10 నుంచి ఆప్ సభ్యత్వ నమోదు
Published Sun, Jan 5 2014 10:40 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పదిహేను రోజులపాటు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 545 స్థానాల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేయనున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు యాదవ్ సమాధానమిస్తూ... ఈ విషయంలో పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకే తాము ఆసక్తి కనబరుస్తున్నామని చెప్పారు. 15 నుంచి 20 స్థానాలకు తగ్గకుండా తమ పార్టీ పోటీ చేసే అవకాశముందన్నారు.
కేజ్రీవాల్ నేతృత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. అయితే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. హర్యానాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. నిజానికి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉన్నా అక్కడ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయని, లోక్‌సభ ఎన్నికలతోపాటే వాటిని నిర్వహించే అవకాశముందన్నారు. అందుకే హర్యానాలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఆప్‌లో చేరేందుకు దేశంలోని ఎంతోమంది ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఈ నెల 10 నుంచి 26 వరకు ‘మై బీ ఆమ్ ఆద్మీ’ పేరుతో సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్లెల్లో, పట్టణాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే పార్టీలో చేరేందుకు ఎటువంటి సభ్యత్వ నమోదు రుసుము వసూలు చేయడంలేదని తెలిపారు.
Advertisement
Advertisement