
విధివిధానాలు ఖరారు చేయండి
అందుకు సీజేఐని సంప్రదించండి: ‘కొలీజియం’ మెరుగుపై కేంద్రానికి ‘సుప్రీం’ నిర్దేశం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థను మెరుగుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను ఖరారు చేయాలని కేంద్రానికి సూచించింది. జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు విధివిధానాలను నిర్దేశించింది. ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలని తెలిపింది. న్యాయమూర్తుల అర్హతలు, నియామక ప్రక్రియలో పారదర్శకత, ఎంపిక ప్రక్రియ పర్యవేక్షణకు సచివాలయం ఏర్పాటు, ఎంపికైన వారిపై ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించడానికి ప్రత్యేక యంత్రాంగం, ఇతర అంశాలపై పర్యవేక్షణ చేపట్టాలని వెల్లడించింది. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకతను పెంచేందుకు ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత కోర్టు వెబ్‌సైట్‌లో, కేంద్ర న్యాయశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం పేర్కొంది. సలహాలు, సూచనలు స్వీకరించాలని తెలిపింది.
యూపీ లోకాయుక్తగా వీరేంద్ర సింగ్
న్యూఢిల్లీ/లక్నో: తన రాజ్యాంగబద్ధ అధికారాలను ఉపయోగించుకుంటూ.. యూపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీరేంద్ర సింగ్‌ను ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా సుప్రీం కోర్టు గురువారం నియమించింది. నియామకం దిశంగా రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ నియమకాన్ని చేపట్టింది.
‘కరువు’పై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
కరువుపీడిత రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎనిమిది కరువుపీడిత రాష్ట్రాల స్పందన కోరింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బోడెలతో కూడిన ధర్మాసనం కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆమ్‌ఆద్మీ పార్టీ మాజీ నేత యోగేంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన స్వరాజ్ అభియాన్ అనేసంస్థ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కరువు ప్రాంతాల్లో వెంటనే రైతులకు పంటనష్టానికి సంబంధించిన పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రాయితీపై పశువులకు దాణా సరఫరా చేయాలని స్వరాజ్ అభియాన్ తన పిటిషన్‌లో కోరింది. కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్షం ప్రదర్శిస్తున్నాయని తెలిపింది.