సిండి‘కేటు’కు సంకెళ్లు  | Bank Irregularities in the name of loans | Sakshi
Sakshi News home page

సిండి‘కేటు’కు సంకెళ్లు 

Published Sun, Jun 16 2019 9:55 AM | Last Updated on Sun, Jun 16 2019 9:58 AM

 Bank Irregularities in the name of loans - Sakshi

బ్యాంకు సొమ్ము స్వాహా కేసులో అరెస్ట్‌ అయిన నిందితులతో పోలీసు అధికారులు

బ్యాంకు రుణం తీసుకోవాలంటే సామాన్యుడికి కష్టమే. ఒకవేళ ఒప్పుకున్నా రుణం మంజూరుకు సవాలక్ష నిబంధనలతో కాలయాపన చేస్తారు. మరి బ్యాంకు మేనేజర్‌ స్వయంగా తలచుకుంటే .. రూల్స్‌ గీల్స్‌ ఏవీ అడ్డురావు. అనుకున్న వారికి అనుకున్నంతా ఇస్తారు. డాక్యుమెంట్లు, కీలక పత్రాలు ఎలాంటివైనా ఓకే అంటారు. ఖాజీపేట సిండికేట్‌ బ్యాంకు మేనేజర్‌ అచ్చం అలాగే చేశారు. చేతివాటం ప్రదర్శించి రుణాలు మంజూరు చేశారు. తరువాత వచ్చిన మేనేజర్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. రెండేళ్లుగా దీనిపై సాగుతున్న విచారణ తాజాగా కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

సాక్షి, ఖాజీపేట: ఖాజీపేట సిండికేట్‌ బ్యాంకులో గతంలో జరిగిన రుణాల గోల్‌మాల్‌పై విచారణ కొలిక్కి వచ్చింది.  ఇక్కడ మేనేజర్‌గా జయంత్‌ బాబు 2014 జూన్‌ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకును దళారీలకు కేంద్రంగా మార్చారు.  ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు ఇలా ఒకటేమిటి అన్నీ దళారుల మధ్యవర్తిత్వంతోనే జరిగాయి. రుణం మంజూరుకు బేరం కుదర్చుకుని డబ్బు ముట్టిన తరువాత దళారీలు చెప్పినట్లు రుణాలు ఇచ్చేవారనే అభియోగముంది. అలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి. తరువాత అక్కడ నుంచి ఆయన బదిలీపై వెళ్లిపోయారు.

సిక్‌ గ్రూపులకు రుణాలు
చివరకు డ్వాక్రా గ్రూపు సంఘాలను బ్యాంకు మేనేజరు వదలలేదు. 7నుంచి 9సంవత్సరాలుగా సిక్‌ అయిన గ్రూపులపై ఆయన దృష్టి సారించారు.  పూర్తి వివరాలు సంబంధిత యానిమేటర్‌ ద్వారా తెలుసుకున్నారు.  డిఎల్, లక్ష్మిప్రసన్న, యువదర్శిని, గణేష్‌గ్రూపులు సిండికేట్‌ బ్యాంకులో ఏడేళ్లుగా రుణాలు చెల్లించక సిక్‌ గ్రూపులుగా ఉన్నాయి. ఈ గ్రూపుల యానిమేటర్, మేనేజర్‌ ఒక ఒప్పందానికి వచ్చి బకాయి రుణాన్ని చెల్లించి గ్రూపు సభ్యులకు తెలియకుండానే క్షణాల్లో వారికి రుణం మంజూరు చేశారు. మంజూరైన గ్రూపులకు పొదుపు డబ్బు లేక పోయినా కొత్తగా మంజూరు చేసిన రుణం పొదుపు గ్రూపు అకౌంట్‌లో ఉంచి మిగిలిన సొమ్ము డ్రా చేశారు. ఆ విధంగా నాలుగు గ్రూపులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు.

డీఎల్‌  గ్రూపులో కొందరు సభ్యులు చనిపోయారు. మిగిలిన చాలా మంది సభ్యులు స్థానికంగా లేరు. వారిపేరున బినామీలను పెట్టి ఫోర్జరీ సంతాలు చేసి  తప్పుడు డ్యాక్యుమెంట్లు ఇచ్చి రుణాలు మంజూరు చేసి స్వాహా చేశారు. లక్ష్మి ప్రసన్న గ్రూపులో కూడా రూ.5 లక్షలు రుణం మంజూరు చేసి డ్రా చేశారు. అలా డ్రా చేశారని తెలియడంతో తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించారు. తనకు మట్టి అంటకూడదని గూపు సభ్యుల సహకారం తీసుకున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తానని చెప్పి కొత్తగా గ్రూపు సభ్యులు రుణం తీసుకున్నట్లు  సంతకాలు చేయించి రుణాలను మంజూరు చేసినట్లు తెసింది. గణేష్‌ గ్రూపు సభ్యులు ఈ వ్యవహరంపై అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఫిర్యాదు
డ్వాక్రా గ్రూపుల రుణాల్లో అక్రమాలు జరిగిన మాట నిజమేనని గతంలోనే వెలుగు అధికారులు గుర్తించారు. అప్పటి వెలుగు ఏరియా కోఆర్డినేటర్‌ ధనుంజయ్‌ బ్యాంకు మేనేజర్‌పై   ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో యానిమేటర్‌ కాంతమ్మకు సంబంధముందని తొలగించారు. తరువాత టీడీపీ ఇన్‌చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి ఆమెను యానిమేటర్‌గా కొనసాగించారు. డ్వాక్రా గ్రూపు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ 2017మార్చిలో సిండికేట్‌ బ్యాంకులో స్వాహా పర్వం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. అప్పటి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాఘనాధరెడ్డి ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ఆయన గుర్తించారు.  అప్పడు స్థానిక టీడీపీ నాయకుల జోక్యంతో కేసు బయటకు రాకుండా తొక్కిపట్టారు. తరువాత వచ్చిన బ్యాంకు మేనేజర్లు ఈ అక్రమాల జోలికి వెళ్లకుండా మిన్నకుండి పోయారు. దీంతో విచారణ రెండేళ్లుగా సాగుతూనే వచ్చింది. 

మేనేజరుపై ఫిర్యాదు
మేనేజరు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికారులు కేసు నమోదుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో అప్పటి  బ్యాంకు మేనేజర్‌ లీలాప్రతాప్‌ పోలీసులకు ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రూ.2.22 కోట్ల రుణాల మంజూరులో మేనేజరు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేశారని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు ఇచ్చారని, అధికారాలను దుర్విని యోగం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సీఐ కంబగిరి రాముడు వేగవంతం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఆయన విచారణను వేగవంతం చేశారు.  వెంకటసుబ్బయ్య, కాంతమ్మ, బ్యాంకు మాజీ మేనేజర్‌ జయంత్‌ బాబులను విచారించారు.

ముగ్గురు అరెస్టు
ఖాజీపేట : సిండికేట్‌ బ్యాంక్‌లో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్‌ మాజీ మేనేజర్‌ జయంత్‌ బాబు శనివారం అరెస్ట్‌ అయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లయ్య అనే కీలక నిందుతుడు పరారీలో ఉన్నాడని మైదుకూరు రూరల్‌ సిఐ కంబగిరాముడు, ఖాజీపేట ఎస్‌ఐ రోషన్‌లు తెలిపారు. జయంత్‌ మేనేజర్‌గా పనిచేసిన కాలంలో దళారులను పెట్టుకుని బ్యాంకును అడ్డంగా దోచాడని తేలిందన్నారు. విచారించి ఖాజీపేట యానిమేటర్‌ కాంతమ్మ.. మీసాల వెంకటసుబ్బయ్యలను కూడా అరెస్టు చేశామన్నారు.  ఫోర్జరీ సంతకాలతో పాటు దొంగ వెబ్‌ల్యాండ్, డాక్యుమెంట్లను సృష్టించిన ఎల్లయ్య పరారీలో ఉన్నాడు.  త్వరలో పూర్తి విచారణ జరిపి రూ.2.22 కోట్లు రుణాల రికవరీ చేయాల్సి ఉందని తెల్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement