బాధిత విద్యార్థిని పరామర్శిస్తున్న డీన్ రమణారెడ్డి
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఆదివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. వసంత్సోవం ప్రో షో ముగింపు సందర్భంగా స్టేడియంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై ఎమ్మెస్సీ విద్యార్థి తన స్నేహితులతో కత్తులతో దాడి చేశాడు. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిట్ వరంగల్‌లో గతేడాది ఆగస్టు మాసంలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి.
కన్నూరి హర్ష, అఖిల్ పాపినేని అధ్యక్షులుగా, సార్థక్‌శర్మ, రవికాంత్ ఉపాధ్యక్షులుగా పోటీ చేశారు. సార్థక్‌శర్మకు జైప్రీత్‌సింగ్, రవికాంత్‌కు అమిత్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో సార్థక్‌శర్మ ఓటమి పాలయ్యాడు. నాటి నుంచి జైప్రీత్, అమిత్‌యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అమిత్‌యాదవ్ ఎదురుపడిన ప్రతిసారి జైప్రీత్‌సింగ్ అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేవాడు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌కు సైతం అమిత్‌యాదవ్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు.
కారుపెట్టిన చిచ్చు..
స్ప్రింగ్ స్ప్రీ వేడుకల సందర్భంగా జైప్రీత్‌సింగ్ కారులో షికారు చేస్తూ అమిత్‌యాదవ్‌కు వింత సైగలు చేయడం ప్రారంభించాడు. అసలు కారుకు అనుమతి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అమిత్‌యాదవ్ ఆరా తీశాడు. ఆదివారం రాత్రి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారనే అమిత్‌యాదవ్‌కు అనుమానం వచ్చింది. నిట్ ప్రధాన గేట్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో క్యాంపస్‌లోకి వెళ్లాడు. అతిథుల కోసం డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కారును అనుమతిచ్చినట్లు సమాచారం. కారు పెట్టిన చిచ్చు కత్తుల స్వైర విహారానికి దారితీసింది.
పరస్పర దాడులు ..
అమిత్‌యాదవ్‌పై వారం రోజుల క్రితం జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో నిట్ క్యాంపస్ ఎదుట దాడి చేశాడు. సరైన సమయం కోసం వేచిచూస్తున్న అమిత్‌యాదవ్ స్ప్రింగ్ స్ప్రీ ముగింపు వేడుకలను అనుకూలంగా మలుచుకున్నాడు. తన మిత్రులతో కలిసి నిట్ స్టేడియంలో కత్తులు, ఇనుప రాడ్లతో జైప్రీత్‌సింగ్‌పై అమిత్‌యాదవ్ దాడి చేశాడు. దాడిలో జైప్రీత్‌సింగ్‌కు కుడి తొడ, నుదిటిపై గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ..
కాజీపేట ఏసీపీ సత్యనారాయణ సోమవారం నిట్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జైప్రీత్‌సింగ్ వద్దకు చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిలో గాయపడిన జైప్రీత్‌సింగ్‌ను డీన్ రమణారెడ్డి, విద్యార్థులు పరామర్శించారు.
చోద్యం చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది..
కారులో నిట్ విద్యార్థులు మద్యం బాటిళ్లు, కత్తులు, ఇనుపరాడ్లను తీసుకువెళ్తున్నా సెక్యూరిటీ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్‌ను సైతం విద్యార్థులు తీసుకువెళ్లారు. నిట్ సెక్యూరిటీ సిబ్బంది పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది
ఆంక్షలు పెడుతున్నారు.
పాత క్షక్షలతోనే దాడి
జైప్రీత్‌సింగ్ తనను అసభ్యకర పదజాలంతో మానసికంగా హింసిస్తున్నాడని, తన సహనం కోల్పోయి ఏం చేస్తానో నాకే తెలియదని అమిత్‌యాదవ్ ఈనెల 7వ తేదీన హెచ్చరించాడు. జైప్రీత్‌సింగ్‌ను సివిల్ హెడ్ రాజేష్ సమక్షంలో మందలించాం. ఇలాంటి పొరపాట్లు మరల జరగకుండా చూసుకోమని తెలిపాం. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో దాడులకు దిగడం బాధాకరం. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పరస్పరం చోటు చేసుకున్న విభేదాలను పాతకక్షలుగా మార్చుకుని అమిత్‌యాదవ్ తన మిత్రులతో జైప్రీత్‌సింగ్‌పై దాడి చేశాడు.
–రాంగోపాల్‌రెడ్డి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్
సెక్షన్ 307 కింద కేసు నమోదు
నిట్‌లోని సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జైప్రీత్‌సింగ్‌పై ఎమ్మెస్సీ చదువుతున్న అమిత్‌యాదవ్, ధీరజ్, సతీష్, రోహిత్, పంకజ్, అలీఖాన్, రవికాంత్ కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇందులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. రోహిత్ పరారీలో ఉన్నాడు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. జైప్రీత్‌సింగ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం.
–సీహెచ్.అజయ్, కాజీపేట ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment