కొట్టి, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు
న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు సోమవారం అర్థరాత్రి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. ప్రత్యేకంగా తనను కొట్టారని, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
భూసేకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కు చెందిన రైతులకు యోగేంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరంతా దేశవ్యాప్త మద్దతును కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ ర్యాలీ పేరిట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో ర్యాలీ తీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా పోలీసుల తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.