న్యూఢిల్లీ: కార్యకర్తలంతా అంతర్గత సంఘర్షణలు మాని, పార్టీలో విశ్వాసం కోల్పోకుండా అవినీతిని నిర్మూలనపై దృష్టి కేంద్రీకరించాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ కార్యకర్తలను కోరారు. రాజకీయాల వ్యవహారాల కమిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత కొన్ని రోజులుగా పార్టీలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని జరిగినా అవన్నీ కార్యకర్తలు పట్టించుకోవద్దు. విశ్వాసం, నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తలపై ఎన్నో నమ్మకాలు, అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకోవాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. అలాగే ఆప్ నేతలు కూడా ఎలాంటి ప్రశ్నలు, సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఒకరిపై ఒకరు విమర్శలు మాని, అందరూ అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని చెప్పారు. రైతుల కోసం ప్రారంభించిన ‘జై కిసాన్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజలుగా మీడియాలో ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అవన్నీ నాకు తెలుసు. అయితే ఇది హోలీ సీజన్. రంగులతో పాటు బురద కూడా తొలగిపోయింది. ప్రస్తుతం హోలీ ముగిసింది. మా పనిని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. అయితే ఆప్ నేత మయాంక్ గాంధీ ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకుపోదలుచుకోలేదన్నారు. కాగా శనివారం మయాంక్ గాంధీ మాట్లాడుతూ పార్టీలోని ఓ వర్గం తనను ప్రశాంత్ భూషణ్, యాదవ్‌ను రాజకీయాల వ్యవహరాల కమిటీ నుంచి ప్రత్యర్థి వర్గం తొలగించడానికి యత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
అంతర్గత సంఘర్షణలు మానండి
Published Sun, Mar 8 2015 10:30 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement