ఆహారం, మద్యం ఇవ్వనందుకు రిసార్ట్ మేనేజర్‌ను చంపేసిన పోలీసులు
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్‌హౌసీ దగ్గర్లోని బనీఖేత్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు.
రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్‌పైనా దాడికి తెగించారు.
ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment