Manhandled
-
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక
-
పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక
లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు. -
మహిళలపై దాడులు.. 200 మంది బుక్కు
నాసిక్: నాసిక్‌లో కొంతమంది మహిళా ఉద్యమకారులపై దాడి జరిగింది. ఇక్కడి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సదరు మహిళపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు మొత్తం 200 మందిపై కేసులు నమోదుచేశారు. నాసిక్ లో ప్రముఖ త్రయంబకేశ్వర్ ఆలయం ఉంది. ఇందులోకి అనుమతించాలంటూ కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే ఉదయం పూట అనుమతి కుదరదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు వారిపై దాడులు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షడు అనఘా పఖడే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుణెకి చెందిన స్వరాజ్య సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తి విలేకరులతో మాట్లాడుతూ తమ మహిళల పక్షాన నిలబడి ఉదయం 5గంటల నుంచి ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తామని, ఆలయ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చిన అనుమతి ఇవ్వలేదని చెప్పారు. -
కొట్టి, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు
న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు సోమవారం అర్థరాత్రి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. ప్రత్యేకంగా తనను కొట్టారని, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కు చెందిన రైతులకు యోగేంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరంతా దేశవ్యాప్త మద్దతును కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ ర్యాలీ పేరిట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో ర్యాలీ తీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.