yogendra yadav
-
సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్‌ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. -
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
ప్రతిపక్షాలు బీజేపీ ఉచ్చులో పడరాదు!
యూనిఫాం సివిల్ కోడ్(యూసీ సీ)పై వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఊహించదగిన ప్రతిస్పందనలనే రాబట్టగలిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు యూసీసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముస్లిం సంస్థలు ఒక అడుగు ముందు కేసి దీన్ని మైనారిటీలకు, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకరమైన చర్యగా ఖండించాయి. రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వాన్ని అందరికీ అందించడం కోసం అంటూ యూసీసీని బరిలోకి దించింది బీజేపీ. అయితే లౌకికవాద రాజకీయాలు సంప్రదాయ (మైనారిటీ) మతనాయకులతో గొంతుకలుపుతూ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో విషాదకరమైన, హాస్యస్ఫోరకమైన సైద్ధాంతిక పోరాటానికి వేదిక సిద్ధమైంది. లౌకికవాదం పేరుతో ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయమని ఊహించే బీజేపీ ఈ చదరంగాన్ని ప్రారంభించి ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలు చట్టవిరుద్ధంగా హిందూ మతాన్నీ, సంప్రదాయాలనూ, జాతీయవాదాన్నీ ఆక్ర మించి ముందుకు వెళుతుంటే లౌకికవాద రాజకీయాలు ఆ మేర వెనకబడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ప్రతిపక్షాలు పప్పులో కాలువేసి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్ప డటానికి కారణమవుతున్నాయి. ఈ తిరోగమనం ఆగాలంటే, లౌకిక రాజకీయాలు ఉమ్మడి పౌరస్మృతి పట్ల సూత్రప్రాయమైన, ప్రగతిశీలమైన పాత్ర పోషించాలి. యూసీసీకి ఏ ఒక్క మతానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలతో ప్రమేయం ఉండదనీ, దీని ద్వారా వివిధ మతపరమైన సమూహాల్లోనూ, సమూహాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వాన్ని పాదుకొల్పడమే ప్రధాన ఉద్దేశం అనే సంగతినీ గుర్తెరగాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరికీ ఒకే విధమైన న్యాయాన్ని ప్రదానం చేయడం దీని ఉద్దేశమని గ్రహించాలి. యూసీసీని వ్యతిరేకించడం పేలవమైన రాజకీయం! 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లౌకికవాదులకు ఇది చెడు రాజకీయ వ్యూహం అని చెప్పక తప్పదు. ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన చట్టం ముందు సరళమైన, శక్తిమంతమైన హేతుబద్ధ సమానత్వాన్ని ప్రతిపాదిస్తోంది. పౌరు లందరినీ ఒకే శిక్షాసమ్మృతి ద్వారా పాలించగలిగితే, సివిల్ కోడ్‌కు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? అలాగే వివిధ సంఘాలు వారి ప్రత్యేక ఆచారాలను సంప్రదాయాలను ఆస్వా దించవచ్చు, అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఏ సంఘాన్నైనా అనుమతించవచ్చా? ఒక మతం లేదా సంస్కృతికి చెందినవారు తమ ఆచారం పేరుతో సొంత సమా జంలోని మహిళల సమానత్వ హక్కును హరించడాన్ని అనుమ తించవచ్చా? ఇవి బీజేపీ వాదనలు కావు. యూసీసీ కోసం మహిళా సంస్థల అసలు డిమాండ్ వెనుక ఉన్న కారణం ఇదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఈ న్యాయబద్ధం కాని ఆదేశిక సూత్రము (సమానత్వం)ను కలిగి ఉంది. భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్‌ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూనే ఉన్న మనలాంటి వారు ఈ కీలక సూత్రాలలో ఒకదాని నుంచి అకస్మాత్తుగా వెనుదిరగలేరు. జాతీయ ఎన్నికలకు 10 నెలల ముందు, లా కమిషన్ అంతకు ముందు తిరస్కరించిన యూసీసీనే తిరిగి ప్రవేశ పెట్టాలని బీజేపీ భావించడం మైనారిటీలను దెబ్బతీయడానికి మరొక సైట్‌ను తెరవడమే. కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ చట్టాల సంస్కరణలను హిందువుల గొంతుకపైకి నెట్టేయ గలవనీ, అయితే ముస్లింలు, క్రిస్టియన్ల విషయంలో అలా చేయడానికి ధైర్యం చేయవనీ దీని ఉద్దేశ్యం. ముస్లిం, క్రైస్తవ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో ప్రతిపక్షాలు గొంతు కలుపు తాయని ఊహించే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించి తప్పు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ పన్నిన యూసీసీ ఉచ్చులో పడిపోతున్నాయి. ప్రతిపక్షాలు యూసీసీ ఆలోచనను వ్యతిరేకించే బదులు, ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌ను బీజేపీ ఏ విధంగా తప్పుగా వ్యాఖ్యా నిస్తుందో చెప్పాలి. ‘యూనిఫాం’ సివిల్ కోడ్ అంటే దేశంలో బహుళ కుటుంబ చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండాలి. పైగా ఆ చట్టం అన్ని మత వర్గాల సభ్యులకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఇదే ముందుకు తేవాల్సిన వెర్షన్. కానీ బీజేపీ విమర్శ కులు ప్రతిఘటిస్తున్న సంస్కరణ ఇది. ఇది రాజ్యాంగ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. సంఘ సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం, స్త్రీవాద ఉద్యమం డిమాండ్ వంటివి ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఏకరూప కోడ్ అనేది ఒకే రూపంలో కానీ ఒకే సూత్రంగా కానీ ఉండదు. బదులుగా, ఇది ఉమ్మడి సూత్రాలు, విభిన్న నియ మాలను కలిగి ఉంటుంది. ఇక్కడ, ఏకరూపత అంటే అన్ని మత, సామాజిక సంఘాలు ఒకే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండడం. సమానత్వ హక్కును, వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కును, లింగ న్యాయం ఆలోచనను ఉల్లంఘించేలా ఏ కమ్యూ నిటీకి చెందిన కుటుంబ చట్టం అనుమతించబడదు. ఈ సూత్రా లను ఉల్లంఘించే ఏ ఆచారం లేదా కుటుంబ చట్టానికి స్థానం ఉండదు. అదే సమయంలో, ఈ ఉమ్మడి సూత్రాలు వివిధ సంఘాలకు వేర్వేరు రూపాలను తీసుకోవచ్చు, వాటి ప్రస్తుత లేదా క్రోడీకరించిన పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. హిందూ ఆచారాల మాదిరిగా కాకుండా, ముస్లిం వివాహం ‘నిఖా నామా’పై ఆధారపడిన ఒప్పందం. ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌కు ముస్లింలు దీనిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, లేదా హిందువులు దానిని స్వీకరించాల్సిన అవసరం లేదు. వివిధ సంఘాలు అందరికీ ఉద్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంత కాలం... వివాహం, విడాకులు, దత్తత, వారసత్వా నికి సంబంధించి పూర్తిగా భిన్నమైన, పరస్మర విరుద్ధమైన ఆచా రాలు, పద్ధతులను అనుసరించడం కొనసాగించవచ్చు. చాలా కాలంగా, లౌకిక రాజకీయాలు బీజేపీ చొరబడిన నేలను ఖాళీ చేశాయి. ప్రతిపక్షాల ఈ స్వీయ–ఓటమి రాజకీ యాలకు యూసీసీ మరొక ఉదాహరణగా మారకూడదు. బీజేపీ రచించిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటానికి, మైనారిటీ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో చేతులు కలపడానికి బదులుగా, లౌకిక రాజకీయాలు బీజేపీ బుకాయింపునకు ఎదు రొడ్డాలి. ప్రతిపాదిత యూసీసీ గణనీయమైన ముసాయిదాను సమర్పించమని అడగాలి. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్‌ను నిర్మించనుంది చిత్రాంగదా. -
రైతు ఆదాయంపై అర్ధసత్యాలు
దేశంలోని రైతు కుటుంబాల పరిస్థితిపై ఇటీవలే వెలుగులోకి వచ్చిన జాతీయ గణాంకాల సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్) సర్వే వెల్లడించిన వాస్తవాలకంటే అది దాచిపెట్టిన నిజాలే ఎక్కువగా ఉంటున్నాయి. సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తోందని ఈ సర్వే చెబుతోంది కానీ, అది అర్ధసత్యం మాత్రమే. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, సాగు ద్వారా మాత్రమే రావడం లేదు. ఇతర శ్రమలు, ద్రవ్యోల్బణం వంటివి తీసివేస్తే, పంట సాగు ద్వారా రైతుకు వచ్చే నెలవారీ ఆదాయం రూ. 3,798 మాత్రమే. మొత్తం రైతు కుటుంబ ఆదాయంలో ఇది చాలా చిన్న భాగమనే వాస్తవాన్ని ఈ సర్వే దాచిపెట్టింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోని ఈ సగటు గణాంకాలు అటు రైతులకూ, ఇటు దేశానికీ మేలుకొలుపు కావాలి. దేశంలో గత కొద్ది నెలలుగా సాగుతున్న రైతుల ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందిన నినాదాల్లో ‘మా తిండికోసం, మా పంటకోసం’ మేం పోరాడుతున్నాం అనేది ఒకటి. దేశంలోని రైతుల పరిస్థితులపై తాజాగా వెలువడిన ఒక అధికారిక సర్వే, ఈ నినాదం సంపూర్ణ సత్యమని చూపిస్తోంది. 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన కేంద్రప్రభుత్వ కీలక నివేదిక వెల్లడిస్తున్న అంశాలు... మన విధాన నిర్ణేతలు, రాజకీయ నేతలకు మాత్రమే కాకుండా రైతులు, రైతుల ఉద్యమాలకు కూడా మేలుకొలుపు కలిగిస్తున్నాయి. గ్రామీణ భారతంలో 2019లో వ్యవసాయ కుటుంబాలు, వారి స్వాధీనంలో ఉన్న భూమి, పశుగణం తదితరాల పరిస్థితి అంచనాపై ఎన్ఎస్ఎస్ 77వ నివేదిక పట్ల దేశం ఎంతో ఆసక్తితో వేచి చూసింది. ఎట్టకేలకు విడుదలైన ఆ సర్వే నివేదిక ప్రధానంగా ఒక అంశంపై దృష్టి పెట్టింది. సగటు వ్యవసాయ కుటుంబంపై ఉన్న రుణభారం రూ. 47 వేలనుంచి రూ. 74 వేలకు అమాంతంగా పెరిగిపోయిందని ఈ సర్వే తెలిపింది. ఇది కలవరపెట్టే అంశం. రైతుల పరిస్థితి మెరుగవుతోంది అని చెబుతున్న తరుణంలోనే వారు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా పేరుకుపోతున్నాయి. కాని ఇది వ్యాధికాదు, వ్యాధి లక్షణం మాత్రమే. అసలైన సమస్య ఏదంటే రైతు ఆదాయమే. లేదా ఆదాయం లేకపోవడమేనని చెప్పాలి. రైతుల ఆదాయం గురించి ఈ సర్వే ఏం చెబుతోందంటే... దేశంలో సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల దాకా ఆదాయం సంపాదిస్తోంది. నిజానికి పట్టణాల్లోని ఇళ్లలో పనిచేస్తున్న వారు సంపాదించే ఆదాయం కంటే ఇది తక్కువ. 2013లో నిర్వహించిన ఇదే సర్వేలో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 6,442లు ఉండగా, ఆరేళ్ల తర్వాత అంటే 2019లో సగటు రైతు కుటుంబం ఆదాయం రూ. 10,218లకు పెరిగింది. ఈ లెక్కలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పైగా, ఇవి వెల్లడించిన అంశాల కంటే దాచి ఉంచినవే ఎక్కువ. ఈ లెక్కలు సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ సంపాదిస్తోందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. రైతు కుటుంబం మూల ఆదాయం తక్కువగానే ఉంటున్నప్పటికీ, అది హేతుపూర్వక రీతిలో పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దీనికంటే వాస్తవాన్ని కప్పిపుచ్చే అంశం మరొకటి ఉండదు. ఇదెలాగో చూద్దాం మరి. ఎన్ఎస్ఎస్ సర్వే గణాంకాలతో సమస్య మొదటగా, రైతుల ఆదాయం అని చెబుతున్నది సగటు కుటుంబ ఆదాయమే కాబట్టి ఇది వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. పదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి నెలకు దాదాపుగా రూ. 30 వేల వరకు సంపాదిస్తున్న బడా రైతులను కూడా సగటు కుటుంబాలలో కలిపేశారు. బడా రైతు కుటుంబాలు సంపాదిస్తున్న ఈ మొత్తం కంటే ప్రభుత్వంలోని నాలుగో గ్రేడ్ ఉద్యోగి సంపాదించేదే ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఒకటి నుంచి 2.5 హెక్టార్ల వరకు భూమిని సాగు చేస్తున్న మధ్యతరగతి రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,571ల కంటే తక్కువగానే ఉంటుంది. రెండోది, ఇది వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం కాదు. వ్యవసాయ కుటుంబం సంపాదిస్తున్న ఆదాయం. ఈ రెండింటికి తేడాను అర్థం చేసుకోవడమే చాలా కీలకమైంది. రైతు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రైతు కాదు. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వ్యవసాయం ద్వారా మాత్రమే రావడం లేదు. వ్యవసాయ కుటుంబం అనే భావనను ఈ సర్వే విస్తృత ప్రాతిపదికన నిర్వచిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కుటుంబం పంటల ద్వారా, లేక పశుపెంపకం ద్వారా అతి తక్కువ ఆదాయం మాత్రమే సంపాదిస్తున్నాయి. రైతు కుటుంబంలో తండ్రి పొలం పని చేస్తే, తల్లి పశువులను మేపుతుంది. కుమార్తె స్థానిక పాఠశాలలో బోధిస్తుంటే, రైతు కుమారుడు షాపు నడుపుతుంటాడు. వ్యవసాయ కుటుంబం ఇలాగే ఉంటుంది. ఒక రైతు కుటుంబం సంపాదిస్తున్న ఈ నాలుగు రకాల ఆదాయాన్ని కలిపేసి ఈ మొత్తాన్ని వ్యవసాయ కుటుంబ ఆదాయంగా లెక్కిస్తున్నారు. మొత్తంమీద చూస్తే పంట సాగు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రైతు ఆదాయంలో చాలా చిన్న భాగం. ఇది ఊహాజనితమైన ఉదాహరణ కాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రైతు కుటుంబం సంపాదించే ఆదాయంలో మూడోవంతు మాత్రమేనని తాజా సర్వే చెబుతోంది. ఒక నెలలో సగటు రైతు కుటుంబం రకరకాల పంటల సాగు ద్వారా రూ. 3,798లు సంపాదిస్తోంది. ఇక పశువుల పెంపకం ద్వారా రూ. 1,582లను, వ్యాపారం నుంచి రూ. 641లను, కూలీలు, వేతనాల ద్వారా రూ. 4,063లను ఆర్జిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, రైతు కుటుంబం తన సొంత భూముల్లో పనిచేయడం కంటే తన శ్రమను ఇతరత్రా వెచ్చించడం ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది. కాబట్టి పైన చెప్పినట్లుగా రైతు వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం రూ. 3,798లు మాత్రమే. మన రైతులు ఎందుకు పట్టణాలు, నగరాలకు పరుగెడుతున్నారో, ప్రభుత్వోద్యోగాలకు ప్రతి ఒక్కరూ ఎందుకింతగా వెంపర్లాడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. మూడు, ఈ కనీస మొత్తాన్ని కూడా అతిశయించి చెబుతున్నారు. రైతు ఆదాయాన్ని అధికం చేసి చూపడంలో సర్వే పరిమితి దాటినట్లుంది. రైతుచేతికి వస్తున్న డబ్బు మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులను అమ్మగా వస్తున్నదేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. పంటల సాగుకు అయ్యే ఖర్చులన్నీంటినీ రైతు నేరుగా చెల్లించిన తర్వాత రైతుకు మిగులుతున్న ఆదాయంగా ఇవి సూచిస్తున్నాయి. ఈ వ్యత్యాసమే రైతుకు లాభం అని అంచనా వేశారు. రైతు కుటుంబం సొంత శ్రమ, ఇతర పెట్టుబడులను సాగు ఖర్చులో కలపడం లేదు. నగదు రూపంలో చెల్లించని ఈ మొత్తాల విలువను కూడా లెక్కించినట్లయితే, మొత్తం పంట సాగు ఖర్చు, వశుపెంపకం ఖర్చులు ఎక్కువై రైతు లాభం అంటున్నది తగ్గిపోతుంది. ఈ సరైన పద్ధతిని మీరు అనుసరిస్తే, పంట సాగు ద్వారా రైతుకుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం కేవలం రూ. 3,058లకు, పశుపెంపకం ద్వారా వచ్చే ఆదాయం రూ. 441లకు పడిపోతుంది. ఈ లెక్కన రైతు కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 8,337లు మాత్రమే అని స్పష్టమవుతుంది. నాలుగు, రైతుల ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తోందంటూ సర్వే చెబుతున్నది అసత్యం. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బ ణాన్ని లెక్కలోకి తీసుకోని సాధారణ లెక్కలు. 2013, 2019 మధ్యకాలంలో అంటే అప్పటి, ప్రస్తుత సర్వే నిర్వహించిన మధ్య కాలంలో రైతుల నామమాత్రపు ఆదాయం 59 శాతం పెరిగింది. కానీ ఈ లెక్కలను మీరు ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినట్లయితే, (2019 కోసం గ్రామీణ భారత్‌కి వినియోగదారీ ధరల సూచి, బేస్ ఇయర్ 2012), రైతు ఆదాయం పెరుగుదల 22 శాతం మాత్రమే. అంటే ముందే చెప్పినట్లుగా ఇది రైతు కుటుంబం మొత్తానికి అన్ని రకాల ఆదాయాలు కలిసి వచ్చిన ఆదాయ పెరుగుదల అన్నమాట. పంట సాగు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే మనం చూసినట్లయితే, ఈ ఆరు సంవత్సరాల్లో రైతు కుటుంబం ఆదాయం వాస్తవానికి క్షీణించిపోయింది. 2013లో రైతు పంట సాగు ద్వారా రూ. 3,081లు సంపాదించేవాడు. 2012 బేస్ ఇయర్లో ధర ప్రకారం ఇది రూ. 2,770లకు సమానం. ఈ బేస్ ఇయర్‌ని మనం నిలుపుకున్నట్లయితే, రైతుల తాజా నెలవారీ ఆదాయం (రూ. 3,798) కేవలం రూ. 2,645లకు సమానం. అంటే గత ఆరేళ్లలో రైతుల ఆదాయం 5 శాతం తగ్గిపోయిందన్నమాట. కాబట్టి ఈ సర్వేకి వాస్తవమైన శీర్షిక ఇలా ఉంటే యుక్తంగా ఉంటుంది. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చారిత్రాత్మక మిషన్ నిజానికి చారిత్రాత్మక తిరోగమనానికి దారితీస్తోంది’. యోగేంద్రయాదవ్ వ్యాసకర్త జై కిసాన్ ఆందోళన్ సహ సంస్థాపకుడు, స్వరాజ్ ఇండియా సభ్యుడు -
ఈ విజయం... నూతన శుభోదయం
ప్రపంచ క్రీడారంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్న దుర్బలులకు 1970లలో హాకీ, 1980ల వరకు క్రికెట్ ఓ గర్వకారణంగా, ఒక సామాజిక హోదాగా ప్రాతినిధ్యం వహించేవి. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. ప్రస్తుతం క్రికెట్ చుట్టూ అలుముకుంటున్న జనబాహుళ్యపు ఉన్మాదం మన సాంస్కృతిక మొరటుదనానికి ప్రతీకగా ఉంటోంది. అవమానాల పాలైన భారతీయులకు – నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా అప్పట్లో క్రికెట్ హీరోలు రంగంమీది కొచ్చారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారతీయ హాకీ సాధించిన ఈ పునరుజ్జీవనం... మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోందని అందరికీ హామీనిచ్చింది. మరుగునపడి ఉండవచ్చు కానీ అది మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. సాధారణంగా నేను పెందలకడనే లేచే వ్యక్తిని కాదు. కానీ ఈ మంగళవారం ఉదయం నాకు భిన్నంగా కనిపించింది. ఒలింపిక్ హాకీ సెమీ ఫైనల్లో భారత్–బెల్జియం మ్యాచ్ చూడటం కోసం నేనూ నాతోపాటు కుటుంబం మొత్తంగా త్వరగా నిద్రలేచాం. ఇరు జట్లమధ్య జరిగిన పోటీ అసంఖ్యాక భారతీయ అభిమానులకు లాగే మమ్మల్ని కూడా పరవశం నుంచి, ఆందోళన, బాధవరకు అనేక అనుభూతులతో కదిలించివేసింది. నిజానికి భారత హాకీ జట్టు గొప్పగా ఆడింది. కానీ ఆ పోటీలో ఓడిపోవడం మాకు అవమానం కలిగించలేదు. అంతకుముందు హార్దిక్ సింగ్ బ్రిటన్ జట్టుపై చేసిన ఏకైక, అద్భుతమైన గోల్‌ను చూస్తున్నప్పుడు కలిగిన ఆ మొదటి ఆనందం ఇప్పటికీ మనసులోంచి తొలిగిపోలేదు. లేదా మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కలిగిన చక్ దే మూమెంట్ గర్వాతిశయాన్ని కూడా మర్చిపోలేదు. ఆ ఘటన నాకు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి నా పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చింది. నేను చదువుకున్న శ్రీ గంగానగర్ లోని ఎస్జీఎన్ ఖల్సా హయ్యర్ సెకండరీ స్కూల్లో గ్రామీణ సిక్కు అబ్బాయిలు ఎక్కువగా ఉండి ఆటలకు ఎంతో పేరుపొందింది. ఆ రోజుల్లో రాజస్తాన్ తరపున ఆడుతున్న 11 మందిలో 6 నుంచి 8 మంది సభ్యులు మా స్కూలుకి చెందినవారే. తర్వాత నేను చదివిన ఎస్జీఎన్ ఖల్సా కాలేజీ కూడా హాకీ, అథ్లెటిక్స్‌లో అదే రకమైన పేరు కలిగి వుండేది. నా తోటివారి లాగే నేను కూడా అప్పట్లో హాకీకి పెద్ద అభిమానిగా ఉండేవాడిని. అప్పటికే భారతీయ హాకీ తన స్వర్ణ యుగాన్ని దాటేసింది కానీ అంతర్జాతీయ ప్రతిష్ట, గుర్తింపు నుంచి ఇంకా దూరం కాలేదు. 1975లో కౌలాలంపూర్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన గేమ్‌లో అస్లామ్ షేర్ ఖాన్ చివరి నిమిషంలో చేసిన గోల్ మన హాకీ వైభవాన్ని నిర్వచించిన ఘటనగా మిగి లిపోయింది. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. అలాగని మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం కానీ దానికి ఒక ప్రతిష్ట అంటూ ఉండేది. నా తరంలో చాలామందికి లాగే, హాకీ పట్ల నా అనురక్తి మెల్లగా క్రికెట్ వైపుకు మళ్లింది. 1974–75 శీతాకాలం సీజన్లో క్లైవ్ లాయిడ్ జట్టు భారత్‌కు రావడంతో అది మొదలైంది. ఈ సీరీస్‌లోనే గార్డన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్ తమ తొలి మ్యాచ్ ఆడారు. నాకు వ్యక్తిగతంగా జి. విశ్వనాథ్, బ్రిజేష్ పటేల్, బీఎస్ చంద్రశేఖర్ అంటే చాలా ఇష్టం. వీరంతా కర్ణాటకకు చెందినవారే. ఆ పోటీలో భారత్ సిరీస్ కోల్పోయింది కానీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 1976 ఒలింపిక్స్‌లో ఆస్ట్రో టర్ఫ్‌ని ప్రవేశపెట్టడంతో భారతీయ హాకీ ప్రాభవం మళ్లీ పుంజుకోలేనంతగా పతనమార్గం పట్టింది. 1980 నాటి మాస్కో ఒలింపిక్స్‌లో సులభంగా మన జట్టు స్వర్ణం సాధించిం దనుకోండి. ఆ సమయంలోనే క్రికెట్ ఆటకు ప్రాచుర్యం పెరగడం, 1983 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు డ్రీమ్ విక్టరీ సాధించడం కాకతాళీయంగా జరిగిపోయింది. మా స్నేహితులు కొందరు ముందుకొచ్చి స్థానిక క్రికెట్ టీమ్‌ను నెలకొల్పారు. దానికి ఎలెవన్ స్టార్ క్లబ్ అని మహా గొప్ప పేరుండేది. అప్పటికింకా ప్రారంభించని నూతన ఏపీఎంసీ మైదానం మా క్రికెట్ గ్రౌండ్‌గా ఉండేది. క్రమంగా క్రికెట్ స్టార్లు (ఈ జాబితాలో నేను కపిల్ దేవ్‌ను చేర్చాను) కొత్త జాతీయ హీరోలు అయ్యారు. భారతజట్టు అప్పటికీ ప్రాధాన్యత లేని జట్టుగానే ఉండేది. ప్రత్యర్థులను అçప్పుడప్పుడూ ఓడిస్తూ మన గర్వాన్ని కాస్త పెంచుతూ వచ్చేది. భారత్ ఆడనప్పుడు నేను వెస్టిండీస్‌కి చెందిన వివియన్ రిచర్డ్స్, పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్‌ను ఆరాధించేవాడిని. మూడో ప్రపంచ దేశాలకు, అలీనోద్యమానికి సంఘీభావం తెలుపుతున్న రోజులవి. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నేను క్రీడా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాను. క్రికెట్ పట్ల నా ఆసక్తిని నా వృత్తిపట్ల అనురక్తి కనుమరుగు చేస్తూ వచ్చింది. హాకీ గతించిన జ్ఞాపకంలా ఉండేది. అలాంటి సమయంలో ‘లగాన్’ మళ్లీ ప్రేరణ కలిగించింది కానీ క్రికెట్ పట్ల నా ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ‘చక్ దే! ఇండియా’ భారత్‌ని ఆనందభాష్పాలతో ముంచెత్తింది కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటిది ఏదీ మిగలలేదు. ఆ తర్వాత నా కుమారుడు కొన్నేళ్ల క్రితం నాలోని క్రీడాసక్తిని తిరిగి వెలిగించిన సమయానికి క్రికెట్ కొత్త గేమ్‌గా అవతరించింది. ట్వంటీ 20 టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌ని, పేస్‌ని కూడా మార్చేసింది. ఈ సరికొత్త మార్పులను నేను చిన్నచూపు చూడలేదు. టీ20 మ్యాచ్‌లంటే నాకు ఇష్టం. సిక్సర్ల విందును మనం ఎందుకు ఆస్వాదించకూడదు? బ్యాట్స్మన్ల కోసం రూపొందిన ఒక ఫార్మాట్ ఇప్పుడు బౌలర్లకు స్వర్గధామం కావడం చూసి ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు భారతీయ క్రికెట్లోని ఈ టాలెంట్ పూల్‌ని చూసి నిజంగానే దిగ్భ్రాంతి చెందుతున్నాను. ఇప్పుడు క్రికెట్ ఒక విస్తరించిన వినోద పరిశ్రమగా మారిపోయింది. మనం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ హబ్‌కి చెందినవారమని నాకు తెలుసు. కానీ నా జాతీయ స్వీయగౌరవానికి అది అదనంగా దేన్నీ జోడించదు. ముఖానికి రంగు పూసుకుని, టీషర్టులు ధరించి ఇంటా బయటా క్రికెట్ చూస్తున్న భారతీయ అభిమానులను చూస్తుంటాను. కానీ వారి ఆనందపు అరుపులు, హోరుకేకల్లో నేను భాగం కాలేదు. 2007లో టీ20 ప్రపంచ కప్‌లో మన విజయం 1983 ప్రపంచకప్, 1975 ప్రపంచ హాకీ కప్ విజయంతో సమానమైంది కాదని నా అభిప్రాయం. ఈసారి ఒలింపిక్స్‌లో మన హాకీ జట్లపై కూడా నా అభిప్రాయం ఇదే. హాకీ కూడా మారిందనడంలో సందేహమే లేదు. నాలుగు క్వార్టర్ల ఫార్మాట్, గేమ్ తీరు, కొత్త నిబంధనలు చోటు చేసుకున్నప్పటికి మౌలికంగా అది ఒకనాటి క్రీడనే తలపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టు నెగ్గినప్పుడు 46 ఏళ్ల క్రితం అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలోని జట్టు సాధించిన విజయానుభూతులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పటి మన మహిళా హాకీ ప్లేయర్ల విజయగాథలు 1970ల నాటి భారతీయ హాకీ క్రీడాకారుల విజయగా«థలకు తీసిపోవు. ఒలింపిక్ పతకాలు మనవాళ్లు గెలవకపోయినా నేను లెక్క చేయను. (భారత పురుషుల హాకీ టీమ్ కాంస్యం దక్కించుకోగా, శుక్రవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో మన మహిళల టీమ్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది.). ఒకటి మాత్రం నిజం మన పురుషులు, మహిళల హాకీ టీమ్ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మన జాతీయ సంకేతాలుగా నిలుస్తారు. ఇది నా కథ మాత్రమే కాదు. వలస పాలనానంతర జాతీయవాదం నుంచి కఠినమైన అల్ట్రా జాతీయవాదం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఒక తరం గాథ కూడా. క్రికెట్ చుట్టూ వలసవాద రాజకీయాల కథపై రాసిన ఆశీష్ నంది మనకో విషయం గుర్తుచేశారు. ‘మూలాలు మర్చిపోయిన, అవమానాల పాలైన, సంస్కృతి కోల్పోయిన భారతీయులకు– నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా క్రికెట్ హీరోలు రంగంమీదికొచ్చారు’. ఈ నేపథ్యంలో భారతీయ హాకీ పునరుజ్జీవనం మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోం దని నాకు హామీ ఇస్తోంది. అది మరుగున పడి ఉండవచ్చు కానీ మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ సంస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈ ఫలితాలు కారుచీకట్లో కాంతిరేఖలు
ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. అధికారం కోసం ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. కానీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఈసారి తీర్పు భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. ఏం చేయకూడదు అని గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. ఎట్టకేలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ చీకటి దినాల్లో తప్పనిసరిగా అవసరమైన ప్రారంభం ఇది. ఏం చేయకూడదు అని మనం గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. సాధారణ ఎన్నికల రాజకీయాల గణాంకాలను దాటి చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిజంగానే అద్భుతమని చెప్పాలి. సాధారణ సమయాల్లో ఒక జనరంజక ముఖ్యమంత్రి మూడోసారి కూడా అధికారంలోకి రావడం గొప్ప విశేషమేమీ కాదు. కానీ బీజేపీ ఓటు షేర్ పెరగడం గొప్ప ముందంజ గానే గుర్తించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న ఒక రాజ కీయ పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడంపై వేడుకలు జరుపుకోవడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు. కాని ఇది సాధారణ ఎన్నికలు కావు. అధికారాన్ని కొల్లగట్టడానికి ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రం లోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే సర్వతోముఖ దాడి ప్రారంభించడానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంచుకుంది. డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. ఎన్నికల కమిషన్‌కు ఉన్న పవిత్రత నుంచి, కేంద్ర భద్రతా బలగాల తటస్థత, కోవిడ్ నిబంధనల వరకు ప్రతి అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుంది. బీజేపీ నేతలు తమ విజయాలను ఏకరువు పెట్టడం బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు. అయినప్పటికీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. బెంగాల్‌ని బీజేపీ కనుక కైవసం చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదో కాస్త ఊహించండి మరి. వేడుకలు, విజయధ్వానాలు మరోవైపు ప్రతిపక్షంలో భయాందోళనలు.. కాని మన గణతంత్ర ప్రజాస్వామ్యం ఒక్క రోజులోనే తన స్థానాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ప్రకటించుకుంది. కేంద్రపాలకులకు ఇంత భంగపాటు కలగడంతో అనూహ్య అవకాశాలకు వీలుకల్పించినట్లయింది. మనం ఇప్పుడు కరోనా మహమ్మారి సుడిగుండంలో ఎంతగా చిక్కుకుపోయామంటే, మోదీ వీర భక్తాగ్రేసరులు కూడా ప్రస్తుత కేంద్ర పాలనపై అనుమానాస్పద దృష్టితో చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన నుంచి ఇంకా మనం బయటపడలేదు. పైగా సెకండ్ వేవ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోవచ్చు. పైగా చారిత్రాత్మక రైతాంగ నిరసనకు మనం సాక్షీభూతులుగా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి తీర్పు రావడం అనేది ప్రస్తుత కేంద్రపాలకులు అఖండులు, అజేయులు కాదనే సత్యాన్ని తిరుగులేనివిధంగా దేశంముందు నిలి పింది. ఇక కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రతిపక్షాల స్థానాన్ని మరింతగా బలోపేతం చేసింది. గత ఏడేళ్లుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి ఈ తీర్పు తిరిగి ఊపిరి పోసినట్లయింది. ఇది మోదీ పాలన అంతానికి నాందీ వాచకం కానుంది. కేంద్రపాలకుల పతనం మొదలు కావచ్చు. కానీ ఈ గొప్ప అవకాశానికి మనం ఎలా స్పందిస్తాం అన్నదాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ తీర్పు దేనికి వ్యతిరేకమో గుర్తించడం చాలా అవసరం. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కృతి కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనతో ఉంటున్న ముస్లిం ఓటర్ల సమీకరణను లౌకిక రాజకీయాలకు సంకేతంగా చెప్పలేం. అలాగే కరోనా మహమ్మారి, లాక్డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదిది. కేరళను మినహాయిస్తే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల అంశంగా కాలేదు. పెద్దనోట్ల రద్దు ఉదంతంలో లాగే ప్రజలు తమ ఆర్థిక బాధల పర్యవసానాలకు కారణాలపై ఇంకా అనుసంధానం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అసమర్థతపై కూడా ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం అనేది వామపక్ష భావజాలం పట్ల విస్తృత ప్రజానీకం ఆమోదం అని చెప్పడానికి వీల్లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాల పట్ల రైతుల వ్యతిరేకతను కూడా ఈ తీర్పు పెద్దగా ప్రతిబింబించలేదు. అయినా సరే.. ఈ అసాధారణ అవకాశాన్ని మనం వినయపూర్వకంగానే అంగీకరించాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చెందిన విజయగాధగా చెప్పడానికి వీల్లేని అనేకానేక రోజువారీ సంభవించే కారణాల ప్రతిఫలనంగానే బీజేపీ ప్రస్తుత తిరోగమనం సంభవించింది. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ ఒక కీలకాంశంగా పనిచేసింది. కానీ ఇది సుపరిపాలనపై ప్రజాతీర్పు కాదు. అదే నిజమైతే తమిళనాడులో ఏఐడీఎంకే చిత్తుగా ఓడిపోవలసి ఉండాలి. అలాగే అస్సోంలో సోనోవాల్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అలాగే మమతా బెనర్జీ పాలనా రికార్డుకూడా తగుమాత్రమే ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్లో, అస్సోంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ విజయానికి నిర్దిష్టమైన ఎన్నికల నిర్వహణే కీలకపాత్ర పోషించింది. ఈ అవకాశం ఎవరికి సంబంధించనిది అనే అర్థ సత్యాన్ని మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం ఇది. మమతా బెనర్జీ లేక ప్రశాంత్ కిషోర్, పినరయి విజయన్ లేక సీపీఎం, హేమంతా బిశ్వాస్ శర్మ లేదా సోనోవాల్.. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలు అనే అంశంపై చాలా మంది తామే కారణమని ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు పరాజితులెవ్వరు అనే విషయంపై రెండు అభిప్రాయాలు లేవు. అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. రాహుల్ గాంధీ కేరళ నుంచి తొలిసారి ఎంపీ అయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోకూడదు. అలాగే ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టంపై భారీ స్థాయి నిరసనలు చెలరేగిన అస్సాంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రానివ్వకుండా ఉండాల్సింది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. బెంగాల్లో ఊసులేకుండా పోయింది. ప్రజా తీర్పు సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం వహించలేదు. మోదీ అజేయత్వానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పదే పదే తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. కానీ రాష్ట్రాల స్థాయిల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి జాతీయ వ్యాప్త సెంటిమెంట్‌గా మారడంలో వైఫల్యం చోటు చేసుకుంటోంది. ఈసారి తీర్పు మాత్రం భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. 2022 మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ఇలాగే సాగితే మోదీ పాలన ముగింపునకు అది ప్రారంభం కాగలదు. మోదీ పరాజయం పొందవచ్చు. కానీ అది కాంగ్రెస్ చేత కాదు. మోదీ పట్ల పచ్చి వ్యతిరేకత వల్ల కూడా కాకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఒక సవాలు కూడా ఉంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
సాగు చట్టాలపై సుదీర్ఘ పోరు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడీ సంభాల్ దివస్, 24న దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్–కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తామని పేర్కొంది. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే దాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఆ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు: కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆదివారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రైతు ఉద్యమం భావి దార్శనికతా పత్రం
వ్యవసాయంపై సంవత్సరాలుగా అకడమిక్, రాజకీయ స్థాయిల్లో సాగిస్తూ వచ్చిన చర్చలు సాధించలేని ఫలితాన్ని రైతు ఉద్యమం సాధించింది. రైతుల మీదికి మీరు కత్తి ఝళిపించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. గ్రామీణ భారతం జాతీయ భవిష్యత్తుకు కీలకమైనది. భారత రైతాంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు ఉద్యమం భారత భావి దార్శనికతా పత్రం. కేంద్ర ప్రభుత్వ సాగుచట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత డిమాండుతో భారతీయ రైతాంగం గత రెండున్నర నెలలుగా సాగిస్తున్న చారిత్రక ఉద్యమం.. భవిష్యత్తుకు ఒక దార్శనికతను ఏర్పర్చింది. రైతులకూ, వ్యవసాయానికే కాకుండా గ్రామీణ భారతానికి, నిజానికి భారత భవిష్యత్తుకు కూడా ఈ ఉద్యమం ఒక విజన్‌ని నిర్దేశిస్తోంది. రైతాంగ ఉద్యమం ఇప్పటికే చరిత్ర సృష్టించింది. రైతులను ఒక్కసారిగా ఇది జాతీయ ప్రాధాన్యతలోకి తీసుకొచ్చింది. ఉద్యమం ఉనికిలో లేదని మీరు నటించవచ్చు. కాని వాస్తవానికి మన రాజకీయ వర్గానికి దేవుడి మీద భయంకంటే ఎక్కువగా ఓటు మీద భయాన్ని ఈ ఉద్యమం సమర్థవంతంగా కలిగించిందనే చెప్పాలి. రైతుల మీదికి మీరు కత్తి ఝళి పించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. అధికారంలో ఉన్నవారు తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలను మరీ తెలివిగా సమర్థిస్తున్న మార్కెట్ మౌలికవాదుల నోళ్లు మూయించిందీ ఉద్యమం. మార్కెట్ అనుకూల పండితులు ప్రబోధించే.. సంస్కరణలను వేగంగా అమలు చేయాలనే భాషను ఇకపై కార్పొరేట్ దగాకోర్లు మునుపటిలా ఉచ్చరించలేరు. కనీసం కొంతకాలమైనా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే రైతాంగ ఉద్యమం సాధించిన విజయం ఊహలకే పరి మితం అవుతుందంటే అంతకు మించిన విషాదం మరొకటి లేదు. వ్యవసాయ సంస్కరణలను విజయవంతంగా నిలిపివేయటమనేది ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగించేందుకు మాత్రమే పరిమితమైతే అదే పెద్ద విషాదమవుతుంది. కార్పొరేట్ వ్యవసాయ వాణిజ్య విధానాన్ని వెనక్కు నెట్టివేయడం అనేది రైతుల్లో ట్రేడ్ యూనియన్ తత్వాన్ని మాత్రమే ముందుకు తీసుకువస్తే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు భారతీయ రైతులు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న పలువిధాల సంక్షోభాన్ని జాతి ముందుకు తీసుకొచ్చాయి. ఈ చట్టాలు భారతీయ రైతులు అనుభవిస్తున్న వ్యథలకు నాందీవాచకం మాత్రం కాదు. అలాగని సాగుచట్టాల రద్దు అనేది రైతుల అవసరాలను తీర్చే వరం కూడా కాదు. భారత్ భవిష్యత్తుకు గుండెకాయ రైతులే అనే భావనను ఈ మహోద్యమం మరింత ముందుకు తీసుకుపోయింది. భారతీయ వ్యవసాయం మూడు పరస్పరాధారిత సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వ్యవసాయరంగంలో ఆర్థిక సంక్షోభంపై అందరూ దృష్టి పెడుతున్నప్పటికీ, మనందరినీ భయపెడుతున్న పర్యావరణ సంక్షోభాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు సంక్షోభాలు కలిసి రైతులను మనుగడ సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ మూడు సంక్షోభాలను ఏకకాలంలో పరిష్కరించగల కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం రైతులకు ఇప్పుడు చాలా అవసరం. ఈ కొత్త ఒప్పందాన్ని రూపొందించడానికి మన ఆదర్శాలు, విధానాలు, రాజకీయాలు కలిసి ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆర్థిక సంక్షోభాన్ని సులువుగానే వర్ణించవచ్చు. దాదాపుగా మన జనాభాలో సగం వరకు (58 శాతం గ్రామీణ రైతు కుటుంబాలు) వ్యవసాయంలో మునిగితేలుతున్నప్పటికీ వ్యవసాయం ఆర్థికంగా చెల్లుబాటు కావడం లేదు. 86 శాతం రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూములను కలిగి ఉన్నారు. తలసరి దిగుబడి చాలా తక్కువ. పైగా పంట చేతికి రావడం కూడా అనిశ్చితంగానే ఉంటుంది. పంటలకు ధరలు చాలా తక్కువ. వ్యవస్థాగతంగానే ఇలా తగ్గిస్తూ వస్తున్నారు. రైతుల అన్ని రకాల ఆదాయ మార్గాలను కలిపి చూస్తే వారి సగటు నెల ఆదాయం రూ. 8 వేలకు మించడం లేదు. రైతు కుటుంబాల్లో సగం కంటే ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు మన ఆర్థిక వేత్తలు చెబుతున్నదేమిటంటే వ్యవసాయంపై ఆధారపడుతున్న జనాభాను తగ్గించాలనే. అయితే వ్యవసాయరంగం నుంచి తప్పించిన ఈ అదనపు జనాభాను ఏ ఖండానికి తరలించాలి అనే విషయం మాత్రం వీరు మర్చిపోతారు. లేదా ఇప్పటికే దేశం మొత్తంగా నిరుద్యోగం తాండవిస్తున్న నేపథ్యాన్ని పక్కనబెట్టి మన ఆర్థిక వ్యవస్థ లక్షలాది అదనపు ఉద్యోగాలకోసం వేచి ఉంటోం దని ప్రగల్భాలు పలుకుతుంటారు. కష్టపడి పనిచేసేవారికి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఎక్కడ వెదుక్కోవాలి అనేదే అసలు సమస్య. మరోవైపున పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. హరిత విప్లవం ఒక ముగింపుకొచ్చేసింది. సేంద్రియ వ్యవసాయం అద్బుతం గురించి, నీటి అధిక వినియోగంపై మనలో బలపడిపోయిన గుడ్డి విశ్వాసం వల్ల భీతిల్లే స్థాయిలో నేల సారం కోల్పోయి, భూగర్భ జలం దిగజారిపోతూ ఉంది. దీనికి జీవవైవిధ్య క్షీణత, విభిన్న రకాల విత్తనాలు తగ్గిపోవడం, జొన్నలు వంటి చిరుధాన్యాల పంటలు తగ్గిపోవడం, కూలీలను, పశుసంపదను కోల్పోవడం, అడవుల నిర్మూలన వంటివి పరిశీలిస్తే పర్యావరణ సంక్షోభం కొంతమంది పర్యావరణవాదులు ఆడే జూద క్రీడ కాదని అర్థమవుతుంది. ఇప్పుడు వాతావరణ మార్పు అనే సరికొత్త సవాలు గురించి ఆలోచిద్దాం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చితంగా వస్తున్న వర్షరుతువు కారణంగా భారత వ్యవసాయం విధ్వంసం వైపు సాగిపోతోంది. వాతావరణ మార్పు ప్రభావం వల్లే మెట్టప్రాంతాల రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. చివరగా రైతులు తమ ఉనికికి సంబంధించిన సంక్షోభంపట్ల స్పందించాల్సి ఉంది. గత రెండు దశాబ్దాల్లో 3.5 లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో రైతు స్థానం క్షీణించిపోవడం, రైతుల స్థాయి రానురాను పడిపోవడం వారి గౌరవానికి భంగం కలిగిస్తోంది. రైతు రోజుకూలీగా మారిపోవడం, త్వరలోనే వలస కార్మికుడిగా ఆవతారమెత్తడం వంటి కారణాలతో తమ తదుపరి తరం వ్యవసాయాన్ని చేపట్టకూడదని భావించేలా చేస్తున్నాయి. నేడు రైతు ఉద్యమ లక్ష్యం కేవలం మూడు సాగుచట్టాల ప్రమాదాన్ని తప్పించుకోవడం లేదా కొన్ని ఆర్థిక లాభాలను రైతులపరం చేయడానికి మాత్రమే పరిమితమై లేదు. భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఆర్థిక, పర్యావరణ, మనుగడ సంక్షోభాలను ఎలా అరికట్టాలనే దిశగానే ప్రస్తుత ఉద్యమం పయనించగలగాలి. దీని కోసం ఒక ఊహాత్మకమైన ముందజ వేయడం ఎంతైనా అవసరం. భారతీయ వ్యవసాయం భారతీయ పంధాలోనే సాగుతుంది. భారతీయ రైతులు గతం తాలూకా శిథిలాలు కాదు. వారు ఇక్కడ ఉండి జీవించగలగాలి. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. అందిస్తుంది కూడా. జ్ఞానం, టెక్నాలజీలను ఒడిసిపట్టడంలో భారత రైతులకు సాటి లేదు. భారతీయ గ్రామం చరిత్ర పెంట కుప్ప కాదు. గ్రామీణ భారతం అనేక అవకాశాల గడ్డ. మన జాతీయ భవిష్యత్తుకు అది కీలకమైనది. భారత రైతాంగంపై, వ్యవసాయరంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. దీనికి ప్రభుత్వం తన వంతుగా వ్యవసాయానికి మరింత అదనంగా బడ్జెట్లో కేటాయించాలి. వ్యవసాయ రంగానికి ఇంతవరకు ఇస్తున్న సబ్సిడీలు చాలా తక్కువ కావడంతో రైతులకు భవిష్యత్తులో సబ్సిడీలు పెంచాలి. సార్వత్రిక పంటల బీమా, రుణ ఉపశమనం, పునర్మిర్మాణం వంటి సమగ్ర చర్యలపైపు మన వనరులను మళ్లించాలి. వ్యవసాయంలో ప్రైవేట్ చొరవ మరింత అవసరమే కానీ అది ప్రభుత్వ మద్దతు, చొరవ కంటే తక్కువగా ఉండాలి.బడ్జెట్లో మరో 3 లేదా 4 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి మళ్లిస్తే గ్రామీణ భారత్ కోసం ఒక సరికొత్త డీల్ సాకారమైనట్లే. జాతి మొత్తంగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది మన రాజ కీయ నాయకత్వ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది. యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
22 మందిపై కేసులు.. 200 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతులు నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని వచ్చి మరి పోలీసులపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఇక దాడులకు సంబంధించి 22 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. ఇక రైతు ర్యాలీకి సంబంధించి జారీ చేసిన ఎన్ఓసీని ఉల్లంఘించినందుకు గాను స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్‌తో పాటు ఇతర రైతు సంఘాల నాయకులు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాలతో సహా మరి కొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వైరల్: 15 అడుగులో గోతిలో దూకిన పోలీసులు) హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రాజధానిలో అదనపు బలగాలను మోహరించించింది. ఎర్రకోట, జామా మసీద్ మెట్రో స్టేషన్లు మూసివేయడమే కాక సెంట్రల్ ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక నిన్న రాజధానిలో తలెత్తిన హింసాత్మక ఘటనలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని.. అందువల్లే హింసాత్మక ఘటనలు తలెత్తాయి అని.. అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని వెల్లడించారు. -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
ఆర్థికవేత్తల్లో ఇంత అయోమయమా?
మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేసుకున్న నేపథ్యంలో.. పైకి ఎన్ని ఆకర్షణీయ మాటలను చెప్పినా, వ్యవసాయ మార్కెట్లను ప్రయివేటీ కరించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పుకోబోతోందని రైతులు గ్రహిస్తున్నారు. ధాన్య సేకరణనుంచి, కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని, సర్కారీ మండీల రద్దు ద్వారా తమ వ్యవసాయ రాబడులు మరింత అస్థిరతకు గురవుతాయని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనిస్తే అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఆర్థికశాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ అశోక్ గులాటి అగ్రగణ్యులు. పైగా నేను చదివి, సంప్రదించి, గౌరవించే పండితులలో ఆయన ఒకరు. రైతుల పట్ల నిజమైన ఆర్తి కలిగి ఉన్న మంచి మేధావి ఆయన. నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న నేటి ప్రభుత్వంతోపాటు ఏ ప్రభుత్వాలనైనా వ్యతిరేకించే దన్ను కలిగినవారు. అవసరమైతే రైతు ఉద్యమాలను కూడా వ్యతిరేకించే దమ్ము కూడా ఉంది. అనేక సంవత్సరాలు వ్యవసాయరంగంపై చేసిన కృషికి తోడుగా, ఆయన కేంద్రప్రభుత్వం ఇటీవల రూపొందించి ఆమోదింపజేసుకున్న మూడు నూతన వ్యవసాయబిల్లులను స్వాగతించారు. వీటిని భారతీయ వ్యవసాయానికి 1991 ఉద్యమం అని కూడా ఆయన పిలిచారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ది ప్రింట్ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా సైతం నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా గులాటి వాదనలను యథాతథంగా ఉల్లేఖించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే గులాటి ఈ అంశంలో పూర్తిగా తప్పుచేశారు. ఇది పాక్షిక పాండిత్యానికి, తప్పుడు డేటాకు లేక పేలవమైన హేతువుకు సంబంధించిన తప్పిదం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విధాన సలహాదారుగా తన అనుకూలతా స్థానం ఫలితంగా నెలకొన్న విస్పష్టమైన తప్పు (ఆయన ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నారా?). ఇద్దరు ఆర్థికవేత్తలు జీన్ డ్రెజ్, అశోక్ కొత్వాల్ మధ్య జరిగిన లోతైన చర్చను చదివినప్పుడు నాకు ఇది మరింత స్పష్టంగా అర్థమైంది. సబ్సిడీ ధరతో పేదలకు ఆహార పంపిణీ చేయడానికి నగదు బదిలీ చేయాలని కొత్వాల్ ఇచ్చిన సలహాకు స్పందనగా డ్రెజ్.. ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు, పేదల పక్షాన సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు మధ్య తేడా గురించి ఒక స్పష్టమైన విభజన రేఖ గీస్తూ మాట్లాడారు. ఒక విధాన సలహాదారు ప్రభుత్వానికి తాను ఇచ్చే సలహాలు పూర్తిగా మంచి స్ఫూర్తితో అమలవుతాయని అంచనా వేస్తూనే తన సలహాలు అందించే ప్రయోజనాలు ఏమిటనే విషయంపై తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంది. ఒక విధానం పర్యవసానాలు ఏమిటి? వాస్తవ జీవితంలో ఆ విధానం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది అని పేదల పక్షం వహించే సలహాదారు తప్పక దృష్టి పెట్టాలి. పేదలకు సహాయం చేయడానికి ప్రత్యక్ష నగదు బదిలీ అనేది అత్యంత సమర్థవంతమైన, ఖర్చుతగ్గించే మార్గంగా కాగితంమీద బాగానే కనిపిస్తుందని, కానీ రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సరఫరా అనేది పేదలకు వాస్తవంగా వారి జీవితాలకు మేలు కలిగించే అంశంగా ఉంటుందని డ్రెజ్ నొక్కి చెప్పారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా ఇదే వాస్తవం. సలహాదారులు–వ్యవసాయదారులు ప్రొఫెసర్ గులాటి మాటల్లో చెప్పాలంటే ఈ బిల్లులు అత్యుత్తమమైనవి. ఈ చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, కొనుగోలుదారులు వ్యవసాయ ఉత్పత్తులను కొని, నిల్వ చేసుకోవడానికి మేలైన అవకాశాన్ని, స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ మార్కెటింగ్‌లో పోటీని సృష్టించవచ్చు. మార్కెటింగ్ వ్యయాలను తగ్గించి, రైతులకు మెరుగైన ధరలను కల్పించడం, అదే సమయంలో వినియోగదారులు చెల్లించే ధరలను తగ్గించడం వైపుగా వ్యవసాయంలో మరింత సమర్థవంతమైన పంపిణీని సృష్టించడంలో ఈ పోటీ అనేది సహాయపడుతుంది అని గులాటి ఆ వ్యాసంలో చెప్పారు. సైద్ధాంతిక మొండితనం కలిగిన వారు మినహా ఈ రకమైన సలహాలతో ఎవరు విభేదించగలరు? ఈ పోటీ వల్ల రైతులు కనీస మద్దతు ధరను పొందలేరంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనల తప్పుడు ప్రచారానికి లోనవటం వల్లే ఈ బిల్లులను నిరసిస్తున్నారని స్వామినాథన్ అయ్యర్ రాస్తున్నారు. ఈ వాదనలోని హేతువు ఏమంత చెడ్డది కాదు. కానీ క్షేత్రవాస్తవాలపై వీరి అంచనాలు షాక్ కలిగిస్తున్నాయి. పైగా ఈ చట్టాలు ఎలా అమలవుతాయి అనే అంశంపై వీరి అంచనాలు మంచి జరుగుతుందనే సద్భావనపైనే ఆధారపడ్డాయి. సహజంగానే వీరి నిర్ధారణలు చాలా తప్పు అని తేలుతుంది. ఆర్థిక శాస్త్రంలోని తికమకలను అర్థం చేసుకోలేని మన దేశ రైతు పైన పేర్కొన్న మేధావుల కంటే ఈ చట్టాలపై మరింత మెరుగైన అంచనాను కలిగి ఉంటాడు. మేఖలా కృష్ణమూర్తి వంటి ఆంత్రోపాలజిస్టు కానీ, సుధా నారాయణన్ వంటి క్షేత్రవాస్తవాలకు సమీపంగా ఉండే ఆర్థికవేత్త కానీ ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్లపై వేసే ప్రభావంపై మరింత వివేచనతో ఉంటారు. సంస్కరణ–వాస్తవికత రైతులకు వరాలు వాగ్దానం చేస్తున్నాయని చెబుతున్న ఈ చట్టాల గురించి నాలుగు అంచనాలను మనం పరిశీలిద్దాం. మొదటి అంచనా ఏమిటంటే సర్కారీ మండీలకు తప్పనిసరిగా తమ ఉత్పత్తులను అమ్మాల్సి వస్తున్నందున తమ పంటలను బయట అమ్ముకునేటప్పుడు వీరికి తగిన అనుభవం ఉండదన్నదే. ఇది తప్పు. ఎందుకంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో నాలుగింట ఒక భాగం మాత్రమే ఈ మండీల ద్వారా కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న ‘స్వేచ్ఛ’ను మన రైతుల్లో నాలుగింట మూడొంతుల మంది ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు. రైతుల్లోని మెజారిటీకి ఇప్పుడు కావలసింది మండీల నుంచి స్వేచ్ఛ కాదు. మరింత చక్కగా నిర్వహించే మండీలు వారికి అవసరం. గత కొన్నేళ్లుగా విస్తృతంగా రైతులతో సమావేశమవుతూ వస్తున్న నేను రైతులు పదేపదే ఒక అంశంపై ఫిర్యాదు చేయడం గమనించాను. తమకు అందుబాటులో మండీలు లేవని, ఉన్నా సరైనరీతిలో అవి పనిచేయడం లేదని రైతులు ఆరోపించారు. రెండో అంచనా ఏమిటంటే, కమిషన్ ఏజెంట్ల నుంచి ఈ చట్టాలు రైతులను కాపాడతాయన్నదే. ఇది కూడా తప్పే. మండీలు రైతులను మోసగించలేవని చెప్పలేం కానీ వేలాదిమంది రైతులతో నేరుగా సంప్రదించలేని బడా వ్యవసాయ కంపెనీలు నెలకొల్పే ప్రైవేట్ మండీలకు ఈ సర్కారీ మండీల నిర్వహణదారులు తమ సేవలను అప్పనంగా అందించడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే ఇకనుంచి రెండు రకాల దళారీల నుంచి రైతులు పీడనకు గురవుతారు. ఇంతవరకు కొనసాగుతూ వస్తున్న పాత కమిషన్ ఏజెంట్లు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్న కార్పొరేట్ సూపర్ దళారీలు. మూడో అంచనా ఏమిటంటే, మార్కెట్ న్యాయబద్ధంగానే పనిచేస్తుంది కాబట్టి తమ ఉత్పత్తులను నిల్వచేసే స్టాకిస్టులు లేక వ్యాపారుల ద్వారా అదనపు లాభాలను ఇప్పుడు రైతులు పొందగలుగుతారన్నదే. కానీ ప్రైవేట్ వ్యాపారులు తాను సంపాదించే అదనపు లాభాల్లో ఒక వాటాను రైతులకు ఇవ్వాలని ఎందుకనుకుంటారు? రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధరను ఇవ్వకుండా వీరు తమలోతాము కుమ్మక్కు కారని గ్యారంటీ ఏదైనా ఉందా? ఇంతవరకు జరిగిన విధంగానే కొన్ని సీజన్లలో రైతులకు మంచి ధర ఇస్తూ మిగతా సమయాల్లో రైతులను అణచివేయడాన్ని వీరు కొనసాగించరని ఎవరు హామీ ఇస్తారు? నాలుగో అంచనా ఏమిటంటే ప్రభుత్వం వ్యవసాయ మౌలిక పెట్టుబడిలో తన వాటాను పెంచడం ద్వారా రైతాంగానికి తోడ్పడుతుందన్నదే. ఇదో నయవంచన. ఈ 3 చట్టాలు విధానాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు పర్యవసానాల సూచికలుగా ఉంటున్నాయని ఆర్థికవేత్తల కంటే బాగా రైతులు అర్థం చేసుకుంటారు. మదుపు, క్రమబద్ధీకరణ, విస్తృత కృషి రూపాల్లో వ్యవసాయం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లుగా మోదీ ప్రభుత్వం ఈ చట్టాల రూపకల్పన ద్వారా స్పష్టంగా వెల్లడించింది. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యపు గిడ్డంగులను, కోల్ట్ స్టోరేజీలు నిర్మించడంలో మదుపు పెడతారు కాబట్టి తాను వ్యవసాయ రంగంనుంచి తప్పుకోవచ్చని ప్రభుత్వ భావన. రైతులకు స్పష్టమైన సంకేతాలు రైతులకు భవిష్యత్ చిత్రపటం ఏమిటన్నది స్పష్టంగా తెలుసు. వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అంటే ఇంతవరకు తాము అనుభవిస్తున్న ఆ మాత్రపు స్వేచ్చను కూడా వారు పొగొట్టుకోవడమే అవుతుంది. ప్రభుత్వం ధాన్య సేకరణనుంచి కూడా తప్పుకోబోతోందని వారు గ్రహించగలరు. సర్కారీ మండీల రద్దు ద్వారా పర్యవసానాలు వీరికి చక్కగా తెలుసు. కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని కూడా వీరు పసిగట్టగలరు. ఆర్థికవేత్తల కంటే రైతులే రాజకీయ సంకేతాలను స్పష్టంగా గ్రహించగలరు. ఇప్పటికే ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనించినట్లయితే మన దేశంలోని కొందరు అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త అధ్యక్షుడు, స్వరాజ్ ఇండియా స్వరాజ్ అభియాన్, జై కిసాన్ ఆందోళన్ సభ్యుడు మొబైల్ : 98688 88986 -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
సమానత్వానికి హైదరాబాద్ స్ఫూర్తి
లక్డీకాపూల్: దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సామాజిక న్యాయదినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరసత్వం, రాజ్యాంగబద్ధత, సామాజిక న్యాయం, సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అంశంపై సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలకు జంట నగరాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. సమైక్యతకు, సమానత్వానికి పట్టంకడుతున్న హైదరాబాద్ దేశానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. దేశంలో అమలవుతున్న కుల వ్యవస్థ, మనుధర్మ స్మృతికి దళితులు, అట్టడుగు వర్గాల ప్రజ లు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సామాజిక న్యాయానికి, లౌకిక వాదానికి వ్యతిరేకంగా పలు చర్యలు, చట్టాలు చేస్తోందన్నారు. ముస్లింలను టార్గెట్ చేస్తోంది... పౌరసత్వ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తోం దని ధ్వజమెత్తారు. దేశ సరిహద్దులో నో ముస్లిం ప్లీజ్ అన్న బోర్డులు ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని యోగేంద్ర యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు పి.శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయనను అరెస్టు చేశారా? ఎక్కడా?
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను ధిక్కరించి మరీ ఎర్రకోట వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఇక్కడ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద స్వరాజ్ అభియాన్ పార్టీ చీఫ్ యోగేంద్ర యాదవ్‌తోసహా పలువుర్ని గురువారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యోగేంద్ర ట్విటర్లో తెలిపారు. వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కరత్‌లను కూడా పోలీసులను అరెస్టు చేశారు. ఇటు బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహాను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై గుహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అయితే, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతోనే గుహాతోపాటు నిరసనకారుల్ని అరెస్టు చేశామని బెంగుళూరు సిటీ పోలీసులు తెలిపారు. మరోవైపు గుహా అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్డియూరప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుహా అరెస్టు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఎక్కడా? కారణం లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను పోలీసులకు వెంటనే ఆదేశాలు ఇస్తాను?’ అని యెడ్డియూరప్ప పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై, గూండాలపై చర్యలు తీసుకోవాలి కానీ, సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదని, అలాంటిది ఏదైనా జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. -
పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘విధ్వంసపు పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్. ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్‌ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు. -
‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యమ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడలంటే బీజేపీని అడ్డుకోని తీరలనీ, అది సాధ్యం కాకపోతే కాంగ్రెస్ చావడం మేలని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఎన్డీయే కూటమికి 300లక పైగా స్థానాలు వస్తాయని తెలిపగా.. యూపీఏ కేవలం 120 స్థానాలలోనే పరితమైదని పలు సర్వేల సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
మతాల మధ్య పోటీగా ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కొంత మంది వ్యక్తులు వచ్చే లోక్‌సభ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య జరిగే పోటీగా చిత్రీకరిస్తున్నారని స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. తెలంగాణ జన సమితి, స్వరాజ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ‘2019 లోక్‌సభ ఎన్నికల ఎజెండా, కార్యాచరణ, పౌరుల ప్రతిపాదన’ వంటి అంశాలపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బందులకు గురిచేస్తోందని యోగేంద్ర విమర్శించా రు. మతం పేరుతో పౌరసత్వాన్ని ముడి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందని, ప్రపంచంలో ఎక్కడ పుట్టిన సరే ముస్లింలు కాకుంటే భారత పౌరులుగా వారికి గుర్తింపు ఇస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రతిని ధుల ఎన్నిక విషయంలో మతం, డబ్బు, మద్యం ప్రధానాంశాలుగా కాకుండా నిస్వార్థం గా పని చేసే వారికి అవకాశం కల్పించే విధంగా మారాలని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులను తీసుకురావడానికి మేధావులు, ప్రజా ఉద్యమకారుల ఆధ్వర్యంలో ‘రీక్లెయిమింగ్ ద రిపబ్లిక్’ పేరుతో ఒక ఎజెండా ను రూపొందించామని చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ’ఇండియన్ సిటిజన్ యాక్షన్ ఫర్ నేషన్ (ఐ కేన్)’ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. నిస్వార్థంగా పని చేసే వారిని లోక్‌సభ ఎన్నికల బరి లో నిలుపుతామని, దీని కోసం స్వతంత్ర ఎన్నికల ప్యానెల్ అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం కోసం ఐ కేన్ ప్రత్యేక వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ ఐ కేన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల తరఫున పోరాడే వారికి మద్దతు.. దేశవ్యాప్తంగా పర్యటించి మేధావులు, ప్రజల పక్షాన పోరాడే వారిని సంప్రదించి ఈ ఎజెండా రూపొందించామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రజల ముందుకు ఈ ఎజెండాను తీసుకుపోవడానికి ఐ కేన్ పని చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున గళం వినిపించే వ్యక్తులు కావాలని, అటువంటి వారికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచేందుకు ఈ ఐ కేన్ పని చేస్తోందన్నారు. యోగేంద్ర యాదవ్ ప్రతిపాదించిన ఎజెండాను తెలంగాణ జన సమితి ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా
జవాబు కావాలి ‘‘కనీస ఆదాయం అనేది చట్టపరమైన హక్కా? కనీసం అంటే ఎంత? పేదలను ఎంపిక చేసే విధానం ఏంటి? బడ్జెట్ ఎంత? ఈ అదనపు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?– ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబులివ్వగలిగితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇది గొప్ప ఆలోచనగా అంగీకరించొచ్చు’’ – యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు అభివృద్ధి ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సరికొత్త ఒడిశా రాష్ట్ర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎవరూ నిరుద్యోగులుగా ఉండకుండా, ఎవరూ దారిద్య్రరేఖకు దిగువన లేకుండా చూస్తాం. ఒకే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి కాంగ్రెస్, బీజేడీలు ఒడిశా అభివృద్ధికి చేసిందేమీ లేదు’’ – అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు లెక్కలు ‘‘నేషనల్ స్టాటస్టికల్ కమిషన్‌లో ప్రభుత్వేతర సభ్యులంతా రాజీనామా చేశారు. దీంతో మరో సంస్థ పళ్లుపీకి నిర్వీర్యం చేసినట్టే. తమ అసమర్థ పాలనలో జరిగిన అవకతవకల డేటా అంతటినీ దాచిపెట్టడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది’’ – అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీ నియంతృత్వం ‘‘ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ, బలమైన ప్రధాని అనే అంశాలు వ్యవస్థలను బలహీనపరిచే రాజ్యాంగ నియంతృత్వానికి దారితీస్తాయి. అందువల్ల సంకీర్ణ ప్రభుత్వం చెడ్డదేమీ కాదు. డీమోనిటైజేషన్ లాంటి విధానపరమైన నిర్లక్ష్యపు ప్రయోగాలు జరుగవు. ఫెడరల్ స్ఫూర్తి విరాజిల్లుతుంది’’ – రూపా సుబ్రమణ్య జర్నలిస్ట్ -
పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు. -
మోదీజీ.. నా నోరు మూయించలేరు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, జై కిసాన్ ఆందోళన్ వ్యవస్ధాపకుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. రెవారిలో తన సోదరి ఆస్పత్రిపై ఐటీ దాడుల నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సోదరి నిర్వహిస్తున్న నర్సింగ్ హోంపై ఢిల్లీ నుంచి వచ్చిన వంద మందికి పైగా అధికారుల బృందం దాడులకు పాల్పడిందని బుధవారం వరుస ట్వీట్లలో యాదవ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పుడు తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని, రెవారిలో మద్దతు ధర కోసం, రైతుల సమస్యలపై తన పాదయాత్ర ముగిసిన రెండు రోజుల అనంతరం తన చెల్లెళ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఐటీ దాడులు చేపట్టారని ఆరోపించారు. మోదీ తనపై, తన ఇంటిపై సోదాలు నిర్వహించవచ్చని తన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలు వైద్యులైన తన చెల్లెళ్లు, బావ, మేనల్లుడి చాంబర్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీల్ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీయూలో నవజాత శిశువులున్నా పట్టించుకోలేదని వాపోయారు. అణిచివేత వైఖరితో మోదీ తన నోరు మూయించలేరని మరో ట్వీట్లో యాదవ్ స్పష్టం చేశారు. -
మౌలిక లక్షణం మలినం కారాదు
ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. మన దేశంలో జరిగే చాలా బహిరంగ చర్చలు ఎలా ఉంటాయంటే, అవి బధిరుల సంభాషణలను మరిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు ప్రతి నాయకుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శత్రువుల మధ్య సాగుతూ ఉంటాయనవచ్చు. వాదనలోని ఏ ఒక్క విషయాన్ని అంగీకరించకూడదని భీష్మించుకుని కూర్చున్నట్టే వారు ఉంటారు. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో చర్చకు దిగినట్టు ఉంటుంది. ఇక మిత్రులైతే ఒకరి వాదనను ఒకరు బహి రంగంగా నిరాకరించుకోరు. అందుకే మన టీవీ చర్చలన్నీ అలా చెవులు చిల్లులు పడేటట్టు ఉంటాయి. చాలా చర్చలు సమర నాదాల తోనే సాగుతాయి. ఇంకా, దశ దిశ లేకుండా ఉంటాయి. ఈ కారణం గానే ఈ మధ్య ‘మైనారిటీల స్థితిగతులు’ అన్న అంశం మీద జరిగిన ఒక చర్చను చూశాక ముచ్చటగా అనిపించింది. సెక్యులర్‌వాద కార్య కర్తలు, మేధావులు కొందరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఆ అంశం మీద తమ తమ విభేదాల గురించి వెల్లడించారు. ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త హర్షమందిర్ రాసిన వ్యాసంతో ఈ చర్చ ఆరంభమైంది. ఆరోగ్యకరమైన చర్చ అవశ్యం ముస్లింల పార్టీ అన్న ముద్ర పడడం వల్లనే మొన్నటి సాధారణ ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ ఆ మధ్య ఇండియాటుడే పత్రిక నిర్వహించిన గోష్టిలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన ఆధారంగా హర్ష ఆ వ్యాసం రాశారు. సోనియా అభిప్రాయానికి మరొక ఉదంతం కూడా జోడించారు. ఒక సందర్భంలో ముస్లింలను బురఖా, టోపీ లేకుండా రావాలంటూ చెప్పిన ఉదంతమది. ముస్లింలు ఈరోజు రాజకీయ అనాథలుగా మిగిలిపోయారని ఆయన వాదన. కానీ ప్రముఖ చరిత్రకారుడు, ఉదారవాద మేధావి రామచంద్ర గుహ దీనితో విభేదించారు. బురఖా ధరించడం ముస్లింల వెనుకబాటుతనానికి ప్రతీకగా కనిపిస్తుందనీ ఉదారవాదులైన మేధావులు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితులలోను సమర్థిం చరాదనీ గుహ అభిప్రాయం. ఇంకా సుహాస్ పాల్షికార్, ఇరేన్ అక్బర్, ముకుల్ కేశవన్ వంటి మేధావులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే, అసలే ముస్లింలు పెద్ద సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి చర్చ జరగడం గురించి కొందరు మేధావులు కలత పడి ఉండవచ్చు. దీనిని నేను అంగీకరించను. ఎందుకంటే, తమని తాము ఆత్మశోధన చేసుకోవడానికి కష్ట కాలమే మంచి అవకాశం ఇస్తుంది. ఆచరణ ఎలా ఉందన్నదే ప్రశ్న సిద్ధాంతపరంగా, ఆచరణ స్థాయిలో సెక్యులరిజం ఎలా ఉన్నదీ అనే అంశం గురించి నిజాయితీగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ అనివార్యంగా జరగాలి కూడా. ఎందుకంటే మన గణతంత్ర రాజ్యం నిర్దే శించుకున్న పవిత్ర సిద్ధాంతం సెక్యులరిజం. 1975లో సెక్యులరిజం అన్న పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో లాంఛనంగా చేర్చుకుని ఉండవచ్చు. కానీ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమది. సెక్యులర్ కాని భారతదేశాన్ని మనం ఎంచుకోలేదు. అయినప్పటికీ ఆచరణలో ఈ పవిత్ర సిద్ధాంతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. ఇందుకు కారణం సెక్యులరిజం ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా రెండు మౌలిక దోషాలతో ఉంది. వాటి గురించి నిజాయితీతో బహిరంగంగా చర్చిండానికి ఇదే అను కూల సమయం. ఆ రెండింటిని రాజకీయ సెక్యులరిజం సమస్య, మేధావుల సెక్యులరిజం సమస్య అనుకోవచ్చు. సెక్యులరిజాన్ని రాజకీయ రంగం పర స్పర విరుద్ధంగా, పక్షపాత దృష్టితో, ఒక సాధనం అన్న ధోరణి నుంచే ఆచ రిస్తుండడం మొదటి సమస్య. ఏదైతే మైనారిటీల హక్కుల పరిరక్షణే ఆశ యంగా మొదలైందో, కాలగమనంలో అదే ఇతరుల బలహీనతలను ఆధారం చేసుకుని మైనారిటీ మేధావులు ప్రయోగించడానికి ఉపకరించే సాధనంగా మారిపోయింది. వాస్తవాల వెల్లడిలో దాపరికమేల? మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం మధ్య వైరుధ్యాన్ని శాస్త్ర బద్ధంగా వివరించేందుకు ప్రారంభమైన ఆలోచనే, ఇప్పుడు ముస్లిం మైనా రిటీలను మతోన్మాద పంథాలో కదిలించడానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి, వారిలో వ్యక్తమవుతున్న పురోగమన వ్యతిరేకతల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా పరిణమించింది. హిందూ సామాజిక విధానంలోని రుగ్మతలను బాహాటంగా చర్చించడానికి చర్చలూ, అందులోని అవాంఛనీయ పరిణామా లను గురించి చెప్పడానికి ఒక విమర్శకుడు కనిపిస్తున్నారు. కానీ ఇతర మతా లలో కనిపించే అలాంటి రుగ్మతలను, అవాంఛనీయ పోకడలను చర్చించే విమర్శకులు తరచూ మౌన ప్రేక్షకులై పోతున్నారు. హిందువులు, వారి సంస్థలు చేస్తున్న దుర్మార్గాల మీద దాడి జరుగుతుంది. శల్యపరీక్షలు జరుగు తాయి. అదే విధంగా ఒక చర్చి, లేదా గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు చేసిన దుర్మార్గాల గురించి ఎలాంటి దాడి జరగదు. ఏ విధమైన∙శల్య పరీక్షలు ఉండవు. మైనారిటీలను లాలించడమనే ఆరోపణ తప్పయితే, ఒక సాధారణ ముస్లిం దుస్థితిని గురించి వస్త్వాశ్రయ దృష్టితో చేసిన సూచనలన్నీ కూడా కీడు చేసేవే అవుతాయి. ముస్లిం పురోహిత వర్గాన్ని లాలించడమనేది ఒక చేదునిజం. ఒకవేళ ఆరెస్సెస్, బీజేపీ ముస్లింలను ముస్లింతనానికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాయని అనుకుంటే, సెక్యులర్ పార్టీలు చేస్తున్నది కూడా అదే. కొన్నేళ్లుగా సెక్యులర్ పార్టీలు ముస్లింలకు సంబంధించిన సమస్యలను మాత్రమే వెలుగులోకి తెచ్చి, వారి భద్రత గురించి మాత్రమే మాట్లాడి, వారి మత అస్తిత్వం గురించి మాత్రమే చెప్పి వారి ఓట్లను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకోగలిగాయి. సాధారణ భారత పౌరులను చేసినట్టు సెక్యులర్ రాజకీయాలు ముస్లింలను ప్రజా సేవలకు, ప్రయోజనాలకు దగ్గర చేయలేదు. వెనుకబడిన ముస్లింలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో, కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అ«ధికారంలో ఉన్న రాష్ట్రాల చరిత్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల రికార్డు కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓటు బ్యాంకు రాజ కీయాలంటూ ఇతరులను విమర్శించే స్థితిలో బీజేపీ లేకపోవచ్చు. కానీ సెక్యులర్ పార్టీలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను బందీ లుగా చేసుకుని, వారి ఓట్లను రాబట్టుకోవడానికి సంక్షేమ పథకాల అమలు చేయడం కాకుండా, వారిలో భయాందోళనలు కల్పిస్తున్నారు. సెక్యులర్ పార్టీల ఈ ఘనతను గమనించిన తరువాత సెక్యులరిజం అంటే మైనారిటీ అనుకూల విధానం తప్ప మరొకటి కాదంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారంలో సాధారణ హిందువులు పడి పోవడం పెద్ద వింతేమీ కాదు. మూలాలను నాశనం చేసిన మేధావులు ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. ఇది ప్రతికూలార్థం ఇచ్చేటట్టుగా కనిపించ డమే కాదు, సాంస్కృతికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. సెక్యులర్ మేధావుల మాటలలో ఎక్కువగా తిలక ధారణ, బురఖా వంటి మత, సాంస్కృతిక చిహ్నాల పట్ల నిరసన కనిపిస్తుంది. సెక్యులరిజం, ఆధునిక విద్య మన మత వారసత్వం పట్ల ఒక సామూహిక నిరక్షరాస్యతను పెంచేశాయి. దీనితో జరి గిందేమిటంటే, సెక్యులరిజం అంటే ఏవో విదేశాలకు సంబంధించిన విధానం, పాశ్చాత్య ధోరణులు ఉన్న హేతువాదులకు పరిమితం, మన సంస్కృతీ సంప్రదాయాలలో ఇమిడేది కాదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తు న్నది. ఈ సిద్ధాంతాన్ని దారుణంగా ఖండిస్తున్నప్పటికీ ఎదురొడ్డి మాట్లాడు తున్నవారు గడచిన రెండేళ్ల నుంచి బాగా తక్కువగా కనిపిస్తున్నారు. ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇది సెక్యులరిజంను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం అనేది గణతంత్ర భారతం అవతరణకు ఆదిలోనే ఏర్ప రుచుకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న సెక్యులరిజం అనే సిద్ధాంతం నిజంగా సెక్యులరిజంగా ఉండాలంటే, సిద్ధాంత పరంగానే కాకుండా, దాని ఆచరణ తీరును గురించి పునరాలోచించుకోవాలని నా విన్నపం. మనకు కావలసినది పొందికైన, నిబద్ధత కలిగిన రాజకీయ సెక్యు లరిజం. మనకు మేధో సెక్యులరిజం కూడా కావాలి. కానీ అది మన బహు ళత్వ, మత సంప్రదాయాల మూలాలు కలిగినదై ఉండాలి. ఇందుకు మనం గాంధీజీ నుంచి కొంత నేర్చుకోవలసి రావచ్చు. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్: 98688 88986 -
అవగాహన లేమితోనే వైఫల్యం
భారత్‌లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి. ఇటీవలే ఒక సోషల్ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్బం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది. సోషల్ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..! ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ఉత్పత్తి చేసిన కోణంగిల– ట్రోల్స్–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్‌యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్ సభలో చేరాను. ఇది జేఎన్‌యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్–సోషలిస్ట్ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్‌వాదీ పరిషత్‌తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యావిషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలి పాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్డీఎస్ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది. చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్‌కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్ నక్సలైట్, రెడ్ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే. ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్‌లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరి స్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది. అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా? పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభా వం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు. స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా? పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్ఎస్ఆర్ తరహా సోవియట్ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజ కీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతి పాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్‌పాట్ సాగిం చిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి. కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది. నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా? అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం లోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్‌కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం. దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జువాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది ‘వామపక్షం’ గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు 98688 88986