరయ్యారు. అదేవిధంగా ధర్మారం రైల్వే గేట్ వద్ద 2014 సంవత్సరంలో జరిగిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, ల్యాదెళ్ల బాలు, విజయ్, ఎల్.రామారావు, పి.ప్రేమ్‌కుమార్, జి.రమేష్, జి.రాజు, కె.రాములు, వి.లింగారెడ్డి, జి.సందీప్‌లు హాజరుకాగా వరంగల్, ధర్మారం కేçసులను పరిశీలించిన రైల్వే మెజీస్ట్రేట్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. -
న్యూసెన్స్ చేసిన ముగ్గురు హిజ్రాలకు జరిమానా
కాజీపేట రూరల్ : రైళ్లలో న్యూసెన్స్ చేసిన ముగ్గురు హిజ్రాలకు కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం జరిమానా విధించినట్లు స్థానిక ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి నడుస్తున్న రైలు చైన్ లాగి రైలు ఆపిన ఒక హిజ్రాను, శుక్రవారం గుంటూరు నుంచికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతోసభ్యకరంగా ప్రవర్తించిన మరో హిజ్రాలను అదుపులోకి తీసుకొని కేసులు నమో దు చేసి రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, వారికి రూ.6 వేల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
రైల్వేలో ఉద్యోగాల పేరిట మోసం
కాజీపేట అర్బన్ : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి ఓ వ్యక్తి రూ.40 లక్షలతో ఫరారీ అయిన ఘటనలో శుక్రవారం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై గురువారం ‘సాక్షి’ ప్రచురితమైన కథనం అక్షర సత్యమైంది. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట హన్మకొండకు చెందిన ఎండీ.రఫీక్ టీస్టాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌కు చెందిన తిరుపతిరెడ్డి తరచూ రఫిక్ టీస్టాల్ వద్ద వస్తుండే వాడు. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి కుమారుడు వినిత్‌రెడ్డి తన స్నేహితులు వాసుదేవరెడ్డి, రాజు తదితురలు రఫీక్ టీస్టాల్ వద్ద కలుసుకునేవారు. టీ తాగుతున్న తరుణంలో బిటెక్ పూర్తి చేసిన తమను నిరుద్యోగం వేదిస్తుందని, రైల్వే లాంటి శాఖలో ఉద్యోగం లభిస్తే బాగుండు అనే అభిరుచులను పంచుకునేవారు. దీనిని గమనించి టీస్టాల్ యజమాని రఫీక్ తనకు రైల్వే శాఖలో ఉన్నతాధికారులు చాలా మంది పరిచయం ఉన్నారంటూ తమ బంధువులు సైతం ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారని నమ్మించాడు. అలా 2015 ఆ యువకుల నుంచి దశల వారీగా సుమారు రూ.40 లక్షలను వసూలు చేసి చాయ్‌వాలా చేతివాటాన్ని చూపాడు. రోజులు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గమనించిన నిరుద్యోగులు రఫీక్‌ను నిలదీశారు. దీంతో రఫీక్ రాత్రికిరాత్రే మకాం మార్చేశాడు. శుక్రవారం బాధితుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఢాంకాన్‌పల్లెలో ఉద్రిక్తత
ఖాజీపేట : ఢాంఖాన్‌పల్లెలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల వారి రాళ్లు, గాజుసీసాల దాడులతో గ్రామం దద్దరిల్లింది. చివరకు రెండు వర్గాలకు చెందిన వారు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఢాంఖాన్‌పల్లెలో గంగినాయుడు, గంగయ్య రెండు గ్రూపులుగా ఉన్నారు. వారికి కొంత కాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. పెద్ద గంగమ్మ ఆలయం విషయంలో తీవ్ర రూపం దాల్చాయి. బోనాల జాతర జరిగే విషయమై గ్రామస్తుల మధ్య మూడు వారాల కిందట చర్చ జరిగింది. ముందు గ్రామంలోని వారు ఎవరు వస్తే వారు గంగమ్మకు బోనాలు పెట్టుకోవచ్చని గంగినాయుడు వర్గం వాదించింది. కొంత కాలంగా తామే మొదటి సారిగా బోనాలు పెడుతున్నామని, ఇది ఆనవాయితీగా వస్తోందని, తరువాత ఎవరైనా పెట్టుకోవచ్చునని గంగయ్య వర్గం వారు వాదించారు. గంగమ్మ వద్ద మీ పెత్తనం ఏమిటంటూ ఇరు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. చిన్న పాటి గొడవ జరిగింది. వెంటనే మైదుకూరు రూరల్ సీఐ హనుమంతునాయక్ జోక్యం చేసుకుని పరిస్థితి సర్దుబాటు చేశారు. జాతరను ప్రశాంతంగా చేసుకోవాలని సీఐ చెప్పారు. బోనాలు ఇంటి వద్దనే పెట్టుకుని, ఆలయంలో పూజారి ద్వారా అమ్మవారికి పూజలు చేసి వెళ్లాలి, ఎవరూ ఆలయం వద్ద బోనాలు పెట్టవద్దని ఆయన సూచించారు. దీంతో గ్రామంలో జాతర జరగలేదు. దారి విషయమై గొడవ ఇరు వర్గాల వారు అన్మదమ్ములే కావడంతో.. ఇరువురి మధ్య రహదారిలో రాకపోకల సమస్య కొత్తగా బయటకు వచ్చింది. సర్వే నంబర్ 236లో 1.08 సెంట్ల స్థలం పూర్వం ముగ్గురు పెద్దలకు భాగాలు ఉన్నాయి. తర్వాత వారి పిల్లలు సుమారు 58 సెంట్లçను భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాజాగా దారి విషయం అంటూ శనివారం రాత్రి గొడవకు దిగారు. ఇరు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. బీరుబాటిళ్లలో పెట్రోలు పోసి దాడులకు పాల్పడ్డారు. గాజుసీసాలను వేసుకున్నారు. ఇళ్ల అద్దాలు పగులగొట్టుకున్నారు. ఈలలు, కేకలతో గ్రామం దద్దరిల్లింది. చుట్టుపక్కల వారు ఏం జరుగుతోందో అనే ఆందోళనతో ఇంటికి తాళాలు వేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు పైగా ఘర్షణ జరిగింది. పోలీసుల పహారా గొడవపై గ్రామస్తులు ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్టేషన్లో ఎవరూ లేకపోవడం.. అంతా బి.మఠంలో ప్రత్యేక బందోబస్తుకు వెళ్లడంతో సమయానికి పోలీసులు రాలేకపోయారు. వెంటనే స్పందించిన మైదుకూరు రూరల్ సీఐ హనుమంతునాయక్ ఉన్న కొద్ది మందితో అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ వెంటేశ్వర్లు వచ్చి ఆందోళనకారులను తరిమివేసి గ్రామం మొత్తం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన అనీల్‌కుమార్, రాముడు, సింగరయ్య రెడ్డయ్య, వెంకటేష్, రామయ్య, పొట్టిరామయ్య, గంగయ్య, గంగామోహన్, కృష్ణయ్యకు గాయాలు కాగా.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
నిట్‌లో కత్తిపోట్ల కలకలం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఆదివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. వసంత్సోవం ప్రో షో ముగింపు సందర్భంగా స్టేడియంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై ఎమ్మెస్సీ విద్యార్థి తన స్నేహితులతో కత్తులతో దాడి చేశాడు. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిట్ వరంగల్‌లో గతేడాది ఆగస్టు మాసంలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. కన్నూరి హర్ష, అఖిల్ పాపినేని అధ్యక్షులుగా, సార్థక్శర్మ, రవికాంత్ ఉపాధ్యక్షులుగా పోటీ చేశారు. సార్థక్శర్మకు జైప్రీత్‌సింగ్, రవికాంత్‌కు అమిత్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో సార్థక్శర్మ ఓటమి పాలయ్యాడు. నాటి నుంచి జైప్రీత్, అమిత్‌యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అమిత్‌యాదవ్ ఎదురుపడిన ప్రతిసారి జైప్రీత్‌సింగ్ అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేవాడు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌కు సైతం అమిత్‌యాదవ్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. కారుపెట్టిన చిచ్చు.. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల సందర్భంగా జైప్రీత్‌సింగ్ కారులో షికారు చేస్తూ అమిత్యాదవ్కు వింత సైగలు చేయడం ప్రారంభించాడు. అసలు కారుకు అనుమతి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అమిత్‌యాదవ్ ఆరా తీశాడు. ఆదివారం రాత్రి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారనే అమిత్యాదవ్కు అనుమానం వచ్చింది. నిట్ ప్రధాన గేట్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో క్యాంపస్‌లోకి వెళ్లాడు. అతిథుల కోసం డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కారును అనుమతిచ్చినట్లు సమాచారం. కారు పెట్టిన చిచ్చు కత్తుల స్వైర విహారానికి దారితీసింది. పరస్పర దాడులు .. అమిత్యాదవ్పై వారం రోజుల క్రితం జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో నిట్ క్యాంపస్ ఎదుట దాడి చేశాడు. సరైన సమయం కోసం వేచిచూస్తున్న అమిత్‌యాదవ్ స్ప్రింగ్ స్ప్రీ ముగింపు వేడుకలను అనుకూలంగా మలుచుకున్నాడు. తన మిత్రులతో కలిసి నిట్ స్టేడియంలో కత్తులు, ఇనుప రాడ్లతో జైప్రీత్‌సింగ్‌పై అమిత్‌యాదవ్ దాడి చేశాడు. దాడిలో జైప్రీత్సింగ్కు కుడి తొడ, నుదిటిపై గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. కాజీపేట ఏసీపీ సత్యనారాయణ సోమవారం నిట్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జైప్రీత్‌సింగ్ వద్దకు చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిలో గాయపడిన జైప్రీత్‌సింగ్‌ను డీన్ రమణారెడ్డి, విద్యార్థులు పరామర్శించారు. చోద్యం చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది.. కారులో నిట్ విద్యార్థులు మద్యం బాటిళ్లు, కత్తులు, ఇనుపరాడ్లను తీసుకువెళ్తున్నా సెక్యూరిటీ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్‌ను సైతం విద్యార్థులు తీసుకువెళ్లారు. నిట్ సెక్యూరిటీ సిబ్బంది పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు పెడుతున్నారు. పాత క్షక్షలతోనే దాడి జైప్రీత్‌సింగ్ తనను అసభ్యకర పదజాలంతో మానసికంగా హింసిస్తున్నాడని, తన సహనం కోల్పోయి ఏం చేస్తానో నాకే తెలియదని అమిత్‌యాదవ్ ఈనెల 7వ తేదీన హెచ్చరించాడు. జైప్రీత్‌సింగ్‌ను సివిల్ హెడ్ రాజేష్ సమక్షంలో మందలించాం. ఇలాంటి పొరపాట్లు మరల జరగకుండా చూసుకోమని తెలిపాం. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో దాడులకు దిగడం బాధాకరం. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పరస్పరం చోటు చేసుకున్న విభేదాలను పాతకక్షలుగా మార్చుకుని అమిత్‌యాదవ్ తన మిత్రులతో జైప్రీత్‌సింగ్‌పై దాడి చేశాడు. –రాంగోపాల్‌రెడ్డి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ సెక్షన్ 307 కింద కేసు నమోదు నిట్‌లోని సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జైప్రీత్‌సింగ్‌పై ఎమ్మెస్సీ చదువుతున్న అమిత్‌యాదవ్, ధీరజ్, సతీష్, రోహిత్, పంకజ్, అలీఖాన్, రవికాంత్ కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇందులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. రోహిత్ పరారీలో ఉన్నాడు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. జైప్రీత్‌సింగ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. –సీహెచ్.అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య
-
ఖనిజాల కోసం అన్వేషణ.!
► నాగసానిపల్లెలో యురేనియం, అల్యూమి నియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తింపు ► 20రోజుల పాటు నాగసానిపల్లె పరిసరాల్లో సర్వే ఖాజీపేట : ఖాజీపేట మండలం నాగసానిపల్లె ప్రాంతంలోని కొండ భాగంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులు ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నారు. ఈ సర్వే అంతా నాగసానిపల్లె సుగాలీతాండా ఆనుకుని ఉన్న గుట్టపైనే జరుగుతోంది. ఫిబ్రవరి 22 నుంచి హెలికాప్టర్ సహాయంతో గుట్ట పైభాగాన భూమిని పూర్తి స్థాయిలో సర్వే చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు హెలికాప్టర్ సహాయంతో స్కానింగ్ చేశారు. ఆ తర్వాత మరికొద్ది రోజులకు అక్కడికి మరోఅధికారిక బృందం వచ్చి పలురకాల అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా సర్వే నిర్వహించారు. వారికి కావాల్సిన మట్టి నమూనాలను తీసుకుని పోయారు. అలాగే సర్వే నిర్వహించిన భూభాగంలో గుర్తులు ఉంచి పోయారు. ఆంజనేయ కొట్టాలు దగ్గర ఉన్న భూభాగం నుంచి నాగసానిపల్లె వరకు నీటి లభ్యత పై కూడా అధికారులు సర్వే చేపట్టారు. వీరంతా సుమారు 12 రోజుల పాటు సర్వే నిర్వహించి పూర్తి స్థాయి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ప్రాథమిక సమాచారం పూర్తి ఇక్కడ యురేనియంతోపాటు అల్యూమినియం నిల్వలు ఉన్నట్లు సర్వే స్కానింగ్‌లో గుర్తించారు. అందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. సర్వే బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం మరలా సర్వే నిర్వహించే అవకాశం ఉంది. యురేనియం నిల్వలు ఎంత భూభాగంలో ఉన్నాయి. ఇక్కడి యురేనియం, అల్యూమినియం ఎంత నాణ్యత కలిగి ఉంది అనే దానిపై నివేదికలు తయారు చేస్తారు. అందుకోసం తిరిగి ఇక్కడి భూ భాగంలో లోతుగా డ్రిల్లింగ్ వేసి మట్టి నమూనాలను అధికారులు ల్యాబ్‌కు పంపుతారు. ల్యాబ్‌లో పరిశీలన పూర్తయిన తర్వాత వచ్చే నివేదికల అనంతరం అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ‘నాగసానిపల్లె గ్రామంలో హెలికాప్టర్ ద్వారా సర్వే జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఆ సర్వే ఎందుకు జరుపుతున్నారు. అనే సమాచారం మాకులేదు. దీనిపై మా ఉన్నతాధికారులు కూడా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు’ అని తహసీల్దార్ శివరామయ్య తెలిపారు. యురేనియం, అల్యూమినియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తింపు? నాగసానిపల్లె భూభాగంలో భారీగా యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు పరిశీలనకు వచ్చిన బృందం గుర్తించినట్లు సమాచారం. అందుకే అధికారులు ఇక్కడే మకాం వేసి పూర్తి అన్వేషణ చేసినట్లు తెలుస్తోంది. యురేనియం కూడా 78 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇక్కడ అల్యూమినియం నిల్వలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం వచ్చిన అధికారులు మాత్రం సమాచారం ఎక్కడా బయటకు రానివ్వడంలేదు. గ్రామస్తులు అడిగినా వారినుంచి సమాధానం లేదు. తాము సర్వే చేసిన నివేదికను కేంద్రానికి పంపుతామని మాత్రం చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఖాజీపేట: ఖాజీపేట మండలం భూమాయపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యనగరం గ్రామానికి చెందిన పెద్దపోలయ్య, వీరయ్యలు వడ్లు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరారు. జాతీయ రహదారి నుంచి భూమాయపల్లెకు వస్తున్న వరికోత యంత్రం వారి ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక ఉన్న వీరయ్య మృతి చెందగా వాహనం నడుపుతున్న పోలయ్య స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.